సంకల్పం

ధారావాహికం – 5వ భాగం

జరిగిన కథ

పృథ్వీ అనూష ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు. సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని భావించే వారిద్దరి మార్గాలు మాత్రం భిన్నమైనవి.

పృథ్వి,యువత అంతా మంచి చదువులు, ఆర్థిక అవకాశాలు పొందగలిగితే అభివృద్ధి సాధ్యమని భావించి అక్షర యజ్ఞం మొదలెట్టాడు.

అనూష సమాజం లో, రాజకీయ నాయకుల లో ఉన్న అవినీతి, లంచగొండితనం తగ్గితే సామాజిక అభివృద్ది జరుగుతుందని భావించి ఆ దిశగా తన జర్నలిజం సహాయంతో ప్రయత్నిస్తోంది.

వీరిద్దరి మార్గాలు కలుస్తాయా చూద్దాం.

విద్యుల్లత

పుత్రోత్సాహము

పృథ్వి, రాజేష్ వాళ్ళ టీం నగరంలోని ప్రతి ఒక్క మురికి వాడకి వెళ్లారు. అక్కడ రాజేష్ తనకు ఉన్న నెట్వర్క్ ద్వారా కొంతమందితో ముందుగానే మాట్లాడి ఉన్నాడు.

అయితే అతనికి తెలియని విషయం ఏమిటంటే తను మొదలుపెట్టిన అక్షర యజ్ఞం అనుకున్న ఫలితాలను ఇస్తోందని గ్రహించగానే పృథ్వి నగరం లోని మిగతా అన్ని స్లమ్స్ లో తన అక్షర ఫౌండేషన్ యొక్క పనులు విస్తరింప చేసేందుకు తెరవెనగా ప్రయత్నాలు సంవత్సరం కిందటే మొదలుపెట్టాడు.

ఆయా ప్రాంతాల్లో కాస్త చదువుకుని, తన తోటి వారు కూడా మంచి వైపుకు నడవాలని ఆశ ఆశయం ఉన్న వారిని గుర్తించి వారికి తన అక్షర ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలను తెలియచేసి వారిని దానిలో మెంబర్స్ గా చేర్చుకున్నాడు.

ఆయా స్లమ్స్ లోని పిల్లలందరి యొక్క వయసు, వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, వారిలో ఎంతమంది పాఠశాలలకు వెళుతున్నది, మిగతా వారి పరిస్థితి ఏమిటి మొదలైన అన్ని వివరాలను సేకరించి పెట్టుకున్నాడు.

పృథ్వి తండ్రి మాధవ్ గారు ఒకరోజు ఉదయమే  “పృథ్వీ నీతో మాట్లాడాలి,కాసేపు సమయం ఇస్తావా?” అని అడిగేటప్పటికీ చాలా ఆశ్చర్యపోయాడు పృథ్వి.

ఇన్నాళ్లు తను చేసే పనుల గురించి చాలా కోపంగా ఉంటూ, చెయ్యని పనులు (వ్యాపార వ్యవహారాలు చూసుకోవడం( గురించి నిత్యం కంప్లైంట్ చేసే తండ్రి ఈరోజు తను నగరంలోని అతిపెద్ద మురికివాడలో సాధించిన విజయం గురించి అతని స్నేహితుడు అయిన పోలీస్ ఆఫీసర్ ద్వారా తెలుసుకుని సంతోషపడ్డాడు.

ఆ ఆఫీసర్లు అంతా “మాధవ్ గారి అబ్బాయి చాలా గొప్ప పని చేస్తున్నాడు,” అంటూ పొగిడేసరికి తన పట్ల ఉన్న అసంతృప్తి కాస్త తగ్గింది. అందుకే పృథ్వి తో కూర్చుని అతని ఫౌండేషన్ యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

“చూడు పృథ్వీ, నువ్వు ఒంటరి పోరాటం చేస్తూ సాధించిన విజయం ఎన్నదగినది. కానీ ఇప్పుడు నువ్వు నగరం అంతా, ఆ తర్వాత రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని విస్తరించదల్చుకుంటే ఎంతో కొంత ఆర్థిక, రాజకీయ బలం ఉంటే ఇంకా త్వరగా నీ పనులు నెరవేరుతాయి.

నేను నా స్నేహితులు కొందరు వ్యాపారవేత్తలతో కూడా మాట్లాడి కొన్ని డొనేషన్స్ సేకరించడానికి సిద్ధం చేసి ఉంచాను.

అలాగే రాజకీయ బలం కూడా ఉంటే నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. నా స్నేహితురాలు విద్యాశాఖ మంత్రి తో మాట్లాడి ఏదైనా సాయం చేయగలదేమో అడుగుతాను.

ఇప్పుడు నువ్వు ఒంటరి వాడివి కావు. నేను కూడా నీతో ఉంటాను,” అని తండ్రి చెప్పినప్పుడు పృథ్వి ఆనందానికి అంతులేదు.

