‘అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
‘సిరిసిరిమువ్వ ‘చిత్రంలోనిదీపాట.
1976లో కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో – చంద్రమోహన్, జయప్రద నాయికానాయకులుగా శ్రీ వేటూరి సుందర రామూర్తి గారి కలం కూర్చిన’ అక్షర సరం’ కె .వి .మహదేవన్ గారి స్వర సారథ్యం లో బాలూగారిచే ఆలపించబడింది. వివరణలోకి వెళ్తే- డప్పు వాద్య కళాకారుడిగా , వారాలబ్బాయిగా జీవనం సాగించే యువకుడిగా,నాట్యమేప్రాణంగా భావించే మూగమ్మాయి హైమను ఆరాధిస్తూ, అభిమానిస్తూ ఉంటాడు .ఆమె వివాహానికి ( నర్తకి కాలేకపోయినఆమెకు) చిరుకానుకగా మువ్వలు కొని వివాహ సమయంలో అందివ్వలేనేమోననే తన నిస్సహాయతను పాట రూపంలో వెలిబుచ్చే క్రమంలోనిదీపాట.
విషయంలోకి వెళ్తే – అందానికే చిరునామాయైన ఈ బంగారు బొమ్మ అందని చందమామ లాంటిది, కావాలన్నా దొరకనిది ,విరబూసిన కొమ్మ నిండుగా, ఇంంపుగా, కళాత్మకంగా ఉండి అందీఅందక ఆరాటపెడుతుంది .అట్లాంటిదే ఈ అపరంజి .
చిలుకలు అంటేనే ముద్దు మాటలతో మురిపించేవి అలాగే ఈ పంచదార చిలుక మాటలే రానిది కానీ చిరుసిగ్గే ఆభరణంగా హద్దులెరిగి పరిధి దాటని తన ప్రవర్తనతో మసలుకునేది. హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నట్లే ఈ ‘మాటలు రాని మయూరా’న్ని గుండె గదిలో పదిల పరుచుకోమని చెప్తూనే – నోరు విప్ప లేక మౌనందాల్చిన ఈమె అధరాల మాటును ‘పదాల సరాలు ‘ దాగున్నాయి సవరించి పాడుకోమని చెప్తూనే – ఆ రాజకుమారి పాదపద్మాలకు అలదిన ‘పారాణి వెలుగు’లో నీ రాజవైభోగమంతా దేదీప్యమానమయ్యేలా తేటతెలుగులో పాడుకోమంటూనే- కొంగుముడి( బ్రహ్మముడి) ని ఆలయంగా భావించి ఆ కోవెలలోని దైవాన్ని నీ హృదయ దేవతగా తలచి నీ గుండె గుడిలో ఆమెను సాక్షాత్కరింప చేసుకో అంటే నీ ఇల్లాలిని గృహలక్ష్మి గా భావించి నీ హృదయం లో పదిలపరుచుకోమని చెప్తూనే…అసాధ్యమైన వాటికై ఆరాటపడడం అవేకమని తెలిసిన ఆ యువకుడు వేదనచే నిరాశతో ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అని తలుస్తూ ఇలాగే పాడుకుంటాను. మరు జన్మంటూ ఉంటే ఆ ‘నాట్య మయూరి’ ‘కాలిమువ్వ’గానైనా పుడతానంటూ – ఆవేదన, ఆశావాదాన్ని కలగలిపి తన్మయత్వంగా పాడిన తీరు అమోఘం .చంద్రమోహన్ గారి నటనకు, బాలూగారి గాన
వాహిని తోడై హృద్యంగా సాగిందీపాట.