ఆమె అందుకున్న చెక్కులో రెండు కోట్లు రాసి ఉంది అది చూసి చాలా ఆశ్చర్యపోయింది.. అప్పుడు అన్ని దేశాల నుండి వచ్చిన వారి తరఫున ఒక ప్రతినిధి మాట్లాడారు. ” మీ పెయింటింగ్స్ మాకు చాలా నచ్చాయి ఈ ఎగ్జిబిషన్లో పెట్టిన అన్ని పెయింటింగ్స్ కన్నా మీ పెయింటింగ్స్ అత్యుత్తమ స్థాయిలో అమ్ముడుపోయాయి.. అదీకాక ప్రతి చిత్రం జీవం ఉట్టిపడేలాగా ఉంది మీరు ఎంచుకున్న థీమ్ ముఖ్యంగా మహిళలది అది గ్రామీణ మహిళలు వారి కష్టాలు, నష్టాలు అన్నింటినీ మీచిత్రాలలో చూపించారు ఇవన్నీ మాఅందరికీ నచ్చి ఒక నిర్ణయం తీసుకొని మీ సంకల్పం నెరవేరాలని ఈచిన్న మొత్తాన్ని మీకు అందిస్తున్నాము వేదిక మీదికి మీ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానిస్తున్నాను” అని చెప్పారు.
వేదికపైకి అలేఖ్య సుధీర్ మరియు భర్త భూపతి వచ్చారు… అలేఖ్య కళ్ళలో ఆనందం మాఅమ్మని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అసలు నేను ఏమీ మాట్లాడే పరిస్థితిలో కూడా లేను ఊరు కూడా దాటని మాఅమ్మలో ఇలాంటి మంచి భావాలు ఉన్నాయని నేను ఊహించనైనా లేదు నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు” అంటూ మాట్లాడింది.
,”నా భార్య పెయింటింగ్స్ బాగా వేస్తుంది అని నాకు తెలుసు చిత్రలేఖనం తనకి ఇష్టమైన వృత్తి ప్రవృత్తి అని కూడా తెలుసు. అందుకే ఆమెను ప్రోత్సహించి ప్రతిదీ నేను ఫ్రేమ్ చేయించాను కానీ తను ఎక్కువ బయట ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు.. అందుకని నేను కూడా బలవంతం చేయలేదు అయినా కూడా జమీందారు వ్యవస్థలో ఆనాటి రోజులలో పరిస్థితి ఎలా ఉండేవో అక్కడున్న వారికి బాగా తెలుసు దాదాపు కొన్ని ఏళ్ల నుండి మాత్రమే ఇలా ఆడవాళ్లు బయటకు వచ్చి చదువులు ఉద్యోగాలు వారి ఇష్టాలను బయట పెట్టుకొని స్వేచ్ఛగా ఉంటున్నారు కాకపోతే నీలా మరి కాస్త ఆలస్యంగానే బయటపడింది తనకు ఏసంకల్పం ఉందో అది నెరవేరడానికి నాశాయశక్తుల కృషి చేస్తాను ఆమె వెన్నంటే ఉండి ఆమెకు సహాయపడతారు ఆర్థికంగా కానీ మరే రకంగా అయినా నేను ఆమెకు అండగా ఉంటాను” అని చెప్పారు భూపతి. ఆ తర్వాత వీరిద్దరికీ సన్మానం జరిగిన తర్వాత ఇంటికి వచ్చారు.
ఇంటికి వచ్చిన నీలాంబరి భర్తను అడిగింది..
” మీరు ఎలా వచ్చారు నాతో కనీసం ఒక్క మాటైనా అనలేదు అసలు వస్తారని కూడా నేను ఊహించలేదు” అన్నది నీలాంబరి.
