పృథ్వి ,అనూష ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు. తమ తో పాటు తమ చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలని కోరుకునే వారు. దానికోసం తమ వంతు కృషి చేయాలని భావించే వారిద్దరి మార్గాలు మాత్రం భిన్నమైనవి.
పృథ్వి అక్షర జ్ఞానం అందరికీ పంచి, యువత ను మంచి వైపు నడపాలని భావిస్తే, అనూష తన కలాన్ని కత్తిలా ఝలిపించి సమాజం లోని చెడును నిర్మూలించాలనుకుంటుంది.
భిన్న దృక్పథాలు ఉన్న వీరిద్దరూ కలుస్తారా?
6వ భాగం ( ప్రేమ ఊసులు)
ఆ రోజు చాలా సంతోషంగా గడిచింది పృథ్వి కి. ఇదంతా ఇంత బాగా, ఇంత త్వరగా జరుగుతుందని అతను కూడా ఊహించలేదు మరి.
మంత్రిగారు, తన తండ్రి, తన గురించి పొగుడుతూ ఉన్న ఆ సమయంలో అనూష కూడా అక్కడే ఉండడం అతనికి ఇంకా ఆనందాన్ని ఇచ్చింది.
ప్రోగ్రాం కి రావడమే కాక, ఆమె ఛానెల్ లో కూడా దీనిపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తానని చెప్పింది పృథ్వితో అనూష.
అనూష వాళ్ళ ఎం డి శ్రీధర్ గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాడు పృథ్వి.
పృథ్వి కోసం కాకపోయినా అతని గురించి మాట్లాడుతున్నప్పుడు అనూష కళ్ళల్లో కనిపించిన మెరుపుల్ని చూసి ఆ కార్యక్రమానికి తప్పకుండా రావాలి అనుకున్నాడు శ్రీధర్.
కానీ తన ఛానెల్ భవిష్యత్తు ను నిర్ణయించే ముఖ్యమైన ప్రసారం జరుగుతుండగా, తను, అనూష ఇద్దరూ అక్కడ లేకపోవడం ఇబ్బంది కనుక అనూష కు పర్మిషన్ ఇచ్చాడు.
వచ్చిన గెస్ట్ లు అంతా వెళ్ళిపోయారు. చివరిగా రాజేష్, ఇంకా మిగతా వలంటీర్స్ కూడా వెళ్ళిపోయారు.
అనూష వచ్చి,” చాలా బాగుంది పృథ్వి .మొత్తానికి నీ కోరిక నెరవేరబోతోంది. నువ్వు ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని, ఆ మంత్రి గారు చెప్పినట్లు దారితప్పి నడుస్తున్న యువతకు మార్గదర్శకంగా నిలవాలని మనసారా కోరుకుంటున్నాను. మరి నేను వెళ్ళొస్తాను,” అంది.
“అనూషా, నీతో మాట్లాడాలి. ఒక పది నిమిషాలు కేటాయించగలవా?” అభ్యర్థించాడు పృథ్వి.
“అలాగే, కానీ ఈరోజు నాకు కూడా ముఖ్యమైన పని ఉంది. కాస్త త్వరగా చెప్పు ఏమిటో,” అంది అనూష.
“అనూషా, ఈ రోజు నేను నిజంగా చాలా చాలా మంచి మూడ్ లో ఉన్నాను. నన్ను ఎప్పుడూ తమ కొడుకుగా చెప్పుకోడానికే ఇష్టపడని మా అమ్మానాన్నలు తమంత తాముగా నా కార్యక్రమంలోని మంచిని గ్రహించి,స్నేహ హస్తం అందించి ఇంత భారీ ఎత్తున అది ప్రచారం పొందే అవకాశాన్ని కలిగించారు.
నా హితులు, శ్రేయోభిలాషులు అందరూ నాకు బెస్ట్ విషెస్ పంపిస్తున్నారు.ఇటువంటి సంతోష సమయంలో నా జీవితంలో అన్నిటికన్నా గొప్పది కాబోయే ఆనందానికి నేను తెర తీయాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే….,” ఎంతో భావుకత తో చెప్పాడు.
అతని వాయిస్ ని బట్టి అతను ఏం చెప్పదలుచుకున్నాడో కొంత అర్థమైనప్పటికీ, “నీకు సంతోషం లభిస్తుంది అంటే అది నాకూ ఆనందాన్ని ఇస్తుంది పృథ్వి. నాకు ఎందుకు అభ్యంతరం ఉంటుంది చెప్పు?నర్మగర్భంగా నవ్వింది అనూష.
“నువ్వు నా పక్కన ఉంటే నేను ఇలాంటి మరిన్ని విజయాలు అనాయాసంగా అందుకోగలనని అనిపిస్తుంది అనూ.
విల్ యు బి విత్ మీ ఫరెవర్?
విల్ యు మ్యారీ మీ మై డియర్?”రొమాంటిక్ పోజ్ లో అడుగుతున్న పృథ్విని చూసి ఒక్క క్షణం తన హార్ట్ ఒక బీట్ మిస్ అయినట్టుగా అనిపించింది అనూష కు.
ఇది నిజమేనా? తను మనసులోనే ఆరాధిస్తున్న పృథ్వి తనని ఇష్టపడుతున్నాడా? ఇది కల కాదు కదా? ఒక్క క్షణం తనని తానే గిల్లుకుంది . ఇది నిజమే! పృథ్వి నిజంగానే తనకి ప్రపోజ్ చేస్తున్నాడు అనుకోగానే తనకు అలవాటు లేని సిగ్గు తెరలు తనకు తెలియకుండానే కమ్మేసాయి అనూష మనసుని, ఆలోచనని. మౌనంగా అలా పృథ్వికేసి చూస్తూ ఉండిపోయింది.
