ఇప్పటివరకు: తన భర్త వ్యవహారం తానే తెలుసుకోవాలని హైదరాబాద్ బయలుదేరింది మైత్రేయి. ఆమె భర్త సుబ్బారావు కూడా తెనాలి వచ్చాడు ఆమె వెనకాలే ఆమెకు తెలియకుండ. వారిద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. సుబ్బారావు అసలు రూపం బయటపడింది. తాగిన మైకంలో ఉన్న సుబ్బారావు మైత్రేయి ని కొట్టాడు. ఆమె తిరగబడింది ఆత్మాభిమానంతో. పనిమనిషి అక్కమ్మ ఓదార్చే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ అవమాన భారం నుండి ఆమె తేరుకోలేక పోయింది
మైత్రేయికి తన చిన్ననాటి ఫ్రెండ్ వసుంధర ఇక్కడే తెనాలిలో ఉన్నట్లు ఒక ఏడాది క్రితం తనకు వివాహమైందని కూడా చెప్పినట్లు గుర్తొచ్చింది. తన డైరీ వెదికితే వసుంధర నెంబర్ దొరికింది.
“హలో ! నేను మైత్రేయిని మాట్లాడుతున్నాను. మీరు వసుంధరేనా మాట్లాడేది?” అంటూ అడిగింది.
“నమస్తే అమ్మ! నేను అడ్వకేట్ వెంకటేశ్వర్లు, మా ఆవిడే వసుంధర , లాయర్ వసుంధర. వసూ ! నీకే ఫోన్ . ఎవరో మైత్రేయి అంట, త్వరగా రా లైన్ లో ఉంది,” అంటూ పెద్దగా పిలిచాడు ఆయన.
పరుగున వచ్చింది వసుంధర. నా చిన్ననాటి ఫ్రెండ్ అండి. మీకు తరవాత చెబుతాను దాని గురించి అంటూ ,”హలో మైత్రి! నెంబర్ ఇచ్చాక కూడా ఇన్నిరోజులు పట్టిందా నాకు ఫోన్ చేయడానికి. చెప్పు ఎలా ఉన్నావు. తెనాలిలో నేనా?”అంటూ ప్రశ్నలవర్షం కురిపించింది.
మైత్రేయి కి ఏడుపు ఆగలేదు. ఏమీ మాట్లాడలేక పోయింది. ఆమె ఎక్కిళ్లు ఫోన్లో వినబడుతున్నాయి వెంకటేశ్వర్లు గారికి.
“మైత్రేయి ఏడవకు. ఏమయిందో చెప్పమ్మా. ఎక్కడున్నావు. అడ్రస్ చెప్పు నేనే వస్తాను,” అతి కష్టం మీద మైత్రేయి ఏడుపు ఆపుకొని, “లేదు వసు, నేనే వస్తాను నీ దగ్గరికి, అడ్రస్ చెప్పు” అని అడిగింది.
వసుంధర చెప్పిన్నట్లు రాసుకొని మధ్యాన్నానికల్లా కాస్త తేరుకొని ఆమెని కలిసింది. తనని కలిసాక తెలిసింది వసుంధర కూడా లా ప్రాక్టీషనర్ అని. కొండంత ధైర్యం వచ్చింది జరిగినదంత చెప్పింది. వసుంధరను ఆమె తరఫున విడాకుల కోసం కోర్ట్ లో కేసు వేయమని అడిగింది.
“మైత్రేయి ! నీ బాధ నాకు అర్ధ మవుతుంది. కానీ విడాకులకు అప్పీల్ చేసే ముందు నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి”.
“నీ విషయం లో గృహ హింస గాని లేక, నీవు నీ భర్తకు చాల కాలం అంటే కనీసం రెండేళ్ల పాటైనా దూరంగా ఉన్నావని గాని సాక్ష్యాధారాలతో కేసుని కోర్ట్ వారి ముందు పెట్టాలి. అలాగే గృహ హింస విషయంలో నిన్ను నీ భర్త హింసించినట్లుగా చూసిన సాక్షం కావాలి. ఇలాటివి నువ్వు సిద్ధం చేయాలి, ” అంటూ మైత్రేయి వైపు సాలోచనగా చూసింది వసుంధర.
