తామరలు, కలువలు నా చెంత లేవు
ఏ పూలతో నిన్ను పూజింతునమ్మా….?
మల్లె ,మందారాలు, మరువంపు మాలలు
అందుబాటులోన అసలే లేవు
ఏ పూలతో నిన్ను పూజింతునమ్మా….?
సంపెంగ ,గన్నేరు ,నందివర్ధనాలు
ఏ చోట వెతికినా కాన రాలేదు
ఏ పూలతో నిన్ను పూజింతునమ్మా…..?
కదంబ పుష్పాలు కనకాంబరాలు
మచ్చుకైనా కానరాకుండనే
ఏ పూలతో నిన్ను పూజింతునమ్మా….?
చేమంతి, బంతులు, సన్నజాజులైన
తేలేకపోతినే నీ కొరకు నేను
ఏ పూలతో నిన్ను పూజింతునమ్మా….?
మంకెన, నాగమల్లి ,పారిజాతాలు
పట్టి తెచ్చే శక్తి నాకు లేదమ్మా…..
ఏ పూలతో నిన్ను పూజింతునమ్మా….?
ఏమైపోయేనో ఈ పువ్వులన్ని ???
ఇంత చక్కటి వన సంపదంత
చెప్పుకొని మురుసుటకు చరిత్రపుటలకెక్కె
కొండంత అండగా నువు చెంత నిలిచి
నీ చల్లని చూపులతో మమ్ము కరుణించి
ఈ వన సంపదoతా తిరిగి మాకిచ్చిన
వర్ణ శోభితమైన రాణివాసము గట్టి
తీరొక్క పూలతో నిన్ను కొలిచెదను
తనువునే ప్రమిదగా …మనసునే వత్తిగా
నీ చల్లని చూపులతో ప్రసరించు జ్ఞానాన్ని చమురుగా చేసి జ్యోతినే వెలిగించి
ఓ వనదేవత !!!!ఆత్మ నివేదనను నీకు అర్పింతునమ్మా
కైమోడ్చి నీ ముందు మోకరిల్లితినమ్మా…
మమ్ము కరుణించవమ్మా కారుణ్యమూర్తి