39 హైస్కూల్ స్వీట్ హార్ట్స్

కథ

           మాలాకుమార్

మేము యు.యస్ వచ్చి వారమయ్యింది. ఇంక జెట్ లాగ్ చాలులే అని వాకింగ్ కు బయలుదేరాము. కొద్ది దూరం నడిచాక ఒక ఇంటి ముందు అప్రయత్నంగా  నా కాళ్ళు ఆగిపోయాయి. అక్కడ లాన్ లో ఓ పమేరియన్ కుక్కపిల్ల ఆడుకుంటోంది. అది అచ్చు నా కుక్కపిల్ల చుటికీ లాగానే ఉంది. అది మమ్మలిని చూసి,  “భౌ… భౌ…భౌ…” అని కొంపలంటుకుపోయేట్లు అరవసాగింది. దాని అరుపులతో “రాకీ…” అని పిలుస్తూ ఒకాయన లోపల నుంచి వచ్చాడు. ఆయనను చూడగానే అచ్చు మా నాన్నగారిలా అనిపించి అలా చూస్తుండిపోయాను. అప్పటికి మా నాన్నగారు పోయి రెండేళ్ళవుతోంది. కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. ఆయన మాకు “హాయ్” చెప్పి “రాకీ” అంటూ ఆ కుక్కపిల్ల దగ్గరకు వెళ్ళాడు. 

“పద. ఇంకా అట్లా చూస్తూ ఉంటే బాగుండదు” అన్నారు ఏమండీ.

వెనకెనకకి తిరిగి చూస్తూ ” ఏమండీ, ఆయన అచ్చు మా నాన్నగారిలా ఉన్నారు కదూ. అదేమో మన చుటికీ లా ఉంది” అన్నాను కళ్ళు తుడుచుకుంటూ.

“మామయ్యగారు కూడా ఆరడుగుల ఎత్తు, తెల్లగా, తెల్ల జుట్టు తో ఉండేవారు కదా. అందుకని ఆయన మీ నాన్నగారిలా అనిపిస్తున్నాడేమో. తిరిగి వచేటప్పుడు మాట్లాడుదాములే” అన్నారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన లేరు. ఇంటికెళ్ళాక మా అబ్బాయితో చెపితే “జాగ్రత్త మాతే. ఆ కుక్కను ముట్టుకోకు. లేనిపోని గోల” అన్నాడు.

మరునాడూ ఆ యింటి ముందు మళ్ళీ ఆగిపోయాను. నా వాలకం చూసి ఏమండీ ఆయనతో “మీరు అచ్చం వాళ్ళ ఫాదర్ లా ఉన్నారని చూస్తోంది. ఆయన రీసెంట్ గా పోయారు” అని చెప్పారు.

ఆయన బయటకు వచ్చి నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ఏమండీ, ఆయనా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అలా ప్రతిరోజూ వాకింగ్ కు వెళ్ళినప్పుడు ఆ యింటి ముందు ఆగి, ఆ రాకీ నీ, అక్కడ లాన్ కు నీళ్ళు పెడుతున్న ఆయనని చూడటం, ఆయనతో కాసేపు మాట్లాడటం అలవాటైపోయింది. ఆయన గేట్ లోపల, మేము ఇవతల ఉండే వాళ్ళం. అదేమిటీ రోజూ మాట్లాడుతున్నా, ఆయన పేరు థామస్ అని చెప్పాడే కానీ, లోపలికి రమ్మనడేమిటి అనుకున్నాను. ఆ కొరతా తీరుస్తూ ఓ రోజు లోపలికి పిలిచాడు. అక్కడ ఉన్న లాన్ చేర్స్ లో కూర్చున్నాము. రోజూ ఆయనతో కూర్చొని ముచ్చట్లతో కాసేపు గడిపేవాళ్ళము. అలా మూడునెలలు గడిచాయి. ఈ మూడు నెలలల్లో ఆ లాన్ దాటి మేము లోపలికి వెళ్ళలేదు. ఆయన కుటుంబసభ్యులెవరూ కనిపించలేదు. ఇక మేము నాలుగురోజులల్లో తిరిగి వెళుతామని ఆయనకు చెపితే, మరునాడు వాళ్ళింటికి డిన్నర్ కు ఆరింటికి రమ్మన్నాడు. 

