“మేడం గారూ,మా బాబుకి కొంచెం ట్యూషన్ చెప్తారా? మిగతా సబ్జెక్టులన్నీ బానే చదువుకుంటాడు మేడం.పాపం తెలుగు, హిందీ అసలు రావు. ఆ రెండూ కొంచెం మీరు నేర్పించగలరా?”అడుగుతున్న సుజాతను చూస్తే కాదనలేకపోయాను.
నేను 20 సంవత్సరాలు వివిధ ఉద్యోగాలు చేసి ఈ మధ్యనే మానేసాను. బాధ్యతలు తీరిపోవడం ఒక కారణం అయితే, ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేసే ఓపిక లేకపోవడం మరో కారణం. అలాగని పూర్తిగా ఖాళీగా ఉండలేక ఇంటి చుట్టుపక్కల వాళ్ళ పిల్లలకి నాకు తోచిన సాయంగా ఫ్రీగా ట్యూషన్ చెప్తూ ఉంటాను.
మా ఎదురింట్లోకి కొత్తగా వచ్చారు సుజాత వాళ్ళు. వాళ్ళ అబ్బాయి నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు .ఐఐటి కోర్సు కూడా నేర్చుకుంటున్నాడని చెప్పింది పరిచయమైనప్పుడు.
“అదేంటి మీ అబ్బాయి ఐఐటి క్లాసెస్ తీసుకుంటున్నాడు అంటే చాలా తెలివైన వాడేమో అనుకున్నాను. అలాంటి వాడికి ట్యూషన్ ఎందుకండి?” అడిగాను నేను
“అదే కదా మేడం. అన్ని సబ్జెక్టులు ఫర్వాలేదు, వాడంతట వాడే చదువుకుంటాడు. తెలుగు, హిందీ అసలు రావడం లేదు. కాస్త సాయం చేయండి,” అని అడిగేప్పటికీ కాదనలేకపోయాను.
“రేపటి నుంచి పంపించండి చూస్తాను ,” అని చెప్పాను
మరుసటి రోజు వాళ్ళ అబ్బాయి హేమంత్ ఒక బండెడు పుస్తకాలు మోసుకుని వచ్చాడు. స్కూల్ పేరు చూస్తే గొప్పదే. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా అని గబగబా ఇంగ్లీష్ లో అతని పరిచయం గురించి నాలుగు ప్రశ్నలు అడిగాను. తడబడుతున్నాడు, ఇంగ్లీషులో వాక్య నిర్మాణం చేసి సమాధానం చెప్పలేకపోతున్నాడు. సరే మొదటి రోజే భయపెట్టడం ఎందుకులే అని తెలుగులో మాట్లాడాను కాస్త కంఫర్టబుల్గా సమాధానం చెప్పాడు.
పుస్తకాల సంచి చెక్ చేశాను. అతని తరగతి పుస్తకాలే కాక ఐఐటీ కి సంబంధించిన పుస్తకాలు, సంచి నిండా ఉన్నాయి. తెలుగు రాదు అంది కదా వాళ్ళ అమ్మ అని, సరే నాలుగు చిన్న పదాలు చెప్పి రాసి చూపించమన్నాను. రాదన్నాడు. అప్పుడు అనుమానం వచ్చి,అ నుంచి బండి ఱ వరకు అక్షరమాల రాసి చూపించమన్నాను. అరగంటసేపు పుస్తకంతో కుస్తీ పడుతూ కూర్చున్నాడు. ఏమిటా అని చూస్తే ఇంకా అచ్చుల వరకు కూడా పూర్తి అవలేదు.
“ఏమిటి బాబూ?”అంటే “అక్షరాలు రావండీ,” అన్నాడు. “తెలుగు ఒకటేనా హిందీ కూడా ఇదే పరిస్థితా?”అడిగాను. నేల చూపులు చూస్తున్నాడు. విషయం అవగతమైంది. సరే అక్షరమాల రాసి ఇచ్చాను 4,5 సార్లు చూసి రాసి ఆ తర్వాత చూడకుండా రాయమని చెప్పాను.
