అరుణాచల క్షేత్ర విశిష్టత

వ్యాసం

మాధవి శ్రీనివాస్

పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటైన ఈ లింగ ధామం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దీనికే అరుణాచల క్షేత్రమని పేరు. ఇక్కడ ఆ పరమశివుడు అగ్ని లింగంగా వెలిశాడని ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా దీపోత్సవం జరుగుతుంది. దానికి ముందు రోజు కొండపై జరిగే దీపారాధనకు నాందిగా…. భరణి దీపారాధన చేస్తారు. ఈ భరణి దీపాన్ని శివాచార్యులు మాత్రమే వెలిగిస్తారు. పరమశివుని గర్భాలయం నుండి తీసుకువచ్చిన అగ్నితో ఈ దీపారాధన చేస్తారు అర్చక స్వాములు. శివుని ఐదు ముఖాలకు చిహ్నంగా, పంచభూతాలకు ప్రతీకగా మహాపంచ దీపారాధన చేసి ….ఐదు పెద్దదీపాల్లోకి అరుణాచలేశ్వరుని ఆవాహన చేస్తారు. తెల్లవారుజామున జరిగే అద్వితీయ అద్భుత ఘట్టం ప్రధాన ఆలయ ప్రాంగణంలో వెలిగించే భరణి దీపారాధన. తిరువన్నా మలై అరుణాచల క్షేత్రంలో అమ్మవారు అపిత కుచలాంబికాదేవిగా, అరుణాచలేశ్వరుడిగా పరమశివుడుగా ప్రసిద్ధి. ఈ అరుణాచల క్షేత్రంలో ఏడాదికి నాలుగు బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ తిరువన్నామలై బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమే ఈ భరణి దీపారాధన. ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక పౌర్ణమి మొదలు ఐదు రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ అరుణాచల క్షేత్రంలో వెలిగించే కృత్తికా దీప దర్శనం మహా పుణ్యప్రదం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది . గిరి ప్రదక్షణలో భాగంగా భక్తులకు అష్టదిక్పాలక లింగాలు దర్శనం ఇస్తాయి. ఉత్తరాన కుబేర లింగం, ఈశాన్యాన ఈశాన్య లింగం, పశ్చిమాన వరుణ లింగం, వాయువ్యన వాయువ్య లింగంగా ప్రసిద్ధి.
14 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ గిరిప్రదక్షిణను భక్తులు ఎక్కువగా పౌర్ణమి రోజు చేస్తారు. ఈ గిరిప్రదక్షిణతో సకలాభీష్టాలు సిద్ధిస్తాయని, అరుణాచలేశ్వరుని స్మరించినంతనే ఆ పరమశివుడు ముక్తిని ప్రసాదిస్తాడని , ఇక్కడ గుళకరాయి కూడా పరమశివుని ప్రతీక అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీనిని ద్వాపర యుగంలో స్వర్ణ పర్వతం అని, కృతయుగంలో అగ్నిపర్వతం అని , త్రేతా యుగంలో రత్న పర్వతమని పిలిచేవారట. ఈ కలియుగంలో శిలా పర్వతమని పిలుస్తారు. అరుణగిరి అంటే పరమశివుని జ్యోతి స్వరూపం. ఈ క్షేత్రం యొక్క మరొక విశిష్టత 11 అంతస్తుల తూర్పు గోపురం ఎత్తు 217 అడుగులు. 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన అద్భుతమైన కట్టడం ఈ ఆలయం. ఈ క్షేత్రం తమిళనాడులోని తిరువన్నామలై ప్రాంతంలో ఉంది. ఈ కార్తీకమాసంలో విశేషంగా చెప్పబడే కృత్తికా దీపోత్సవానికి భక్తులు ఏటా లక్షలలో వస్తారట. ఈ అరుణాచలంలో అన్నదానం చేస్తే పరలోక వాసులైన తల్లిదండ్రులకు ఉత్తమ గతులు, స్వర్గలోకం ప్రాప్తిస్తాయని చెప్తారు. ఈ అన్నదానం కార్తీక పౌర్ణమి రోజు చేసిన విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ప్రసిద్ధి. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారి అయినా దర్శించి తరించవలసిన పుణ్యక్షేత్రాలలో సుప్రసిద్ధమైన ఈ అరుణాచల క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం చెన్నై తిరుపతి నగరాల నుండి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవి అరుణాచల క్షేత్రం యొక్క విశేషాలు.
సర్వేజనా సుఖినోభవంతు

Written by Madhava Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

క్షీరాబ్ధి ఏకాదశి

దొరసాని