మన మహిళా మణులు-

శ్రీమతి ఉమా ప్రసాద్ – అచ్యుతుని రాజ్యశ్రీ మేడమ్

మన మహిళామణులు శీర్షికలో ఉమాప్రసాద్ గారి వ్రాశాము. వారి మాటలలోనే విషయాలను తెలుసుకుందాం. – సంపాదకురాలు.

 

క్లుప్తంగా నా పరిచయం
నేను పుట్టింది రాజమండ్రిలో. మా తల్లిదండ్రులు ఎమ్‌.ప్రమీలాదేవి, గాత్ర-వీణ కళాకారిణిగా ప్రవేశముంది. తండ్రి ఎమ్‌.వి.రంగాచార్యులు. నాన్నగారికి మేము ముగ్గురు సంతానం. అందులో నేను రెండవదాన్ని.

అక్క విజయలక్ష్మి, తమ్ముడు ఎమ్‌.వి.శ్రీనివాస్‌. మా నాన్నగారికి చిన్నప్పటినుంచి సంగీతంపై మక్కువ కాని ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్స్‌ కారణంగా నేర్చుకొనే అవకాశం, సంగీతవిద్యను అభ్యసించడం కష్టమైంది. కానీ సంగీతాభిలాష నశించలేదు. ఉద్యోగరీత్యా కలకత్తా ట్రాన్స్‌ఫర్‌ అయినప్పుడు రోడ్డుమీద ఎవరో ‘మురళి’ వాయిస్తున్నప్పుడు ఆ నాదానికి ఆకర్షితులైయ్యారు. అప్పుడు గురువు లేకుండా వినికిడిజ్ఞానంతో విని నేర్చుకోవడానికి ప్రయత్నించారు. విజయవాడ ట్రాన్స్‌ఫర్‌ అయిన తరువాత సద్గురువులు అందరి సహకారంతో సంగీతవిద్యను అభ్యసించి, పిల్లలకుకూడా ఆ అభిరుచిని పంచారు. తర్వాత వేణువు విద్వాంసులుగా రాణించారు. ఆయన తర్వాత సంగీతానికి అంకితం అయ్యారు. ముఖ్యంగా బాగా చిన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను ఒక గురువు వద్దకు తీసుకెళ్ళి సంగీతానికి పునాది వేయించింది. తరువాత కష్టమైనా ఇష్టంతో విద్యను అభ్యసించడం మొదలుపెట్టాను. విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో 6 సం||లు డిప్రొమా (గాత్రం)లో సర్టిఫికేట్‌. అప్పటి మొట్టమొదటి గురువు కీ||శే|| శ్రీమతి రేవతి రత్నస్వామి. తరువాత కీ||శే|| పెమ్మరాజు సూర్యారావుగారు, కీ||శే|| ఎమ్‌.వి. రమణమూర్తిగారు, కీ||శే|| కిట్టప్ప, అన్నవరపు రామస్వామిగారు, కీ||శే|| డా|| నూకల చిన్నసత్యనారాయణగారు తదితర గురువుల వద్ద విద్యను అభ్యసించడం జరిగింది. అప్పట్లో చిన్న చిన్న సంగీత కచేరీలు గురువుల ప్రోద్భలంతో చేయడం జరిగింది. పెళ్ళి అయిన తరువాత డా|| సి.ఆనందరామం, ప్రసిద్ధ సాహిత్య, నవలా రచయిత్రిగారి (మా అత్తగారు) ప్రోద్భలంతో ఎమ్‌.ఎ.(మ్యూజిక్‌) (గాత్రం), తెలుగు యూనివర్శిటీలో, అలాగే సంగీతంలో పిహెచ్‌.డి. పద్మావతీ యూనివర్శిటీ, తిరుపతిలో, అలాగే ఎమ్‌.ఎ.(ఎకనామిక్స్‌), ఆంధ్రా యూనివర్శిటీనుంచి పట్టాలు పొందటం జరిగింది.


సహజంగా మా అత్తగారు సాహిత్యాభిలాష నాకు కొంత సంక్రమించి సంగీతంపై వ్యాసాలు, కవిత్వాలు, భక్తి, ఆధ్యాత్మిక రచనలు చేయడానికి సాహసించాను. అనేక సంస్థలలో ఉపన్యాసకురాలిగా, సంగీత కదంబంలో సంగీత కార్యక్రమాలలో పాల్గొని పాడడం జరిగింది.
విద్యాభ్యాసం రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లో జరిగింది.
ప్రేరణ మా తల్లిదండ్రులు
ప్రోత్సహించింది మా అత్తమామలు అన్నివేళలా అన్నింటా చేదోడువాదోడుగా వుంటూ మంచి సహాయ సహకారాలు అందిస్తున్న మా శ్రీవారు (రిటైర్డ్‌ ఆంధ్రబ్యాంకు మేనేజరు).
అలాగే మా కుటుంబసభ్యులు, మా పిల్లలు సాహితి, మనుమరాలు రోహిత, అబ్బాయి రేవంత్‌ – వారికి కూడా సంగీత ప్రవేశం వుంది.

               
నా జీవనం – నా జీవితం నేను కూడా సంగీతంలో మమేకం అవ్వాలన్న ఉద్దేశ్యంతో నేను ‘సాహితి కళా స్రవంతి’ అన్న సంస్థను స్థాపించి తద్వారా సంగీత జిజ్ఞాసులకు మా సంస్థ ద్వారా ఉచిత సంగీత శిక్షణ, కస్తూరిబా వుమెన్స్‌ కాలేజ్‌లో కల్చరల్‌ హెడ్‌గా వివిధ కాలేజీలలో సంగీత శిక్షణ, మరియు మా సంస్థద్వారా వివిధ రంగాలలో పోటీలు నిర్వహించి, సంగీత విశిష్ట అతిథులను ఆహ్వానించి, వారి చేతులమీదుగా బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తూ వచ్చాం. ముఖ్యంగా ‘సాహితి కళా స్రవంతి’ సంస్థ ప్రారంభం – జ్యోతి ప్రజ్వలన – డా|| సి.నారాయణ రెడ్డిగారి చేతులమీదుగా సంస్థను ప్రారంభించాం.

తర్వాత మా మొట్టమొదటి గురువులు శ్రీమతి రేవతి రత్నస్వామిగారు, కోవెల శాంతగారు, మణిరఘునాధ్‌గారు, కొమాండూరి శేషాద్రిగారు తదితరులు. అలాగే సాహిత్యగోష్టిలో డా|| శరత్‌జ్యోత్స్నగారు, విద్యారాణిగారు, ముక్తేవి భారతిగారు తదితరులు పాల్గొని సంస్థకు మంచి పురోగతికి పాటుపడ్డారు.
ఒక గృహిణిగా అన్నింటినీ సమన్వయించుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ (రిటైర్డ్‌ లెక్చెరర్‌, ఎకనామిక్స్‌) అలాగే సంగీత అధ్యాపకురాలిగా పార్ట్‌టైమ్‌గా క్లాసెస్‌ చెపుతూ సంగీతయానం చేస్తున్నాను.
కళలు ఉత్కృష్టమైనవి. ఏ కళైనా అభిరుచి అనే జిహ్వను కలిగివుంటే అవరోధాలు అధిగమించి సోపానాలు ఎక్కడం సులభతరం అవుతుంది. నా మనస్సు – ధ్యాస – చింత – సంగీతం అనే లోకంలో విహరించడం మాత్రమే.
డా|| సి.ఉమాప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒద్దిక

బాలికా వికాసం