ఆంగ్ల నూతన సంవత్సరం 2024

అందరికీ 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  మన సంప్రదాయం కాకపోయినా అనుసరిస్తున్న ఈ విధానం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఆంగ్ల మాస నామాలైన జనవరి, ఫిబ్రవరి, మార్చి మొదలైన నెల నామకరణ విధానాన్ని తెలుసుకుందాం.
ప్రస్తుతం మనం అనుసరిస్తున్న క్యాలండర్‌ ` కాలమాన పట్టిక ` గ్రెగేరియన్‌ పట్టిక.  ఈ పట్టికకు ఒక నిర్దిష్ట ప్రామాణం ఉన్నట్లు కనబడదు.  అయితే క్రీ.శ. 1582లో పోప్‌గ్రెగేరియన్‌ సరిచేసిన క్యాలండర్‌గా చెప్పవచ్చును.  దీని ప్రకారం యదార్ధ సంవత్సరానికి 24.6 సెకెన్ల  ఎక్కువ సమయం లెక్కించటం జరుగుతోంది.  దాని ప్రకారం ఒక రోజు ఎక్కువ వస్తుంది.  ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జాన్‌ వెర్షల్‌ ఈ లోపాన్ని సవరించటానికి ఒక మార్గాన్ని సూచించారు.  అది క్రీ.శ 4000 సంవత్సరమును లీప్‌ సంవత్సరంగా లెక్కించకుండా వదిలేయడం.  ఈ లోపాలను సవరించడం అవసరమని ‘‘నానాజాతి సమితి’’ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది.  ఈ సంఘము 185 రకాల ప్రణాళికలను పరిశీలించి క్రీ.శ. 1926లో ఒక నివేదిక ఇచ్చింది.  కాని ఇంతవరకు అది ప్రగతి సాధించలేదు.   అదే సమయంలో సంవత్సర ప్రారంభము వివిధ దేశాలలో వివిధ ఆచారాలననుసరించి ఉగాది నాడు ప్రారంభమయ్యేది.  అయితే సంవత్సర ఆరంభము అందరికీ ఒకే విధంగా అంటే ఒకే నెలలో, ఒకే తేదీన వస్తే బాగుంటుందని ఫ్రాన్స్‌ చక్రవర్తి చార్ల్‌స్‌ 15వ శతాబ్దిలో నిర్ణయించి, అప్పటివరకూ 11వ నెలగావున్న జనవరిని ఒకటవ నెలగా ప్రారంభించి,  నూతన సంవత్సర వేడుకలు జరిపాడు.  అప్పటి నుండి నేటి మన నూతన ఆంగ్ల సంవత్సరం వేడుకలు ప్రారంభమైనాయి.  ముందుగా దీనిని ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్‌ అంగీకరించి ప్రారంభించారు. తరువాతి కాలంలో ప్రపంచములోని అన్ని దేశాలు అనుసరించటం జరిగింది.
‘జనవరి’ మాసానికి ‘జనస్‌’ అనే రోమన్‌ దేవతయొక్క నామం నిర్ణయించటం జరిగింది.  జనస్‌ దేవత ముందుకు, వెనుకకు ముఖాలు కలిగివుంటుంది.  ‘ఫిబ్రవరి’ లాటిన్‌ నామధేయమైన ‘ఫిబ్రువరిస్‌’ నుండి రూపాంతరము చెందినది.  కుజగ్రహాన్ని ఆంగ్లములో ‘మార్స్‌’ అంటారు.  రోమన్లు కుజగ్రహాన్ని అధికంగా కొలిచే రోజులు కలిగిన మాసాన్ని ‘మార్చి’ నెలగా నామకరణం చేయటం జరిగింది.   ‘ఏప్రిలిస్‌’ అనే లాటిన్‌ పదానికి ‘ఏప్రిల్‌’ గా పిలుచుట జరుగుతోంది.  ‘మయా’ అనే గ్రీకు దేవత నామాన్ని ‘మే’ నెలగా భావిస్తారు.  రోమన్లు అధికంగా కొలిచే గురుగ్రహ భార్యయైన ‘జునో’ నామము నుండి ‘జూన్‌’ నెల ఆవిర్భవించింది.  రోమన్‌ దేశానికి చెందిన ‘జూలియస్‌సీజర్‌’ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘జూలై’ మాసం నామకరణం చేయబడిరది.  రోమన్‌ చక్రవర్తియైన ‘అగష్టాస్‌’ గుర్తుగా ‘ఆగష్టు’ నెల వాడుకలోకి వచ్చింది.  లాటిన్‌ శబ్దమైన ‘సెప్టెమ్‌’ నుండి ‘సెప్టెంబరు’ అవతరించింది. అలాగే లాటిన్‌ శబ్దమైన ‘అక్టో’ నుండి ‘అక్టోబర్‌’ ఉద్భవించింది. అలాగే లాటిన్‌ పదాలైన ‘నోవెమ్‌’ నుండి ‘నవంబరు’, ‘డిస్‌మ్‌’ నుండి ‘డిసెంబరు’ నామకరణం చేయటం జరిగింది.   ఈవిధమైన నామకరణ విధానాన్ని స్థూలంగా పరిశీలిస్తే  నామకరణ విధానములో సరైన శాస్త్రీయత ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవాలి.

