అమెరికా కల

కథ

తాటి కోల పద్మావతి గుంటూరు.

ఆ రోజు ఆదివారం కావడంతో చక్రధర్ ఇంట్లోనే ఉన్నాడు. కాలేజీకి వెళ్లాల్సిన పనిలేదు. భార్య విశాలి అందించిన కాఫీని తాగుతూ టీవీ చూస్తున్నాడు. విశాలి మౌనంగా అక్కడే నిలబడి ఉన్నది.
ఏంటి అలా ఉన్నావు. ఆరోగ్యం బాగాలేదా అన్నాడు.
ఆరోగ్యం బాగానే ఉంది మనసుకే బాగోలేదు అన్నది ముభావంగా.
మనసుకేమయింది!
అనుకున్నది జరిగితేనే మనసుకు సంతోషంగా ఉంటుంది.
ఇప్పుడు నీ మనసుకు వచ్చిన కష్టమేమిటి?
“ఏమైందా! మీకు తెలీదా! అమెరికా వెళ్తానని ఎన్నిసార్లు చెప్పి నన్ను నమ్మిస్తారు. ఎన్నిసార్లు మోసం చేస్తారు. ఈ పల్లెటూర్లోనే జీవితాంతం పడి ఉండాలా! ఇద్దరం చదువుకున్నాం. ఇక్కడ ఉండి ఏం చేస్తాం అమెరికా వెళ్లి పోదాం అన్నది విశాలి.
“అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు.”
ఎలాగైనా వీసా సంపాదించండి ఇద్దరు అమెరికా వెళ్ళిపోదాం.
“ఇక్కడ అమ్మ నాన్న బామ్మ, తాతయ్యని వదిలేసి ఎలా వెళ్లగల మంటావు.”
అదంతా నాకు తెలియదు. మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత అమెరికా వెళ్తానని మా వాళ్లకు ఇచ్చిన మాట మర్చిపోయారా! అమెరికా వెళ్తానంటేనే కదా మా వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు!
“ఇక్కడ కావలసినంత ఉన్నది. మనకు ఏం తక్కువైందని. అక్కడికి వెళ్లి సంపాదించుకోవాలనా?
కావాలంటే నువ్వు కూడా సిటీలో జాబ్ చేయవచ్చు అన్నాడు భర్త చక్రధర్.
“భర్త సలహా నచ్చలేదు విశాలికి. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్. పెద్ద అపార్ట్మెంట్ కారు అన్నీ ఉన్నాయి. తనని ఏ డాక్టర్కు ఇంజనీర్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. చక్రధర్ ని ప్రేమించింది. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. పల్లెటూరి సంబంధం ఇష్టం లేకపోయినా కూతురి కోసం ఒప్పుకోవలసి వచ్చింది విశాలి తల్లిదండ్రులు.
‘పెళ్లయి రెండు ఏళ్లయినా చక్రధర్ అమెరికా ప్రయాణం గురించి ఆలోచించడం లేదు. అందుకే ఈరోజు ఏ సంగతి తెలుసుకోవాలనుకుంది విశాలి.
“ఒక్కోసారి విశాలికి ఆ ఇంటి వాతావరణం చూసి కోపం వస్తుంది. ఇంటి వెనకాల పశువుల పాక ఆవులు గేదలు. పేడ రొచ్చు కంపు కొడుతుంది. సాయంత్రం కాగానే దోమలు ముసురుతాయి. ఎలాగైనా ఆ పల్లెటూరు వదిలి సిటీలో కాపురం పెట్టించాలి. లేకపోతే అమెరికా వెళ్ళిపోవాలి అని మనసులో గట్టిగా నిర్ధారించుకుంది.
