ఇక నిశ్చింతగా….

కథ -అరుణధూళిపాళ

          అరుణ ధూళిపాళ

మధ్యాహ్నం భోజనం చేసి, పుట్టింట్లో నాలుగు రోజులు గడపడానికి వచ్చిన కూతురు భావన తల్లికి అత్తవారింటి విషయాలు చెబుతోంది. సోఫాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటున్నాడు తండ్రి శ్రవణ్. భర్త మంచివాడేనని, అత్తగారు కూడా కలివిడిగానే ఉంటుందని చెబుతూనే ఏవో కంప్లైంట్స్ ఇస్తూ తను ఆమెను ఎంతగానో భరిస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తోంది. తల్లి రేఖ “అలా కాదమ్మా! మీ అత్తగారిని రెండేళ్లుగా చూస్తున్నాం. మంచి మనిషి. అలాంటి అత్తగారు దొరకడం నీ అదృష్టం” అని నచ్చచెప్పడం ఆ అమ్మాయికి నచ్చడం లేదు.  అప్పటిదాకా మౌనంగా వింటున్న శ్రవణ్ “భావనా!” అన్నాడు కొంచెం కఠినంగా. తల్లీ కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడి శ్రవణ్ వైపు చూశారు. “భావనా! ఎప్పుడూ ఇతరుల మీద నింద వేయడం సరి కాదు. అల్లుడితో సమానంగా నువ్వూ డ్యూటీకి వెళ్ళిపోతే మీరు వచ్చేవరకు అన్నీ సిద్ధం చేయడం మాట్లాడినంత సులువు అనుకుంటున్నావా? అల్లుడు భరత్ ఒక్కడే కావడం వల్ల నీకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. భర్త లేక ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ మీ సుఖం కోసం ఎప్పుడూ ఆరాటపడే మీ అత్తగారిని అనడానికి నీకు నోరెలా వస్తోంది? ఎంతో మంది ఆడవాళ్లు అత్తవారింట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. దానికి మీ అమ్మ నీ ముందు సజీవ సాక్ష్యం. ఆమె ఎదుర్కొన్నవాటిలో నీ అనుభవం ఆవగింజంత కూడా కాదు. నన్ను పెళ్లి చేసుకున్నాక మీ అమ్మ పడిన అనేకమైన కష్టాల్లో నేను ఎప్పటికీ మరచిపోలేని ఒక దుస్సంఘటన చెప్తాను. ఇప్పటివరకు నీకవేవీ తెలియవు”. అని కళ్ళు మూసుకొని దాని తాలూకు గతంలోకి జారిపోయాడు శ్రవణ్.
*****
ఆ రోజు…మేడ మీద ఒక గదిలో శ్రవణ్ అసహనంగా అటూఇటూ పచార్లు చేస్తున్నాడు. హైదరాబాద్ నుండి పరీక్షలు ముగించుకొని ఆరోజు మధ్యాహ్నమే పల్లెకు వచ్చాడు. భార్య రేఖ ఎందుకో సంతోషంగా ఉన్నట్టు అనిపించలేదు. ఆమె ముఖంలోని భావాలను చదవడానికి తనకు కళ్ళులేవుగా! రేఖ గదిలోకివస్తే అడగాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ రాత్రివేళ పనంతా ముగించుకొని కానీ ఆమె పైకిరాదు. కుటుంబ కట్టుబాట్లకు ఎక్కడా లోపం రానీయదామె. అత్త, భర్త, మరుదులు, ఆడపడుచులు అందరూ భోజనం చేశాక పనంతా ఆమే చేసుకోవాలి. ఇంటికి పెద్ద కోడలు కదా! కొంతమందికి అడగకుండానే సంప్రదాయబద్ధంగా కొన్ని బాధ్యతలు వచ్చి చేరతాయి వయసుతో నిమిత్తం లేకుండా..!
గుమ్మం దగ్గర అలికిడి అయింది. అడుగుల సవ్వడినిబట్టి రేఖ అని అర్థమయింది. రెండు నిమిషాలు మౌనం ఇద్దరి మధ్యా… మంచంమీద కూర్చున్నాడు శ్రవణ్. దగ్గరగా వచ్చిన రేఖ అమాంతం అతడిని చుట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఊహించని ఈ పరిణామం అతన్ని అయోమయంలో పడేసింది.
