దొరసాని

ధారావాహికం – 9 వ భాగం

ఉదయం ఆరు గంటలకు ముందే నీలాంబరి భూపతి లేచారు… పొద్దున్నే లేవడం అలవాటు కదా… కాకపోతే అక్కడ అన్ని పని వాళ్ళు చేస్తారు ఇక్కడ అన్ని పనులు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి….

లక్ష్మి మదన్

వంటింట్లోకి వెళ్లి నీలాంబరి చాయ్ చేస్తుంటే భూపతి వెనక నిలబడి ఆశ్చర్యంగా చూడ సాగాడు…

” మానీలనేనా! ” అని అన్నాడు నవ్వుతూ..

” కాదా! అలా అనిపించడం లేదా కాకపోతే నేను ఇక్కడికి రావడం వల్ల చాలా నేర్చుకున్నాను వంటింటి పనులు ఇంటి పనులు అన్ని పనివాళ్ళు మాత్రమే చేయాలని ఆలోచన తీరు ఉండేది.. అది చిన్నప్పటినుంచి పెరిగిన పెంపకం వల్ల అలాంటిది.. ఒక్కసారి నేను స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాను అనిపించింది ఏంటి !మన పనులు మనం చేసుకోకూడదా అన్ని చేసుకోవడం కుద
రనప్పుడు కొంత పని పని వాళ్ళ మీద ఆధారపడతాము అలాగని కూర్చున్న దగ్గరికి అన్నీ చేయించుకోవాలని ఉందా? అందుకే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పనులు నేర్చుకున్నాను వంట చేయడం కూడా నేర్చుకున్నాను ఇదంతా అలేఖ్య వల్లే”! చిరునవ్వుతో చెబుతూ చాయ్ పోసి ట్రే లో పెట్టుకుని బాల్కనీలో ఉన్న టీపాయ్ మీద పెట్టింది భూపతి నీలాంబరి అక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నారు అక్కడ నుండి సూర్యోదయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది… రంగురంగుల పువ్వుల చెట్ల మధ్యనుండి కెంపు కిరణాలు సూర్యుడు ప్రసరిస్తుంటే ఆదృశ్యం ఎంతో రమణీయంగా ఉంది… అలాగే చూస్తూ కూర్చున్నారు ఇద్దరు…

” చూడండి ప్రకృతిలో మనకు ఆనందం కలిగించే విషయాలు ఎన్ని ఉన్నాయి? మనం బద్ధకంతో వాటిని అనుభవించము ఇలాంటి సూర్యోదయాలు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కానీ ఈతరం అంతా బారెడు పొద్దు అయితే కానీ లేవరు.. మూసుకున్న గదిలోనే జీవనం.. చల్లగాలి పిలిచే అవకాశం కూడా కోల్పోతున్నారు అన్ని కృత్రిమమైనవే…” అని కొంచెం నిట్టూర్చింది నీలాంబరి.

” ఎన్నో కోల్పోతున్నాము దగ్గర ఉన్నవి చూడడం మానేస్తాము ఎక్కడో దూరం ఉన్న వాటిని చూడాలని అనుకుంటాము అందనీ మామిడి పండ్లు అందుకోవాలని చూస్తాము కానీ మన పెరటి చెట్టు కాస్తే వాటిని నిర్లక్ష్యం చేస్తాము అదే మనిషి నైజం” అన్నాడు భూపతి.

ఇంతలో అలేఖ్య మరియు సుధీర్ లేచి వచ్చారు…

” గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు మామయ్య గారు ” అన్నాడు సుధీర్.

” శుభోదయం” అని చిన్నగా నవ్వింది నీలాంబరి…

ఇదే అదునుగాతోచి “మేము భారతదేశం వెళ్లడానికి ఏర్పాటు చేయగలరా! అక్కడ మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అది కాక ఇల్లు వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు అందుకని మేము వెళ్లడానికి ఏర్పాటు చేయండి” అని అడిగాడు భూపతి.

అప్పుడే అక్కడికి వచ్చిన అలేఖ్యకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..

” అప్పుడే వెళ్ళిపోతారా నాన్న! మరో పదిహేను రోజులు ఉండవచ్చు కదా అసలు మిమ్మల్ని బయటకు ఎక్కడికి తీసుకెళ్లలేదు చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి” అని అన్నది అలేఖ్య.

