పిల్లలు విదేశాలలో చదువుకోవటం వారికే కాదు, వారి తల్లిదండ్రులకి కూడా ఒక సుదీర్ఘ స్వప్నం. పిల్లలు శిశు ( నర్సరీ ) తరగతి లో వేయడం తో ఆ కల మొదలు అవుతుంది. ఇక విద్యార్థులకి ఉన్నత (హై స్కూల్) పాఠశాల స్థాయి కి వచ్చేసరికి మెల్లిగా పై చదువుల పై ఆసక్తి మొదలవుతుంది. సుదీర్ఘమైన ప్రయాణంకల ఈ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఏ ఏ విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి కి ఏ పోటీ (కాంపిటీటివ్ ) పరీక్ష వ్రాయాలి ? వాటిలో యెంత ఫలితం సాధిస్తే ఎక్కడ అవకాశం దొరుకుతుంది. విశ్వవిద్యాలయాలు , కళాశాలలు , వాటికి తగ్గ ఋణాలు ,తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అక్కడ .. లేకపోతె ఎక్కడ ఉండాలి .. ఇలా అనేక విషయాల పట్ల శోధన , పరిశోధన జరిపి పిల్లల్ని విదేశాలకి పంపుతాము.
విదేశాలకి వెళ్లి అక్కడ విద్యాసంస్థలో చేరగానే సరా ? అక్కడి నియమ నిబంధనలు , ఆ దేశం యొక్క చట్టాలు, నేరాలు వాటికి పడే శిక్షలు వీటి అవగాహన అవసరం లేదా ? అన్ని దేశాలలో చట్టం ఒకేలా ఉండదు. ఒక్కో దేశం ఒక్కోరకమైన నిబంధనల్ని కలిగి ఉంటుంది. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల విషయానికి వస్తే వాటి రాష్ట్రాల వారిగా ఉన్న చట్టాలు కూడా తెలుసుకోవాలి. అన్నీ అవసరం లేదు , కేవలం విద్యార్థులు అందునా విదేశీ విద్యార్థులకి వర్తించే చట్టాలు , నియమాల అవగాహన ఉంటే చాలు.
విదేశాలకి వెళ్ళగానే ఏదో కళాశాల లేదా విద్యా సంస్థలో చేరగానే ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేరిపోదాము అని అనుకుంటారు. కానీ ఆ దేశం , ఆ విద్యాసంస్థ ఎన్ని గంటలు అలా ఉద్యోగాన్ని చేయడాన్ని అనుమతిని ఇస్తుంది అన్న వివరాల పట్ల ఖచ్చితమైన సమాచారం కలిగి ఉండాలి . అలాగే విద్యార్థులు సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టడం , అక్కడి వ్యక్తిగత గోప్యతా విధానాల పట్ల అవగాహన లేకపోవడం వంటివి కూడా విద్యార్థులని ఇబ్బందులకు గురిచేసే అంశాలే . కొన్ని విదేశీ విద్యా సంస్థలు కొన్ని విధానాల పట్ల ఖచ్చితమైన నియమ నిబంధనలను కలిగి ఉంటాయి. వాటిని అతిక్రమిస్తే కఠిన మైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుoటాయి . పరిశోధన అంశాలలో కాపీ కొట్టడం ,సమాచార చౌర్యం (plagiarism) లాంటివి కొన్ని విద్యా సంస్థలు , విశ్వవిద్యాలయాలు చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. అలాగే పిల్లవాడు విద్యా సంస్థలో చేరగానే ఇక్కడ బ్యాంకు ఖాతాలో సెక్యూరిటీ నిమిత్తం వేసిన డబ్బుని తీసివేస్తుంటారు. ముందస్తు అవగాహన , నిర్ధారణ లేకుండా చేసే ఈ పనుల వల్ల పిల్లలు దేశం కానీ దేశంలో ఆపదలల్లో చిక్కుకుంటారు.
విద్యార్థులు చట్టబద్ధమైన అర్హత, అనుమతి లేకుండా వాహనం నడిపితే కొన్ని చోట్ల జరిమానాతో పోగా , కొన్ని చోట్ల అది జైలు శిక్ష విధించదగిన నేరంగా పరిగణిస్తారు. అలాగే విద్యార్థులు మద్యం, మత్తు మందు సేవన ఇలాంటి విషయాల్లో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆయా దేశాల చట్టపరమైన విధానాలు తెలుసుకోవడం అత్యావశ్యకం . పొరపాటున పిల్లలు వీటిల్లో పట్టుపడితే , ఇక్కడ తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వడానికి భయపడి , మరిన్ని ఇబ్బందుల్ల్ని కొనితెచ్చుకుంటారు. మన పిల్లలు బుద్ధిమంతులే అయినా కూడా ఈ విషయాల గూర్చి వారితో చర్చించే వారిని విదేశాలకి పంపాలి. మరొక్క విషయం ఏమిటంటే ఏ చట్టపరమైన వెసులుబాటు అయినా ఆయా దేశాల పౌరులకు వర్తింపచేస్తాయి కానీ విదేశీయులకి కాదు.
అలాగే నకిలీ విద్యాసంస్థల పట్ల ఖచ్చిత మైన సమాచారం కలిగి ఉండాలి. 2019 లో డెట్రాయిట్‌లోని ఓ నకిలీ విశ్వవిద్యాలయానికి చెందిన 250 పై చిలుకు మంది విదేశీ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలపై అమెరికా సంయుక్త రాష్ట్ర (U.S.) ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అరెస్టు చేశారు. అందులో భారతీయ విద్యార్థులే అత్యుధికంగా ఉండటం గమనార్హం . విద్యార్థులు అటువంటి విద్యాసంస్థల్లో తెలిసి చేరినా తెలియక చేరినా అక్కడి చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పదు. వీసా గడువు తీరిపోయాక కూడా కొంత మంది విద్యార్థులు చట్ట విరుద్ధంగా ఉంటూ ఉంటారు . విద్యార్థుల వీసా వివరాల పట్ల తల్లితండ్రులు ఎరుక తో వ్యవహరించాలి.