చదువు కోసం శ్రవణ్ హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండడం, పరీక్షలు అయింతర్వాత సెలవులకు ఇంటికి రావడం పరిపాటే. ఇంట్లో అందరి మధ్యలో ఒంటరితనం అనుభవిస్తున్న రేఖ భర్త కున్న అంధత్వం వల్ల తమ భవిష్యత్తు కోసం శ్రవణ్ చదువే ఒక ఆలంబన అనే సత్యాన్ని అతని మాటల ద్వారా గ్రహించింది. అందుకే 16 ఏళ్ళ రేఖ అతనికి దూరంగా ఉండడానికి గొప్ప మనసుతో అంగీకరించింది. అత్తగారి
సూటిపోటి మాటలను, తన భర్త నిస్సహాయతవల్ల సంసార బాధ్యతను భుజాల మీద మోస్తున్న మరిది పెద్దరికాన్ని భరిస్తూనే, చిన్నవారైన ఇంకొక మరిది, ఇద్దరు ఆడపడుచుల ఆలనాపాలనా చూసుకుంటోంది.
***
ఏడుస్తున్న రేఖను ఓదార్చడం అసాధ్యమైంది శ్రవణ్ కు. జరగకూడనిది ఏదో జరిగి ఉంటుందని అర్థమైంది. ఆమె దుఃఖం కొంత ఉపశమించేదాకా ఆగి “ఏమైంది రేఖా! ఎందుకేడుస్తున్నావ్? నువ్విలా ఏడవడం నేను చూడలేకపోతున్నాను. జరిగిందేమిటో చెప్పు?” లాలనగా అడిగాడు. వెక్కిళ్ళమధ్య రేఖ చెప్పిన విషయం విని శిలలా బిగుసుకుపోయాడు శ్రవణ్.
దీనికంతటికీ తన అసహాయతే కారణమా? అదే అయితే దానికి రేఖను బలి చేయడం ఎందుకు? నరాలు బిగుసుకున్నాయి.
తననుతాను తమాయించుకొని “రేఖా! మన కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ విషయమే రాగానే నీతో చెప్పాలని ఎంతో ఆశగా వచ్చాను. వచ్చినప్పటినుండీ నీ మౌనం నాలో అలజడులను రేపుతూనే ఉంది. నేను చెప్పే వార్త విని నీ మనస్సులో పొంగే సంతోష తరంగాల సవ్వడులను
నా గుండెలో పొదువుకుందామనుకున్నా. ఒక్కసారిగా నా ఆశలు మొదట్లోనే పాతర వేయబడ్డాయి. నాలాంటి అంధుడిని కట్టుకున్నందుకు నాతోపాటు నువ్వూ చిత్రవధ అనుభవిస్తున్నావు. ఊరుకో! నీ ఆవేదనను అర్థం చేసుకోవడమే తప్ప ఏమీ చేయలేని వాణ్ణి. కాలం మనకు మంచిరోజులు ఇస్తుందని నా నమ్మకం అన్నాడు. కానీ రేఖ ఉన్న పరిస్థితిలో భర్త ఓదార్పు, ఆయన చెప్పాలనుకున్న శుభవార్త ఇవేవీ ఆమెకు రుచించలేదు.
పేదవారైన రేఖ తల్లిదండ్రులు గత్యంతరం లేక అంధుడైన శ్రవణ్ తో ఆమె పెళ్లి చేశారు. డబ్బున్న ఆ ఇంట్లో కూతురు సుఖపడుతుందని వారు ఆశించారు. పేదరికంతో పాటు శ్రవణ్ అంధత్వం ఆమె ఆశలకు సంకెళ్లు వేసాయి. ఆమెకు పెళ్లిలో శ్రవణ్ వాళ్ళు చేయించిన బంగారు గొలుసు ఇనప్పెట్టెలో ఉంటుంది. అప్పుడప్పుడు శుభకార్యాలకు అత్తగారే తీసి ఇస్తుంటుంది. పెట్టె తాళపుచెవులు ఆమె దగ్గరే ఉంటాయి. ఈ విషయంలో ఆమె ఎవ్వరినీ నమ్మదు. అలాంటిది ఉన్నట్టుండి ఆ గొలుసు పెట్టెలో నుండి మాయమైంది. కుటుంబమంతా తర్జనభర్జనలు జరిపి పేదింటి అమ్మాయి రేఖకు మాత్రమే తీసే అవసరం ఉందని తేల్చారు.
