దొరసాని

ధారావాహిక – 6 వ భాగం

లక్ష్మీమదన్

వేదిక మీదికొచ్చిన నీలాంబరిని చూసి సభలో ఉన్న వారందరూ అసంకల్పితంగా లేచి నిలబడ్డారు.. దానికి కారణం ఆమె వేషధారణనే… అందరికీ ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది… ఇప్పుడు ఆశ్చర్యపోవడం నీలాంబరివంతయింది.. మొదటి వరుసలో తన భర్త భూపతి కూడా ఉన్నారు తనకు తెలియకుండా ఎప్పుడొచ్చారు అని చూసింది పక్కనే ఉన్న కూతురు అలేఖ్య నవ్వి చేయితో సైగ చేసింది మాట్లాడవలసిందిగా కోరుతూ…..
నీలాంబరి వస్త్రధారణ తన దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసేదిగా ఉంది… చక్కని ఆకుపచ్చ రంగు పట్టు చీరకి ఎరుపు రంగు అంచు మరియు ఎరుపు జాకెట్ ధరించి మెడలో పచ్చల హారం వేసుకొని చేతినిండా పచ్చగాజులు వేసుకొని తలలో చిన్న మల్లెమాల తురుముకొని నుదుట సింధూరంతో ముక్కుకు చిన్న ముక్కుపోగుతో ఎంతో అందంగా కనిపించింది నీలాంబరి… అందమే కాకుండా ఆమె ముఖంలో కనిపించే రాజసం ఆమె పట్ల గౌరవాన్ని పెంచే లాగా ఉంది.

మొదట ఒక పాటతో ఆరంభించింది…” జయ జయ ప్రియ భారతి జనయిత్రీ దివ్యధాత్రి” జానకి గారు పాడిన పాటను అద్భుతంగా పాడి వినిపించింది నీలాంబరి. ఈసారి ఆశ్చర్య పోవడం భూపతి మరియు అలేఖ్య వంతయ్యింది… ఎందుకంటే ఆమె పాటలు పాడుతుంది అని తెలుసు కానీ ఇంత బాగా పాడుతుందని మాత్రం తెలియదు “ఇంట్లో ఉన్న మేమే అర్థం చేసుకోలేకపోయామే” అని కొంచెం బాధపడ్డారు…

తర్వాత ఆమె ఉపన్యాసం ప్రారంభించింది సభలో ఉన్న అందరికీ వందనం చేస్తూ తన ప్రసంగం ఆంగ్లంలో మొదలుపెట్టింది..” నేను నా మాతృభాషను గౌరవిస్తాను నా మాతృభాష తెలుగు అంటే నాకు ప్రాణం అలాగే ఇతర భాషలను కూడా నేను గౌరవిస్తాను ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు ఇతర దేశాల నుండి వచ్చారు కాబట్టి వారి సౌలభ్యం కోసం నేను నాకు వచ్చిన ఇంగ్లీషులో మాట్లాడుతున్నాను. ఎక్కడైనా తప్పులుంటే మన్నించండి…

నా దేశం నాకు ఎంతో సంస్కారాన్ని నేర్పించింది అదే కాక భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పది దానిని విదేశీయులు కూడా సమ్మతించి దాని పట్ల ఇష్టం పెంచుకొని ఆవిధంగా నడుచుకుంటున్నారు… నాకు బాధాకరమైన విషయం ఏమిటంటే నేను ఎంతో గొప్ప సంస్కృతి అని చెప్తున్నా.. నా దేశ ప్రజలు ఆ సంస్కృతిని కాదని విదేశీ సంస్కృతికి దాసోహం అవుతూ ఉన్నారు…అలా అవడం తప్పని నేను అనడం లేదు కానీ ముందు మనలని మనం గౌరవించుకున్న తర్వాత అన్నింటిని స్వంతం చేసుకోవాలి… నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను దీనిని ఎవరు అపార్థం చేసుకోవద్దు… భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి “భిన్నత్వంలో ఏకత్వం “అంటారు ఆ కట్టుబొట్టు ఎవరి సంస్కృతిని బట్టి వాళ్ళు అలవర్చుకుంటున్నారు.. సౌలభ్యం కోసం కొన్ని బట్టలను తారుమారు కూడా చేసుకుంటున్నాము అదేం తప్పు కాదు సౌకర్యం ఉంటే ఏదైనా ధరించవచ్చు కానీ కొన్ని పరిమితులు పాటించుకుంటే మంచిదని నా అభిప్రాయం… ఒకసారి నేను ఒక షాపుకు వెళ్లాను అమెరికా వచ్చే ముందు మా అమ్మాయి కొన్ని చీరలు కావాలంటే వెళ్లాల్సి వచ్చింది… లోపలికి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వేసుకున్న ప్యాంటు అంతా చిరిగిపోయి ఉంది ఒకచోటనే కాదు ప్రతి చోట పేలికలై వేలాడుతుంది.. నేను ఆ అమ్మాయిని చూసి బిక్షగత్తె అనుకున్నాను.. దుకాణం యాజమాన్యం ఎంత మంచి వాళ్ళు బిక్షగత్తను కూడా లోపలికి రానిచ్చి ఏదైనా ఆమెకు తగినది ఇస్తారేమో అనుకున్నాను… నేను అలా అనుకోవడంలో పొరపాటు లేదని తలచాను ఎందుకంటే రేగిపోయిన జుట్టు…మెడలో ధరించిన పొంతన లేని మాలలు ..ఒక చెవికి మాత్రమే ధరించిన పోగు చూసి ఒకటి పోయిందేమో అని కూడా అనుకున్నాను… కానీ ఆమె నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి బట్టలు సెలెక్ట్ చేసుకుంటుంది అప్పుడు అడిగాను నా పక్కనున్న నా స్నేహితురాలు ప్రియం వదను… ఎవరా అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుంది” అని..” అదే ఈనాటి ఫ్యాషన్ ఎంత చిరిగిపోయి ఉంటే అంత ధర ఎక్కువ చాలా డబ్బున్న వాళ్ళు ఇలాంటివి మరీ ఎక్కువగా వేసుకుంటున్నారు” అని చెప్పింది.. నాకు నిజంగా కళ్ళు తిరిగినంత పని అయింది ఫ్యాషన్ అంటే ఇంత వెర్రి తలలు వేయాలా అనిపించింది… సరే ఈ విషయంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నన్ను క్షమించండి…