చట్ట ఉల్లంఘన తెలిసో తెలియకో చేస్తే అక్కడి దేశంలో లభించే న్యాయ సహాయం పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి. అలాగే భారత విదేశీ విధానం , రాయబార కార్యాలయం ఈ దిశగా చేసిన ఏర్పాట్లు తదితర వివరాలని కూడా ముందే తెలుసుకోవాలి. మన బంధువులు , స్నేహితులు ఉంటే ఆపత్కాల పరిస్థితుల్లో వారు చేయగలిగిన సాయం గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. ఆయా ప్రాంతాలలో భారతీయుల కోసం , భారతీయ విద్యార్థుల కోసం స్థానికంగా పని చేసే స్వచ్చంధ సేవా సంస్థల సమాచారం కలిగి ఉండటం కూడా అవసరమే. అలాగే విదేశాలలో చట్టపరంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్న విద్యార్థులకు భారత , భారతేతర న్యాయవాదులు , న్యాయవాద సంస్థలు కొంతమంది తమ న్యాయ సలహాలని సహాయాన్ని అందిస్తున్నారు కూడా .
విదేశాలకు పిల్లల్ని పంపేముందు చట్టపరమైన అంశాల ఎరుక చాలా ముఖ్యం. ఇందుకుగాను ఆయా దేశాలలో ఉన్న భారత రాయబార కార్యాలయాలు అందిస్తున్న సలహాలు సహకారాలు తెలుసుకుంటే ఆపద వచ్చినప్పుడు సమయం వృథా కాకుండా తక్షణ చర్యలు చేపట్టవచ్చు. “హై కమిషన్ అఫ్ ఇండియా” ” https://hci.gov.in/ ” వెబ్సైటు ద్వారా ఏయే దేశాలలో రాయబార కార్యాలయాలు ఉన్నాయి ఇత్యాది వివరాలు తెలుస్తాయి. అలాగే “https://www.hcilondon.gov.in/” ఈ వెబ్సైటు ద్వారా UK వెళ్లాలనుకునే విద్యార్థులు చేయవలసినవి చేయకూడనివి తెలుపుతుంది. ఇటువంటి వెబ్సైట్లు సింగపూర్ , అమెరికా సం. రా. , ఆస్ట్రేలియా, కెనడా , న్యూజిలాండ్, కెన్యా, హంగేరి , వెనిజులా తదితర దేశాలకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. మునుపటిలా కాక ఇప్పుడు భారతీయుల కోసం అనేక రకాల సదుపాయాలు , సహాయసహకారాలు అందించడానికి ప్రతీ దేశం ప్రయత్నిస్తోంది. మనం చేయవలసిందల్లా ఆయా సమాచారాలు కలిగి ఉండి , మన పిల్లల యెడల ఎరుకతో ఉంటూ వారిని జాగురకతో ఉండేట్లు చేయడం .
మరో ముఖ్య మైన అంశం ఏమిటంటే విదేశాలలో మన బంధువులు చుట్టాలు ఉంటె వారిని గుడ్డిగా నమ్మటం లాంటివి చేయకూడదు . ఏదైనా ఆపద వస్తే వారు యెంత వరకు చూసుకుంటారు అనేది కూడా వారి వారి పరిస్థితులని బట్టి పరిమితి ఉంటుంది. అలాగే ఒక్కోసారి అలంటి చుట్టాలు స్నేహితుల వల్ల కూడా ఆపద రావొచ్చు . ఈ మధ్యనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని బందీగా ఉంచి అతనిపై దాడి చేశారన్న ఆరోపణలపై అమెరికాలోని మిస్సోరీ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. రక్షింపబడిన విద్యార్థి, మిస్సౌరీ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవడానికి గత సంవత్సరం (2022 ) భారతదేశం నుండి యుఎస్‌కు వెళ్ళాడు . అతనిని ఏడు నెలలు బంధించి కనీస అవసరాలకి కూడా వీలు ఇవ్వక ఒకే గదిలో ఉంది చిత్ర హింసలకి గురిచేశారు. ఆ ముగ్గురిలో ఒకరు అతని దగ్గరి బంధువు . ఏడు నెలల తరువాత ఎవరో ఒక బాధ్యత గల పౌరుడి ద్వారా ఈ విషయం పోలీసులకి తెలిసి ఆ పిల్లవాడు రక్షింపబడ్డాడు. ఇలాంటివి విన్నప్పుడు విదేశాల్లో చదువుకునే విద్యార్ధి ఉన్న ఏ తల్లిదండ్రులకైనా భయం కలగడం సహజం. అందువల్ల పిల్లలతో నే కాక వారి స్నేహితులు , చుట్టు పక్కల వారితో కూడా కొంత పరిచయం కలిగి ఉండటం మంచిది. అనవసర ఆకర్షణలకి గురి కాకుండా వారిని కాపాడుకోవటం కూడా అత్యావశ్యకం .
కావున విద్యకై విదేశాలు వెళ్లే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కనీసం కొంత న్యాయపరమైన, చట్టపరమైన అవగాహన కలిగివుండటం ఎంతైనా అవసరం. కాదంటారా ?!
*********
డా. వరిగొండ సత్య సురేఖ
న్యాయవాది
విశాఖపట్టణం