…ఆగని ఆకలి..

వ్యాసం

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

పుట్టుకతోనే ప్రతి ప్రాణి ఆ ఆ అనుకుంటూనే ఆకలి హాహాకారాలతోనే ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.ప్రాణం పోయే వరకు ఆగని ఆకలి కేకలు.

ఆకలికి సమానత్వం ఎక్కువ.కులమతాలు లేవు,పేద గొప్ప లేదు.వయసు వావి లేదు,ఈదేశం ఆదేశం అని కాదు,దాని జాడ లేనిదెక్కడ,అంతా తానై చరించే సర్వవ్యాపి. మనిషికొక్కరికే కాదు సకల జీవరాశిని అంటి పెట్టుకుని వదలని మహాశక్తి.

ఆకలి రుచి ఎరుగదు.గుఱ్ఱం    ఆకలితో అలమటించేటప్పుడు ఎండు గడ్డయినా తింటుంది.ఆకలితో వున్నప్పుడు పచ్చటి మెతుకులు రెండు ముద్దలు చాలు. అన్న  సామెత.కడుపులో ఎలుకలు పరుగెడుతుంటే తట్టుకోని ప్రాణి దానికైనా తెగిస్తుంది.తనపిల్లలను చంపుకు తినే జీవరాసులు ఎన్నో.

ఉదయం లేవగానే ఆహారవేటకు తరిలిపోయే పశుపక్ష్యాదులు.ఆకలి బాధ అందరిదీ.ఆకలి తీర్చే అన్నదాతలు ,సత్రాలు,దేవాలయాల్లో నిత్యాన్నదానాలు ఎన్నో వున్నాయి.

ఉన్నోడికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా తక్కువే.లేనోడికి పచ్చడి మెతుకులు చాలు కడుపు నింపుకోవడానికి, ఆకలి బాధ తీర్చుకోవడానికి.
డొక్కలెండి తిండి దొరకని అభాగ్యజీవలెందరో.తిండి తర్వాతే ఏదైనా.ఆకలి అందరిది.ఆకలికి పేద గొప్ప భేదం లేదు.ఏ ప్రాణికైనా ఆకలి బాధ ఒకటే.

ఆకలి చక్రం తిప్పుతుంటే ఆచట్రం లో ఇరుక్కుపోయి నకనక లాడుతూ అలమటించి ఆయాసపడి తట్టుకోలేక ఎన్నో ప్రాణాలు గాలిలోకి కలిసాయి.నిన్న కాక మొన్న కరోనా వల్ల పనులులేక చేతిలో చిల్లి గవ్వలేక తినే అవకాశం లేక ఆకలి కేకతో తల్లి నలుగురు బిడ్డలకు విషం ఇచ్చి తాను చనిపోయిన సంఘటన మనసును కలిచి వేస్తుంది.ఇలా ఆకలి చావులెన్నో ఆపాల్సిన అవసరముంది,ప్రభుత్వంపై బాధ్యత ఉంది. అందుకే ఎన్నో పథకాలు.తెల్ల రేషన్ కార్డులు.ఉచితంగా బియ్యం పంపిణీ.రెండు పూటలా తిండి ఉంటే చాలు.రైతన్నకు రుణపడి ఉండాలి.

ఆకలిని తట్టుకోలేక కాశీ క్షేత్రాన్ని శపించపోయిన మహాఋషి వ్యాసుడు.తృప్తిగా అన్నంపెట్టిన అన్నపూర్ణాదేవి.
ఆకలితో ఉన్న నిజాం రాజుకు గడ్డితో పచ్చడి చేసి పెట్టి కడుపునిండా అన్నం పెట్టిన అన్నపూర్ణ.అందుకే గడ్డి అన్నారం పేరు వచ్చింది.ఆ ఇల్లాలుకు ఇనాం గా భూమిని ఇచ్చాడు రాజు
మహా ఇల్లాలు డొక్కా సీతమ్మ పేరు తెలియని తెలుగు వారు ఉండరుఅర్ధరాత్రైనా ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టిన ఇల్లాలు.
ఎన్నో పూటకూటిండ్లు ఉండేవి.ఇప్పుడు హోటళ్లు వెలిశాయి.

అన్నిటికీ రోగమొచ్చినా కుండకు ఏ రోగం రాదు.ఎంత రోగంతో బాధపడ్డా ఆకలి మాత్రం ఉండాల్సిందే.గంజో నీరో ఆ సమయానికి.ఎంత వున్నా బంగారం తిని ఆకలిని ఆపుకోలేడు.సమయానికి రెండు ముద్దలు పెట్టినోడే పరమాత్మ.

ఉన్నోడికి రోజు పండుగే.ఆకలి తీరిన రోజు లేనోడికి పండుగ.ఎంగిలి విస్తారాకులు ఏరుకుని కుక్కలతో పోటీ పడుతుంటే సమాజం సిగ్గుతో తలవంచాల్సిందే.ఆకలి ఎంత నీచమైన పనినైనా చేయిస్తుంది. ఆకలిని జయిద్దాం….

అందరిని అంటి పెట్టుకుని చచ్చేవరకు వుంటూ వీడని నేస్తం ఆకలి,ఆకలి.ఆకలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విష వలయం – The trap

మార్పు మంచిదే