పర్బతి బారువా

జంతు సంరక్షణ కార్యకర్త ,మరియు తొలి మహిళా మావటిగా రికార్డుకెక్కి,పురుషాధిక్య క్షేత్రంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గౌరీపూర్ రాజ కుటుంబానికి చెందిన దివంగత శ్రీ ప్రకృతీష్ చంద్రబారువా వీరి తండ్రి. ఆయన ప్రముఖ అంతర్జాతీయ ఎలిఫెంట్ క్యాచర్. పర్బతి 1954 వ సంవత్సరం గోల్పరా జిల్లా లోని గౌరీపూర్ రాజవంశంలో జన్మించారు. తను పుట్టిన సంవత్సరంలోపే ఏనుగులతో అనుబంధం ఏర్పడిందంటారు. రాజకుటుంబం కారణంగా ఏనుగుల మహల్ ఉండేదని అందులో 40 ఏనుగులను పెంచేవారమని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు .తండ్రి ఏనుగుల క్యాచర్ కావడంతో వాటిపై ఆసక్తి, అవగాహన ఏర్పడిందంటారు .తండ్రి తో అడవిలోకి వెళ్లే అలవాటు ఒక కారణంగా కూడా చెప్పొచ్చు. వారు సకుటుంబ సపరివారంగా, సేవకులతో పాటు ఒక ట్యూటర్ని కూడా వెంట తీసుకొని అడవుల్లో సుదీర్ఘ పర్యటన చేసేవారని అందుకే ఏనుగులపై ఇష్టం కలిగిందంటారు.

1970లో రాచరిక వ్యవస్థ (సంస్థానాల )రద్దు వారి కుటుంబానికి ఒక పెద్ద దెబ్బఅని , ఒకానొక సందర్భంలో రాజభవనం, ఏనుగుల నిలయం మాత్రమే మిగలడంతో కుటుంబం పోషణ భారంకావడంతో తండ్రి ఏనుగులను విక్రయిస్తూ, కలప వ్యాపారం చేస్తూ జీవనం సాగించామని చెప్తుంటారు .
పర్బతి తన 14వ ఏట మొదటిసారి ఒక అడవి ఏనుగును కోక్రాఝర్ జిల్లాలోని కచ్గావులో, రైడర్ గా పట్టుకుని తండ్రితో శభాష్ అనిపించుకున్నారు. ఆ రోజుల్లో ఏనుగులను పట్టుకోవడం అతి సామాన్య విషయంగా పేర్కొన్నారు. ఆమె జంబోలను చుట్టుముట్టి బంధించి ,పట్టుకుని మచ్చిక చేసుకోవడంలో నైపుణ్యం సాధించడంతో అస్సాంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ ,ఒడిస్సాలలో కూడా తెలియడంతో ఏనుగుల స్వైర విహారం , విధ్వంసాలు అరికట్టడంలో వీరి సేవలు వినియోగించుకోవడం మొదలుపెట్టారు .

తొలుత ఆమె మావటిగా కెరీర్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నపుడు
తండ్రి ససేమిరా అంగీకరించని కారణం, పురుషాధిక్యపు వృత్తిలో స్త్రీలు మనుగడ సాగించలేరంటూ, వారు అంగీకరించక పోయినా, పట్టుదలతో ఆమె ఈ రంగాన్ని ఎంచుకున్నారు .14 అడవి ఏనుగులను మచ్చిక చేసుకుని వాటికి చికిత్స చేయడం, సంరక్షించడం కూడా నేర్చుకున్నారు. వాటికి చికిత్స చేయడం అంటే కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు ,మూలికా వైద్యంలో ప్రత్యక్షంగా ఒక గురువు ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ‘హస్తిర్ కన్య’ , ‘హాతి కీ పరి’ , ‘ఎలిఫెంట్ ఫేరీ’ అంటూ వివిధ భాషల్లో ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు.
తొలిసారిగా ఈమె 1995లో మార్క్ షాండ్ అనే ట్రావెల్ రైటర్ దృష్టిని ఆకర్షించారు. ఎలిఫెంట్ క్యాచర్ /రైడర్ /హోల్డర్ పర్బతి పై డాక్యుమెంటరీ( బి. బి. సి వారి )తీసే సందర్భంలో నాలుగు నెలలు షూట్ చేశారు. ఏనుగుల్ని స్నానానికి తీసుకెళ్లడం, అడవిలో స్వారీ చేస్తూ అదుపులోకి తెచ్చే క్రమంలో వాటికి గాయాలైతే మూలికలతో వైద్యం చేస్తూ శిక్షణ ఇవ్వడం లాంటి అంశాలను చిత్రీకరించే సమయంలో ఈమెపై పుస్తకం రాయాలని వారు సంకల్పించారు. బి. బి. సి. డాక్యుమెంటరీ ‘క్వీన్ అఫ్ ది ఎలిఫెంట్స్’ తో ఈమె తొలిసారి వెలుగులోనికి వచ్చారు. 1996లో థామస్ కుక్, డైలీ టెలిగ్రాఫ్ ట్రావెల్ బుక్ అవార్డు ,ఫ్రెంచ్ సాహిత్య పురస్కారం కైవసం చేసుకుందీ పుస్తకం .
ఆ షూటింగ్ సందర్భంలో ఒక ఏనుగు మరణం వివాదాస్పదం కాగా ,పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ ,(పేటా) ,మేనకాగాంధిలు, ‘పీపుల్ ఫర్ అనిమల్ ‘శతాబ్ది ఉత్సవాల సన్నాహాల్లో ఏనుగులను హింసించారని అప్పుడే ఏనుగు చనిపోయిందని ఆరోపించగా, ఆ సందర్భంలో ఏనుగులతో ఎగ్జిబిషన్ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడించేది ఉండగా ,వివాదం కారణంతో రద్దు చేశారు. తమ తప్పు తెలుసుకున్న సభ్యులు మైక్ పాండే గౌహతిలోని వారి ఇంటికి వచ్చి క్షమాపణ కోరడంత వివాదం సర్దుమణిగిందని, నిజానికి ఆ ఏనుగు’ సెప్టిసిమియా’ వ్యాధితో మరణించిందని తెలుసుకున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం : 28 ఏళ్ల అడవి ఏనుగు ‘కజిరంగా సాంక్చ్యుయరి’లో ఒక మావటి తో సహా అనేకమందిని చంపగా ,అటవీ అధికారులు దాన్ని చంపడానికి నిర్ణయించగా, బాధపడి ఆ ఏనుగు జీవితం విషాదాంతం కాకూడదని తన సంరక్షణలో ఉంచుకొని, శిక్షణనిచ్చి ట్రాక్ లోకి తెచ్చానని ఇప్పుడది క్రమశిక్షణతో జీవనం సాగిస్తుందని దానికి కొత్త జీవితాన్ని ఇచ్చిన తృప్తి కలిగిందంటారామె సంతోషంగా.