“అంతే కాదు నీమీద హింసాత్మక్క చర్య జరిగిన దానికి నీ వంటి మీదేమయిన గుర్తులున్నాయా. అంటే నిన్ను కొట్టినప్పుడు వచ్చిన ఎర్రటి కదుములు , చర్మం చీరుకుపోయిన గుర్తులు , అలాగే వాపులు అలాటివి”, అని చెప్పింది.
మైత్రేయి “నాకు తెలియదు వసుంధర. నా వీపు మీదేమైనా ఉన్నాయేమో. ఎందుకంటే నన్ను అతను చాల బలంగా వీపు మీద గుద్దాడు. నాకు వీపంతా చాలా సెన్సిటివ్ గ ఉంది. నా చేయి మెలిపెట్టి ఉంచాడు చాల సేపు. డొక్కలో కొట్టాడు. నేనిప్పుడు నా ఎడం భుజం కదప లేక పోతున్నాను. “అంటూ కళ్ళనీళ్లు పెట్టుకొంది మైత్రేయి.
వెంటనే వసుంధర ఆమె వీపు ని పరిశీలించింది. ఎడమ వైపు బాగా బలంగా దెబ్బలు తగిలినట్లు నల్లగా పడిన కదుములు కనిపించాయి . వెంటనే తన మొబైల్ కెమరాతో ఫోటో లు తీసింది.
“ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ లో కూడా డొమెస్టిక్ వయోలెన్స్ కింద కేసు నమోదు చేయాలి . అలాగే ఒక గవర్నమేంట్ హాస్పటల్ లో డాక్టర్ కి చూపించి నీకు కొట్టటం ద్వారా దెబ్బలు తాగిలాయని డాక్టర్ సరిఫికేట్ఇవ్వాలి. అలాగే ఒక ప్రత్యక్ష సాక్షి కూడా ఉంటె నీ కేసు ఇంకాస్త బలంగా ఉంటుంది ఏమంటావు”. అని ఆమె అభిప్రాయం కోసం చూసింది.
మైత్రేయి పోలీస్ కేసు మాట వింటూనే చిగురుటాకుల వణికి పోయింది.
మైత్రేయి చేతి ని తన చేతిలోకి తీసుకొని, ”అంత భయపడోద్దు మైత్రి, . నా మీద భరోసా ఉంచు. నేను నీకు లీగల్ ప్రొటెక్షన్ కల్పిస్తాను,” అంటూ తన జూనియర్ రాజ్య లక్ష్మిని పిలిచింది.
“రాజ్యలక్ష్మి మైత్రేయి పట్ల డొమెస్టిక్ వయోలెన్స్ జరిగిందని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు. అక్కడి సబ్ ఇన్స్పెక్టర్ రమణారావు గారితో నేను మాట్లాడతాను. వాళ్ళ స్టేషన్ లోని మహిళా ప్రొటెక్షన్ సెల్ లో ఈ కేసు పెట్టు.”, అంటూ వసుంధర తన జూనియర్ కి వివరించింది.
“తర్వాత ఇంకో విషయం, డాక్టర్ కాత్యాయ ని గారి దగ్గరికి కూడా మైత్రేయిని నేను తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తాను, ఆ రిపోర్ట్స్ నువ్వు తరువాత తీసుకురా,” అంటూ పని పురమాయించి మైత్రేయి ని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళింది వసుంధర.
డాక్టర్ కాత్యాయని మధ్య వయస్కురాలు. ఒక సామాజిక కార్యకర్త కూడా. “చాలా దెబ్బలు తగిలాయమ్మ. దెబ్బలింకా పచ్చిగా ఉన్నాయి. ఎడమచేయి బెణికినట్లుగా ఉన్నది. ఆర్థోపెడిస్టుకి రిఫెర్ చేస్తాను చూపించు. నిన్నంత ఎలా భరించావు నొప్పిని. “ అంటూ స్కిన్ సూథింగ్ కోసం ఒక ఆయింట్మెంట్ రాయమని నర్స్ కి చెప్పి మైత్రేయి ని డ్రెస్సింగ్ రూమ్ లోకి పంపించింది. పెయిన్ రిలీఫ్ కోసం ఒక ఇంజక్షన్ కూడా ఇచ్చింది. నర్స్ నిచ్చి ఆర్థోపెడిస్ట్ దగ్గరకూడా పంపించింది. డాక్టర్ . కాత్యాయని గారు పంపారనగానే డాక్టర్. సందీప్ ఆమెను వెంటనే అటెండ్ అయ్యాడు. మైత్రేయికి ఎడమభుజం చుట్టూ పట్టివేయడం జరిగింది. పదిరోజులదాకా రెస్ట్ ఉండాలని చెప్పి పెయిన్ రిలీఫ్ కి టాబ్లెట్స్ కూడా ఇచ్చాడు.
