తెలుగు భాష అక్షయపాత్ర

– పులి జమున

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేస్తూ ఒకవైపు తెలుగు భాషోపాధ్యాయినిగా, మరోవైపు పరిశోధన విద్యార్థి గా నిరంతరం భాషాభివృద్ధికి శ్రమిస్తున్నారు ప్రముఖ రచయిత పులి జమున. ఈవారం తరుణి ముఖాముఖి లో పులి జమున గారి ఇంటర్వ్యూ…..

 

తరుణి: మీ పరిచయం?
జమున: నా పేరు పులి జమున, మహబూబ్ నగర్.
ఎం.ఏ. ఎం.ఫిల్ చేశాను. తెలుగు భాషోపాధ్యాయినిగా పనిచేస్తూ మరోవైపు పిహెచ్.డి చేస్తున్నాను.

తరుణి: మీరు ఏ ప్రక్రియ లో నైనా రచనలు చేస్తున్నారు. భాషపై ఇంత పట్టు ఎలా సాధించారు?
జమున: చిన్నప్పటి నుండి తెలుగు భాషంటే ఎంతో ఇష్టం. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర,మొదలగు పుస్తకాలతో పాటు చాచా చౌదరి, ఫాంటమ్, మొదలగు కామిక్స్ పుస్తకాలలోని కథలను ఎంతో ఆసక్తిగా చదివేదాన్ని. ఆ విధంగా నేను పెరిగే కొద్దీ వివిధ ప్రక్రియలపై అభిలాష పెరిగింది. తెలుగు భాషపై గల అభిమానంతో ఎం.ఏ.లో తెలుగు సాహిత్యం తీసుకుని అందులో గోల్డ్ మెడల్ ని సాధించాను . అధ్యాపకుల బోధనలతో తెలుగు భాషపై మరింత అభిమానం కలిగింది..సాహిత్య రంగంలో తొలి అడుగులు వేస్తున్న తరుణంలో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం కలిగినది. తెలంగాణ సాహితి అధ్యక్షులు ప్రముఖ కవి, రచయిత వల్లభాపురం జనార్దన, ఖాజామైనోద్దీన్, పాలమూరు సాహితీ అధ్యక్షులు ప్రముఖ కవి డాllభీంపల్లి శ్రీకాంత్, ప్రముఖ కవయిత్రి,రచయత్రి కె.ఎ.ఎల్.సత్యవతి గారు మొదలగు వారితో కలిసి ప్రపంచ తెలుగు మహాసభలలో పలుమార్లు పాల్గొనే అవకాశంతో పాటు, ఒరిస్సా లోని భువనేశ్వర్ లో,ఛండీఘర్ లో,కేరళాలోని తిరువనంతపురం లో,రాజస్థాన్ లోని అజ్మీర్ లో నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనే అవకాశం లభించింది. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ప్రముఖ కవి,ఉపన్యాస కేసరి డాllపొద్దుటూరి ఎల్లారెడ్డి గారి ప్రోత్సాహంతో వారి పర్యవేక్షణలో ఎం.ఫిల్. పూర్తి చేశాను.
కవిసమ్మేళనాలలో పాల్గొనడం, అష్టావధానం, శతావధానాలలో పృచ్చకురాలిగా పాల్గొనడం, ఆకాశవాణి కేంద్రంలో స్వీయ కథానిక చదవడం, విసా ఛానెల్ లో సంక్రాంతి సందర్భంగా కవిసమ్మేళనంలో పాల్గొనడం తదితర కార్యక్రమాల ద్వారా తెలుగు భాషపై పట్టు సాధించగలిగాను.

తరుణి: ఇప్పటివరకు మీరు ఏయే ప్రక్రియల్లో రచనలు చేశారు?
జమున: సామాజిక సమస్యలకు స్పందిస్తూ వివిధ ప్రక్రియలలో రచనలు చేస్తున్నాను. వచన కవితలు, కథలు, వ్యాసాలు, పాటలు, సమీక్షలు, మొగ్గల ప్రక్రియ, మణిపూసల ప్రక్రియ, ఆటవెలది, తేటగీతి, గజల్, రుబాయిలు, సమ్మోహనాలు ఇష్టపది, పదమంజీరాలు కైతిక లు, పీఠికలు, లేఖా సాహిత్యం మొదలగు ప్రక్రియలలో రచనలు చేశాను.

