శ్రీ వ్రతం

ప్రతి సంస్కృతిలో అంతర్భహిత్య శుద్ధి ప్రధాన లక్షణం. అది లేనిదే జీవితం కానీ, సంఘం కానీ సవ్యంగా నడవదు. దానిని బోధించడానికి ఎన్నో మతాలలో ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. చాలావరకు వాటిని అనవసరించే జీవిస్తూ ఉంటారు. వీటికి ఆచార వ్యవహారాలని కూడా అంటారు. ఇలాంటి వాటిలో వైష్ణవులకు ఈ ధనుర్మాసము ఒక విశిష్టమైనది. ఇది ఆచరించడానికి వెనుక ఒక విశిష్టమైన గాధ కూడా ఈ కలియుగంలోనే జరిగినట్లు చెపుతారు. తమిళనాట గల విల్లుపుత్తూరు నందు విష్ణుచిత్తులు అనే వైష్ణవ పూజారికి ఆండాలు తల్లి అయోనిజగా దొరికింది తులసి వనంలో.ఆమె ఈ వ్రతము 30 రోజులు ఆచరించి భగవత్సాన్నిథ్యం పొందినదట. ఆమె ఈ 30 రోజులు రోజుకు ఒక పాశురం చొప్పున పాడుతూ ఆఖరి రోజున శ్రీరంగనాధునిలో ఐక్యమైపోయినదట. వాటిలోని కొన్ని పాసురాల గురించే ఈనాడు మనం ప్రస్తావించుకుంటున్నాం.

          కామేశ్వరి

1వ పాశురం
కాలమానం ప్రకారం నడుచుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇందులో ఆండాళ్లు తల్లి తాము వ్రతం చేయడానికి “ధనుర్మాసం వెన్నెల నిండిన కాలమని,కాల పురుషున్ని పొగుడుతూ… వేలాయుధము ధరించిన కృష్ణుడు మనకి పరా అనే వాయిద్యము ఇస్తాడు, అందుకే నిదురించుచున్న మీరందరూ లేచి ఈ భగవత్ సత్సంగంలో చేరండి. మన పెద్దలు కూడా మనల్ని చూసి సంతోషిస్తారు.”అని బ్రతిమాలింది. అంతే కదా మనం చేసే పని వల్ల భగవంతుడు, పెద్దలు కూడా సంతోషించాలి కదా.
2పాశురం
వ్రతం చేయాలంటే నియమ నిష్ఠలు కావాలి .అందుకే వ్రతం ప్రారంభం ముందు  చేయవలసినవి, చేయకూడనివి తెలుసుకుని నియమంతో ఉండాలని చెబుతోంది. పెద్దల్ని సందర్శించేటప్పుడు మౌనం ఒక భూషణం. ఆండాళ్ చెప్తోంది ” మనం మొదట ఆ క్షీరాబ్దిశయునునికి ధ్వని కాకుండా పాదాలకు మంగళం పాడెదము. నియమాలకు వ్యతిరేకంగా నేతి, పాలను ఆరగించం. బ్రహ్మ ముహూర్తం లోనే స్నానం చేసి, చక్కగా అలంకరించుకొని, మనోవాక్కాయ కర్మల యందు నిర్మలత్వం కలిగి ఉండి, దానధర్మములు చేస్తూ మన పెద్దలు చెప్పిన మార్గంలో నడుద్దాం” అంది
.3వ పాశురం
ఇందులో ప్రపంచం సస్యశ్యామలంగా ఉండాలని, ఈతి బాధలు లేకుండా సుఖంగా ఉండాలని కోరుచున్నారు.” మేము చేయు స్నానము వలన సకాలమన వర్షములు పడి పాడిపంట నిండుగా ఉండాలని, ఇంద్రునికై బలిని యాచించి భూమిని కొలిచిన త్రివిక్రమావతారమును కీర్తించుచున్నారు. మనం కూడా ఈ వ్రతమైన ఆచరించేటప్పుడు మన స్వార్ధమే కాకుండా లోకా సమస్త సునోభవంతు అనుకోవాలి. అదే నిస్వార్ధపు పూజ.
4వ పాశురం
లోకం క్షేమంగా ఉండాలంటే వర్షాలు సకాలంలో పడాలి కదా. అప్పుడే పంటలు బాగా పండుతాయి. ప్రజలకు నాలుగు వేళ్ళు లోపలకి పెడతాయి. అందుకే ఆండాళ్ తల్లి ఆ వాన దేవుని ” శ్రీమన్నారాయణని శంఖము వలె ఉరిమి, చక్రం వలే మెరుపులు మెరిసి, శారంగము అనే ధనస్సు నుంచి వచ్చిన బాణముల వలె వర్షమును కురిపించమని వేడుకుంటున్నది.'”
మనం కూడా స్నానం చేయాలన్నా తిండి గుడ్డ కావాలన్నా గంగమ్మ ఏదో రూపంలో కావాలి కదా.
5వ పాశురం
వ్రతంలో కూర్చునే ముందు భగవత్ ధ్యానం చేస్తాము కదా. అలాగే ఆండాళ్లుతల్లి…గోపవంశము నకు మంగళ దీపుడైన, యశోద తనయునీ , దామోదరుని మనోవాకాయ కర్మలతో ధ్యానించినచో మన పాప రాశి అంతా అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవునని భగవత్ నామము మనసారా కీర్తిద్దామని ” మధురమైన వాక్కులతో పలికింది.