ఇందులో రేఖ తన గొలుసు తనే ఎందుకు దొంగతనం చేస్తుందన్న ఇంగితజ్ఞానం కూడా ఎవ్వరికీ కలుగలేదు. మన కుటుంబాల్లో చాలామందికి కోడలు పరాయిది. ఎంత ఊడిగం చేయించుకున్నా ఇలాంటి విషయాల్లో ఆమెను దోషిగా నిలబెడతారు. రేఖ నుండి
విషయాన్ని రాబట్టడానికి ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష, పరోక్ష ప్రయత్నాలు ఎన్నోచేశారు. శ్రవణ్ ఊళ్ళో లేడు కాబట్టి ఇవేవీ అతనికి తెలియవు. మరో దారుణమేంటంటే అజ్ఞానం వెర్రితలలు వేసి మూఢనమ్మకంగా మారి రేపటి రోజున రేఖను దోషిగా నిరూపించడానికి అమ్మలక్కలంతా పథకం తయారుచేసారు. రేఖను శోకదేవతగా మార్చిన సంఘటన ఇదే.
*****
సూర్యుడు తన కర్తవ్య పాలనకు ఉపక్రమించాడు. రేఖ ఎప్పటిలాగే చీకటితోనే లేచి యాంత్రికంగా తన పనులు చేసుకోసాగింది. మన దేశంలో చాలమంది మధ్యతరగతి మహిళల బ్రతుకులు ఇట్లాగే తెల్లవారుతాయి కారణాలు ఏవైనా. రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ కళ్ళు ఉబ్బిపోయి ఉన్నా గమనించనట్లే ఉన్నారు ఇంట్లోని వాళ్లందరూ. అదింకా రేఖ మనసును సూటిగా గుచ్చుతోంది. శ్రవణ్ ఆలోచనల నిద్ర లేమితో ఎరుపెక్కిన కళ్ళను నల్లటి కళ్ళద్దాలలో దాస్తున్నాడు. ఇదంతా అన్యాయమని గొంతెత్తి అరవాలని ఉంది. దాని పరిణామాలు తమ భవిష్యత్తు మీద ఎలాంటి ముద్రలు వేస్తాయో తనకు బాగా తెలుసు. తొందరపడటం అన్నిటికీ పరిష్కారం కాదని, తన చదువు ఒక కొలిక్కి వచ్చేంతవరకు ఎన్ని బాధలైనా అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మౌనం వహించాడు. భర్త ఆలోచనలను ఎరిగిన ఇల్లాలిగా ఎంతో సహనం వహించే రేఖ కొన్ని సందర్భాల్లో భర్త నిష్ప్రయోజకుడని
నిందిస్తుంది. ఆమె భావనలో తప్పు లేదు. వ్యతిరేకులైన మనుష్యుల మధ్య ఆమెకున్న ఒకే ఒక ఆలంబన శ్రవణ్.
అంధుడని తెలిసినా ఏ నమ్మకంతో జీవన ప్రయాణంలో తోడుగా ఉంటానని వచ్చిందో ఆ మనసుకే తెలుసు.