ఒక గంట తర్వాత మొత్తానికి అక్షరాలు రాసి చూపించి ఆ రోజుకి నాకు నమస్కారం చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు
మరుసటి రోజు హిందీ . అదీ, అదే పరిస్థితి. అక్షరమాల నుంచిమొదలు. ఓ గంట కష్టపడి అక్షరాలు రాయడం పూర్తి చేసాడు.
మూడవ నాడు మళ్లీ తెలుగు అక్షరాలు రాయమంటే, గత రెండు రోజులుగా నేర్చుకున్న తెలుగు హిందీ అక్షరాలు కలగలిపి రాసేసి పుస్తకం నా ముందు పడేశాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నాకు.
ఆ అబ్బాయి తెలివితేటల గురించి ఆలోచించాల్సిందే అనిపించింది నాకు.
సరే వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా మిగతా సబ్జెక్టులన్నీ ఎలా నేర్చుకుంటున్నాడో చూద్దామని మాథ్స్ టేబుల్స్ అడిగాను.కూడికలు, తీసివేతలు ఏది అడిగినా సరైన జవాబులు లేవు.
అలా సైన్స్,సోషల్ ,ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు అతనిని ప్రశ్నించిన తర్వాత నాకు మళ్ళీ ఒకసారి అతను చదువుతున్న స్కూల్ పేరు కరెక్టేనా అని అనుమానం వచ్చింది. పుస్తకాలు, స్కూల్ డైరీ మళ్లీ ఒకసారి చెక్ చేశాను. ఖచ్చితంగా ఆ స్కూలే.
మర్నాడు ఒకసారి కలవమని సుజాతకి చెప్పాను.
“మీ వాడికి తెలుగు’ హిందీ కాకుండా మిగతా సబ్జెక్టులన్నీ బానే చదువుకుంటున్నాడు అని చెప్పారు కదా? అది మీకు ఎలా తెలుసు?” అడిగాను.
“నాకు ఇంగ్లీషు రాదండీ. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. మా వారికీ అంతే. మా పిల్లాడైనా మంచి స్కూల్లో, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఇంజనీర్ అవ్వాలని మా కోరిక. అందుకే ఊరి నుంచి వచ్చేసి, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి, వాడిని అంత మంచి స్కూల్లో చదివిస్తున్నాం. తెలుగు, హిందీ నాకు కాస్త చదవడం వచ్చు కనుక నేను ప్రశ్నలు అడుగుతాను. అప్పుడు నాకు అర్థమైంది, వాడికి అవి రావని .ఇంగ్లీష్ నాకు రాదు కనుక, నేను అడగలేను. వాడు పుస్తకం ముందు పెట్టుకుని చదువుతుంటాడు. ప్రోగ్రెస్ కార్డులో చూస్తే మార్కులు బాగానే ఉన్నాయి. అందుకని ఆ సబ్జెక్టులు బానే చదువుతున్నాడు, అనుకుంటున్నాను. ఏం మేడం మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అడిగింది సుజాత.
తనకి పరిస్థితి వివరించి చెప్పాను.
“స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్లు ఎంట్రన్స్ పరీక్ష కూడా పెట్టారు. మావాడు బాగానే మార్కులు తెచ్చుకున్నాడు అని చెప్పారు. మేము ఎంతో సంతోషించి అంత ఫీజు కట్టి ఈ స్కూల్లో జాయిన్ చేసాం మేడం.ఇప్పుడు ఏం చేయాలి?” అమాయకంగా అడిగింది సుజాత.
“ఆ స్కూల్లో నాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నారు నేను తనతో మాట్లాడి విషయం తెలుసుకుంటానులే,” అని చెప్పాను .మర్నాడు సాయంత్రం సదరు స్నేహితురాలు, ఆ స్కూల్లో పనిచేసే టీచర్ జ్యోతి ఇంటికి వెళ్లాను.
హేమంత్ పేరు చెప్పి అతని చదువు విషయం అడిగాను.
