ఈ తరం కోడళ్ళు

వ్యాసం

మొన్న మొన్నటిదాకా, అత్తలు కోడళ్ళని రాచి రంపాన పెట్టేవాళ్ళని అనుకున్నాం. కానీ ప్రస్తుత సమాజంలో జరిగే పరిణామాలను పరిశీలిస్తే ఈ రోల్స్ రివర్స్ అయినాయని అనిపిస్తోంది. ఇందుకు నేను ఇవ్వబోతున్న ఉదాహరణలు చదివితే మీరు కూడ నాతో ఏకీభవించకుండా ఉండలేరు.

మాధవపెద్ది ఉషా

మొన్నీమధ్యే ఓ కోడలు, ఎనభై దాటిన షుగర్ పేష్ంటైన తన అత్తగారికి, చాలా తెలివిగా ‘ ఎన్నాళ్ళు నోరు కట్టేసుకుంటారు? ఏం ఫరవాలేదు తినండి ఏమీ కాదు అంటూ ఆవిడని ప్ర్రోత్సాహించి తినకూడని స్వీట్లన్నీ తినిపించింది. అది కాస్తా వికటించి ఆవిడని హాస్పిటల్ పాలు చేసింది. అంతేకాదు డయాబిటిక్ కోమా వచ్చి అటునించటే పైలోకాలకి కూడ వెళ్ళిపోయింది తన వాళ్ళందరినీ శోకసాగరంలో ముంచేసి. నమ్మలేకపోతున్నారు కదూ….కానీ ఇది పచ్చి నిజం….! పైగా ఆ కోడలు ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ తను చేసిన ఘనకార్యం గురించి వర్ణించివర్ణించి చెప్పింది. విన్నవాళ్ళంతా ముక్కు మీద వేలేసుకున్నారు. కానీ ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఒక్క మాట అంటే ఒట్టు. అయినా ఏమంటారులెండి? ఆమే భయం భక్తీ లేకుండా అంత ఘంటాపథంగా చెప్తుంటే…..!! ఆ మొగుడనబడే శాల్తీ సూది మ్రింగిన గేదెలా చూస్తూ ఉండి పోయాడు కానీ తన భార్యని ఒక్కటంటే ఒక్క మాట అనలేకపోయాడు! కానీ అటువంటి వెధవ పని చేసిన భార్యని పూర్వకాలపు భర్తైతే చాచి లెంపకాయ కొట్టేవాడు. ఇంకా చెప్పాలంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్ప జ్ప్పేవాడు అవునా కాదా!
చెప్పొద్దూ అలా ఉన్నారు ఈ రోజులలో కొంతమందికోడళ్ళు…! మరో విషయం..ఓ ఇంటికి కాబోయే కోడలు, తన వుడ్బీని అడిగే ప్రశ్నేమిటో తెలుసా?మీ ఇంట్లోఏమైనా పాత సామాన్లు ఉన్నాయా? ఉంటే మాత్రం చెప్పండి. ఆ పాత సామాన్లంటే నాకు పడదు. వాటిని పారేస్తానని ప్రామిస్ చేస్తే గానీ నీతో పెళ్ళికి నేను ఒప్పుకోను అంటున్నారట! ఇంతా చేసి ఆ పాత సామన్లు ఏంటయ్యా అంటే …..ఇంకెవరు? కాబోయే అత్తగారూ, మామగారూట! పెళ్ళైనా క వాళ్ళు కాడ మనతో ఉండేటట్లైతే మాత్రం ఇప్పుడే చెప్పు. వాళ్ళెందుకు మన మొధ్య అంటున్నారుట! అదండీ సంగతి!!!
అసలు నాకు తెలియక అడుగుతాను…పాతికేళ్ళు కంటికి రెప్పలా, చూసుకుంటూ వారిని ప్రయోజకులను చేయడమే తమ ధ్యేయంగా పెట్టుకుని వారికోసమే బ్రతుకుతూ, వారికోసమే తమ సర్వస్వాన్నీ ధారపోసిన ఆ దైవస్వరూపులైన తల్లి తండ్రులనా, పాతసామాను అనడం ?
