సంధి అంటే?

 రంగరాజు పద్మజ

సంధి అంటే రెండు పదాల కలయిక. రెండు పదాలు కలిసేటప్పుడు అనేక మార్పులు కలుగుతుంటాయి. అంటే అక్షరాలు తగ్గడమో పెరగడమో జరుగుతూ ఉంటాయి. దీన్ని సంధి కార్యం అంటారు. వ్యాకర్తలంటే సూత్రాలు రాస్తారు. అలా చిన్నయసూరి సూరి సంధి గురించి ” పూర్వ పర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి యనంబడు” అంటూ సంధి గురించి నిర్వచించారు.
అంటే పూర్వ పదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చుకు పర పదంలో ఉన్న అచ్చుకు కలిసి సంధి జరిగినప్పుడు పర పదంలోని అచ్చు వచ్చి చేరడాన్ని సంధి అంటారని ఫలితార్థం.
ఆ రోజులలో గ్రాంథిక భాష వాడుకలో ఉంది కాబట్టి సూత్రీకరణ కూడా గ్రాంథిక భాషలోనే జరిగింది.
ఉదాహరణకు..
రాముడు+ అతడు
రాముడ్ + ఉ+ అతడు = ఇక్కడ ‘ఉ’మరియు ‘అ’ల మధ్య సంధి జరిగి, ఆ రెండింటి స్థానంలో ‘అ’ వచ్చి చేరి, రాముడ్ + అ+తడు = రాముడతడు అని అవుతుంది.

ఈ సంధులు అచ్చుల మధ్య జరిగితే అచ్చంధులని, హల్లుల మధ్య జరిగితే హల్సంధులని చెబుతారు. ఇవి తెలుగు సంధులు, సంస్కృత సంధులని బేధాలు ఉన్నాయి. ఈ సంధి కార్యాలు మూడు రకాలుగా జరుగుతాయి.
1. ఏకాదేశ సంధులు
2.ఆదేశ సంధులు
3. ఆగమ సంధులు.

1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.

సంస్కృత సంధులలో అయితే పూర్వ పర స్వరాలకు సంబంధం లేకుండా వేరొక స్వరం వచ్చి చేరుతుంది.
ఉదా:- సవర్ణదీర్ఘ సంధి ,గుణ సంధి, వృద్ధి సంధి.

2. ఆదేశ సంధులు:- ఆదేశం అనగా ఒక అక్షరాన్ని కొట్టివేసి, దాని స్థానంలో కొత్త అక్షరం వచ్చి చేరడం. అందేకే వ్యాకర్తలు “శత్రువదాదేశః” అని నిర్వచనం చెప్పారు. అంటే శత్రువులాగా రా నీ కొట్టివేసి దాని స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరడం.
ఉదా:– వాడు + కొట్టెను = వాడుగొట్టెను.
ఇక్కడ ‘కొ’ స్థానంలో ‘గొ’ వచ్చి చేరింది.
ఉదా:– సరళవాదేశ సంధి ; గసడదవాదేశ సంధి; పుంప్వాదేశ సంధి; యణాదేశ సంధి.

3. ఆగమ సంధులు:– ఆగమం అనగా కొత్తగా ఒక అక్షరం రావడం.. అంటే ఉన్న అక్షరాలన్నీ ఉండగా, వాటి మధ్య కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరుతుంది. అందుకే వ్యాకర్తలు ‘మిత్రవధాగమః’ అన్నారు. అంటే మిత్రుని వలే కొత్తగా ఒక అక్షరం చేరుతుంది అని ఫలితార్థం.
ఉదా:- మా + అమ్మ
మా +య్+అమ్మ = మాయమ్మ.
ఇక్కడ ‘య్’ మిత్రునిగా వచ్చి చేరింది.
ఉదా:– యడాగమ సంధి; రుగాగమ సంధి; టుగాగమసంధి, నుగాగమసంధి, దుగాగమ సంధి, అనునాసిక సంధి ; జస్త్వసంధి, శ్చుత్వసంధి;
మొదలగునవి.
తెలుగు సంధులు- సంస్కృత సంధులు ఏవో చూద్దాం!!
తెలుగు సంధులు:–
ఉత్వ సంధి;
ఇత్వసంధి;
అత్వ సంధి;
యడాగమసంధి;
ఆమ్రేడిత సంధి;
ద్విరుక్త టకారాదేశ సంధి; సరళాదేశ సంధి ;
గసడవాదేశ సంధి;
నుగాగమ సంధి; టుగాగమసంధి;
నుగాగమ సంధి;
టుగాగమ సంధి; పుంప్వాదేశసంధి;
పడ్వాదుల సంధి ; ప్రాతాదులసంధి;
దుగాగమ సంధి;
త్రికసంధి మొదలైనవి.

సంస్కృత సంధులు:– సవర్ణధీర్ఘ సంధి;
గుణసంధి;
యణాదేశ సంధి;
వృద్ధి సంధి;
అనునాసిక సంధి;
జస్త్వసంధి;
శ్చుత్వ సంధి మొదలైనవి.

వచ్చే సంచిక నుండి సంధులు ఎలా ఏర్పడతాయో సూత్ర రూపంగా వివరంగా తెలుసుకుందాం!
సశేషం

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హేమంత రాగాల పల్లకిలో

నెమలి ఈకలు