దొరసాని

ధారావాహికం-8 వ భాగం

అలా తన్మయత్వంతో పాటలు వింటూ నిద్రలోకి జారుకుంది….

అందమైన ఉద్యానవనంలో ఒక చక్కని భవనం పాత పద్ధతిలో కట్టబడి ఉంది పైకప్పు చెక్కలు పెంకులతో ఉంది… లోపల అంతా నాపరాయి పరిచి ఉంది (షాబాద్ బండ)… ఒక చక్కని పెద్ద హాలు ..గోడల నిండా చక్కని చిత్రాలు అన్ని చిన్న పిల్లలకు సంబంధించినవే.. సున్నం పూతతో చేయబడ్డ గోడలు చాలా నునుపుగా ఉన్నాయి… హాలులో మెత్తటి చాపలు పరవబడి ఉన్నాయి అక్కడ రకరకాల బొమ్మలు ఆట వస్తువులు ..కొన్ని పెయింటింగ్ వేసుకునే పుస్తకాలు.. రంగు పెన్సిళ్లు ఉన్నాయి… మూడు నెలల పిల్లోడి నుండి మూడేళ్ల వయసు వరకు పిల్లలంతా ఉన్నారు అక్కడ.. నెలల పిల్లలకు మాత్రమే గదులలో పెద్దపెద్ద ఊయలు ఏర్పాటు చేసి ఉన్నాయి…

ఒక పెద్ద వంటగది కూడా ఉంది అందులో పాలపొడులు కొంచెం పెద్ద పిల్లలు తినే ఘనాహారము.. మూడేళ్ల వయసు వరకు తినదగ్గ అన్ని ఆహార పదార్థాలు అక్కడ ఉన్నాయి .. ఇత్తడి, రాగి ,మట్టి పాత్రలే ఉన్నాయి… గోబర్ గ్యాస్ కనెక్షన్ ఉండడం వల్ల అందులో వేయడానికి ఉపయోగించే పేడకోసం ఇంటి వెనకాల పశువుల ఏర్పాటు చేయబడింది… ఆవులు బర్రెలు ఒక 20 వరకు ఉన్నాయి…

వాటి కోసం ఏర్పాటు చేయబడిన శాలలు ఆ వెనకాల అంతా పచ్చని గడ్డి పశువుల దాణా కోసం పెంచబడింది.

పిల్లలకు సంబంధించిన పాలు కొనే అవసరం లేదు.. గ్యాస్ ఏర్పాటు కోసం వెనకాల పెద్ద ప్లాంట్ నిర్మించారు..

ఇక ఆ పెంకుంటి ముందు రకరకాల కూరగాయల పాదులు.. కూరగాయ మొక్కలు ఆకుకూరలు అన్ని వాకిట్లో ఒక పక్కగా పెంచడానికి ఏర్పాటు చేశారు….. పిల్లలకు సరిపడే ఆహారం అంతా ఇక్కడే పండించడం జరుగుతుంది… అంటే ఆ వాకిలి అంత విశాలంగా ఉంది… తర్వాత రకరకాల పూల మొక్కలు ఇంటిపై పాకిన రాధామాధవ చెట్టు విరగబోసి ఉంది గుండుమల్లి జాజిమల్లి పందిళ్ళలో పాకి ఉన్నాయి బంతి చామంతులు ప్రహరీ గోడ చుట్టూ ఉన్నాయి… ఎంతో ఆహ్లాదంగా ఉంది…

లోపలికి వెళ్ళిన నీలాంబరికి పిల్లల కేరింతలు నవ్వులు వినిపించాయి కొంతమంది పిల్లలు నిద్రపోతున్నారు బోసి నవ్వులు నవ్వుతూ మరికొంతమంది పిల్లలు చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటున్నారు కొంచెం నడుస్తున్న పిల్లలు మూడు కాళ్ల బండితో లేదా చిన్న చిన్న సైకిల్ తో ఆడుకుంటున్నారు వారిని చూసుకోవడానికి ఎంతో మంది ఆయాలు ఉన్నారు తినిపించడం పాలు తాగించడం పడుకోబెట్టడం అన్నీ తల్లి చేసినట్లుగానే చేస్తున్నారు వంట చేయడానికి వంటవాళ్ళు పశువులను చూసుకోవడానికి మనుషులు ఇలా అన్ని రకాల ఏర్పాటు జరిగి ఉంది… పెంకులతో కట్టిన ఇల్లు కావడం వల్ల చాలా చల్లగా ఉంది అందులో ఇల్లు ఎత్తు మీద కట్టడం వల్ల చక్కటి గాలి వీస్తుంది అందులో చుట్టూ పచ్చని చెట్లు వాతావరణమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చూస్తుంటే నీలాంబరికి ఎంతో ఆనందంగా అనిపించింది అబ్బా “ఇదే కదా నేను కోరుకున్నది” అని అనుకున్నది…