“బాబోయ్ చెప్పకు లక్ష్మీ, ఆ పిల్లాడికి అసలు ఏ సబ్జెక్టు అవగాహన లేదు. ఆ అబ్బాయే కాదు, అలాంటి పిల్లలు మా స్కూల్లో ప్రతి క్లాస్ కి ఓ 15, 20 మంది ఉంటారు. వాళ్ళకి చదువు చెప్పడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? మాకు తప్పట్లేదు,” నిట్టూర్చింది జ్యోతి.
“అదేంటి జ్యోతీ ,మరి మీ స్కూల్లో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ కూడా పెట్టి మరీ జాయిన్ చేసుకుంటారు కదా పిల్లల్ని? అలాంటప్పుడు ఇలాంటి పిల్లలకు అడ్మిషన్ ఎలా దొరుకుతుంది? ఒక్కొక్క క్లాస్ లో అంత మంది ఇటువంటి పిల్లలు ఎలా ఉంటారు? పైగా ఐఐటి కోర్సులో?” అడిగాను.
“సర్లే లక్ష్మీ ,ఇవన్నీ ఎవరికి తెలియని విషయాలు? నాతో ఎందుకు చెప్పిస్తావు? ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఒక కామెడీ. అందులో ఒకటి’ కాదు కాదు సున్నా మార్కులు వచ్చిన వారికి కూడా మేం సీట్ ఇస్తాం. ఆ పేరెంట్స్ ఐఐటి కోర్సులో అడిగితే అందులో కూడా. మరి రెగ్యులర్ కోర్స్ కన్నా రెండు రెట్లు ఎక్కువ ఫీజు వసూలు చేయొచ్చు కదా!” జవాబు ఇచ్చింది జ్యోతి.
“అదేమిటి జ్యోతీ, అలా చేయడం అన్యాయం కాదా? పేరెంట్స్ ని మోసం చేయడం కాదా?” ఆవేశంగా అడిగాను.
“కూల్ ఆ పేరెంట్స్ కి తెలియదా వాళ్ళ పిల్లల కెపాసిటీ ఎంత అని? ఇప్పుడు నేను చెప్పిన 15 మంది పిల్లల్లో కనీసం 10 మంది పిల్లల పేరెంట్స్ బాగా చదువుకున్నవాళ్లే. వాళ్లకి డబ్బు ఉంది వాళ్ళ పిల్లలు ఫలానా స్కూల్లో ఫలానా కోర్సు చదువుతున్నారు అని సొసైటీలో చెప్పుకోవడంలో స్టేటస్ ఉంది. అందుకే ఎంత ఫీజు అయినా కట్టి జాయిన్ చేస్తున్నారు. అప్పుడు తప్పు మాది ఎలా అవుతుంది? ఇది మా మేనేజ్మెంట్ వాదన, దీన్ని నువ్వు కాదనగలవా?
ఇంకొంతమంది పేరెంట్స్ ఏమో వాళ్ల పిల్లలు చదవలేరని తెలిసినా ,ఎక్కువ ఒత్తిడి తెస్తే కొంచమైనా చదువుతారని ఆలోచనతో ఈ ఐఐటీ కోసం జాయిన్ చేస్తారు, మేమేం చేస్తాం?”సమాధానం చెప్పు అన్నట్లుగా చూసింది జ్యోతి.
“వీళ్ళందరూ సరే,మరి హేమంత్ లాంటి పిల్లల గురించి ఏం చెప్తావ్? అతని తల్లిదండ్రులు బాగా డబ్బున్న వాళ్ళు కాదు. అలాగని అతనిపై ప్రెషర్ పెట్టి చదివించాలి అనుకునే వాళ్ళు కాదు. వాళ్ళ అబ్బాయి చదువుపైనే ఆశలు పెట్టుకుని ఊరు నుంచి వచ్చి తాహతుకు మించి ఫీజు కట్టి మీ స్కూల్లో చదివిస్తున్నారు. కనీసం వాళ్లకైనా న్యాయం చేయొచ్చు కదా? అలాంటి పేరెంట్స్ కి చెప్పాలి కదా మీ బాబు కెపాసిటీ కి ఐఐటి కోర్సు వద్దు రెగ్యులర్ కోర్సులో జాయిన్ చేయండి అని. అది చదవడమే అతనికి కష్టంతో కూడుకున్నది అని,” జ్యోతి సమాధానం కోసం చూసాను.