ఇల్లంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎవరిపనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా తనవాళ్లే మొన్నటివరకు. తన కుటుంబమే. కానీ ఈరోజు అందరూ ఉన్న ఏకాకి రేఖ. చేయని నేరానికి అభియోగం మోపబడిన ముద్దాయి. ఆమె కళ్ళు నిండు తటాకాలయ్యాయి. మధ్యాహ్నం భోజనాలు ముగిశాయి. అమ్మలక్కలు ఒక్కొక్కరుగా ఇంటి వసారాలోకి వచ్చి చేరుతున్నారు. రేఖను దోషిగా నిరూపించే ప్రయత్నాల్లో మొదటి ప్రణాళికకు రంగం ఏర్పాటు చేశారు. ఇంట్లో రేఖ, శ్రవణ్ తప్ప మిగిలిన అందరిలో కుతూహలం చోటు చేసుకుంది. శ్రవణ్ కు కూడా రేఖ నిర్దోషి అని పూర్తి నమ్మకం. అందుకే ఒకచోట ఒంటరిగా కూర్చున్నాడు. విద్యాగంధం లేని ఆ పల్లె టూరులో చదువుకున్న తానొక్కడు ఇవి మూఢ నమ్మకాలని ఎలా రుజువు చేయగలడు? అభిమన్యుడై ఎట్లా పోరాడగలడు? సన్నటి కన్నీటి పొర కనిపించని ఆ కళ్ళల్లో.
మొత్తం ఐదుగురు ఆడవాళ్లు వచ్చారు. అందులో అందరికంటే వయసులో పెద్దావిడ శ్రవణ్ తల్లి రాజమ్మను బియ్యం, పసుపు తెమ్మని పురమాయించింది. వాటిని కలుపుతూ కళ్ళు మూసుకొని పెదాలతో ఏవో అర్థం కాని పదాలను వల్లించింది. అందరూ చోద్యం చూస్తున్నారు. “రేఖమ్మా! మళ్లీ అడుగుతున్నా చెప్పు. గొలుసు నువ్వే తీసినవు కదా”? అడిగింది పెద్దరికం.

“లేదు పెద్దమ్మా! మీరెన్ని సార్లు అడిగినా నేను తీయలేదు అంతే. ఆ అవసరం నాకు లేదని మీకు మళ్లీ మళ్లీ చెప్తున్నా” ఆవేదన, ఆక్రోశంతో దుఃఖాన్ని గొంతుకలో ధ్వనింపచేస్తూ రేఖ జవాబు. “ఇక ఇట్లా కాదులే రాజమ్మా! ఎంత అడిగినా నీ కోడలు నిజం చెప్తలేదు. రేపటికల్లా నిజం బట్ట బయలైతది. ఇదుగో, ఈ మంత్రించిన బియ్యాన్ని నీ కోడలును తినమని చెప్పు. పొద్దటికి కడుపుబ్బి, నిజం కక్కుతది” అన్నది పెద్దరికం పొగరుగా తల ఎగరేస్తూ తానేదో సాధించబోతున్నట్టు.
“సరే వదినా” అంటూ రాజమ్మ రేఖతో వాటిని తినమని చేతిలో పెట్టింది. ధారలుగా కారుతున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ ఉక్రోషంగా చేతిలోకి తీసుకొని వాటిని కసిదీరా నమిలి మింగేసి పరుగెత్తుకొని లోపలికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె గుండెలోని బాధతో సంబంధం లేని అమ్మలక్కలు తమవంతు పని పూర్తయిందన్న తృప్తితో కాసేపు అదే విషయాన్ని చర్చించుకుని వెనుదిరిగారు.
మరో ఉదయానికి తెర తీస్తూ చంద్రుడు మబ్బుల్లో కనుమరుగయ్యాడు. రేఖ మామూలుగానే లేచి పనుల్లో నిమగ్నమయింది. సమయం గడుస్తున్న కొద్దీ దుఃఖ తీవ్రత తగ్గడం సహజమే కదా! శ్రవణ్ కు కూడా ఏదో జరుగుతుందనే భయం లేదు. రేఖపై అత్యంత విశ్వాసం కలిగి విద్యావంతుడైన భర్త అతను. కళ్ళు లేకపోవడమనే లోపం తప్ప పరిపూర్ణ సుమనస్కుడతడు. ఇంట్లో వాళ్లంతా ఒక్కొక్కరుగా లేచి అనుమానంగా రేఖ వైపు చూడసాగారు. ఎలాంటి తేడా ఆమెలో కనిపించలేదు. గొలుసు దొంగతనం ఆమెనే చేసి ఉంటుందని, ఈ రోజు అది తేటతెల్లమవుతుందని, దాని తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించుకున్న వాళ్లకు ఆశాభంగం కలిగింది.