పిల్లలు పుట్టిన తర్వాత మూడు నెలలకి తల్లి పనికి వెళ్లక తప్పదు ఆపిల్లల్ని వెనకాల వీపుకు కట్టుకొని ఎండలో పనిచేయడం వర్షంలో తడవడం ఇలా పిల్లలు అనారోగ్యాల పాలవడం తల్లులు పిల్లలను సంరక్షణ చేసుకోలేకపోవడం నీరసించి పోవడం ఇలా జరుగుతుంది దానివల్ల ఎన్నో శిశు మరణాలు జరుగుతున్నాయి తల్లికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వెసులుబాటు ఉండదు. వండి వార్చడం ఇల్లు చూసుకోవడం అన్ని పనులు ఉండనే ఉంటాయి… కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుండి ఉద్యోగం చేసుకునే వాళ్ళ వరకు వారి పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్ళవచ్చు వారందరి సంరక్షణ బాధ్యత ఈ బాల సదనందే… ఇక్కడ బీద గొప్ప అనే తారతమ్యం లేదు అందరి పిల్లల్ని ఒకేలాగా చూస్తారు వాళ్ళు ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే తీసుకొని వదిలినప్పుడు చక్కగా స్నానం చేయించి పంపించడం మాత్రమే.. ఇంక మిగతా పనులన్నీ ఇక్కడి వాళ్ళే చూసుకుంటారు వాళ్లకి బట్టలు ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు మధ్యలో బట్టలు తడుపుకున్న పాడు చేసుకున్న వేరే బట్టలు అక్కడున్న ఆయాలు మారుస్తారు అలా సాయంత్రం తల్లులు వచ్చే వరకు పిల్లలు సంరక్షణలోనే ఉంటారు అందువల్ల తల్లులకి మానసిక నిశ్చింత దొరికింది అందరూ వారి పనులు చక్కగా చేసుకోగలుగుతున్నారు అలా చేయడం వల్ల పని ఎక్కువగా జరుగుతుంది తక్కువ కూలీలతో ఎక్కువ పని జరగడం మంచిదే కదా! ఒక టీచర్ కి మానసిక ఉపశమనం ఉంటే తరగతి గదిలో పిల్లలని బాగా చూసుకోగలుగుతుంది మంచి శిక్షణ కూడా ఇవ్వగలుగుతుంది ఇలా అన్ని రకాలుగా ఎంతో ఉపయోగకరమైన పనులు జరుగుతున్నాయి… ఒక్కసారిగా ఒక చిన్న పాపాయి నీలాంబరి కొంగు పట్టుకొని నిలబడింది ఉలిక్కి నీలాంబరి కళ్ళు తెరిచింది… “ఏది పాప కనబడదే!” అని కళ్ళు తెరిచి లేచి కూర్చుంది..

నీలాంబరిమాటలకు లేచిన భూపతి..

” ఏమిటి నీలా! ఏం జరిగింది పాప ఎక్కడుంది? ” అని అడిగాడు.

” అదేనండి బాలసదనంనికి వెళ్లాను.. అంతా చూస్తూ లోపలికి వెళ్లాను ఒక పాప నా కొంగు చివర్లు పట్టుకొని లాగింది. ” అని అన్నది.

” నీలా! మనం అమెరికాలో ఉన్నాము ఇక్కడ ఏ బాలసదనం లేదు కలగన్నావా ఏమిటి ఇదేనా నీ మనసులో ఉన్న కోరిక!” అన్నాడు భూపతి.

” ఒక్కసారి నిద్ర మత్తు వదిలిన నీలాంబరి “అబ్బా ఎంత మంచి కల కన్నానండి నిజంగా ఆ కలలో వచ్చిన తీరుగానే నేను సదనం ఏర్పాటు చేస్తాను దీని గురించి మీకు వివరంగా తర్వాత చెప్తాను మనము భారతదేశానికి వెళ్లే ఏర్పాటు చేయండి నేను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి అందుకు తగ్గ ధనం కూడా కొంతమన దగ్గర ఉంది మిగతాది ఏర్పాటు చేసుకుందాం” అని చెప్పింది.

” సరే అమ్మాయితో మాట్లాడదాము నువ్వు పడుకో ఏ ఆలోచనలు పెట్టుకోకు నువ్వు అనుకున్నది నెరవేరుతుంది నీకు అండగా నేను ఉంటాను కదా ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు నీలా!’ అని ఆప్యాయంగా ఆమె తలను నిమిరి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు…

నీలాంబరి అతని ఒడిలో పసిపాప లాగా నిద్రపోయింది ఆమె మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ముఖ్యంగా తనకు ఎంతో అండగా ఉంటున్న తన భర్త అంటే గౌరవం చాలా పెరిగింది ఏరోజు అతను తనను నొప్పించింది లేదు.. “ఇలా నాకు అండగా నిలబడడం ఎంతో సంతోషంగా ఉంది”

ఒక గట్టి సంకల్పానికి బీజం పడింది మంచి పనికి ఎప్పుడు విజయమే ఉంటుంది.. దానికి దైవ బలం కూడా తోడుంటుంది అదే శ్రీరామరక్ష!

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళామణులు

సమయస్ఫూర్తి