సంకల్పం

ధారావాహిక నవల:9 వ భాగం

విద్యుల్లత కట్టెకోల

పృథ్వీ అనూష ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు. తమతో పాటు తమ చుట్టూ ఉండే సమాజం కూడా బాగుండాలని కోరుకునే వారు.
అందుకు తమ వంతు కృషి చేయాలని భావించే వారిద్దరి మార్గాలు మాత్రం భిన్నమైనవి.
పృథ్వి మురికివాడల్లో యువతకు మంచి విద్య లభిస్తే వారు సన్మార్గంలో నడుస్తారని భావించి, అక్షర యజ్ఞం మొదలెట్టాడు.
సమాజం లో రాజకీయ నాయకుల అవినీతి, లంచగొండితనం బహిర్గతం చేసేందుకు కలాన్ని కత్తిలా ఝలిపించాలని జర్నలిజం ఎంచుకుంది అనూష.
మార్గాలు వేరైనా గమ్యం ఒకటే ఐన వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం.

ఎడబాటు
హాస్పిటల్ నుంచి అనుకున్న సమయం కన్నా ముందుగానే డిశ్చార్జ్ అయింది అనూష. తల్లిదండ్రులు, పృథ్వి అందరూ వెంటరాగా, ఇంటికి వెళ్ళింది. ఆమెకు ప్రమాదం జరిగిన రోజు నుంచి సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. చాలామంది అభిమానులుగా మారి ఆమె ఆరోగ్యం గురించి నిత్యం కనుక్కుంటూ ఉండటం, త్వరగా కోలుకోవాలని ఆశీస్సులు పంపిస్తూ ఉండడం ఆమెకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఈరోజు తన డిస్చార్జ్ అవుతుందని తెలిసి ఎంతో మంది పుష్పగుచ్చాలు పంపించారు హాస్పిటల్ కి. వాటన్నిటిని చూసి తెగ సంబరపడింది అనూష.
కార్లో వచ్చేటప్పుడు పృథ్వి కి అవన్నీ చూపిస్తూ ఆమె ఎక్సైట్ అవుతూ ఉంటే ఏమాత్రం రియాక్ట్ అవని అతడిని చూసి,చాలా కోపం కూడా వచ్చింది అనూష కి.
ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులతో,ఇప్పుడే వస్తాను అని చెప్పి పృథ్విని కాఫీ షాప్ కి తీసుకెళ్లమంది. అక్కడికి వెళ్ళాక, “పృథ్వీ నేను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచీ గమనిస్తున్నాను‌ నువ్వు ఎందుకు ముభావంగా ఉంటున్నావు? నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అన్నావు. నాకు ప్రమాదం జరిగిన రోజు, స్పృహ లోకి రాగానే, నీ కళ్ళలో నేను ఆ ప్రేమ అంతా చూడగలిగాను‌ కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
ఎందుకలా ఉన్నావో నాకు ఇప్పుడే చెప్పు. నీకు తెలుసు కదా నాకు ఏ విషయంలో అయినా క్లారిటీ అనేది చాలా ముఖ్యం,” అడిగింది అనూష.
జవాబు చెప్పలేనట్లు మౌనం వహించాడు పృథ్వి.
“నీ మౌనం నా ప్రశ్నకు జవాబు కాదు, చెప్పు పృథ్వీ ఏం జరిగింది?” రెట్టించింది అనూష.
“సరే నీకు క్లారిటీ కావాలి కదా, చెప్తాను విను.నీకు ప్రపోజ్ చేసి, నువ్వు వెంటనే ఒప్పుకోవడంతో,నేను ఆరోజు ఎంతో ఆనందంతో ఉన్నాను. మనిద్దరం కలిసి జీవించబోయే భవిష్యత్తును అంతా ఎంతో అందంగా ఊహించేసుకున్నాను.
వెంటనే ఇంటికి వెళ్లి మా అమ్మానాన్నలకు నీ ఫోటో చూపించి, నీ గురించి చెప్పాను.  వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను.