 “అసలు ఇక్కడ ఎవరైనా హాయ్ తప్ప ఇంకో మాట మాట్లాడరు. మీతో రోజూ కబుర్లు చెప్పటమే కాక, వాళ్ళింటికి డిన్నర్ కు కూడా పిలిచడా?” అని మా అబ్బాయి తెగ ఆశ్చర్యపోయి,  “ఎంతైనా నీ రూటే వేరు డాడ్” అని  మెచ్చుకున్నాడు.

మరునాడు మేము ఒక పూలబుకే తీసుకొని ఆరింటికల్లా వాళ్ళింటికి వెళ్ళాము. థామస్ మమ్మలిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు. లోపల బెడ్ రూంలో మంచం మీద ఒక ముసలావిడ పడుకొని ఉంది. ఆవిడకు మమ్మలిని పరిచయం చేసి “షి ఈజ్ మై వైఫ్ లూసీ” అని ఆవిడను పరిచయం చేసాడు. ఆ వయసులో కూడా లూసీ తెల్లగా, అందంగా , నవ్వు మొహంతో ఉంది. ఆవిడ అంత పెద్దదానిగా ఉంది ఈయనేమో చిన్నవాడిలా ఉన్నాడు అని నేను ఆశ్చర్యంతో చూస్తున్నాను. మమ్మలిని అక్కడే కుర్చీలో కూర్చోబెట్టాడు. 

నా ఆశ్చర్యం గమనించిందేమో ” మేము హై స్కూల్ స్వీట్ హార్ట్స్ మి” అంది లూసీ నవ్వుతూ.

నేనింకా అయోమయం మొహం పెట్టాను హైస్కూల్ స్వీట్ హార్ట్స్ అంటే అర్ధంకాక.

వాళ్ళిద్దరికీ మాకు అర్ధం కాలేదని అర్ధం అయ్యింది. థామస్ నవ్వుతూ “మా నాన్న సెకండ్ వర్ల్డ్ వార్ కు వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి వరకూ మానాన్న సంపాదిస్తే, మా అమ్మ మమ్మలిని చూసుకునేది. మేము పదిమంది పిల్లలము. నాన్న యుద్దముకు వెళితే అమ్మ సంపాదించవలసిన అవసరం వచ్చింది. అప్పటి వరకూ మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఇంటిని చూసుకుంటుంటుంటే, భర్తలు సంపాదించేవారు. ఇప్పుడు యుద్దానికి మగవాళ్ళు వెళితే ఆడవాళ్ళకు సంపాదించి కుటుంబాన్ని చూసుకోక తప్పలేదు. అందుకని మేము ఇంతకు ముందు ఉన్న పెద్ద కమ్యూనిటీ నుంచి వేరే చిన్న కమ్యూనిటీకి మారాల్సివచ్చింది. అక్కడ మా అమ్మలాగే అందరూ హౌస్ వైఫ్స్ ఏవో చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబాలను పోషిస్తుండేవారు. అక్కడే స్కూల్ లో చేరాము. అప్పుడు నేను 9th క్లాస్ లో, మా పెద్దక్క లెవెంత్ లో ఉన్నాము. లూసీ మా పెద్దక్క మేరీ  ఫ్రెండ్. లూసీ అక్క కోసం మా ఇంటికి వస్తుండేది. సన్నగా, నాజూకుగా, నవ్వు మొహంతో ఉన్న లూసీని మొదటిసారి చూడగానే ప్రేమించేసాను” అని ఆగాడు థామస్.

“అంత చిన్న వయసులోనే ప్రేమా?” అనుకోకుండా అన్నానే కాని వాళ్ళేమనుకుంటారో అని కాస్త భయం వేసింది.

