దొరసాని

ధారావాహికం – 12వ భాగం

భారతావనికి చేరుకున్నారు నీలాంబరి మరియు భూపతి గారు…

ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే చాలామంది పూల గుచ్చాలు పట్టుకొని నిలబడ్డారు అవి చూసి వీళ్ళిద్దరూ బయటికి రాబోతుంటే వాళ్ళందరూ” నీలాంబరి గారు” అని పిలిచారు..

        లక్ష్మి మదన్

ఒక్కసారి వెనుతిరిగి చూసిన నీలాంబరికి వాళ్లు తననే పిలుస్తున్నారు అని అర్థం అయింది..

” నన్నే పిలుస్తున్నారండి నీలాంబరి !అంటున్నారు” అన్నది.

అందరూ వారి దగ్గరికి వచ్చారు…

” మేమంతా మీ ప్రతిభను సోషల్ మీడియాలో చూసి తెలుసుకొని వచ్చాము… ఏదైనా సోషల్ మీడియా వల్ల ఈమధ్యకాలంలో వార్తలు తొందరగా వ్యాప్తి చెందుతున్నాయి.. అలాగే మాకు యూట్యూబ్ ద్వారా మీ వీడియోస్ కొన్ని లభించాయి మాకు ఎంతో ఆసక్తి అనిపించింది మీరు ఏం సంకల్పించారు ?మీరు ఉపన్యాసంలో వెళ్ళడించలేదు… ఆ ఆసక్తితో మేము మిమ్మల్ని కలవడానికి వచ్చాము మేడం… సంకల్పం ఏమిటో మాకు వివరిస్తారా అని అడిగారు కొన్ని చానల్స్ వాళ్ళు”…

నీలాంబరికి అయోమయంగా అనిపించింది “మేము వస్తున్నది కూడా ఎలా తెలిసింది అయినా కూడా నేను ఎక్కడో మారుమూలల ఎవ్వరికి తెలియకుండా పెరిగిన ఒక మామూలు మహిళను.. ఎక్కడో నేను ఉపన్యాసం ఇస్తే ఇక్కడ తెలిసి వీళ్లు నన్ను పలకరించడానికి వచ్చారు”.. అనుకున్నది

అప్పుడు భూపతి గారు వాళ్ళ దగ్గరికి వచ్చి ” నీలాంబరి గారు ఒక మామూలు మహిళ కాకపోతే తనకు ఎన్నో ఉన్నత ఆశయాలు ఉన్నాయి. ఏ కారణంలు అయితే ఏమి తను ఇన్ని రోజులు బయటపడలేదు తనకున్న అభిరుచి చిత్ర లేఖనం మాత్రమే ..దానివల్లనే తనకు ఇంత ఎక్స్పోజర్ వచ్చింది. అది కూడా తాను నలుగురికి తెలియాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ తన సంకల్పం ఇలా ఎంతోమందికి తెలియజేసింది…నీలా! నువ్వు మాట్లాడు ” అని చెప్పాడు.

” అవును నేను నలుగురిలో కలవడానికి ఇష్టపడను ఎప్పుడూ నేను మా దివాణం దాటి మాఊరు దాటి బయటకు వెళ్లలేదు వెళ్లిన ఏదో ఒక రోజు రెండు రోజులు మాత్రమే కానీ నేను అమెరికాకు నెల రోజులు వెళ్లాల్సి వచ్చింది. ఈ నెల రోజులు నాకు అద్భుతమైన జీవితం ఇచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చిత్రలేఖనం అంటే ఉన్న అభిరుచిని నాకూతురు నలుగురికి తెలియజేసింది అది అభిరుచిగానే కాకుండా నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటుంది అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది.. మీకు అందరికీ ధన్యవాదములు. నేను అనుకున్నది నెరవేరిన తర్వాత మీకు ముందుగానే తెలియజేస్తాను.. అప్పుడు నేను మాట్లాడతాను నా సంకల్పం నెరవేరాలని మీరు కూడా నాకు మద్దతునివ్వండి అలాగే దాని వివరాలు కూడా నేను అది పూర్తయిన తర్వాత మీకు చెప్తాను ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను నన్ను క్షమించండి” అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించింది నీలాంబరి.

తర్వాత వాళ్లు వారి కోసం వచ్చిన కారులో వారి ఊరైన గోపాలపురానికి వెళ్లారు…

కారులో కూర్చున్న నీలాంబరి బయటకు చూస్తూ “ఇదే కదా నా జన్మభూమి ఎక్కడికి వెళ్లినా మనసు పుట్టిన ప్రదేశం మీదికే మళ్ళుతుంది.. ఒక పుణ్యావనిలో పుట్టినందుకు దేవుడికి అనుక్షణం నేను కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాను…” అనుకుంటూ బయట పరిసరాలను కొత్తగా చూస్తున్నట్లు చూస్తూ కూర్చుంది….

నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి ఊరికి దాదాపు మూడు గంటలు పడుతుంది. గోపాలపురం దారి ఒకప్పుడు అసలు బాగుండేది కాదు ..భూపతి గారు సర్పంచ్ అయిన తర్వాత చక్కని రోడ్డు వేయించారు రోడ్డు కిరుపక్కలా కూడా బంతిపూల తోటలు… చామంతి పూల తోటలు మొక్కజొన్న వరి పండించిన పొలాలు పత్తి పొలాలు అన్ని కనిపిస్తున్నాయి మనసంతా తేలిపోయినట్లుగా ఉంది. భూపతి గారు నీలాంబరిని చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నారు.

విమానంలో భోజనం సరిగా చేయలేకపోవడం వల్ల ఆకలి వేయసాగింది “నీలా !ఎక్కడైనా ఆగి ఏమైనా తిందామా” అని అడిగారు.