తరుణి: చాలా ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. మరి ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు ప్రచురించారు? 
జమున: పుస్తక ప్రచురణ చాలా ఖర్చుతో కూడిన అంశం. అయినప్పటికీ నా రచనలను సంపుటి గా తీసుకువచ్చాను. మొదటి సంపుటి: నీలో నేను (మొగ్గల ప్రక్రియ)
రెండవ సంపుటి: నేత మొగ్గలు (మొగ్గలు ప్రక్రియ)
మూడవ సంపుటి: అమృత వర్షిని(మణిపూసల ప్రక్రియ) ఇంకా కొన్ని
అముద్రితాలుగా ఉన్నాయి. వాటిలో 1.సుద్దాల అశోక్ తేజ పాటలు ఒక పరిశీలన (ఏంపిల్ సిద్ధాంత గ్రంథం)
2. వచన కవితలు
3. సామాజిక మొగ్గలు
4. పాటల పల్లకి

    

తరుణి: తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న మీరు అందుకున్న అవార్డులు?
జమున: తెలుగు భాష మీద అభిమానం లో సాహిత్య రంగంలో కొనసాగుతున్నాను. నా కృషి ని గుర్తించి అనేక అవార్డు ఇచ్చారు.  భావనాఋషి అవార్డు, బి.యన్. శాస్త్రీ యువస్మారక పురస్కారం, తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో్ సన్మానం, పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బేర్ ఫుట్ వాక్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, జి.వి.ఆర్. ఆరాధనా కల్చరల్ ఫౌండేషన్ వారి నవరత్న పురస్కారం, మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిచే ఉత్తమ కవితా పురస్కారం,
కోయిల్ కొండ మండలం వారిచే, వైశ్యసంఘం ఆధ్వర్యంలోబిసి సంఘం, లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే కోయిలకొండ మండలం ఉత్తమ రచయిత్రిగా నగదు పురస్కారం, శోభకృత్ నామ ఉగాది సంధర్భంగా లుంబినీ పాఠశాల మరియు పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం,
నేటి కవితా సమూహం వారిచే నేటి కవితా భూషణ్, సమీక్షా భూషణ్, కవన పూదోట వారిచే కవనశ్రీగా, కలం స్నేహం వారిచే కలం భూషణ్, అవార్డును అందుకున్నాను. కరోనా నేపథ్యంలో. “కాల పరీక్ష”, “శిథిల స్వప్నం”మొll కథలను,అనేక కవితా పోటీలలో పాల్గొని నగదు బహుమతిని, ప్రశంసాపత్రాలను అందుకున్నాను. మణిపూసల ప్రక్రియలో చేసిన విశేష కృషికి మణి పూసల కవి భూషణ్, మణిపూసల తొలి కవయిత్రి పురస్కారం, సృజన సాహితీ వారిచే ఆత్మీయ పురస్కారం అందుకున్నాను.
ఎం.ఏ.తెలుగు సాహిత్య చరిత్ర-సంస్కృతి అంశానికి గాను కేంద్ర మానవ వనరుల మంత్రి మన్మోహన్ సింగ్ గారు అతిథిగా, గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని అందుకున్నాను.

 

తరుణి: మీరు ప్రస్తుతం రాస్తున్న పుస్తకాల గురించి చెప్పండి.                                                                               జమున: ప్రస్తుతం నేను “చౌడూరి గోపాలరావు గారి సాహిత్యానుశీలనం”అను అంశంపై పి.హెచ్.డి. చేస్తున్నాను.
కథలు ,వచన కవితలు,తేట గీతి పద్యాలతో పాటు బాల సాహిత్యానికి సంబంధించిన రచనలు చేయాలని నా ఆకాంక్ష.

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విలువలు లేని బంధాలు

ప్రాయశ్చిత్తం