భారతదేశం ప్రకృతిని ప్రేమించే తత్వం ఉన్న దేశం… ప్రతి పండుగ పూజలో చెట్టు కానీ జంతువు కానీ పిచ్చుక కానీ ఏదైనా ఉంటుంది అంటే ప్రకృతితో మమేకమైన పండగలు.. ప్రతి పండుగకు ఒక నిర్దిష్టమైన పిండి వంటకాలు చేసుకునే ఏర్పాటు ఉంటుంది అది ఆరోగ్యాన్ని పెంపొందించే మందులాగా పనిచేస్తుంది శరీరానికి ఏది అవసరం ఎంత అవసరం అనే ప్రమాణికం తప్పకుండా ఉంటుంది… అందుకే నా దేశం ఎంతో గొప్ప సంస్కృతిని నేర్పింది అని అంటున్నాను..

ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతోమందిని చూశాను… అందులో కొంతమంది పుట్టిన దేశానికి దూరంగా ఉన్నందున అక్కడి అలవాట్లను ఆచారాలను గౌరవించి వాటిని నిలుపుకొని పిల్లలకు నేర్పించి చాలా సంతోషంగా జీవిస్తున్నారు… మరికొందరు మూలాలను మరిచిపోయి ఇక్కడే పుట్టినట్లుగా అనుకొని వేషభాషలను అలవాట్లను పూర్తిగా మార్చుకొని జన్మభూమికి ద్రోహం చేసేలా ఉన్నారు… అంతెందుకు ఇప్పటికీ భారత దేశంలో ఉన్న కొంతమంది అక్కడి పెద్దలు చెప్పిన వాటిని నమ్మరు ఉదాహరణకు పతంజలి గారు సృష్టించిన యోగ సూత్రాలను పెడచెవిన పెడతారు దానిని ఇతర దేశం వారు కొంత మార్పులు చేసి మళ్లీ భారతదేశానికి పంపిస్తే అది గొప్ప అనుకొని పాటిస్తున్నారు ఇలాగని నేను ఏ దేశాన్ని కించపరచడం లేదు భారతదేశ ఔన్నత్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ విషయం అన్ని దేశాల వారికి కూడా తెలుసు…