6వ పాశురం
వ్రతము చేయడానికి మనము కూడా ఇరుగుపొరుగు వారిని పిలుచు కుంటాం కదా. అలాగే ఆండాళ్ళు తల్లి వ్రతములో పాల్గొనక బద్ధకముగా పరుండిన గోపికను ఇలా లేపుతున్నది. ” తెల్లవారుతున్నట్లు గుర్తుగా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి కదా., ఆలయంలోని శంఖం కూడా గంభీరంగా మోగుతొంది,.. లేవవేమి… శేష సాయి అయిన ఆ సర్వేశ్వరుని యోగులు మునులు హరి హరి అని కీర్తిస్తున్న ధ్వని విని మేము లేచాము. నీవు కూడా లేచి రా “అని లేపుతోంది.
మంచి కార్యం చేసేటప్పుడు మనము అందర్నీ కలుపుకోవాలి. దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు కదా.
7వ పాశురం
ఇప్పుడు లేపే గోపిక కాస్త తెలివైనది కామోసు! అందుకే ఆండాళ్లంటోంది ” ఓ తేజస్విని…. తెల్లవారుజామున భరద్వాజ పక్షులు చేయు ధ్వనినైనను నీవు వినలేదా.. ఇండ్లలోని గొప్పకాంతలు పెరుగు చిలుకుతున్న చప్పుడు, వారి కదలికలకు తగ్గట్టుగా కంకణాల, ఆభరణాల ధ్వనులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది వినిపించడం లేదా. అంతటా వ్యాపించి ఉన్న ఆ నిర్గుణ పరమాత్మ నేడు వి రోదులను సంహరించుటకు కృష్ణావతారమెత్తివచ్చాడు. ఆయన గుణగానాన్ని కీర్తిస్తున్నాము. విని కూడా ఎట్లాపరుడినావు. మేము నీ తేజస్సు కూడా చూడాలని ఆరాటపడుతున్నాం. తలుపులు తెరువు “అంటోంది.
పుణ్యపురుషుల దర్శనము కూడా మహా భాగ్యమే కదా
8వ పాశురం
ఈ పాశురంలో అమ్మ అంటోంది ” తెలతెలవారిపోతుంది. గేదెలు మేయడానికి మైదానాలకు వెళుతున్నాయి. నిన్ను పిలవడానికి అని మిగతా పిల్లల్ని కూడా ఆపి నీకోసం వచ్చాము . లే లే శ్రీకృష్ణుని గుణగణములను కీర్తించి, కేశినిఅనే రాక్షసుని, చాణుర ముష్టికులను హతమార్చిన వాడును, దేవతలందరికీ దేవుడైన వానిని చేరి సేవించినచో మన బాధలు విని కృప చూపును. ”
మనం కూడా మన కోరికలు తీర్చుకోవడానికి పెద్దలను గౌరవించి, పొగిడి మన పనులు నెరవేర్చుకుంటాము కదా.
9వ పాశురం
ఈ పాశురంలో భగవత్చైతన్యంలో మునిగి జడంగా పరుండిన గోపిక స్వపర వ్యాపారములను విడనాడి మూగ చముడు కమ్మినట్లు పరుండెను. ఆమె తన అద్దాలమేడలో చుట్టూ దీపములతో, సుగంధపు వాసనలు అలముకొని ఉండగా హాయిగా నిద్రించుచున్న గోపికను ” ఎంతో భాగ్యవంతురాలైన ఓ మేనత్త కూతురా…మణిమయ నిర్మితమైన తలుపుల గడియ తీయి. ఓ అత్త నీ కూతురు ఏదైనా మంత్రమునకు కట్టుబడిపోయినదా. పలుకుట లేదు. నీవైనా మాధవ! వైకుంఠ వాసా! అని అనేక భగవత్నామములను కీర్తించి ఆమెను లేచునట్లు చేయుము.”అనివేడుకుంటున్నారు భగవత్ అనుభవం లో నిమగ్నమైన గోపిక వీరి పిలుపుకి బాహ్యస్మృతికి మరలి వచ్చును. మనం కూడాశుద్ధసత్వంలో ఉన్నా శుద్ధ తామసంలో ఉన్న జడును వలె పడి ఉంటాము. గోవిందా గోవిందా అని దగ్గరగా పిలిచే హరినామ స్మరణ బాహ్య స్మృతికి తెస్తుంది కదా..
10వ పాశురం
