దొరసాని

ధారవాహికం – 10 వ భాగం

లక్ష్మీమదన్

అలేఖ్యని మెల్లగా తీసుకుని వెళ్లి హాల్లో ఉన్న దీవాన్ మీద పడుకోబెట్టారు… వెంటనే నీలాంబరి లోపలికి వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చి అలేఖ్యకు తాగించింది.

” అలేఖ్యా! ఒక్క సారి కళ్ళు తెరువు” అని పిలిచాడు సుధీర్..

కళ్ళు తెరిచిన అలేఖ్య..
ఒక్కసారి చుట్టి చూసి లేచి కూర్చుంది…

” ఏమయింది తల్లి! “అని అడిగింది నీలాంబరి..

ఒక్కసారిగా వెక్కి వెక్కిఏడ్చింది అలేఖ్య…

” ఏమైంది తల్లి ఇంత బాధ ఎందుకు ?చెప్పమ్మా నేను ఉన్నాను కదా” అలేఖ్యను దగ్గర తీసుకొని తల నిమిరిగింది నీలాంబరి.

” నేను చెప్తా ఆంటీ అన్నాడు సుధీర్”

ప్రశ్నార్థకంగా సుధీర్ వైపు చూశారు నీలాంబరి మరియు భూపతి.

” మేము ఇప్పుడే పిల్లలు వద్దు అనుకొని చాలా జాగ్రత్తలు తీసుకున్నాము.. కానీ! ఎలా జరిగిందో తెలియదు అలేఖ్య నెల తప్పింది అది నిన్న రాత్రి నిర్ధారణ అయింది ఇంట్లోనే యూరిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఆవిషయం తెలిసింది… అప్పుడు కొంచెం ఉద్వేగానికి గురైంది అలేఖ్య ..”మనం వద్దు అనుకున్నాముకానీ దేవుడు మనకి ఇప్పుడే కనండి అని ఒక సంకేతం ఇచ్చినట్టున్నాడు అదే కాక మా అమ్మానాన్న ఇక్కడికి రాకపోయినట్లయితే ఈ గర్భం ఉంచాలా వద్దా అని ఆలోచించే వాళ్ళము అని రాత్రి చాలాసేపు ఏడ్చింది అలేఖ్య” అని చెప్పాడు సుధీర్.

అప్పుడు అలేఖ్య అన్నది..

” అమ్మ నాన్న నన్ను క్షమించండి… నేను ఇప్పుడిప్పుడే వృత్తిలో స్థిరపడుతున్నాను కదా అందుకని కొంత సమయం తీసుకుందామని అనుకున్నాను దానికి సుధీర్ కూడా ఒప్పుకున్నాడు అందువల్ల ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాము కానీ ఆ భాగ్యం ఇప్పుడే దక్కే అదృష్టం నాకు దేవుడు ఇచ్చాడు నిజంగా మీరు రాకుంటే మీకు ఈవిషయం తెలియకుండానే నేను…నేను .. ఏమో ఆ మాట అనడానికి నాకు నోరు రావడం లేదు ఏం చేసేదాన్నో… అందుకే నాకు చాలా ఏడుపొస్తుంది అమ్మ నేను చక్కని పాపని మన భారత దేశంకి వచ్చాకే కంటాను… నా సీమంతానికి ఏర్పాట్లు చేసుకో అమ్మ’ అని నవ్వింది అలేఖ్య.

ఇంక నీలాంబరి భూపతి ల సంతోషము మిన్నంటింది…

ఇద్దరు అలేఖ్యను దగ్గరకు తీసుకున్నారు నుదుటి పై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు భూపతి..

“అయితే అమ్మ సంకల్పించే బాలసదనం మన ఇంటి బిడ్డతోనే మొదలు అన్నమాట” అన్నాడు భూపతి.

” అవును అందరి పిల్లలతో పాటే మన బిడ్డ కూడా అక్కడికి వెళ్లి వస్తుంటాడు” అన్నది నీలాంబరి.

” అలేఖ్య! ఈరోజు ఇద్దరము సెలవు తీసుకుందాము అందరం కలిసి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి వద్దాము ఎలాగూ అత్తయ్య మామయ్య ఊరికి వెళ్ళిపోతున్నారు కదా ఒకసారి దర్శనం చేసుకుని వస్తే అందరికీ తృప్తిగా ఉంటుంది” అని అన్నాడు సుధీర్.