“వసుంధర ! ఈ అమ్మాయికి చాల దెబ్బలు తగిలాయి. మరి కేసు పెట్టిందా . నువ్వే డీల్ చేస్తున్నావా.” అంటూ , “అవును నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టింగ్ సంగతి ఏమైంది”అని అడిగింది.
“అదా ! ఈ వారమే అప్పాయింట్మెంట్ రావచ్చు మేడం . గోపాల రావు గారి టర్మ్ అయిపోతుంది రెండు రోజుల్లో. బహుశా ఆ తరువాత నా టర్మ్ కావచ్చు. అలా అయితే నేను మైత్రేయి కేసుని ఇంకెవరికయినా అప్పగించాల్సి ఉంటుంది. పైగా నేను విజయవాడ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.”, అని బలహీనంగా నవ్వింది. తన బెస్ట్ ఫ్రెండ్ కి జరిగిన దానిని జీర్ణించుకోలేక పోతున్నది వసుంధర .
ఈ మూడేళ్ళలో మైత్రేయి ఎప్పుడు ఇలాటి స్థితి లో తన దగ్గరకురాలేదు, తనని ఎప్పుడు కలవలేదు. ఎలాటి బాధ లున్న మనసులో దాచుకొని చిరునవ్వుతో ఉండే మైత్రేయిని ఆమె అలా చూడలేక పోతున్నది. ట్రీట్మెంట్ అయి డ్రెస్సింగ్ రూమ్ నుండి వచ్చిన మైత్రేయి ని చూస్తూ, డాక్టర్ కాత్యాయని గారు, “ఆమె ఇప్పుడు మానసికంగా బాగా క్రుంగిపోయి ఉన్నదని, అందువల్ల బీ పి కాస్త హై గా ఉన్నదని”’ చెప్పి ఆమెకు నిద్రరావటానికి కూడా ఒక టాబ్లెట్ తన మెడికల్ చెస్ట్ నుంచి తీసిచ్చింది. పసుపు వేసుకొనే వేడిగా పాలు తాగి ఈ టాబ్లెట్ వేసుకొని పడుకోమని చెప్పింది.
“పద మైత్రేయి మా ఇంటి కి వెళదాము. ఈ రోజంతా నా దగ్గరే ఉండు.”, అంటూ కుర్చీలోంచి లేచింది వసుంధర .
“వద్దులే వసు ! నువ్వు వెంకటేశ్వర్లు గారు ఇద్దరు బిజీ లాయర్స్. నేను ఉంటె ఎంతయినా ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఈ స్థితి లో మరింత ఇబ్బందిగా ఉంటుంది. నన్ను ఇంటి దగ్గర వదిలి పెట్టు. అక్కమ్మ ను రమ్మంటాను”, అంటూ సున్నితంగా తిరస్కరించింది.
వసుంధర తన కారుని మైత్రేయి ఇంటి వైపు నడిపింది. ఇరవై నిమిషాలలోనే ఇల్లు వచ్చేసింది. మైత్రేయి కారు దిగింది. కారు చప్పుడు వింటూనే కిటికీ కర్టన్ కొద్దిగా జరిపి బయటికి తొంగి చూసింది రమాదేవి . మూతి ని వికారంగా తిప్పుతూ “వచ్చింది”, అనుకొంటూ కర్టన్ జర్రుమని లాగేసింది. వసుంధర ఆమెను గమనించింది. ఈమె సరయిన ప్రత్యక్ష సాక్షి అనుకొంటూ వసుంధర తన కార్ ని ముందుకు నడిపింది. అక్కమ్మ అప్పటి దాక మైత్రేయి కోసం కాచుకొని ఉన్నది ఇంటిదగ్గరే. అందుకే కారు రాగానే పరిగెత్తుకొంటూ వచ్చి చేయి పట్టుకొని లోపలకు నడిపించుకు పోయింది.
వారం రోజులలో కోర్ట్ లో కేసు ఫైల్ చేసింది. సుబ్బారావు కి అరెస్ట్ వారంట్ ఇవ్వడం జరిగింది.
(ఇంకా ఉన్నది)