కానీ వాళ్ళిద్దరూ,” నీ వివాహం, నీ భవిష్యత్తు, నీ ఇష్టం. దానికి మేము కాదనము‌ కానీ నీకు చూస్తే ప్రశాంతమైన జీవితం ఇష్టం. ఆ అమ్మాయి ఏమో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, అదికూడా సమాజం కోసం తాపత్రయపడే మనిషి అంటున్నావు. కనుక ఖచ్చితంగా తనతో జీవితం నువ్వు అనుకున్నట్లు సాఫీగా నడవదు. తను ప్రమాదం అంచునే నడుస్తుంటుంది కనుక నువ్వు అలాగే ఉండవలసి ఉంటుంది, ఆలోచించుకో,”అని చెప్పారు.
వాళ్ళు అలా చెప్పినప్పుడు నాకు ఆ విషయం అర్థం కాలేదు. నువ్వు ఒక చిన్న ఛానెల్లో పని చేస్తున్నావని, ఆయన ఊహించినంత భారీగా ఏమి జరగదని నేను మా నాన్నగారికి చెప్పి, మీ ఛానెల్ ఆన్ చేశాను టీవీలో.
సడెన్ గా నువ్వే వార్తలు చదువుతూ కనిపించేసరికి ఆశ్చర్యపోయాను.
ఆ తర్వాత చక చకా ఏమిటో జరిగిపోయాయి. ఏం జరిగిందో అని కంగారుపడుతుండగా నీకు ప్రమాదం జరిగిందని వార్త.
హాస్పిటల్లో స్పృహ లేకుండా అలా పడి ఉన్న నిన్ను చూసినప్పుడు నా ప్రాణం పోయినంత పని అయింది. నీకు ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్పిన తర్వాతే నా ప్రాణం తిరిగి వచ్చింది.
ఆ తర్వాత జరిగినదంతా శ్రీధర్ గారి ద్వారా విన్నాను. నువ్వు సాధించిన విజయం చిన్నదేమీ కాదు. దానికి  నిన్ను అభినందించకుండా ఉండలేను.
నువ్వు ఇక మీదట ఇలాంటి ప్రాణాంతకమైన ప్రమాదాలకు లోనవ్వకుండా ఉండడం కోసం,నిన్ను ఈ ఉద్యోగం వదిలేయమని కోరాలని అనుకున్నాను. కానీ నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు కదా. అందుచేత ఆ మాట నీ పేరెంట్స్ ద్వారా, శ్రీధర్ గారి ద్వారా అడిగించాను. నువ్వు వాళ్ళ మాటలను కొట్టి పారేసావు.  ఇదే నీ మార్గమని, ప్రాణం పోయే వరకు ఇందులోనే ప్రయాణిస్తానని,తెగేసి చెప్పావు వాళ్లకి. అది నా మనసును చాలా బాధ పెట్టింది.
నీకు నీ వృత్తి ప్రాణం అయ్యుండొచ్చు, దానికోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధం కావచ్చు. కానీ చెప్పాను కదా నువ్వే నా ప్రాణం అని.
మరి ముందు ముందు నీకు ఏదైనా జరిగితే నేనేం కావాలి?నేను ప్రాణాలతో ఉండగలనా?అయితే నీకు మాటిచ్చిన విధంగానే నేను నడుచుకోవాలి, లేదా మాట తప్పి నీ దృష్టిలో చెడ్డవాడిని కావాలి. రెంటిలో ఏది జరిగినా నష్టపోయేది నేనే. అదే నా ఈ ప్రవర్తనకి కారణం.
సరే ఎలాగూ  ఈ సంభాషణ మనమధ్య వచ్చింది కనుక సిగ్గు విడిచి అడుగుతున్నాను. నిన్ను జర్నలిజం మానేయమని నేను అడగను, కానీ ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మానెయ్. నాకోసం ఇది చేయగలవా ప్లీజ్? కన్నీళ్ళతో వేడుకుంటున్నట్లు అడిగాడు పృద్వి.
అతడి మాటలు గుండెల్ని పిండేసినట్లు ఒక్క క్షణం నిస్తేజంగా, నిర్లిప్తంగా ఉండిపోయింది అనూష. ఆ తర్వాత తేరుకుని,” పృథ్వీ, నీ మాటలతో నీకు నా మీద గల అవ్యాజమైన ప్రేమ వ్యక్తపరిచావు. నిజంగా నేను అందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నా సమాధానం చెప్పే ముందుగా నేను ఒక్క విషయం అడుగుతాను.