” సరే లీవ్ కోసం నేను మాట్లాడతాను” అని లేచి లోపలికి వెళ్ళిపోయింది అలేఖ్య.

నీలాంబరి స్నానం చేసి వచ్చి దేవుడు దీపం వెలిగించింది…

” స్వామి నా ఇల్లు ఒక్కటే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ చల్లగా ఉండాలి ఏ బిడ్డలకు కష్టం రాకూడదు ఆడపిల్లలు సురక్షితంగా క్షేమంగా ఉండాలి ” అని దండం పెట్టుకొని… నైవేద్యం కోసం బెల్లం పొంగలి చేసింది… పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి అది మెత్తగా ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసి తర్వాత కొంచెం ఇలాచి పొడి వేసి ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేడి చేసి అందులో కాజు బాదం వేయించి పొంగలి లో నెయ్యితో పాటుగా వేసింది మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసి చక్కగా కలిపి గిన్నెలోకి తీసుకొని స్వామికి నివేదన చేసింది… తర్వాత తను ఎప్పుడూ చేసుకున పారాయణం చేసుకుంటూ కూర్చుంది నీలాంబరి ..తన చిన్నప్పటినుండి తనకి లలితా పారాయణం అలవాటు అలాగే హనుమాన్ చాలీసా రామ రక్షా స్తోత్రం ఇంకా చిన్న చిన్న స్తోత్రాలు చాలానే చేసేది ఆమె తండ్రి శ్రీపతి గారు వ్యవహారంలో ఎంత గొప్పవాడు అయినప్పటికీ పిల్లల గురించి శ్రద్ధ ఎక్కువగా తీసుకునేవాడు …స్కూల్ కి వెళ్లే లోపల స్నానం చేసి వచ్చిన శ్లోకాలు కొన్ని దేవుడి దగ్గర చదువుకొని దేవుడికి దండం పెట్టుకొని భోజనం చేసి పాఠశాలకు వెళ్లేవారు ఆ అలవాటు ముందు నుంచి అలాగే కొనసాగిస్తూ ఉంది నీలాంబరి…

భూపతి గారికి ఈ పూజ వ్యవహారాలు అంతగా ఉండేవి కావు..

పెళ్లయిన కొత్తలో హారతి తెచ్చి ఇస్తే ఏదో మొక్కుబడి అన్నట్లుగా తీసుకునేవారు కానీ సమయం వచ్చినప్పుడల్లా దేవుడు పూజ చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పేది నీలాంబరి… అలాగని తప్పకుండా చేసుకోమని ఎప్పుడు బలవంత పెట్టలేదు.. ఏదైనా బలవంతం చేస్తే ఆ పని మీద విరక్తి పెరుగుతుంది అందుకని ఆ పని చేయలేదు నీలాంబరి తాను పూజ చేసుకునేటప్పుడు గట్టిగా నోటితో చదువుకుంటూ చేసేది గంట మోగించినప్పుడు ఆ శబ్దం భూపతికి వినచ్చేలా మోగించేది…

ఇల్లంతా చక్కగా సాంబ్రాణి పొగ వేసి ఎప్పటికప్పుడు ఇంటిని కోవెలలా ఒక భక్తి భావం కలిగించే లాగా ఉంచుకునేది ..ఇది చూసిన నీలాంబరి అత్తగారు మామగారు కూడా ఎంతో సంతోషించే వాళ్ళు ఇంటి కోడలు ఇలా ఉంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు! కొన్ని రోజుల తర్వాత భూపతి లో కూడా చిన్నగా మార్పు వచ్చింది తాను కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా దైవ సన్నిధిలో గడిపేవాడు ఆ తర్వాత అది అలవాటుగా మారి తాను కూడ నీలాంబరి తో పాటు పూజలో నిమగ్నం అయ్యేవాడు…

అలా కూర్చుని నీలాంబరి పారాయణం చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన భూపతి..

” నేను స్నానం చేసి వస్తాను నీలా! ” అని స్నానానికి వెళ్ళిపోయాడు…

అప్పటికే స్నానం చేసి వచ్చిన అలేఖ్య సుధీర్ దేవుడి దగ్గరికి వచ్చారు…

అలేఖ్య పెళ్లి కోసం కొన్న చిలకపచ్చ రంగు పట్టు చీర కట్టుకున్నది ..