“మొన్న తన ఫ్రెండు రాజి వచ్చింది సొంతంగా కార్ డ్రైవ్ చేస్తున్నది. ఈ వాతావరణంలో ఎలా ఉంటున్నావు. పెళ్లి కాగానే అమెరికా వెళ్ళిపోతాను అన్నావు కదా. నీ ఆశయాలు కలలు ఏమైనా అంటూ అడిగేసరికి అవమానంగా అనిపించింది. తన ఫ్రెండ్స్ అంతా మంచి స్థితిలో ఉన్నారు. తను మాత్రం ఈ పల్లెటూర్లోనే మగ్గిపోతున్నది. ఎలాగైనా సరే చక్రధర్ ని అమెరికా పంపించి ఆ తర్వాత తను కూడా వెళ్లాలని నిశ్చయించుకుంది.
“ఉన్నట్లుండి చక్రధర్ తండ్రికి పెరాలసిస్ వచ్చి ఒక కాలు చెయ్యి పనిచేయటం లేదు. డాక్టర్లు మందులు వైద్యానికి చాలా ఖర్చయిపోయింది. అయినా ఫలితం లేదు. చక్రధర్ తండ్రి హఠాత్తుగా మరణించాడు.
“దాంతో చక్రధర్ కి ఇంటి బాధ్యతలు ఎక్కువైనాయి. తండ్రి వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చినవాడు. వ్యవసాయం మెలకువలు అన్ని తెలిసినవాడు. ఏ కాలంలో ఏ పంటలు వేయాలో, ఏ పంట వేస్తే బాగా దిగుబడి వస్తుందో అని ఆలోచించి పది ఎకరాల భూమిని 20 ఎకరాలు పెంచాడు.
“కాలచక్రం గిర్రును తిరుగుతూనే ఉన్నది. నాలుగేళ్లలో విశాలి అత్తగారు మామగారు పోయారు. ఆడపడుచుకు పెళ్లి చేయాల్సి వచ్చింది. చక్రధర్ పొలం అమ్మి చెల్లెలు పెళ్లి చేశాడు. తమ్ముడు ఆస్తిపంచుకొని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయాడు.
“విశాలి అమెరికా కల నెరవేరలేదు. కాల గతిలో ఆ ఊరిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పూరిపాకలు, పెంకుటిల్లు పోయి వాటి స్థానంలో అపార్ట్మెంట్ వెలిశాయి. కొంతమంది పొలాల అమ్ముకొని పట్నం చేరుకున్నారు. షాపులు వెలిశాయి. దొరకని వస్తువు అంటూ లేదు. ప్రాథమిక పాఠశాల కాకుండా జిల్లా పరిషత్తు వరకు ఉన్నది. అక్కడ టెన్త్ క్లాస్ చదివిన వాళ్లంతా సిటీలో కాలేజీకి వెళ్తారు. బస్సులు ఆటో సౌకర్యం బాగానే ఉంది.
కాలంతో పాటు మార్పులు సహజం. విశాలి ఇద్దరు బిడ్డల తల్లి అయ్యింది. వాళ్ళ ఆలనా పాలనా చూడడంతోనే సరిపోతున్నది.
“విశాలీ! త్వరగా క్యారేజీ సద్దు కాలేజీ టైం అవుతున్నది అంటూ వచ్చాడు చక్రధర్.
భర్తకు క్యారేజీ సర్దుతున్నది విశాలి.
అప్పుడే చేతి సంచి తగిలించుకొని ఊడిపడ్డాడు సూర్యనారాయణ.
“ఏ మామయ్య బాగున్నావా అంటూ పలకరించాడు చక్రధర్.
“ఆ! ఏం బాగులే ఏం చెప్పుకుంటాం. చెప్పుకుంటే సిగ్గుచేటు. కడుపు చించుకుంటే కాల మీద పడుతుంది.
“అదేంటి మామయ్య ఏం జరిగింది అలా ఉన్నావు.