అసలు దేనికైనా ఓ అర్థం పరమార్థం ఉండాలి. దేవుడు నోరిచ్చాడుకదా అని పెద్దా చిన్నా లేకుండా ఎంత మాట పడితే అంతమాట
అనేయడం ఎన్నటికీ క్షమార్హం కాదు! నేటి అందరూ కాదు, కొందరమ్మాయిలు ఈ సత్యం గ్రహిస్తే మంచిది.
పాత కాలంలో అయితే అత్తలకు చదువు ఉండేది కాదు. అందువల్ల ఏదో తమ ఆధిపత్యం చూపించాలనే అపరిపక్వ మనస్తత్వం వల్ల కోడళ్ళని రాచి రంపాన పెట్టారంటే ఓ అర్థం ఉంది.
కానీ ఈ రోజులలో అత్తలూ, కోడళ్ళూ కూడ చదువుకున్నవారే! చాలామటుకు అత్తగార్లు కూడ ఉద్యోగాలు చేసి రిటైర్ అయినవాళ్ళే! కోడళ్ళతో సర్దుకు పోగల సంస్కారం కలవారే…! అయినా ఎందుకో ఈ మనస్ఫర్థలు..?? పెళ్ళికి ముందే ఈ రకమైన కండిషన్స్ ఏంటి?
పసితనంనుంచీ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి, ఎన్నో ఒడుదుడుకులకు ఓర్చి ఓ ప్రయోజకుడిని చేయడమనేది ఏమైనా సామన్యమైన విషయమా?
పిల్లవాడు తిన్నాడా లేదాఅని కనుక్కుంటూ, వారి చదువులకోసమని, తెల్లవారక ముందే అలారం పెట్టుకుని తాను లేచి వారిని కూడ నిద్ర లేపి, చదువుకోండ్రా అని వెంటపడుతూ, వారికి సుస్తీ చేస్తే సెలవు పెట్టి ఇంట్లోనే ఉండి సేవలు చేసి, టైంకు మందులు వేసి వారి క్షేమం కోసమే అహోరాత్రులూ తపిస్తూ దాదాపు పాతిక ముప్ఫై ఏళ్ళు కష్టపడి పెంచి , తీరా ఆ కష్టం ఫలించే సమయం ఆసన్నమయ్యేసరికీ ఈ కోడళ్ళు వచ్చి గద్దలా తన్నుకు పోవడానికా తల్లితండ్రులు కొడుకులను కనేదీ పెంచేదీ…???
ఏం వాళ్ళకు మాత్రం ఎదిగిన కొడుకు ఛాయలో నిశ్చింతగా జీవితపు చివరి అంకం గడిపేద్దామని ఉండదా…? అలా అనుకోవడం స్వార్థం అవుతుందా…? లేక నేరం అవుతుందా…???
తమాషా ఏంటంటే ఈ సోకాల్డ్ గృహదేవతలు లేక లక్ష్ములు , తమ తల్లితండ్రుల మీద మాత్రం ఈగ కూడ వాలనీయరండోయ్…!!!
అసలు ఈ రోజులలో ఇంకో టాక్ కూడా ఉంది. ఈ సదరు కోడళ్ళ తల్లులే, కూతళ్ళకి కాబోయే వరుడికి పెళ్ళయ్యాక వేరే కాపరం పెట్టాలన్న కండిషన్ పెట్టమని మంత్రోపదేశం చేస్తున్నారట కూడ! అంతేకాదు అది కుదరని పక్షంలో, విదేశాలకు పయనమయ్యే మార్గాలను ( కొడుకు, తల్లి తండ్రులను వదిలి పెట్టి ) కూడ అన్వేషించి పెట్టడానికి కూడ వెనుకాడడంలేదట! ఈ నగ్నసత్యం తెలుసుకున్న ఎవరైనా ముక్కు మీద వేలేసుకోకుండా ఉండగలరా….?
సరే ఇకపోతే ఈ రోజులలో, చాలావరకూ పెళ్ళిళ్ళు 3 నెలలు తిరక్కుండానే పెటాకులవుతున్నాయని నాకు తెలిసిన ఓ ఎడ్వకేట్ ఉవాచ..! మరి ఇంతోటి భాగ్యానికి 5 రోజుల పెళ్ళి ఎందుకమ్మా పనిలేక ( గరికపాటివారన్నట్లు )..!! దానికి కారణం ఆర్థిక స్వాతంత్ర్యమేనట……!!!! హా హతవిథీ …..ఎంత పని చేసావే ఓ ఆర్థిక స్వాతంత్ర్యమా….!!!
