ప్రతి వారి జీవితంలో చూస్తాము ఎన్నో ఎన్నికలు ( ఎలక్షన్లు )
అందులో నాలుగు దశలలో జరిగేవి ప్రముఖం
జయాపజయాలు రెండు సమవుజ్జీలు
గెలుపోటములు నిలకడ లేని స్థితులు
కానీ ప్రతి దశలో గెలవాలని పోరాడుతాడు
ఆదిలో బాల్యం ఒక ఎలక్షన్
అప్పుడు అందరూ వేస్తారు ఓటు నీకే
ప్రతిపక్షమేలేని పక్షమే నీది
ఎజెండా లేని పార్టీ నీది
ఐదేళ్ల వరకు నీకు నీవే సాటి
ఆప్యాయత అనే సింహాసనం ఎక్కించి
రారాజు అంటారు
ఇక కౌమారం ఒక ధాటి అయిన ఎన్నిక
నీవు పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటావు
ఏజెండాను బయటపెడతావు
అప్పుడే బయలుదేరుతాయి ప్రతిపక్షాలు, ప్రతి వాదనలు కూడా
ఓడుతావని ఎన్ని హెచ్చరిక చేసిన పట్టించుకోవు
అందరూ నా వాళ్లు కాదు కొందరే అనుకుంటావు
కానీ తెలుసుకోలేవు ఎవరు నీవారిని….పగవారిని…
చివరికి ఓటమి అంచుల దాకా వస్తావు
కానీ పడనీయక కాపు కాస్తారు నీవాళ్ళు…
ధరావత్ పోకుండా దాటవేస్తారు నిన్ను
యవ్వనము ఒక స్థిరత్వంతో కూడిన ఎన్నిక
ధైర్యంతో కాలిడితావు గెలవాలని….
పాఠాలు నేర్చావు…. పన్నాగాలు పన్నగలవు…
రూపు మారింది…భాష మారింది…
ఏజెండానూ, జెండాను అనుకూలంగా మలుచుకున్నావు…
అన్నిటా గెలుపు నాదేనని మిడిసి పడతావు..
స్వామిని నేను అంటూ వెన్ను విరుస్తావు..
కానీ కాలం ఎల్లవేళలా ఒకలా ఉండదు…
వస్తుంది వెనకాలే మరో ఎలక్షన్ వృద్ధాప్య రూపంలో..
ఈసారి నీది ఒంటరి పోరాటం…..
ఏ జండా లేని ఏజెండా నీది….
నీ వారే నిన్ను తోసి పారేస్తారు..
నిన్ను కాదని మరో తరం ముందుకు వస్తుంది…
నీవు చేసిన త్యాగాలు…, సేవలు…
మరుగున పడిపోతాయి..
నీ ఎన్నిక ఇప్పుడు… మన్నిక కాదంటుంది…
నీ భావాలు తుప్పుపట్టాయంటుంది…
నిన్ను పక్కకు తప్పుకోమంటుంది….
ఇప్పుడు నీవు చెల్లని నాణ్యానివి అంటుంది..
ఓటర్లు ఉండరు నీకు… మిగిలేది నోటరీలే
నీ స్థానం మరొకరికి దక్కుతుంది
నీ ప్రభవం మరొకరు లాక్కుపోతారు
నీకు మిగిలిన చివర ఓటరు కాలు డొక్కడే
నిన్నుచేస్తాడు ఏకగ్రీవ నేతని .
ఓడి గెలిచిన అభ్యర్థివి నీవు,
కానీ కీర్తి పతాకం రెపరెపలాడుతుంది కొన్నాళ్ళు.