ఆధునిక జీవనశైలి వల్ల యువతరానికి ఎదుర్కోలేని,ఎదురీదలేని ఇబ్బందులు వస్తున్నాయి.బతుకు ఆటంకాల కుండపోతలను తట్టుకోలేక పోతున్నది యువత.ఎన్ని గొడుగు లు పట్టగలరు?ఆకర్షణల్లో అట్టహాసాల్లో
ఊగిపోతున్న యువత మందుకు బానిసై ముందుకు పోలేని వైనం కనబడుతున్నది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆనంద కేరింతల్లో ఉండొద్దని అనడం లేదు కానీ ఆరోగ్యానికి బాగుండని, అనారోగ్య హేతువైన మత్తు పదార్థాలను విరివిగా తీసుకోవద్దని అంతే! ఈ లిక్కర్స్ అదే పనిగా పదేపదేగా సేవించడం వల్ల ఆరోగ్యం చెడిపోతున్నదన్న స్పృహ కోల్పోతున్నారు యువత. Smoking is injurious for health అని డబ్బాలపై రాసి ఉన్న సిగరెట్ తాగే అలవాట్లను వదులుకోలేని జనం ఎంతోమంది. చిల్లులు పడిపోతున్న ఊపిరితిత్తులు భరిస్తారే గాని చెడ్డ అలవాట్లు మానుకోవాలి అనే ఆలోచన రానివ్వరు. శ్వాస కష్టమై ప్రాణాలు పోవచ్చు! క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు రావచ్చు! అన్ని తెలుసు… తెలియకుండానే చేస్తున్నారా ? అదే ఇక్కడ సమస్య!
ఇలాగే తాగుడు అనే అలవాటు. Limitless గా తాగుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ ఉంటారు . .ఇలా నష్టపోతున్న కుటుంబాలను చూస్తే హృదయం తరుక్కుపోతుంది. బాగా చదువుకున్న వాళ్ళు ,బాగా డబ్బు సంపాదించే వాళ్ళు, గొప్ప ధనవంతులు కాస్ట్లీ లిక్కర్ తక్కువ మోతాదులో తీసుకొని జాగ్రత్తగా నే ఉంటారు. వీళ్ళలోనూ కొందరు శృతిమించి రాగానపడ్డట్టు, మొదట్లో కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటూ వచ్చిన అలవాట్లను కంట్రోల్ చేసుకోలేక విపరీతంగా తాగడం వల్ల ఇలా ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో వింత ఏమిటంటే ఆడపిల్లలు కూడా మేమేం తక్కువ అని సేవిస్తున్నారు.”ఆడ పిల్లలు కూడా
“అని అనడమే ఒక పెద్ద నేరమైపోయిన కాలంలో సంచరిస్తున్నాం మనం. ఇది సమానత్వంగా భావించడంలోనే వింత అగుపడుతున్నది. చదువుల్లో, సంపాదనలో, అధికార హోదాలలో, రాజకీయ ప్రాతినిధ్యంలో, సమానత్వం కోరుకోవాలి . సామాజికంగా మేం తక్కువ కాదు అని నిరూపించాలి. Equality is our policy అని ఎలుగెత్తడం తప్పు కాదు అదే సరైంది,కానీ దుర్వ్యసనాల విషయంలో కూడా మేమేం తక్కువ తిన్నామని అనడం కొంత వింతగానే అనిపిస్తుంది.
ఎటుగాని మధ్యతరగతి జీవితాలు, దిగువ మధ్యతరగతి జీవితాలు, పేదలు విపరీతమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ తాగుడు అనే వ్యసనం వల్ల. దాని పేరే వ్యసనం! ఒకసారి అలవాటు అయ్యిదంటే చాలు అలవాటు కాస్త పొరపాటు అయిపోతుంది.అంటే అది చాలా పెద్ద చెడ్డ వ్యసనంలోకి మారుతుంది. చీప్ లిక్కర్ తీసుకుంటూ కంట్రోల్ అనేది లేకుండా తీసుకుంటూ తమ శరీరానికి తూట్లు పొడిచుకుంటున్న నిర్భాగ్యులను చూస్తే జాలి కలుగుతుంది.
ఇదంతా ఒక కుట్ర !ఎవరి కుట్ర? ఎవరు చేస్తున్నారు ఈ కుట్ర? అని ఒకసారి తర్కించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపార వాణిజ్య ఎత్తుగడలలో చిత్తయిపోయేది సామాన్యులే. వాళ్ళ వ్యాపార లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం తప్పకుండా ప్రజల మీద ఇటువంటివి తప్పించుకోలేని పెనుభూతాలను వదులుతూనే ఉంటారు.
మరి ఏం చేయాలి? ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి ?ఈ ప్రశ్నలు ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు తమకు తాము వేసుకున్నట్లయితే, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో నడుచుకున్న విధానాలు,బంధువర్గంలో ఆచరణలలో ,చుట్టుపక్కల వాళ్ళ పద్ధతులు ఇవన్నీ పిల్లల మీద ప్రభావం చూపుతాయి .చిన్నప్పటినుంచి ఇటువంటి వాతావరణం చూసిన అనుభవించిన పిల్లలు పెరిగిన తర్వాత తాము ఏదో కోల్పోయామని అది ఇప్పుడు సాధించుకునే శక్తి యుక్తులు వచ్చాయని ఒక చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతారు.కాబట్టే కాస్తంత కళ్లెం వేసి వెనక్కి లాగడానికే, దేవుడని పూజలని ,దేవాలయాలని, మసీదులనీ, చర్చ్ లనీ,గురువులని, ఆధ్యాత్మిక ధోరణులని పరిచయం చేయాలి.చిన్ననాటి నుంచి అప్పుడే కనీసం సమస్య పెద్దదిగా కనిపించే సమయంలో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే
అవకాశాలకు ఒక దారి దొరుకుతుంది ఇదే,ఈ మార్గాలే రాజ్యం చేసే ఈ కనిపించని కుట్రలనుంచి బయటపడడానికి చేయూతనిస్తుంది. గ్లోబలైజేషన్ అని చెప్పుకునే ఈ మహత్తర పదార్ధముందే ,ఇది అంతు పట్టని పదార్థం . దీని నుంచి బయటపడలేము కానీ మనని మనము రక్షించుకోవాలి. ఇదొక్కటే మార్గం.ఈ unseen Conspiracies నుండి ఎవరికి వాళ్లే వాళ్లను రక్షించుకోవాలి .తస్మాత్ జాగ్రత్త!