సరే అదటుంచితే, ఈ రోజులలో వయస్సుపైబడిన తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్ ల్లో చేర్పించడం అతి మామూలు విషయం అయిపోయింది. అసలిదంతటికీ కారణం ఎవరో తెలుసా??? ఈ మగ మహారాజులే …..!!
వీరికి భార్యతోనూ, తల్లితోనూ సమన్వయంతో ప్రవర్తించడం రాదు. అయితే మమాస్ బాయ్ అనిపించుకోవడం, లేకుంటే హెన్పెక్డ్డ్ హస్బెండ్ అవడం….! ఏం ఇద్దరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్యస్థంగా జీవితం కొనసాగించడం చేతకాదా ఈ సో కాల్డ్ ధీరులకు?
ఏం పెళ్ళాం దగ్గర తల్లిని మెచ్చుకోవడం ఎందుకు? ఉదాహరణకు—క్రొత్తగా గృహస్థాశ్రమంలో అడుగిడిన యువతికీ అందులో నిష్ణాతురాలైన (పొండి పోయిన) తల్లికీ మధ్య పోలికేమిటీ అన్న ఇంగితం కూడ లేకుండా భార్య ఏ వంటకం చేసినా బావుంది అని నాలుగు ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడడం పోయి ఆఁ ఏమైనా మా అమ్మ చేసినట్టు లేదనడం ఎందుకూ ? కోరి కష్టాలు తెచ్చుకోవడం తప్ప ? ఇక తల్లి దగ్గర ‘ దాన్నేం అనకమ్మా ఎట్లా ఉన్నా ఎడ్జెస్ట్ అయిపో ‘అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఎందుకూ పనిలేక…? అసలు ఇలాంటప్పుడే తల్లా పెళ్ళామా అన్న ప్రశ్న ఉదయించేది..! అందుకే ఆ తరం వెళ్ళి పోయింది కానీ ఈ తరం మన ముందు తరం సుఖ సంతోషాలతో వర్థిల్లాలంటే ఈ వుడ్బీ హస్బ్యండ్లందరూ పెళ్ళికి ముందు కోచింగ్ కాలేజ్ లలో ట్రైనింగ్ తీసుకుని గ్రాడ్యుయేట్ అయి ఉండాలని ఓ నిబంధన పెట్టి తీరాలి గాక తీరాలి. అప్పుడే మన వివాహ వ్యవస్థ చిరకాలం వర్థిల్లుతుందని నా ధృడాభిప్రాయం!! మీరు కూడ నాతో ఏకీభవిస్తారు కదూ!
చివరగా నేను ఈ నాటి అమ్మాయిలకు చేసే హిత బోధ ఏమిటంటే , అమ్మా మీరు మీకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎన్నుకుని వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు, అతను మీకు అన్ని విధాల తగినవాడని మీరు విశ్వసించినప్పుడు దయచేసి ఆ వరుడ్ని ఇంతవాడ్ని చేయడానికి వెనుక ఎవరి కృషి ఎవరి త్యాగం ఎవరి భగీరథ ప్రయత్నం ఉన్నాయో కొద్దిగా దృష్టి పెట్టండమ్మా అదే నేను మీ అందరిననీ ముకుళిత హస్తాలతో వేడుకునేది…!!!

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SANJEEVANI – The Vibrant Life

దొరసాని