ఎరుపు రంగు అంచుతో అక్కడక్కడ జరీబుటాతో చీర చాలా బాగుంది. అందులో అలేఖ్యకి చాలా బాగా నప్పింది..

ఎప్పుడు జుట్టు వదిలేసుకుని ఉండే అలేఖ్య చక్కగా జడ వేసుకుంది మెడలో చిన్న నెక్లెస్ వేసుకొని చెవులకి జుంకీలు పెట్టుకుంది కాళ్లకు చిన్నగా శబ్దం చేసే పట్టీలు పెట్టుకుంది… అచ్చం అలేఖ్యను చూస్తే ఇప్పుడు నీలాంబరి లాగే అనిపిస్తుంది…

“అదే మాట అన్నాడు సుధీర్..

” అలేఖ్య నీకు అన్ని మీ అమ్మ పోలికలే ఉన్నాయి అసలు చూస్తుంటే మీరిద్దరూ అక్క చెల్లెళ్ళ లాగా ఉన్నారు” అని అన్నాడు.

నీలాంబరి కూతురిని అలా తలెత్తి చూసి ఎంతో తృప్తి పడింది అయినా ఎక్కువసేపు చూస్తే దృష్టి దోషం తగులుతుందని కళ్ళను మళ్లించుకుని..” గర్భవతి అయిన కూతుర్ని ఇలా చూడకూడదు కదా” అని అనుకొని పారాయణం మధ్యలోనే లేచి… కూతురికి దేవుడు బొట్టు నుదుట పెట్టి తీర్థం ప్రసాదం ఇచ్చింది… తర్వాత చేతిలో గుప్పెడు ఉప్పు తీసుకొని దిష్టి తీసేసింది…

ఇక అందరూ గుడికి వెళ్లడానికి తయారయ్యారు.

కిటికీలో నుండి నీలాంబరి చుట్టుపక్కల వాతావరణం అంతా చూస్తుంది చక్కని రోడ్లు పచ్చని చెట్లు శుభ్రంగా ఉన్న పరిసరాలు ఇది చాలా నచ్చింది నీలాంబరికి…

“ఏమండీ ఈ రోడ్లను చూశారా ఎంత శుభ్రంగా ఉన్నాయి చుట్టుపక్కల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఎంతో అందంగా ఉంది” అన్నది నీలాంబరి.

” అవును నేను మరొకటి కూడా గమనించాను ఎక్కడైనా చెత్త పడితే అక్కడి వాళ్ళందరూ తమ వంతు బాధ్యతగా దాన్ని తీసుకెళ్లి చెత్తకుండీలో వేసేస్తున్నారు..” అన్నాడు భూపతి.

” అవునండి.. ఇక్కడి వాతావరణం చలిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాకింగ్ కి వెళ్తారు అందులో ఇక్కడి ఆహారం కొంచెం అరగడానికి కష్టమే ప్రతి ఒక్కరూ వాకింగ్కు వెళ్ళినప్పుడు నేను చూసే దాన్ని వారి వెంబడి ఒక కుక్క ఉంటుంది.. ఒకవేళ కుక్క ఎక్కడైనా మలమూత్రాలు చేస్తే వెంటనే వాళ్ళు శుభ్రం చేసి చెత్తకుండీలో వేస్తారు ఈ పద్ధతి నాకు చాలా నచ్చింది… ఈ విషయంలో మన దేశం మాత్రం చాలా వెనుకబడి ఉందండి.” అన్నది నీలాంబరి.

” మనకెందుకులే అని రోడ్ల మీద చెత్త వేయడం ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయడం చదువుకున్న వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంటుంది నీలా!” అన్నాడు భూపతి.

ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే గుడి దగ్గరికి చేరుకున్నారు… అది సరస్వతి అమ్మవారి గుడి.. గుడి చాలా అందంగా ఉంది అమ్మవారు వీణా చేత బూని ధవళ వస్త్రములు ధరించి.. సర్వాభరణములతో ఆసీనురాలు అయి ఉంది…

అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని నైవేద్యం సమర్పించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చొని ఇంటికి బయలుదేరారు అందరూ..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎంత బాగుండో

ఉల్లాసం