” నీవు వెళ్లిన 15 రోజులకి సాగర్ వెళ్లిపోయాడు ఆ తర్వాత నాకు ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది అసలు ఇన్ని రోజులు నువ్వు లేకుండా ఆ ఇంట్లో నేను లేను అందుకని ముఖ్యమైన పనులన్నీ ముగించుకొని టికెట్ బుక్కు చేయమని అమ్మాయికి చెప్పాను వెంటనే అలేఖ్య నా కోసం టికెట్ బుక్ చేసింది ఈ లోపల నీఎగ్జిబిషన్ ఉంది అని తెలిసింది దానికోసం నీ పరిచయ వేదిక ఉందని తెలిసి ఆరోజు నీకు సర్ప్రైజ్ ఇద్దామని సరీగా వేదిక దగ్గరికి మాత్రమే వచ్చాను… ఏది ఏమైనా నీలా! నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత చక్కగా మాట్లాడావు ఇంత పరిణితి నీలో ఎప్పుడు వచ్చింది ?ఇంత చక్కని ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు? ” అని అడిగాడు భూపతి.
“ఎక్కువగా నేను పుస్తకాలు చదువుతాను అది మీకు తెలుసు కదా పిల్లల పుస్తకాలు కూడా చదివేదాన్ని అందులో ఏ పదం అర్థం కాకున్నా దాని నిఘంటువులో చూసుకొని ఎప్పటికప్పుడు కొత్త పదాలు తెలుసుకునేదాన్ని ఎప్పుడైనా నేను టీవీ చూస్తే అందులో ఇంగ్లీష్ న్యూస్ మాత్రమే చూసేదాన్ని దాని వల్ల కూడా నాకు కొంత పరిజ్ఞానం వచ్చిందేమో” అని చిరునవ్వుతో అన్నది నీలాంబరి.
అలేఖ్య సుధీర్ కూడా వీళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నారు వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నారు.. ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా అలేఖ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు అసలు మామూలుగా అయితే అమెరికాలో ఫోన్ చేసి వస్తానని చెప్తారు ఇలా చెప్పకుండా ఎవరూ రారు కానీ వాళ్ళు నీలాంబరి ఉపన్యాసం విన్న తర్వాత అసలు ఫోన్ చేయాలని ఆలోచన కూడా లేకుండా అందరూ ఒకేసారి నీలాంబరిని కలవడానికి వచ్చారు…
రావడంతోనే “సారీ అలేఖ్య! సారీ ఆంటీ !రావడానికి పర్మిషన్ తీసుకోకుండానే మేమంతా వచ్చేసాము మిమ్మల్ని కలవాలని ఎంతో ఆత్రుతతో వచ్చాము మాకు మిమ్మల్ని చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఎంతో చదువుకునే కూడా మేము ఏమీ ఆలోచించకుండా ఎక్కడున్నవాళ్ళం అక్కడే ఉండి బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ తప్ప ఇంకో ఆలోచన లేకుండా ఊపిరి సల్పని ఆఫీస్ పనిలో మునిగి ఉంటున్నాము తప్ప వేరే విషయాలు ఏమీ ఆలోచించడం లేదు అలాంటిది మీరు ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా ఎంతో గొప్ప ఆలోచనలతో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే మాకు అసలు నోట మాట రావడం లేదు నిజంగా మిమ్మల్ని కలుసుకొని మేము చేసుకున్న పుణ్యం.. ” అని ఒక్కరొక్కరు పూల గుచ్చాలు అందించారు..
“మరొక విషయం మీరు ఈరోజు రాత్రి భోజనం వండుకొనే అవసరం లేదు మేమే అందరమూ తీసుకొని వచ్చాము సంతోషంగా అందరము కలిసి భోజనం చేద్దాము మంచి తెలుగు వంటలే వండి తీసుకొచ్చాము” అని అన్నారు. కాసేపు అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్న తర్వాత భోజనాలకు ఏర్పాటు చేసుకున్నారు …. ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన వంట చేసుకొని తీసుకొచ్చారు భక్షాలు ,పులిహోర, గులాబ్ జామ్ ,గుత్తి వంకాయ కూర, టమాటో పప్పు, బీరకాయ పచ్చడి ,ముక్కల పులుసు ఇలా అన్ని రకాలు చేసుకొని తీసుకొని వచ్చారు.. అందరూ కంచాలు తీసుకొని వడ్డించుకోవడం మొదలుపెట్టారు నీలాంబరికి భూపతికి మాత్రం ప్రత్యేకంగా టేబుల్ మీద వడ్డించారు.
