మా ఏకాదశి ఉపవాస దీక్ష

లాక్ష్రచన లక్ష్మి మదన్

మేము మా ఊర్లో ఉన్నప్పుడు ఏకాదశి దీక్ష ఎలా చేస్తామో నేను చెప్తాను నవ్వొస్తే నవ్వుకోండి..

వైకుంఠ ఏకాదశికి మేము ఊరికి వెళ్లే వాళ్ళము..

మా ఊరి రామాలయంలో పూజలు బాగా జరుగుతాయి ప్రసాదాలు కూడా చాలా బాగుంటాయి..

ఇక విషయానికి వస్తాను..

ఏకాదశి రోజు అందరం తల స్నానం చేసుకొని భక్తిగా ఇంట్లో పూజలు చేసుకుంటాము.. పారాయాణాలు జరుపుకుంటాము…

తర్వాత చాయ్ కార్యక్రమం ఉంటుంది కదా తాగాలా వద్దా అనుకునే లోపే ఇంట్లో మా అత్తగారు “చాయికి ఏం తప్పు ఉంది తాగండి…” అంటారు.

అలా ఒక కప్పు చాయతో ఉపవాసం మొదలవుతుంది…

ప్రబోధ ఆరగింపు కోసం గుడికి వెళ్తాము… అక్కడ పూజ అయ్యేవరకు నిరీక్షించి తీర్థం ప్రసాదం తీసుకుంటాము… తీర్థం సరే….ప్రసాదం విషయానికి వస్తె అక్కడ పొంగలి పెడతారు మా అయ్యగారు..

“అమ్మో ఉపవాసం కదా అన్నం తినకూడదు” అని మేము చేతులు అడ్డు పెట్టేంత లోపల మా అత్తగారు ఒక్క చూపు చూస్తారు…” గర్భగుడి లోపల ప్రసాదం తీసుకుంటే తప్పేం లేదు తీసుకోండి’ అంటారు…

ఇంకేం చేస్తాము… మెల్లిగా చేతులు చాపి ప్రసాదం తీసుకుంటాము పోనీ చాటుగా ప్రసాదం ఎవరికైనా పెడదామా అనుకుంటే ఒక చూపు మా వైపే ఉంటుంది మా అత్తగారికి… ఆమె వద్దన్న పనిని చేసే అలవాటు లేదు… మొండిగా తినకుంటే ఏం చేస్తారు మహా అంటే “ఈ కాలం పిల్లలు మాట వినరు” అని అంటారు… అంతే..

అయినా పెద్దమనిషి తీసుకోమని చెప్తుంటే మనం ఎందుకు కాదనాలి … అని చేతిలో ఉన్న పొంగలి ప్రసాదాన్ని గుటుక్కున మింగేస్తాము…

ఇక తర్వాత ఇంటికి వచ్చి ఉపవాసం లేని వాళ్ళకి వంట చేసి పెడతాము… ఇక మేము దీక్షలో ఉన్నాం కదా మా కోసం కొన్ని పూరీలో చపాతీలో అంత సిరానో చేసుకుంటాము….

ఆ తర్వాత ఆరిగింపు వేళకు మేము గుడికి వెళ్ళాలి… మా ఇంటికి చాలా దగ్గరలోనే రామాలయం…

ఉపవాస దీక్షతో ఉన్న మేము గబగబ గుడికి వెళ్తాము😃… పూజ హారతులు అయిన తర్వాత తీర్థం ప్రసాదాలు ఇస్తారు ..తీర్థం కామనే కానీ ప్రసాదం మాటేంటి! చెప్తా చెప్తా తొందర ఎందుకు?

చక్కని ఘుమఘుమలాడే పులిహోరను మా అయ్యగారు తీసుకొని వస్తాడు….

మళ్లీ మొదటి విషయమే… మేము “నో “అంటాము మా అత్తగారి కళ్ళతో “ఎస్” అంటారు అసలే మా సీతమ్మ గారు చేసిన పులిహోర బ్రహ్మాండమైన రుచి మా రామయ్య కు నివేదన చేసిన పులిహోర ఆ రుచి ఇంకా ఎక్కడైనా ఉంటుందా లోపల ఆత్మారాముడు ప”రవాలేదు తిను “అని ఒక సంకేతం ఇస్తాడు… అంతే రెండు చేతులు చాపి పులిహోర తీసుకొని హాయిగా ఆరగిస్తాము… బ్రేవ్.. ఉష్ అలా అనొద్దు తిన్నది ప్రసాదమేగా!

మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తాం భోజనాలు చేసే వాళ్ళందరికీ వడ్డించి ఇక వంటింట్లో మా ప్రహసనం మొదలు పెట్టుకుంటాం…

మీరంతా అలా అనుకుంటే ఎలా అసలు విషయమే చదవలేదు అప్పుడే ఏదేదో నిర్ణయం చేసేసుకుంటున్నారా! ఆగండి చెప్తాను..

మధ్యలో పూరీల గిన్నెలు పొద్దున చేసిన ఉప్మా గిన్నె ఆలూ కర్రీనో ఇంకేదో… పెద్ద గిన్నెడు సిరా అంటే రవ్వ కేసరండి….. అసలే ఉపవాసంతో నిరసించాం కాబట్టి చివరకు తినడానికి అరటి పళ్ళు పెద్ద గ్లాసులలో మజ్జిగ… అంతేనండి ఇంకేం లేదు నిజం ఇంతే తింటాం మేము…

సరే మా ఉపవాస దీక్ష అయ్యాక ఏవో పనులు అవి చేసుకొని కాసేపు విశ్రమించి సాయంత్రము తేనీరు కార్యక్రమానికి నడుము కడతాము….

అసలే ఉపవాసం చేసాము కాబట్టి కాస్త పెద్ద గ్లాసుడు తేనీరుని గొంతులో గబుక్కున పోసుకుంటాము… మీరు ఇలా దిష్టి పెట్టకూడదు మరీ గ్లాసు నిండేం కాదు లెండి నడిస్తే ఏం పడిపోదు కొంచెం వెలితిగానే తాగుతున్నాము…

మళ్లీ సాయంకాలపు పనులు పారాయణాలు చేసుకున్నాక పెరట్లో నుండి బోలెడన్ని పువ్వులు కోసి అలాగే తులసి దళాలు కోసి దేవుడికి మాలలు కట్టి సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్లడానికి తయారుగా ఉన్నాం అన్నమాట…

రాత్రి భోజనాలు చేసే వాళ్ళకి వంట చేసి పెట్టి ఇక ఉపవాస దీక్షలు ఉన్నవాళ్ళకు మాత్రం ఏదో తేలికగా ఉండేది మాత్రమే చేసుకొని అంటే పోహానో ఉప్నా నో… అంతేనండి ఎక్కువ ఏం లేదు… సరే గుడికి వెళ్ళాలి కదా ఆ మాట చెప్పనీయండి..

సాయంత్రం కొంచెం ముందుగానే గుడికి వెళ్లి కూర్చుంటాము అంతా పూజ అయ్యేవరకు ఎదురుచూసి మళ్ళీ తీర్థం కామన్ ఇప్పుడు ప్రసాదం ఏంటి! చెప్తా..

మా ఊళ్లో వైకుంఠ ఏకాదశికి బూందీ నైవేద్యం పెట్టి అందరికీ ప్రసాదం పంచుతారు…

తీర్థం తర్వాత షోండెలు వచ్చాయి ఇక మా అత్తగారి వైపు చూడదలచుకోలేదు చేతులు చాపి గుటుక్కున నోట్లో వేసుకొని నమిలి మింగడమే… తర్వాత తీయని బూంది… తినకుండా ఉంటామా! చెప్పండి మరీ మీరు అలా అంటారు కానీ మీరైనా అలాగే చేస్తారు!

సరే భక్తిగా దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వచ్చామా అందరికీ భోజనాలు వడ్డించామా మళ్లీ మేము తేలికగా ఉండే పలహారం భుజించాము… అసలే ఉపవాసం అందుకే తోడెయ్యగా మిగిలిన పాలను ఒక్కొక్కరం ఒక్కొక్క గ్లాసులో పోసుకొని తాగేసి “హమ్మయ్య” ఉపవాసం అనే కార్యక్రమం అయిపోయింది అని చక్కగా నిద్రించాము….

అదండీ మా ఉపవాస దీక్ష…

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సమయస్ఫూర్తి

విదేశీ విద్య సరే … మరి విదేశీ చట్టం తెలుసుకున్నారా!?