ఇట్లు పారతంత్రీయ పరాకాష్ట లో ఉన్న గోపికను ( వ్రతము పూర్తవకుండానే పూర్ణఫలమును పొందిన ) “తలుపు తీయకపోయినా పరవాలేదు. కనీసం మాట్లాడరాదా… తులసి మాలలచే అలంకరింపబడిన కిరీటము గల నారాయణుడు మనము మంగళములు పాడగానే పురుషోర్ధములు ఇచ్చును. ఏమి నీ మొద్దు నిద్ర… రావణుని సోదరుడైన కుంభకర్ణుడు తన గాఢ నిద్రను నీకు ఇచ్చాడా ఏమి? లేచి వచ్చి తలుపు తెరిచి మాట్లాడము ” అంది ఆండాళ్ళు. అంటే పూర్ణ జ్ఞాని అయిన ఆ గోపిక దర్శనము చే వారికి కూడా మంగళములు చేకూరును అని భావము. పీఠాధిపతులు,స్వామీజీలు వచ్చినప్పుడు దర్శన భాగ్యం కోసం తపిస్తాం.
11వ పాశురం
ఇందులో ఆండాళ్ తల్లి కుంభకర్ణుడుగా నిద్రపోతున్న గోపికను లేపడానికి మరో ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఆమె వంశాన్ని పొగుడుతోంది. ” నీ గొప్ప వంశము వారు ఎలాంటి వారు అంటే దూడలు కలిగిన వేలాది ఆవుల మందల యొక్క పాలును సులువుగా పితికేస్తారు, శత్రువులను నశించినట్లు దండెత్త గలరు, ఏ కల్లాకపటం ఎరుగని వారు, అయిన గోపాలకుల ఇంట మొలచిన ఓ బంగారు తీగా! పుట్టలో ఉన్న పాము పడగల లాంటి పిరుదులు కలదానా… వన మయూరము వలె అందమైన కేశపాశం కలదానా… ఓ సంపన్నురాలా.. బంధువులు, చలికత్తెలతో కూడి ఇంటి ముందుకు వచ్చి చేరినాము. నీల మేఘశ్యాముడగు ఆ శ్రీకృష్ణుని నామములను మేమందరం గానం చేయుచుండగా నీవు ఉలుకక పలుకక దేనికొరకు నిద్రిస్తున్నావు. నీ నిద్రకు అర్థమేమో తెలుపుము ” అంటూ అడుగుతూ లేపుతోంది.అంటే ఆ గోపిక భగవతానందమందు మునిగి తన సంపదలను, సౌందర్యాన్ని కూడా లెక్కచేయడం లేదు. భగవంతుని తప్ప అన్యచింతన లేని అనన్య భక్తురాలు.
ఈ విధంగా 30 పాశురాలు ఉన్న తిరుప్పావై వైష్ణవులకు ఎంతో పుణ్యప్రదమైనది. ప్రతి వైష్ణవ ఆలయంలోనూ తప్పక ఈ ధనుర్మాసాన్ని ఆచరిస్తారు. రోజుకి ఒక పాసురం చొప్పున చదువుతారు. కలియుగంలోనే జరిగిన సంఘటన అంటారు ఆండాళ్ ఆవిర్భావం. ద్రవిడ దేశంలోని శ్రీవిల్లిపుత్తూరు అనే చోట అయోనిజ అయిన ఆండాళ్ విష్ణుచిత్తులకు తులసి వనంలో లభించింది. బాల్యం నుండి భక్తి జ్ఞాన వైరాగ్యం కలిగి ఉండెడిది. శ్రీకృష్ణుని వివాహము చేసుకొనవలెనని కాంక్షించుచుండెడిది. పూర్వము ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పొందుటకు గోపికల చేసిన కాత్యాయనీ వ్రతమును ఆచరించింది. ఆ వ్రతము తర్వాతి తరంవారికి కూడా అందించవలెనని ” తిరుప్పావై” అనే ప్రబంధ రూపమును లోకానికి అందించింది. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం. శ్రీ పదమగు వ్రతం.
ఇందులో 11 పాసురాల అర్ధాన్ని మీకు వివరించడానికి భగవంతుడు వీలు కల్పించాడు.ధనుర్మాసం నెల్లాళ్లు ఆలయాలలోనూ, ఇళ్లలోనూ శ్రద్ధ, భక్తులతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వైష్ణవులు . భోగి పండుగ రోజున ఆండాళ్ళు రంగనాధుల కళ్యాణం కూడా ముఖ్యంగా శ్రీరంగంలో వైభవంగా జరుపుతారు. ఇతర వైష్ణవ దేవాలయాలలో కూడా ఆచరిస్తారు. ఈ వ్రతాలన్నీ పూర్వీకులు మనకు క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చడానికి అందించినవే. దానివల్ల దేహం నిరోగమవుతుంది జన్మ పురోగమనమవుతుంది.
జై శ్రీ కృష్ణ — జైశ్రీరామ్

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనుబంధం

సంక్రాంతి