రాజనీతి శాస్త్రంలో పట్టభద్రురాలైన ఈమె, 1978లో ఒక బ్యాంకర్ తో వివాహం జరిగిన పది సంవత్సరాల అనంతరం విడిపోయారు. తర్వాత ఒక ప్రాజెక్టు ఎలిఫెంట్ డైరెక్టరైన ఎస్.ఎస్ .బిస్ట్ . ను వివాహం చేసుకున్నారు.
మ్యాన్ కిల్లర్ ఎలిఫెంట్ ను విజయవంతంగా శిక్షణతో మచ్చిక చేసుకున్న మహిళాఎలిఫెంట్ క్యాచర్ /హోల్డర్ గా ఐ.సి.యు.ఎన్.గ్రూప్ మరియు అస్సాం ప్రభుత్వం సత్కారం పొందారు. మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ టాస్క్ ఫోర్స్ సభ్యురాలు ,ఏషియన్ ఎలిఫెంట్ స్పెషలిస్ట్ గ్రూప్ ఐ .సి . యు.యెన్లో సభ్యురాలు. నాలుగు దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణ ,శిక్షణలో మమేకమై జీవిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఏనుగులంటే ఎందుకు ఇష్టం అని అడుగగా: ‘ఏనుగులు చాలా స్థిరంగా, విశ్వాసపాత్రంగా, ప్రేమగా, క్రమశిక్షణతో ఉంటాయి అందుకే ఇష్టమంటూ ‘సమాధానం ఇచ్చారు.
మావటి వారికి ఎలా లొంగదీయాలో తెలుసు కానీ శాస్త్రీయత లేని కారణంగా నైపుణ్యం సాధించలేరని, సశాస్త్రీయత చాలా అవసరమని పేర్కొన్నారు .
70 ఏండ్ల వయసులో కూడా పర్బతి బారువా జంతు సంరక్షణలో చురుకుగా ఉంటూ, ఇతర మావటి వారికి శాస్త్రీయంగా శిక్షణనిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు 600కు పైగా ఏనుగులకు శిక్షణనిచ్చి మచ్చిక చేసుకున్నారు.ఆమె ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి వివిధ సెషన్లలో, సెమినార్లలో పాల్గొన్నారు.
ఈమె సేవలకు గాను ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం 2024 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పురుషాధిక్య క్షేత్రంలో నిలదొక్కుకుని తనదైన ముద్రవేశారు. ప్రాచీ డర్మాలో నిపుణురాలైన వీరు ఏనుగులు ఆవాసం కోల్పోవడం తనను బాధించే విషయమని అడవుల నరికివేతతో వాటి సంరక్షణ ప్రశ్నార్థకంగా, ఆందోళనగా మారిందంటారు.
అడవి ఏనుగుల బారినుండి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఈమె జీవనయానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నిరంతరకృషితో పద్మశ్రీ ని కైవసం చేసుకున్న వీరిని అభినందిద్దాం.

రాధికాసూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని –

పర్యావరణ ప్రేమికుల్లారా!