“మీ అత్తయ్య పరిస్థితి ఏం బాగాలేదు ఆపరేషన్ చేయాలన్నారు. డబ్బు అవసరం పడింది. మీరేమైనా సర్దుతారని వచ్చాను. పొలం బేరం పెట్టాను. అమ్ముడు పోగానే మీ బాకీ తీర్చుతాను అన్నాడు.
“పొలం బేరం పెట్టడం ఏమిటి మామయ్య! అమెరికాలో ఉన్న ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారు. తల్లికి ఆపరేషన్ అంటే డబ్బు పంపలేదా! అసలు ఈ విషయం వాళ్ళకి చెప్పావా?
“చెప్పడం అయింది. డబ్బు అడగటం కూడా అయింది. ఈ మధ్యనే వాళ్లు లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నారట. డబ్బు సర్దుబాటు చేయలేమన్నారు. ఒకటికి రెండుసార్లు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు.
“చక్రధర్ ఆశ్చర్యపోయాడు. విశాలి అక్కడే ఉన్నది. అదేంటి బాబాయి గారు. పిల్లల కోసం మీరు ఎంత కష్టపడ్డారు!
“అవును విశాలి! మామయ్య ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. పగలు రాత్రి పొలంలో కష్టపడి పని చేసేవాడు. పిల్లలకి ఆ కష్టం తెలియకుండా పెంచాడు.. ఒక సంవత్సరం పంట చేతికి అందకపోయినా అప్పు చేసి మరీ చదివించారు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పండుతుందన్న నమ్మకంతో వ్యవసాయం చేసేవాడు. ఇప్పుడు వాళ్లు రెక్కలొచ్చిన పక్షులు లాగా ఎగిరిపోయారు.
“పోనీలే బాబు వాళ్ళు ఎక్కడున్నా బాగుంటే చాలు. కాస్త కోస్తావ్ మిగిలితే వాళ్లకేగా ఇచ్చేది.
“ముందుగానే ఇచ్చి చేతులు దులుపుకుంటే మీ గతి ఏం కావాలా? అమెరికా వెళితే తల్లిదండ్రులు గుర్తుకు రారా.! పోనీలే మామయ్య నువ్వేం దిగులు పడకు నేను బ్యాంకుకు వెళ్లి డబ్బు తెస్తాను. ఈ లోగా నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో అంటూ మామయ్యకు ధైర్యం చెప్పి ఆరోజు కాలేజీకి సెలవు పెట్టి బ్యాంకుకు వెళ్ళాడు చక్రధర్.
“సమయానికి డబ్బు అందుబాటు కాగానే సూర్యనారాయణ భార్యకు ఆపరేషన్ చేయించాడు.
“రాత్రి భోజనాలైనాక భర్త గదిలోకి అడుగు పెట్టింది విశాలి.
“కన్న బిడ్డలే నిజంగా తల్లిదండ్రుల పట్ల అలా ప్రవర్తిస్తారా! అన్నది.
“నీకు ఇంకా నమ్మకం కలగటం లేదా! కన్నవారిని ఉన్న ఊరిని వదిలేసి వెళ్లాక వాళ్ల స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. సంపాదనలో మునిగాక మానవ సంబంధాలు మర్చిపోతారు. ఇప్పటికైనా అర్థమైందా? నేను అమెరికా ఎందుకు వెళ్లలేదో? ఇంత మందిని బాధ పెట్టి అక్కడ మనం సుఖపడేది ఏమున్నది. చివరికి కన్న తండ్రి చనిపోయిన తలకొరివి పెట్టడానికి రాని కొడుకులు ఎంతమంది ఉన్నారు. అదృష్టానికి నోచుకోని ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. అందుకోసమేనా వాళ్లు బిడ్డల్ని కనీ పెంచి పెద్ద చేసేది. వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనే కదా. ఆశ్రమాల్లో ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురుచూస్తున్నారో తెలుసా!