థామస్ నవ్వుతూ ” ఏమో మరి ప్రేమ పుట్టేసింది” అన్నాడు.

“అదేమిటో మేరీ ఇంట్లో థామస్ ను చూడగానే నేనూ ప్రేమించేసాను. ఇలా స్కూల్ రోజులల్లో ప్రేమించుకోవటాన్నే “హైస్కూల్ స్వీట్ హార్ట్స్” అంటారు. కాకపోతే థామస్ ఇంకొంచం అడ్వాన్స్. నైంత్ క్లాస్ లోనే ప్రేమించేసాడు. నాకంటే మూడేళ్ళు చిన్నవాడు. మా ప్రేమకు మా వయసులు అడ్డు రాలేదు” అంది నవ్వుతూ.

“మరి నువ్వు నన్ను అంత చిన్న వయసులోనే ప్రేమలో పడేసావు” నవ్వుతూ లూసీ తో అని, ” నేను 10th కు వచ్చేసరికి లూసీ 12th అయిపోయింది. లూసీ స్కూల్ వదిలి వెళ్ళిపోతోందని, పెళ్ళి చేసుకుందామంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు రాలేదని ఇద్దరమూ చాలా దిగులు పడ్డాము. ఏమి చేయాలో తెలియలేదు. అప్పుడు మా అక్క మేరీనే ‘వాడికి చదువు పూర్తయ్యేసరికి పద్దెనిమిది సంవత్సరాలు వస్తాయి. ఈ రెండేళ్ళల్లో నువ్వు ఏదైనా కోర్స్ చేసి ఉద్యోగం సంపాదించుకో. ఆ తరువాత థామస్  కూడా ఏదైనా కోర్స్ చేస్తాడు. ఇద్దరూ సంపాదించుకొని, స్థిరపడి పెళ్ళి చేసుకోండి. ఎంతా మూడేళ్ళే కదా’ అని ధైర్యం చెప్పింది. నా స్కూల్ చదువు అయ్యేసరికి లూసీ ట్రేడ్ స్కూల్ లో నర్స్ ట్రైనింగ్ రెండేళ్ళు చేసింది. నా స్కూల్ అయ్యాక నేనూ ట్రేడ్ స్కూల్ లో కార్పెంటరీ కోర్స్ చేసాను. ఆ తరువాత పెళ్ళి చేసుకున్నాము. మాకు నలుగురు పిల్లలు. వాళ్ళూ ఎవరికి వారు వేరే వెళ్ళిపోయి, పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు” అని చెప్పటం ముగించాడు.

“మరి లూసీ ఇలా…” అని ఆగిపోయారు ఏమండి.

“నాలుగేళ్ళ క్రితం లూసీకి కార్ ఆక్సిడెంట్ లో వెన్నుముక విరిగింది. అప్పటి నుంచి ఇలా బెడ్ మీదనే ఉంది. తను వీల్ చేర్ లో కూడా కూర్చోలేదు” అన్నాడు థామస్.

“నా అంతట నేను ఏ పనీ చేసుకోలేను. అన్నీ థామస్ నే చేస్తాడు. నన్ను ఏదైనా సీనియర్ సిటిజన్ హోం లో చేర్చమని చెప్పాను. అయినా వినడు” అంది దిగులుగా లూసీ.

థామస్ లేచి ఆమె పక్కన కూర్చొని, ప్రేమగా ఆమె చేయిని చేతిలోకి తీసుకొని ” ఒకవేళ నేను ఇలాగయితే నన్ను సీనియర్ సిటిజన్ హోం లో చేర్చేదానివా? ఇప్పుడు తనకు ఎనభై ఏళ్ళు. నాకు డెభైఏడేళ్ళు. మాది అరవై రెండేళ్ళ ప్రేమబంధం” అన్నాడు. థామస్ చేతిని అందుకొని చిన్నగా ముద్దు పెట్టుకుంది లూసీ. ఆ ప్రేమజంటను అలా చూస్తుండిపోయాను.