ప్రతి మతం వారి ప్రామాణిక గ్రంథాలను పఠించడం మనం చూస్తున్నాము… కానీ మా దేశంలో ఉన్న ఎంతమందికి భగవద్గీత తెలుసు ఎంతమంది దానిని చదువుతున్నారు ఇది చాలా బాధపడ తగ్గ విషయం… భగవంతుడు కృష్ణుని నోటి నుండి పలికిన గీత భగవద్గీత అది ఏ దేశ ప్రజలు చదివినా కూడా అవగాహన అవుతుంది భోజనం ఎలా ఉండాలి ఏ రకమైన ఆహారం తినాలి! చేసే పని పట్ల శ్రద్ధ ఎలా ఉండాలి ఇలా ఎన్నో నేర్పింది భగవద్గీత ..భగవద్గీత గురించి వివరించే అంత గొప్ప దాన్ని నేను కాదు అది అందరూ ఆదరించదగ్గ గొప్ప గ్రంథం తప్పక పూజ గదిలో ఉండవలసిన పుస్తకం…. తర్వాత భారతీయ మహిళలు కుటుంబ బాధ్యతలకు పెద్దపీట వేస్తారు ఎంత పెద్ద ఉద్యోగం చేసినప్పటికీ ఇంటి బాధ్యత వాళ్లదే అని తలచి ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యం వాళ్ల చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి పనిలో వారి హస్తం ఉండి కుటుంబాలను ఎంతో చక్కగా చూసుకుంటున్నారు.. చిన్న ఉద్యోగం చేసిన పెద్ద ఉద్యోగం చేసిన పొదుపు అనే మంత్రం వారికి బాగా తెలుసు… వచ్చిన దాంట్లో కొంత ఆదా చేసి ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక నగ చేయించుకోవాలని పిల్ల పెళ్ళి చేయాలను ఇలా ఎన్నో ఆశలతో రేపటి గురించి ఆలోచించుకుంటారు.. ఈ విషయంలో మాత్రం మహిళలను మెచ్చుకోక తప్పదు అయినా కూడా నేను మొదట మహిళా పక్షపాతిని మాత్రమే… తర్వాత నేను ముఖ్యంగా మా అమ్మాయి అలేఖ్యకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవాలని మాత్రమే అనుకున్నాను కానీ నాకు చిత్రలేఖనమనే అభిరుచి ఉండటం వల్ల నా సమయాన్ని అందులోనే పెట్టుకున్నాను.. ఆ చిత్రాలను ఇలా ప్రదర్శనకు పెట్టి వాటి ద్వారా డబ్బు వస్తే అది నీ ఇష్టమైన అవసరాలకు ఉపయోగించుకోమని తన సలహా ఇచ్చింది వాటికి ఇంత విలువ వస్తుందని ఇంత డబ్బు వస్తుందని నేను ఊహించలేదు దానితోపాటు నాకు ఇంత గౌరవం పెరుగుతుందని కూడా నేను అనుకోలేదు ఇంతమంది ప్రముఖుల మధ్య మాట్లాడడానికి కూడా నాకు మాట తడబడుతుంది అయినా కూడా ఇదంతా నేను నాకు ఉన్న ఒక కోరిక తీర్చుకోవడానికి మాత్రం చేస్తున్నాను అదే నాకు ఈ వేదిక మీద నిలబడడానికి ధైర్యాన్ని ఇచ్చింది…

నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది నేను భారతదేశం వెళ్లిన తర్వాత నా కల నెరవేరిన తర్వాత నా ఊహా సౌధం కట్టుకున్న తర్వాత మీకు అందరికీ వెల్లడిస్తాను…

ముందు నేను అమెరికా రావడానికి ఇష్టపడ లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మరొక లోకాన్నే చూశాను.. ఒక గిరి గీసుకొని కూర్చున్న నాకు ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని నష్టాలు ఉంటాయి ఎంత మంది బాధపడుతున్నారు ప్రతి దేశంలో కూడా ఇలాగే ఉంటుంది కదా అని అనిపించింది… కాకపోతే ప్రతి మహిళ కూడా ఎవరో వచ్చి ఏదో చేసి మనల్ని ఆదుకుంటారు అని ఆలోచించవద్దు ఆత్మస్థైర్యం నింపుకొని వారికి కావాల్సిందేదో వాళ్ళు చేసుకోగలగాలి ఆ ధైర్యం వారికి వారే తెచ్చుకోగలగాలి ఎవరు ఏ సహాయం చేసిన ఒకరోజు రెండు రోజులు మాత్రమే కానీ మన ధైర్యం మనకుంటే నిరంతరం మనం సంతోషంగా ప్రశాంతంగా ఉంటాము…

దయచేసి నేను మాట్లాడిన దానిలో తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి జై భారత్…” అని చెప్పి ఆమె ఉపన్యాసాన్ని ముగించింది.

ఒక్కసారి సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది.. కూతురు అలేఖ్య కళ్ళనుండి నీళ్లు కారిపోతున్నాయి “అమ్మను తను ఈ కోణంలో ఎప్పుడూ చూడలేదు అసలు అమ్మేనా ఇంత బాగా మాట్లాడింది ప్రపంచం పట్ల ఇంత అవగాహన ఉంది” అని అనుకుంది భూపతి కూడా ఆమెను అలా తదేకంగా చూస్తూ ఉండిపోయాడు “ఆమె నా భార్య కావడం అదృష్టం అని అనుకున్నాడు తనకు ఏ కోర్కె ఉన్న దానికి తన వంతు సహకారం ఇస్తా”నని మనసులో అనుకున్నాడు…

నీలాంబరి అందరినీ తృప్తిగా చూస్తూ అక్కడే నిలబడింది… అప్పుడే ఆమెను వేదిక మీద కూర్చోబెట్టి ఆమెకు సన్మానం చేసి గౌరవార్థం ఆమె సంకల్పం నెరవేరాలని కొంత అమౌంట్ చెక్ రూపంలో ఇచ్చారు… ఆ చెట్లు వేసిన అంకెను చూసి చాలా ఆశ్చర్యపోయింది నీలాంబరి.

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

సంకల్పం