“అనూష ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇందులో బలవంతం ఏమీ లేదు. నా ప్రపోజల్ నీకు నచ్చకపోతే వదిలేయ్. నాకు అదృష్టం లేదనుకుంటాను. కానీ కనీసం నీ స్నేహాన్ని మాత్రం నాకు దూరం చేయకు. ఈ జన్మకి దానితోనే సరిపెట్టుకుంటా,” బ్రతిమాలుతున్నట్లు చెప్తున్న పృథ్విని చూసి నవ్వు ఆగలేదు అనూషకు.
“ఏయ్ బుద్దూ, ఆగు. నన్ను చూస్తే నీకు అర్థం కావట్లేదా? ఈరోజు కోసం నేనూ ఎంతగానో ఎదురు చూస్తున్నాను. కానీ నేను అందుకు అర్హురాలినో, కాదో అని ఆలోచిస్తూ ఉన్నాను ఇన్నాళ్లూ. నీ స్నేహం,ప్రణయం నా అదృష్టం కొద్దీ లభించిన వరాలుగా భావిస్తాను.
ఐ లవ్ యూ పృథ్వీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, సారీ మైండ్. ఎందుకంటే మనిద్దరికీ తెలుసు కదా మన ఫీలింగ్స్, థాట్స్ అన్ని మైండ్ తోనే మొదలై అక్కడే అంతమవుతాయని. హార్ట్ ఈజ్ ఎ పంపింగ్ మెషిన్.
సో డియర్ పృథ్వీ ఐ లవ్ యు ఫ్రం ది బాటమ్ ఆఫ్ మై మైండ్ అండ్ థాంక్యూ ఫర్ ఛూజింగ్ మీ యాజ్ యువర్ లవ్.
ఇంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియదు.
నిజానికి నీ గురించి నేను ఎన్నోసార్లు పాట కూడా పాడుకున్నాను, తెలుసా?” చిలిపిగా నవ్వుతూ చెప్పింది అనూష.
“అవునా ఏది?ఏం పాట చెప్పు?” అడిగాడు పృథ్వి.
“చూసీ, చూడంగానే నచ్చేసావే
అడిగీ, అడగకుండా వచ్చేసావే
నా మనసులోకీ. అందంగా దూకి”
“అమ్మ దొంగా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా పాపా? మరి మనం కలిసినప్పుడంతా ఈ ప్రేమని ఎక్కడ దాచేసావు? సీరియస్గా ఎటో చూస్తూ చాలా క్యాజువల్ గా మాట్లాడే దానివి?అంటే నేనే బయటపడాలని ఎదురుచూస్తున్నావ్ అన్నమాట. కనపడేంత అమాయకురానివి కాదు నువ్వు,” నవ్వుతూ కన్నుగీటాడు పృథ్వి.
“ఏమో పృథ్వీ అదంతా నాకు తెలియదు. మా అమ్మ నాన్నలు ఎన్నోసార్లు పెళ్లి గురించి మాట్లాడినా స్పందించని నా మనసు నిన్ను చూడగానే స్పందించింది .కానీ నేనుగా బయటపడేంత ధైర్యం చేయలేకపోయాను.
‘లేదని చెప్పా నిముషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలె
ఏమి చేయమందువే….’
“అబ్బా అనూ! ఎప్పుడూ సీరియస్ గా,నీ ఛానల్, వార్తలు, రాజకీయాలు, అవినీతి అంటూ మాట్లాడే నువ్వు ఇలా సినిమా పాటలు పాడుతూ ప్రేమ మాటలు చెప్తుంటే ఎంత వెరైటీగా ఉందో తెలుసా? ఏదయితేనేం ఈరోజు నేను ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడిని అయ్యాను. థాంక్యూ సో మచ్ డియర్. ఇకపై నేను కూడా పాట తోనే చెప్తాను.
‘నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
నా మనసుకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే’
నా పాటను భరించడం కష్టం అనుకో కానీ అలవాటు చేసుకో మరి నువ్వు,”నవ్వుతూ చెప్పాడు పృథ్వి.
“నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పృథ్వీ. నా జీవితంలో ప్రేమ,పెళ్లి ,నువ్వు ,తప్పకుండా ముఖ్యమైన భాగాలే. కానీ ఇవి ఏవీ కూడా నా కెరియర్ కన్నా ముఖ్యమైనవిగా నేను భావించలేను.
ఏ రోజైనా,మన జీవితంలో ఏ ఇబ్బందులు కలిగినా, ఎట్టి పరిస్థితుల్లో ఐనా నువ్వు నన్ను జర్నలిజం వదిలేయమని చెప్పే రోజు రాకూడదని అనుకుంటున్నాను.
అదే జరిగితే నా ఛాయిస్ వేరుగా ఉంటుంది. ఈ విషయంలో నీకు ముందే క్లారిటీ ఇవ్వటం బావుంటుందని అనిపించింది,”సీరియస్ గా చెప్తున్న అనూష వంక ఆరాధనగా చూసాడు పృథ్వి.
“ఇందుకే, ఇందుకే, నాకు నువ్వంటే మరింత ఇష్టం అనూ, ఐ ప్రామిస్ మన జీవితంలో అలాంటి రోజు రాదు,”వాగ్దానం చేశాడు పృథ్వి. అది నిలబెట్టుకోవడం అంత సులువైన విషయం కాదని అతనికి అప్పుడు తెలియదు మరి.