అదిగో చూడండి అలనాటి పల్లె
మన పసితనాన్ని గుర్తు చేస్తూ
మన జ్ఞాపకాల్లో పదిలమైన
అలనాటి అందాల పల్లె !
ఆ పల్లెలోని హేమంత ఋతు విలాసం
ప్రకృతి సీమంతినీ సుందర దరహాసం
దట్టమైన మంచు దుప్పటి ముసుగులో
గజగజ వణుకుతున్న పల్లె
మమతానురాగాల సిరిమల్లె !
తుషార శీతల ఉషోదయంలో
లీలగా గోచరిస్తున్న పల్లె అందాలు
రెప్ప వేయనీయకుండా
కళ్ళకు వేస్తున్నాయి బంధాలు!
పొగమంచు తెరలో
కుదురైన పెంకుటిళ్ళు
ముగ్గులు తీర్చిన ముంగిళ్ళు
ముగ్గుల్లో గొబ్బిళ్ళు!
మంచుకు తడిసిన మట్టిరోడ్లు
కంబళ్ళు కప్పుకుని పొలాలకు వెళ్ళే రైతన్నలు
వెన్నంటి సాగిపోయే బసవన్నలు
అల్లనల్లన కనిపించే చలిమంటలు
దూరాన వినిపించే గుడిగంటలు!
లేలేత సూర్యకిరణాలు సోకి
కొబ్బరాకుల నుండి రాలుతున్న మంచుముత్యాలు
కొలనులో విచ్చుకుంటున్న ఎర్ర తామరపూలు
గాలికి తలలూపుతున్న పచ్చ చేమంతులు
చేనంతా విరబూసిన పూబంతులు!
ఇల్లు చేరుతున్న ధాన్యపురాశులు
అవి చూసి మురిసే పల్లెవాసులు
అది కదా అసలైన పల్లె
దేశసౌభాగ్యానికి సిసలైన ముల్లె!
పాడిపంటలతో కళకళలాడే లోగిళ్ళు
హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల మేళాలు
ముగ్గులు వేసే ముద్దుగుమ్మలు
సందడి చేసే కొత్త అల్లుళ్ళు
భోగిమంటల కాంతులు
కనుమ పూజలందుకునే వృషభరాజములు!
ఇదే మన పల్లె ,
ఇంపైన చిననాటి పల్లె
సంక్రాంతి సంబరాల పల్లె!
తెలుగు సంస్కృతికి నెలవు!
సుఖశాంతుల కొలువు!
మళ్లీ కనగలమా ఏనాటికైనా ఇలాంటి పల్లెను?
ఆత్మీయతానురాగాలు
పెనవేసుకొన్న సిరిమల్లెను!
రైతన్న గుండెల్లో ఆనందాన్ని పండించే
అసలైన ముల్లెను!!