“అలా ఎలా చెప్తాం లక్ష్మీ ?అది మా మేనేజ్మెంట్ కి రూల్స్ కి విరుద్ధం. ఏ పేరెంట్స్ కి అయితే వాళ్ల పిల్లల కెపాసిటీ మీద,తాము కట్టగలిగే ఫీజు ఎంత అనే విషయం పైన క్లారిటీ ఉండి, రెగ్యులర్ కోర్స్ ఎంచుకుంటారో వాళ్లకు తప్ప మిగతా వాళ్ళందర్నీ ఐఐటి కోర్సు జాయిన్ చేసేందుకే మేము ప్రయత్నిస్తాము. కారణం ఇందాక నేను చెప్పినట్లు దాదాపు రెండు రెట్లు ఫీజు అధికంగా ఉండడం,” నిర్మొహమాటంగా చెప్పేసింది జ్యోతి.
“మరి హేమంత్ వాళ్ళ అమ్మ వాడికి తెలుగు, హిందీ తప్ప మిగతా సబ్జెక్టులలో మార్కులు బానే వస్తున్నాయి అని చెప్పింది .అదెలా సాధ్యపడుతుంది? నేను బల్లగుద్ది చెప్పగలను అతనికి ఏ సబ్జెక్టులో కూడా బేసిక్స్ రావని,” కోపం ఆపుకునే ప్రయత్నం చేశాను.
“అలాంటివన్నీ నువ్వు అడక్కూడదు లక్ష్మీ ,సాధ్యమైనంతవరకు ప్రతి పిల్లలకి పాస్ మార్కుల వరకు తెప్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. పరీక్షకు ముందు రివిజన్ ఇస్తాం. ఇంకా అవసరమైతే మా ట్రిక్స్ మాకు ఉంటాయి, అవి ఫాలో చేస్తాం. ప్రోగ్రెస్ కార్డు చూసి పేరెంట్ కి హార్ట్ ఎటాక్ రాకూడదు కదా మరి,” కార్పొరేట్ స్కూల్ మాయాజాలం అంతా ఇమిడిపోయి ఉంది తన మాటల్లో.
“నువ్వు చెప్పేవన్నీ నిజమే అనుకుందాం. కానీ విద్యాలయాలు ఇలా దోపిడీదారుల్లా మాట్లాడడం తప్పు కాదా? వాటికంటూ ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కదా, కాదంటావా?” నన్ను నేను సమర్ధించుకునే ప్రయత్నం చేశాను.
“ఏ కాలంలో ఉన్నావ్ లక్ష్మీ నువ్వు? కొన్ని కోట్లు ఖర్చుపెట్టి స్కూల్స్ ఓపెన్ చేసే ఇలాంటి కార్పొరేట్ సంస్థల నుంచి నువ్వు సామాజిక బాధ్యత లాంటి పెద్ద పెద్ద పదాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? కొంతమందికి ఉచితంగా విద్య ఇస్తున్నారు కదా ?అదే వాళ్ళు చేసే సామాజిక బాధ్యత. అసలు బాధ్యత గురించి మాట్లాడితే ఇంతింత ఫీజులు వసూలు చేసేందుకు ఇలాంటి స్కూల్స్ కి పర్మిషన్ ఇచ్చే గవర్నమెంట్ కి ఏం బాధ్యత ఉంది అని అడుగుతాను? దానికి నీ దగ్గర జవాబు ఉందా?” రెట్టించింది జ్యోతి.
నిజమే జ్యోతి అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఇదంతా ఒక విష వలయం . ఇందులో చిక్కుకున్న పేరెంట్స్, పిల్లలు శలభాల్లా మాడిపోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదా? ఇది ఎలా మారుతుంది? ఆలోచనలో పడిపోయాను.