ఆ తరువాత నేను కోక్, ఒక ఆపిల్, ఏమండీ వైన్, కొద్దిగా బ్రెడ్  తో డిన్నర్ చేసాము. వారికి థాంక్స్ చెప్పి, ఆప్యాయంగా హగ్ చేసి ఇంటికి బయలుదేరాము. 

“అమెరికన్స్ కు పెళ్ళి మీద నమ్మకం ఉండదని, ఊరుకూరికే విడాకులు తీసుకొని వేరే పెళ్ళి చేసుకుంటారని విన్నాము. కానీ వీరేమిటీ వేరుగా ఉన్నారు. ఆయనకు భార్య మీద ఎంత ప్రేమ. ఆవిడకు నాలుగేళ్ళ నుంచి అన్ని సేవలూ చేస్తూ, ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు” అన్నాను ఆశ్చర్యంగా ఏమండీతో దారిలో.

“అలా ఏమీ ఉండదు. అదంతా ఏవో సినిమాలు చూసి, పుస్తకాలు చదివీ మనం ఊహించుకొని నిర్ణయించుకున్నదే. ఇప్పుడు అక్కడా పడని వాళ్ళు విడాకులు తీసుకుంటునే ఉన్నారు. ఏదైనా ఇక్కడింతే, అక్కడింతే అని ఫిక్సైపోకూడదు. అన్ని చోట్లా అందరూ ఉంటారు. అట్లా అమెరికన్స్ మీద ఒక అభిప్రాయం ఏర్పడింది అంతే” అన్నారు ఏమండి.

“ఏమైనా ఈ హైస్కూల్ స్వీట్ హార్ట్స్ గ్రేట్” అన్నాను.

(ఈ కథ వివాహబంధం గురించి పొన్నాడవారి పున్నాగవనం గ్రూప్ లో, శ్రీమతి. వెలగపూడి భారతి గారు నిర్వహిస్తున్న “చిన్నారి పొన్నారి చిట్టి మందారాలూ – చిన్న కథలూ” లో నేను రాసిన “హై స్కూల్ స్వీట్ హార్ట్స్” కథ, ఇంకా దానిమీద  భారతి గారు చేసిన సమీక్ష. 

కమలా పరచా గారి కథ “హైస్కూల్ స్వీట్ హార్ట్స్”

విలక్షణమైన కథ. థామస్, లూసీల ప్రేమ కథ. ప్రేమపుట్టడానికి జాతి, మత, కుల వివక్షలు లేనట్టే వయోభేదం కూడా లేదని నిరూపించారు థామస్, లూసీలు.

9వ తరగతి చదివేటప్పుడే అక్క స్నేహితురాలిని ప్రేమించడం…. దానికి అక్క మేరీ సపోర్టు చేయడం అక్కడివారి సంస్కృతికి అద్దం పట్టింది.

ఎక్కడైనా మంచితనం, ప్రేమభావాలనేవి మానవ సహజాలుకదా అనిపిస్తాయి. భార్య మంచాన పడితే సకల సేవలు చేసే థామస్ లాంటివారికి నమోవాకాలు. బాల్యంలో కలిగిన ప్రేమ కడదాకా నిలిచి ఉండడానికి ఒక దేశం ప్రాంతం అనే తేడాలేముంటాయి? థామస్ లూసీలు నిజంగా హైస్కూల్ స్వీట్ హార్ట్సే.

చక్కని ప్రేమకథ అందించిన కమలగారికి 

అభినందనలు

కమల గారు వ్రాసే కథలన్నీ మనతో మాట్లాడుతున్నట్లే ఉంటాయి. చివరి వరకు ఏకబిగిన చదివిస్తాయి. ఎక్కడా కాల్పనికత లేకున్నా పాఠకులను అలరిస్తాయి. అది వారి ప్రత్యేకత  అన్నారు భారతిగారు.

భారతిగారూ ఇంత మంచి సమీక్షను చేసిన మీకు ధన్యవాదాలండి.)

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమెరికా దేశంలో అనునిత్యం సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవలో..

ఎన్నుకో….Elect