మన దేశానికి కాలమాన పట్టిక ఋషులచే సరైన ప్రామాణికతన పాటించి తయారుచేయబడింది.కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వచ్చే కాలమానాన్ని  మన ఋషులు మనకందించారు.  ఏనెలలో, ఏరోజున, ఏగ్రహణం వస్తుంది, ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది మొదలైన వారం, తేదీ వివరాలతో మనకందించారు.  ఈ ఘనత మన ఋషులకు, మన జ్యోతిష్కులకు చెందుతుంది.  ప్రకృతి పరంగా వసంతఋతువును చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాదిగా,  సంవత్సర ప్రారంభముగా భావిస్తాము.
చైత్రము, వైశాఖము, జ్యేష్టము మొదలైన తెలుగు నామాలు కలిగిన మన మాసాలు ఆంగ్లమాస కాలమానానికి అనుసంధానించబడినవి. వ్యవహార సౌలభ్యం కోసం ప్రపంచదేశాలు అన్నీ  అనుసరించే విధానాన్నే మనం అనుసరిస్తున్నాము.   అందువలన ప్రభుత్వ కార్యకలాపాలు ఆంగ్లమానాన్ని అనుసరించే జరుగుతుంది. దైనందిన విషయ వ్యవహారాలలో మాత్రము తెలుగు మాస విధానాన్ని కొనసాగిస్తున్నాము.  ‘ఉగాది’ అనేది కూడా మనదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒకొక్క విధంగా ఉంటుంది.  కొందరు చాంద్రమానాన్ని అనుసరిస్తే మరికొందరు సౌరమానాన్ని అనుసరిస్తారు.  అందువలన ఉగాది అనుసరణలో కూడా ప్రాంతీయ భేదము కనబడుతుంది.
మన భారతీయ సిద్దాంతము గ్రహా సంచారాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.  ఆంగ్ల సంవత్సరము మన రెండు తెలుగు ఉగాదుల సమ్మేళనముగా ఉంటుంది. సాధారణంగా మొదటి మూడు ఆంగ్లమాసాలు ఒక ఉగాది ముగింపుగాను, తరువాతి తొమ్మిది ఆంగ్లమాసాలు మరొక తెలుగు ఉగాదితో కొనసాగింపుగాను వుంటుంది.  సంవత్సరంలో సాధించిన విజయాలు, పొందిన అపజయాలు, అసంపూర్ణంగా మిగిలిన వ్యవహారాల పరిశీలన వంటివ మనం సంవత్సరాంతములో చేసుకుంటూ, వచ్చే నూతన సంవత్సరంలో అనుసరించవలసిన విధివిధానాలపై ఒక అలోచన చేసుకుంటాము, కార్యప్రణాళిక రూపొందించుకుంటాము. ప్రపంచము నాస్తిక, ఆస్తిక వ్యక్తుల కలయికగా ఉంటుంది.  ఖగోళంలోని గ్రహాల సంచారము మానవ గతివిధులపై  ప్రభావం చూపుతుందనేది వాస్తవము.  అందుకే మనలో చాలా మంది గ్రహసంచార ఫలితాలు తెలుసుకోవటంలో ఆసక్తి కనబరుస్తారు. జ్యోతిషమనేది ఒక శాస్త్రము.  సూర్యోదయ, సూర్యాస్తమయ, గ్రహణ విషయాలు, నక్షత్ర సంచార నిర్ణయాలు మొదలైనవి  లెక్కించటంలో ఒక నిర్దుష్ట విధానముంటుంది.  