ఎంతో సంతోషంతో నీలాంబరి ” నాక్కూడా మీఅందరి ఆప్యాయత ప్రేమ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందమ్మా నేను ఇంతమంది ప్రేమను పొందగలిగాను నాకు కూడా ఇది మర్చిపోలేని జ్ఞాపకం ఎప్పుడైనా మీరు భారతదేశానికి వస్తే మాఇంటికి మాత్రం తప్పకుండా రావాలి మాఆతిథ్యం స్వీకరించాలి” చెప్పింది.
” తప్పకుండా వస్తాము అదే కాక మీరు సంకల్పించిన విధంగా మీకల నెరవేరిన తర్వాత చూడటానికి మేము కూడా వస్తాను” అని చెప్పారు.
“ఇన్ని రోజులు మాకు మీరు చిత్రలేఖనం నేర్పించడానికి గురుభక్తిగా మేము చిన్న బహుమతులు మీకు సమర్పించుకుంటాము మీరు కాదన వద్దు” అని వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు బహుకరించారు నీలాంబరకి..
పట్టు చీరలు ముత్యాల హారాలు స్వెటర్లు మేకప్ బాక్స్ లు ఇలా ఎన్నో తీసుకొని వచ్చారు..
అన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది నీలాంబరి..
” నేను ఇవి మీ నుండి తీసుకోలేను దయచేసి నన్ను అర్థంచేసుకోండి నేను ప్రతిఫలం ఆశించి మీకు నేర్పలేదు కావాలంటే మీరు మాఊరికి వచ్చిన తర్వాత నాసంకల్పం నెరవేరిన తర్వాత దానికి మీరు కొంత విరాళంగా ఇవ్వవచ్చు కానీ నాకోసం మాత్రం నేను ఏమీ తీసుకోను” అని చెప్పింది నీలాంబరి.
వాళ్ళందరూ కొంత నిరాశ పడినప్పటికీ ఆమె ఆశయానికి అడ్డుపడకూడదని నిర్ణయించుకొని..
” అలాగే మీ ఇష్టం ఆంటీ! మిమ్మల్ని మేము నొప్పించము కానీ మీ ఊరికి మాత్రం తప్పకుండా వస్తాము” అని చెప్పి “సరే ఈ బహుమతులు ఏమి తీసుకోకపోయినా కూడా తాంబూలం మాత్రం తీసుకోండి” అని చీర జాకెట్ బట్ట పండ్లు ..బొట్టు పెట్టి ఆమె చేతికి ఇచ్చి నమస్కారం చేసుకున్నారు.
తర్వాత అందరూ ఎవరిళ్లకు వాళ్లు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు…
ఆ రోజంతా విశ్రాంతి లేకుండా గడవడం వల్ల అందరూ అలసిపోయారు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయి.. పడుకున్నారు.
భూపతి కూడా ప్రయాణం చేసిన అలసట వల్ల తొందరగానే నిద్రపోయారు..
నీలాంబరికిమాత్రం నిద్ర రావడం లేదు…
ఆమె మొబైల్లో ఇళయరాజా స్వరపరిచిన బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ కళ్ళు మూసుకొని పడుకుంది..
” నిజంగా గానగంధర్వుడే కదా.. ఇంతటి మహనీయుడిని మళ్లీ చూస్తామా ఇంత అందమైన పాట ఇంకెవరి వల్లనైనా సాధ్యమా ఆ గొంతులోని మాధుర్యం వింటుంటే మాటల్లేని ఆనందం పొందుతాము .. ఇంద్ర సభలో గంధర్వులు తక్కువయ్యారని భగవంతుడు పైకి తీసుకెళ్లాడేమో” ఇలా ఆలోచిస్తూ పాటలను తన్మయత్వంతో వింటుంది నీలాంబరి….
ఇంకా ఉంది