సూర్యుడు తన తాపాన్ని పెంచుకున్నాడు.
నిన్నటి పెద్దరికం ఇంట్లోకి వచ్చింది. రాజమ్మతో గుసగుసలు కాసేపు. ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయింది. మేడ మీద ఉన్న శ్రవణ్ దగ్గరికి వచ్చి రేఖ జరిగిన విషయం చెప్పింది. ఇద్దరిలో అంతులేని ఆలోచనలు. మళ్ళీ ఏ పథకాన్ని తోడుతున్నారోనని భయం. అది తప్పు చేయడం వల్ల వచ్చింది కాదు. చేయని నేరానికి శిక్ష అనుభవించే బలం మనసులకు లేక కలిగే భయం.
సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు అమ్మలక్కలంతా మళ్లీ సమావేశమయ్యారు. చాలాసేపు చర్చించుకున్నారు. రేఖను పిలిపించారు. రేఖతో పాటు శ్రవణ్ కూడా కిందకు వచ్చాడు అసహనంగా. రాజమ్మ చేటలో బియ్యం తెచ్చింది. పసుపుతో వాటిని కలపమని పెద్దావిడ ఆజ్ఞ జారీ చేసింది. కలిపిన పసుపు బియ్యంలో ఒక్కొక్కరిని పిలుస్తూ రెండు చేతులు పెట్టమంది. రేఖను మాత్రమే పిలిస్తే బాగుండదని ముందుగా ఇద్దరు, ముగ్గురిని పిలిచింది. ఏవో చదువుతూ వాళ్ళు పెట్టిన చేతుల మీద తన చేతులు పెట్టింది. ఒకవేళ వారు దోషులైతే ఆమె చేతి కింద ఉన్న చేతులు వాటంతట అవి కదులుతాయి. ఇదీ ఆ ప్రక్రియ సారాంశం. ఎవరి చేతులూ కదలలేదు. రేఖ వంతు వచ్చింది. రేఖ భయం భయంగా చేతులు పెట్టింది. రేఖ చేతులపై పెద్దావిడ చేతులు. “కదులుతున్నాయ్, కదులుతున్నాయ్” ఆమె కళ్ళలో మెరుపు, గొంతులో ఆనందం. బిత్తరపోయిన రేఖ.
అప్పటిదాకా అన్నిటినీ భరిస్తూ వచ్చిన శ్రవణ్ హృదయంలోని బడబానలం ఒక్కసారి విరుచుకుపడింది. “ఆపండి!” అరిచాడు గట్టిగా. పెద్దరికం ఏదో మాట్లాడబోయింది. “ఇప్పటి వరకు చేసింది చాలు. ఎవ్వరూ మాట్లాడొద్దు. ఎవరైనా ప్రయత్నిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత చేతకాని వాడిననుకుంటున్నారా? దోషులను నిర్ణయించే సామర్థ్యం మీకుంటే ఇక పోలీసులు, కోర్టులు ఎందుకు? అసలు రేఖను దోషిగా అనుకోవడానికి మీకు మనసెలా ఒప్పింది? మీ మూఢ నమ్మకాలతో అమాయకులను బలి పెట్టొద్దు. వెళ్లండి అందరూ ఇక్కడినుండి” అన్నాడు పెల్లుబికిన ఆవేశంతో. రాజమ్మతో సహా అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. కొడుకులో ఇంత ఆవేశం ఆమె కూడా ఎప్పుడూ ఎరగదు. ఈ చర్యను ఆమె ఊహించలేదు. సైగ చేసింది వాళ్లకు వెళ్ళిపొమ్మని. అందరూ జారుకున్నారు మెల్లగా. శ్రవణ్ తన నిస్సహాయతకు తనను తాను నిందించుకుంటూ మేడ మీదికి వెళ్ళిపోయాడు. రేఖ మనసు వీణలు మీటింది. తనకు సర్వస్వం అయిన శ్రవణ్ తనకోసం అందరినీ ఎదిరించి తన పక్షాన నిలవడం ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇక తనకు ఎలాంటి బాధ లేదు అనుకుంది తృప్తిగా. దుఃఖమంతా ఆవిరైపోయినట్టు తోచిందామెకు. మౌనంగా భర్తను అనుసరించింది సంతోషంగా.