” మరొకసారి వెళదాం తల్లి ఇప్పుడు వెళ్లాలి అందులో నేను అనుకోకుండా వచ్చాను కదా చాలా పనులు ఉన్నాయి ఊరి బాధ్యతలు కూడా ఉన్నాయి కదా మన మీద నమ్మకంతో వాళ్లు బాధ్యత మన మీద ఉంచినందుకు మనము చక్కగా నిర్వర్తించాలి కదమ్మా” అన్నాడు భూపతి.

” అవును రా అలేఖ్య ఇక్కడికి వచ్చే ముందు చాలా అఇష్టంగా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నేనంటే ఏమిటో తెలిసింది ఇక్కడ వాతావరణం అర్థమయింది “ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని” అనే నానుడి నాకు చాలా చక్కగా అర్థమైంది మనసు భారతదేశానికి వెళ్లాలని ఎంత లాగుతుందో నేను చెప్పలేను.. అలాగని కన్నబిడ్డలను వదిలి వెళుతుంటే కూడా అంతే బాధగా ఉంది కానీ మన భారత దేశము నీ తల్లినే కన్నతల్లి… అందుకని ఈసారికి వెళ్ళిపోయి త్వరలో నువ్వు శుభవార్త చెప్తే వచ్చే ఏర్పాట్లు చేసుకుని ఎక్కువ రోజులు ఉంటాము” అని అన్నది నీలాంబరి..

” అమ్మా! పుట్టగానే గ్రీన్ కార్డు వస్తుందని అందరూ డెలివరీలు అమెరికాలోనే అవుతున్నారు కానీ నిన్ను చూసిన తర్వాత నాకు అక్కడికే రావాలని ఉందమ్మా నా సీమంతం మన ఊళ్లో మన ఇంట్లో మీచేతుల మీదుగా జరగాలని ఉంది తర్వాత నా పుట్టబోయే బిడ్డ కూడా భారతదేశ సంతతి గానే ఉండాలి ఇదేనమ్మా నేను కోరుకున్నది నేనే అక్కడికి వస్తాను ఇప్పుడిప్పుడే నాక్కూడా మనసు ఇండియాకు వెళ్లాలని అనిపిస్తుంది సుధీర్ కూడా సుముఖంగానే ఉన్నాడు మా ప్రయత్నాలు మేము చేసుకుని మాఉద్యోగాలు అక్కడే చూసుకునేలా ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాము అది జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను” అని చెప్పింది అలేఖ్య.

ఒక్కసారిగా నీలాంబరి మరియు భూపతి ముఖంలో సంతోషం పొంగి పొరలింది…

” నిజంగానా మీరు అక్కడికి వచ్చేస్తారా ఈ మాట వింటూనే ఎంతో సంతోషంగా ఉంది నువ్వు నీ బిడ్డను అక్కడే కంటాను అనడం నాకు చాలా సంతోషంగా ఉంది… అంతకన్నా ఇంకా నాకు కావలసింది ఏముంది ఇది దేవుడు నాకు ఇచ్చిన వరమే నమ్మ. త్వరలో ఆ శుభవార్త విని మన ఊళ్లో మన ఇంట్లో చక్కని శుభకార్యం చేసుకుందాము” చెప్పింది నీలాంబరి…

తల్లి తండ్రి వెళ్తారు అనగానే అలేఖ్య ముఖంలో బాధ ప్రస్ఫుటంగా కనబడుతుంది…” సరే అమ్మ ఆఫీస్ కి లేట్ అవుతుంది మేము బయలుదేరాలి రెడీ అవుతాను” అని చెప్పి అలా వెనుతిరిగిందో లేదో కళ్లకు చీకట్లో క్రమ్మి అలా కిందపడిపోయే అంతలో అక్కడే ఉన్న తండ్రి చేతిలోకి పట్టుకున్నాడు అలేఖ్యని…

నీలాంబరి కంగారుగా ఏమైంది తల్లి ఏమైంది అంటూ మొహం మీద కొంచెం నీళ్లు చిలకరించింది…

ఇంతలో సుధీర్ కంగారుగా వచ్చాడు…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మంచి మాట

అన్నమాచార్య కీర్తన