“అందుకేనా మీరు అమెరికా వెళ్ళనన్నారు. మీ వాళ్ల కోసం ఇంత బాగా ఆలోచించారు. మీలాంటివారు ఉంటే తల్లిదండ్రులు సుఖపడతారు. భర్త మనసు ఇప్పటికి అర్థమైంది విశాలి కి.
“సిటీలో చదువుతున్నారు ఇద్దరికీ డిగ్రీ పూర్తయినాయి. పిల్లలు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉండాలని ఆశ పడింది విశాలి.
“పిల్లల భవిష్యత్తుకి మనం అడ్డుపడకూడదు అన్నాడు చక్రధర్.
“విశాలి మనసులో అమెరికా మోజు తగ్గిపోయింది. సూర్యనారాయణ గారి నుంచి భార్య చనిపోయినట్లు ఫోన్ వచ్చింది. అప్పుడు కూడా కొడుకులిద్దరూ రాలేదుట. ఏదో కారణాలవల్ల విమానాలు ఆగిపోయాయని చెప్పారు.
“మేనల్లుడు చక్రధర్ ఆ కార్యక్రమాలన్నీ దగ్గరుండి స్వయంగా జరిపించాడు.
విశాలి తల్లిగా తన పిల్లలకి మంచి సదాభిప్రాయాలు నేర్పింది. సంప్రదాయాన్ని గౌరవించడం అలవాటు చేసింది. పల్లెటూరిలో పుట్టి పెరిగినా, సిటీ చదువులు చదివినా అక్క తమ్ముళ్ల ఇద్దరినీ మాతృభూమి పట్ల మమకారం పెంచుకోనేలా చేసింది.
“చదువులు పూర్తయ్యాయి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు అడిగారు చక్రధర్ పిల్లలిద్దరిని.
“మీరు నేర్పిన విద్య. మీ అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. పుట్టిన ఊరుని మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్లలేం. పదిమందికి విద్యతో పాటు వినయాన్ని సంస్కారాన్ని అందించే గురువులంటే అందరికీ గౌరవం. నేను టీచర్ గా చేస్తానంది కూతురు వీణ. పేదవాళ్ల రక్తాన్ని జలగల్లా పీల్చి రోగాల పేరుతో అంతస్తులు మీద అంతస్తులు కట్టే కార్పోరేట్ హాస్పిటల్స్ ఎంతమంది జీవితాలతో, ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయో! అటువంటి రక్తపు కూడు తినడం కోసం ఆశపడను. నలుగురు చేత దేవుడు అనిపించుకొని దండాలు పెట్టించుకునే వైద్య వృత్తిని ఎన్నుకొని పేదవాళ్ల కోసం వైద్యం చేయాలని నాది నా కోరిక అన్నాడు కొడుకు వివేక్.
“శభాష్! మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు మమ్మల్ని వదిలేసి ఎక్కడ అమెరికా వెళ్ళిపోతారు అని మీ అమ్మకి భయం పట్టుకుంది. చూసావా విశాలీ! మన పిల్లలు తీసుకుని నిర్ణయాలు.
“విన్నానండి. వాళ్లకి మీ పోలికలే వచ్చాయి మనం చాలా అదృష్టవంతులం. మన కళ్ళేదంటే మన పిల్లలు ఉండటం మన అదృష్టమనే చెప్పుకోవాలి. అన్నది సంతోషంగా.
“డబ్బు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, మాతృభూమిని మమకారాన్ని వదిలి వెళ్ళటం, ఎంతమంది తల్లిదండ్రుల హృదయాలను కష్టపడుతుందో మాకు తెలుసు. అందుకే మేము మాకు నచ్చిన వృత్తి చేపట్టాలనుకున్నాము. మమ్మల్ని ఆశీర్వదించమంటూ కొడుకు కూతురు తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు.
“విశాలకి అమెరికా కల నెరవేర లేదనే బాధ తొలగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జనజీవన స్రవంతిలో బోనంకుండ విశిష్టత జనజీవన స్రవంతిలో బోనంకుండ

దొరసాని