*****
ఒక వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. మళ్లీ ఇంట్లో ప్రయత్నాలు మొదలైనట్టు రేఖ ద్వారా అర్థమైంది శ్రవణ్ కు. ఏదైనా భయం లేదనుకున్నాడు. రేఖకు ధైర్యం చెప్పాడు. గొలుసును దొంగిలించింది ఇంకా ఎవరో తేలలేదు కాబట్టి శ్రవణ్ పెద్ద బావ నాలుగూళ్ల అవతల ఎవరో “అంజనం” వేస్తారని దాంట్లో దొంగ బయటపడతాడనే వార్త మోసుకొచ్చాడు. శ్రవణ్ పెద్ద తమ్ముడు, బావ ఇద్దరూ కలిసి ఆ ఊరికి వెళ్లారు. అక్కడ కొమురయ్య అనే వ్యక్తి అంజనం వేస్తాడని తెలిసి అతని ఇంటికి వెళ్లారు. వీళ్ళు చెప్పిన విషయం అంతా విని కొమురయ్య దొంగను పట్టిస్తానని భరోసా ఇచ్చాడు. చేతికి ఏదో లేపనం పూసుకుని కాసేపు మంత్రాలు చదివి, రేఖ దోషి కాదని ఇతరుల వల్లే గొలుసు మాయమైందని తేల్చాడు. రేఖ మీద ఉన్న అభియోగం ఆ రకంగా రూపుమాపబడింది. తర్వాత ఎన్నో ప్రయత్నాలు జరిగి కొన్నాళ్ళకు ఆ ఇంటి పనివాడు తీసాడన్న వాస్తవం తెలియడం, వాడు ఏడుస్తూ రాజమ్మ కాళ్ళ మీద పడి గొలుసును తిరిగి ఇచ్చివేయడం జరిగింది.
రాజమ్మతో సహా ఇంట్లో వాళ్ళందరూ శ్రవణ్ ను తప్పించుకొని తిరుగుతున్నారు. అన్నీ అర్థమైనా ఏదీ జరగనట్టే అందరితో మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రవణ్.
****
నెల రోజులు గడిచాయి. శ్రవణ్ వేసవి సెలవులు అయిపోయాయి. ఆరోజు…..వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోలేదు ఇంకా. రేఖ చేయి పట్టుకొని శ్రవణ్ నడుస్తున్నాడు. వారికి ముందు ఆ ఇంటి నమ్మినబంటు పనివాడు ఒక చేతిలో పెట్టె ఒక చేతిలో బ్యాగు పట్టుకొని నడుస్తున్నాడు. బస్టాండులో వారిని బస్సెక్కించి చేయి ఊపాడు కన్నీళ్ల మధ్య. తన వారికి దూరమవుతున్నానన్న బెంగ కంటే కన్నఊరికి దూరమవుతున్నానన్న బాధ శ్రవణ్ ని ఎక్కువగా పీడించసాగింది. శ్రవణ్ చేతిని పట్టుకున్న రేఖ, బాధల సుడిగుండం నుండి తీరానికి చేరిన నావలా సంతృప్తిగా నిట్టూర్చింది. ఆవలి తీరపు కష్టాన్ని ఆమె ఊహించగలదు. కానీ చదువుకున్న తన భర్త మీద పూర్తి నమ్మకం. ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు.