ఒకప్పుడైతే నీలాంబరి బయట తినడానికి ఒప్పుకునేది కాదు కానీ ప్రపంచాన్ని తను చూసి వచ్చింది తనలో మార్పు కూడా వచ్చింది. అలాగని బయట అస్తమానం తినాలని ఎవరు అనుకోరు.. కానీ! తప్పని పరిస్థితిలో తినే లాగా ఉండాలి ఎవరి చుట్టూ వాళ్ళు గిరి గిసుకొని ఉంటే మనతో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అనే విధంగా తన ఆలోచన ధోరణిని మార్చుకున్నది.

” ఎక్కడైనా శుభ్రంగా ఉన్న హోటల్ దగ్గర ఆపండి అల్పాహారం తినేసి బయలుదేరుదాము” అన్నది నీలాంబరి.

ఒకింత ఆశ్చర్యపోయిన భూపతి..” రాజూ! ఒక మంచి హోటల్ ముందర ఆపు మనం టిఫిన్ చేసి బయలుదేరుదాము” అని చెప్పాడు.

అలా పచ్చని పొలాలు కొంత దాటిన తర్వాత ఒక కుటీరం లాగా ఉన్న ఒక స్థలంలో బండి ఆపాడు డ్రైవర్…

“ఇక్కడ ఆపవేంటి ఇది ఇల్లు కదా అలాగే అనిపిస్తుంది” అన్నాడు భూపతి.

” ఇల్లు కాదు సార్ ఒక మంచి హోటల్ ఇంటి భోజనం లాగా ఉంటుంది చాలా శుచిగా శుభ్రంగా తయారు చేస్తారు నాణ్యత విషయంలో ఇంక చెప్పనవసరం లేదు ధర కూడా తక్కువ … ఎంతోమందికి సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు మీరు ఒకసారి తిని చూడండి” అని చెప్పాడు.

నీలంబరి భూపతి కారు దిగి ఆ హోటల్ లోకి ప్రవేశించారు… ఇల్లు లాగే ఉంది.. ఇల్లంతా కూడా శుభ్రంగా పవిత్రంగా కూడా అనిపిస్తుంది అన్ని వెదురుతో చేసిన కుర్చీలు టేబుల్లు ఉన్నాయి.. కింద పీటలు కూడా ఉన్నాయి సాంప్రదాయంగా భోజనం చేసే వాళ్ళకి ఏర్పాటు చేశారు…

అగర్బత్తులు సాంబ్రాణి పరిమళము ఆహ్లాదకరంగా అనిపిస్తుంది…

నీలాంబరి భూపతి వెళ్లి కుర్చీలలో కూర్చున్నారు డ్రైవర్ వేరే చోట వెళ్లి కూర్చోబోయాడు..

” రాజు నువ్వు కూడా ఇక్కడే కూర్చో ఎందుకు దూరంగా వెళ్లి కూర్చుంటావు” అన్నది నీలాంబరి..

ఆశ్చర్యంగా చూసిన రాజు…

” పరవాలేదు మేడం నేను ఇక్కడే కూర్చుంటాను నాకు కొంచెం మొహమాటంగా ఉంటుంది” అని చెప్పి వేరేచోట కూర్చున్నాడు.

ఆర్డర్ తీసుకోవడానికి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు…

” ఏం తీసుకుంటారు అండి” అడిగి ఏమున్నాయో చెప్పారు.

తనకు ఇష్టమైన పొంగలిని ఆర్డర్ చేసుకుంది నీలాంబరి భూపతి మాత్రం ఇడ్లీ అడిగారు…

చక్కని అరిటాకులు పరిచి వాళ్లకు పలహారాలు వడ్డించారు ఇడ్లీతో పాటుగా కొబ్బరి చట్నీ టమాటో చట్నీ పల్లి చట్నీ రెండు మూడు రకాల పొడులు మంచి సువాసనలు వస్తున్న ఇంటినేయ్యి వేసి వడ్డించారు….

అదనంగా ఆర్డర్లో లేని రవ్వ కేసరిని కూడా ఇచ్చారు నోట్లో వేసుకుంటే కరిగిపోయే మధురంగా ఉంది…

అక్కడి పలహారం వీరికి ఎంతో నచ్చింది ..”ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ఆహారం ఎలా ఇవ్వగలుగుతున్నారు_ అని నీలాంబరి అడిగి తెలుసుకుంది…

ముందుగా చిన్న బండితో స్టార్ట్ చేసి వీళ్ళు అంచలంచలుగా ఎదిగారట అందులో తక్కువ ధరకు విక్రయించడం వల్ల ఎంతోమంది విరాళాలు కూడా ఇచ్చి ప్రోత్సహించారు ఏమీ లేని పేదవారికి భోజనం అయిదు రూపాయలకే పెడతారట టిఫిన్లు రెండు రూపాయలకే పెడతారట ఎంతో మందికి దీనివల్ల ఉపాధి కలుగుతుంది ..పనిచేసుకొని ఇంటికి వెళ్లే వారికి వంట చేసుకునే టైం లేనివారికి ఇక్కడ చక్కని భోజనం లభిస్తుంది… ఇదంతా తెలుసుకున్న నీలాంబరి “ప్రపంచంలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టే లోకం ఇంకా బాగానే ఉంది” ఇలా ఆలోచించుకుంటూ తాను టిఫిన్ చేయడం ముగించింది….

కౌంటర్ దగ్గర ఒక హుండీని చూశారు..

” ఇది ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు” అని అడిగింది నీలాంబరి.

 

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సావిత్రిబాయి ఫూలే

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య కీర్తన