మీ నాన్నగారు, అమ్మ,  లేదా నేనే అయినా నీ దగ్గరికి వచ్చి,” నువ్వంటే నాకు చాలా ప్రేమ‌.నువ్వు సమాజసేవ అంటూ ఆ మురికివాడల్లో తిరుగుతుంటే, నీకు ఏమైనా జరుగుతుందేమో అని చాలా భయమేస్తుంది. అందుచేత నువ్వు ఆ పని మానేయ్. సమాజానికి ఏదైనా చేయాలంటే నాలుగు డబ్బులు విరాళంగా ఇచ్చేయ్,” అని చెప్పారు అనుకో, నువ్వు ఏం సమాధానం చెప్తావు.?
“అనూ, నేను చెప్పిన విషయం ప్రత్యక్షంగా జరిగినది. నువ్వు దానికి సమాధానం దాటవేసి, జరగని దాని గురించి మాట్లాడుతున్నావు. అంటే నీకు నేను చెప్పిన దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదని నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు బోడి గుండు కి మోకాలికి ముడి పెట్టకు.నేను వెళ్తున్న దారిలో ఎటువంటి రిస్క్ గాని ప్రమాదంగానీ, లేదని నీకు కూడా తెలుసు.
కానీ నువ్వు నడిచే దారి అనుక్షణం ఆపదలతో కూడుకున్నది‌. నీకు ఇలా జరిగిన తర్వాత మనిద్దరి వివాహం గురించీ, భవిష్యత్తును గురించీ నా పేరెంట్స్ కూడా కంగారు పడుతున్నారు.
నువ్వు ఇదే మార్గంలో పయనిస్తూ ఉంటే,ఇప్పుడు జరిగినట్లే అప్పుడు ఏదైనా జరిగితే?మనిద్దరి ప్రాణాలకు ఏమైనా హాని కలిగితే? ఇలాంటి భయాలు వాళ్ళని వెంటాడుతున్నాయి.
ఈ విషయాలన్నీ నీతో మాట్లాడాలంటేనే నాకు ఏమిటో గా ఉంది.నువ్వు సాధించిన విజయాన్ని చిన్నది చేయలేను. కానీ మన అందమైన భవిష్యత్తును దాని కోసం ఛిద్రం చేసుకోలేను.
ఈ ఆలోచనలతో నాలో నేనే నలిగిపోతున్నాను. నీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు అనూ? దీనికి పరిష్కారం ఏమిటో నాకు తెలియటం లేదు,” వేదనతో చెప్పారు పృథ్వి.
ఆక్షణం తన మీద అతను చూపిస్తున్న అంతులేని ప్రేమకు కరిగిపోయింది అనూష.అతని దగ్గరగా వచ్చి, అతడి తలపై  ముద్దు పెట్టి, మార్దవంగా, లాలనగా,” చూడు పృథ్వీ, నీ మాటలతో నా మీద నీకున్న ప్రేమ, నీ భయాలు, నీ తల్లిదండ్రుల కు నీ పట్ల ఉన్న ప్రేమ అన్నీ నాకు అవగతం అయ్యాయి.
ఇంతటి అనురాగాన్ని పొందగలిగిన నేను అదృష్టవంతురాలిని,అని కూడా నాకు తెలుసు.
అయినా ఈ విషయంలో నా సమాధానం ఏమయి  ఉంటుందో నీకు తెలుసనుకుంటా.
నేను ఇది వరకే చెప్పినట్లు, జీవితమా,నా ఉద్యోగమా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు నేను నా ఉద్యోగమే కోరుకుంటాను. అది పిచ్చి అని చూసేవాళ్ళుకి అనిపించొచ్చు.నేనేమీ చేయలేను.
అలాగే నీ పేరెంట్స్ చెప్పినట్లు, నా ఆశయం కోసం, ఆనందం కోసం నీ జీవితాన్ని రిస్క్ లో పెట్టే  హక్కు నాకు లేదు.
ఈ ఆలోచనలన్నీ మనసులోనే ఉంచుకొని, మనం పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నన్ను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు .కానీ అలా చేయని  నీ సంస్కారానికి హాట్సాఫ్.
ఇప్పుడు మాత్రం నేను ఒకటే చెప్పగలను.
‘నీ సుఖమే నే కోరుతున్నా, నిను వీడి అందుకే  వెళుతున్నా.’
మన ఇకపై కేవలం స్నేహితులుగా ఉండిపోదాం పృథ్వీ.  బై,ఉంటాను” అంటూ వెళ్ళిపోతున్న అనూష వంక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు  పృథ్వి.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్వప్న రాజీయం

తొలిపోద్దుకు మలినడక