పరీక్షల తర్వాత సెలవులకు ఇంటికి బయలుదేరేముందు మిత్రుడైన భాస్కర్, తానూ కలిసి తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది శ్రవణ్ కు. చదవబోయే పీజీ కోర్సుల నిమిత్తం హాస్టల్ వసతి ఇవ్వడం ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం అటువంటి విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రకటించింది. భాస్కర్ కు కూడా హాస్టల్లో బాగా ఇబ్బంది అవుతోంది. శ్రవణ్ ఇంటి విషయాలు కూడా తనకు బాగా తెలుసు. అందుకని శ్రవణ్ వచ్చేలోపు రూమ్ చూసి పెడతానని, తన చెల్లిని తీసుకువచ్చి ఇక్కడే చదివిస్తానని, రేఖకు కూడా తోడుగా ఉంటుందని చెప్పాడు భాస్కర్.

 

ఈ విషయమే రాగానే రేఖకు చెప్పి ఆమె ఆనందాన్ని తనదిగా చేసుకోవాలనుకున్నాడు. ఇంతలోనే జరిగిన పరిణామాలు శ్రవణ్ ను అశాంతికి గురి చేసాయి. రోజులు గడచిన కొద్దీ రూము దొరకకపోతే రేఖను వీళ్ళ మధ్య ఎలా వదిలి వెళ్ళాలో శ్రవణ్ కు అర్థం కాలేదు. రేఖకు చెప్పి ఆమె ఉన్న స్థితిలో నిరాశకు గురి చేయడం నచ్చలేదు. మనసు పొరల్లో దిగులు కమ్ముకోసాగింది. హఠాత్తుగా దేవుడు వరం కురిపించినట్టు వారం రోజుల క్రితం భాస్కర్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. రూమ్ దొరికిందని, రేఖను తీసుకొని రమ్మని. అప్పుడే రేఖకు చెప్పాడు. ఆ సమయంలో ఆమె అతనికి ఆనందరేఖ అయింది.
అదే రోజు తల్లితో ఆ విషయం చెప్పాడు. ఆమె అవునని, కాదని చెప్పలేదు. మౌనమే ఆమె అంగీకారంగా భావించాడు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ దీన్ని వ్యతిరేకించలేదు. జరిగిన సంఘటన వల్ల వాళ్లలో కలిగిన న్యూనతా భావమా? శ్రవణ్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తిరుగుండదనే నమ్మకమా? తెలియలేదు. ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు శ్రవణ్. లేకుంటే వారిని ఒప్పించడం చాలా కష్టమయ్యేది.
*****
గతంలోకి వెళ్ళిపోయి జరిగిన ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్న శ్రవణ్ చెప్పడం ఆపి కళ్ళు తెరిచి చూసేసరికి భావన కళ్ళనిండా నీళ్లు. రేఖకు కూడా బాధ తాలూకు గాయం మళ్లీ సలపరించినట్లు కళ్లనుండి నీళ్లు దుమికాయి.
“భావనా! ఆ కాలంలో మూఢవిశ్వాసాలు మనుషులను ఎంతగా బాధించేవో చూడు. ఈ కాలంలో అక్షరాస్యత పెరిగి అవన్నీ దూరమవడం వల్ల మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారు. అది మీ అదృష్టం. ఆ సంఘటన తరువాత ఎన్నో కష్టాలను మీ అమ్మ సాహచర్యంలో అధిగమించాను. ఆరోజే నిర్ణయించుకున్నాను భర్తగా రేఖ జీవన రేఖను సంతోష తీరాలపై నిలబెడతానని. ఈరోజు మన ఇంటి సుఖాల వెనుక పట్టరాని దుఃఖపు అగాధాలున్నాయి. అది మర్చిపోకు. మీ తరానికి సహనం లేకపోవడం మనసుల మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే కుటుంబ బంధాలు బలపడతాయి తల్లీ!
ఆ తర్వాత నీ ఇష్టం” అన్నాడు ఆవేదనగా.
భావన మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని
“సారీ నాన్నా! నా కళ్ళు తెరిపించారు. మా అత్తగారిని అమ్మలా చూసుకుంటాను. మీ కూతురుగా ఈ తరం వారికి ఆదర్శంగా నిలుస్తాను” అన్నది భావన దృఢంగా.

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లీపియర్ – ఫిబ్రవరి

మన మహిళామణులు