“నేను కూడా మా మహిళా మండలి ద్వారా దీని గురించి ప్రచారం చేయిస్తాను.పెద్ద పెద్ద సినిమా తారల తల్లులు మా మహిళా మండలిలో ఉన్నారు. వారి వల్ల మనకి సోషల్ మీడియాలో ప్రచారం దొరకవచ్చు. దానితో ఎంతో కొంతైనా ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నాను. నన్ను కూడా నీ మిషన్లో కలుపుకోరా,” అడిగింది తల్లి. ఈ పరిణామంతో రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగాడు పృథ్వి.

అన్ని మురికివాడలలో కమ్యూనిటీ హాలు,లైబ్రరీ నిర్మాణం చేపట్టారు. ఆర్థిక ఇబ్బంది లేదు కనుక ఆ పనులు త్వరగా పూర్తయ్యాయి. ఇక ఆ కమ్యూనిటీ హాల్స్ లోకి టీవీలు, కంప్యూటర్లు, లైబ్రరీల లోకి తాను ఎంచుకొని కొన్న పుస్తకాలు అన్నీ టకటకా వచ్చి చేరాయి.

ఈరోజు విద్యాశాఖ మంత్రి శ్రీ శారదా దేవి గారి ద్వారా తన అక్షర ఫౌండేషన్ యొక్క కార్యకలాపాలు  ఒకేసారి అన్ని స్లమ్స్ లోనూ మొదలు పెట్టబోతున్నాడు.

అలవాటుగా అనుకున్న సమయం కన్నా కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ మంత్రి గారు తన ఫౌండేషన్ గురించి బాగానే సమాచారం సేకరించినట్లు ఉన్నారు.

తన ఉపన్యాసంలో ఆవిడ పృథ్విని, అతను మొదలుపెట్టిన అక్షర ఫౌండేషన్, అది సాధించిన, సాధించబోతున్న లక్ష్యాలు ,విజయాలను గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఇటువంటి ఒక యజ్ఞాన్ని సంకల్పించినందుకు పృథ్వి ని ఎంతగానో పొగుడుతూ నవ యువతకు ఆదర్శం అంటూ కొనియాడారు.

చదువు విలువ గురించి పోతన భాగవతం లోని ప్రహ్లాద చరిత్ర లో గల ఈ పద్యాన్ని కూడా ఆవిడ ఉటంకించారు‌

చదువని వాడజ్ఞుండగు

చదివిన సదసద్వివేక చతురత గలుగున్

చదువగ వలయును జనులు

చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!

ఆంధ్ర మహా భాగవతంలోని పాత్రల చేత పోతన చెప్పించిన గొప్ప పద్యాల్లో ఇది ఒకటి.

హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు-“బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది?

మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.

ఈ పద్యం బాగా చదువుకోవాలని చెప్పటమే కాదు. చదువు ఎలా ఉండాలో చెబుతున్నది కూడాను.చదువు ఏం చెయ్యాలటనో చూశారా? అది మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకునే శక్తినివ్వాలట! అంటే మనం చదువుకొని, మంచేంటో-చెడేంటో తెలుసుకోవాలన్నమాట!

చదువు విలువ తెలుసుకుని, అది పది మందికి పంచాలని ఇతను చేస్తున్న ఈ యజ్ఞానికి తాను కూడా ఇతోధిక సాయం చేస్తానని, అదే విధంగా ఇక్కడ ఉన్నవారంతా ఇందులో ఎంతో కొంత పాలు పంచుకుని అదృష్టవంతులు కావాలని ఆవిడ పిలుపునిచ్చారు.

శారదాదేవి గారి ధారాళమైన, అద్భుతమైన ఈ ఉపన్యాసం విని అక్కడ ఉన్న వారంతా ఉత్తేజితులయ్యారు.

ఆ తర్వాత సభకు వచ్చిన చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు  తమవంతు విరాళాలు  ప్రకటించారు. దాంతో పాటు అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాము ఉన్నామని భరోసా ఇచ్చారు.

పృథ్వి తండ్రి మాధవ్ గారు మాట్లాడుతూ తాను మొదట్లో తన కొడుకు యొక్క ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోలేక ఎంతో విమర్శించానని, కానీ ఈనాడు తన కొడుకు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం గురించి ఇతరుల ద్వారా తెలుసుకుని పొంగిపోయానని, ఇది సహజంగా ప్రతి తల్లి తండ్రులు చేసే పొరపాటే అని చెబుతూ,

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా

పుత్రుని గనుకొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…!

అని తను కూడా ఓ పద్యాన్ని పాడటం తో హాలంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది.

ఇదంతా చూస్తూ పృథ్వి కళ్ళు చెమర్చాయి.

రాజేష్ ఇంకా అతని టీం ఎంతో ఉత్సాహపడి పోయారు.ఇటువంటి ప్రోత్సాహం ఉంటే తాము అనుకున్న లక్ష్యాన్ని చాలా త్వరగా సాధించగలం అని భావించారు.

సభ ముగింపు ఉపన్యాసం (ఓట్ ఆఫ్ థాంక్స్) లో అపరిమితమైన ఆనందం తో ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు పృథ్వి.

ఇంకాఉంది

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

చెట్టు స్పర్శ