వీటిని ఆధారం చేసుకుని ప్రతీ గ్రహము మానవ మేధస్సుపై, మనస్సుపై, నడవడికపై ఎటువంటి ప్రభావము చూపుతుందనేది నిర్ణయిస్తారు. వీటిని స్థూలంగా మనం జాతక ఫలితాలు అని పిలుస్తాము. వ్యాపారాలకు అనుకూల సమయమైతే వ్యాపారస్థులకు లాభసాటిగా ఉంటుందని, వాతావరణ పరిస్థితులననుసరించి రైతులు లేక వ్యవసాయదారులు లేక, దళారీ ఫలిత నిర్ణయముంటుంది.  వరదలు, తుఫానులు, ఎండలు, వడగాల్పులు, చలితీవ్రత మొదలైన వాటిని అనుసరించి ప్రజల స్థితిగతులు అంచనావేస్తారు.  యుద్ధ పరిస్థితులు ఉంటే అది మొత్తం దేశంపై ప్రభావం చూపుతుంది.  ఇలా అనేక కారణా సంకలనంతో, కూర్పుతో జాతక నిర్ణయాలు చేస్తారు.
కొందరు ప్రముఖ జ్యోతిష సిద్ధాంతులు నిర్ణయించిన ప్రకారం ఈ 2024 సంవత్సర ఫలితాలు స్థూలంగా వివరించటం జరిగింది.  సకాలంలో వర్షాలు కురిసి, పంటలు తగినంత పండుతాయి.  కొత్త తెలుగు ఉగాది వస్తుంది. ఈ సంవత్సరములో అనేక విధములైన ఏఏ పరిణామాలు కలుగుతాయో తెలియజేస్తారు. స్త్రీలకు రక్షణ విషయం, అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఎలా వుంటాయో, రాజకీయ సంక్షోభాలు తలెత్తే అవకాశము వుందో లేదో తెలియజేస్తారు. అనేక వ్యాపార రంగాలలో అభివృద్ధి గోచరిస్ంచేదీ,వ్యాపారులు కల్తీల విషయంలో జాగ్రత్త అవసరాల విషయం చెబుతారు. అంటురోగాలు కొంత వరకు తగ్గుముఖం పడతాయని గతం లో చెప్పారు. ఇది ఎంతో ఊరట నిచ్చే అంశము. అన్నదాతకు ప్రభుత్వం నుండి సహాయం అంది కొంత ఊరట లభిస్తుందో లేదో తెలియజేస్తారు. ఎరువు, ధాన్యా లు, పంటలు వంటివీ, నల్ల ధాన్యాల పంటలు పెరుగుతాయా తరుగుతాయా , చిన్న వ్యాపారులకు నష్టాలు వచ్చే సూచనలున్నాయా లేవా తెలియజేస్తారు. రక్షణ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పింది ఫలవంతమైంది. అవినీతిపరులపై కఠిన చర్యలు ఉంటాయో లేదో తీవ్రవాద, నక్సలైట్ల ప్రభావం తగ్గుముఖం పడుతుందోలేదో వేచి చూడాలి. సకాంలో ధనం చేతికి అందుతుంది కనుక శుభకార్యక్రమాలకు అంతగా ఆటంకం  ఉండదు అనే ఆశతో ఉంటారు ప్రజలు. ఏదిఏమైనప్పటికి వ్యక్తిగత జాతక పరిశీనలతో సరైన ఫలితాలు నిర్ణయింపబడతాయి.
ఈ 2024 సంవత్సరం అందరికి అనుకూలంగా ఉండి ధన, ధాన్య సమృద్ధిని కలిగిస్తుందని ఆశిద్ధాం.  ఆహ్లాదకర వాతావరణంలో అందరం సమిష్టిగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాదిద్ధాం. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సర్వే జనాః సుఖినోభవన్తు

 

డా. దేవులపల్లి పద్మజ విశాఖపట్టణము ఫోను 9849692414

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘తరుణి‘ యూట్యూబ్

నీ స్నేహంలో