సంకల్పం

ధారావాహికం – 4వ భాగం

జరిగిన కథ

పృథ్వి, అనూష ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు. సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని భావించే వారిద్దరి మార్గాలు మాత్రం భిన్నమైనవి.

పృథ్వి నగరం లోని మురికివాడల్లో ఉన్న యువతకు మంచి విద్య లభిస్తే వారు నేరాలు చెయ్యకుండా మంచి మార్గం లో పయనిస్తారని నమ్మి ఆ దిశగా అక్షర యజ్ఞం మొదలెట్టాడు.

మరి అనూష ప్రయాణం ఏ వైపు వెళ్తోందో చూద్దాం.

విద్యుల్లత

( ఇన్వెస్టిగేషన్)

“అమ్మా ఏమిటి, రాత్రంతా నిద్రపోకుండా ఏదో రాసుకుంటూనే ఉన్నట్టున్నారు? కాస్త వేడివేడిగా కాఫీ ఇవ్వనా?” పనిమనిషి లక్ష్మీ మాటలతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది అనూష.

“అలాగే తీసుకురా లక్ష్మీ, చాలా తలనొప్పిగా ఉంది. ఒక్క క్షణంలో బ్రష్ చేసుకుని వస్తాను,” అంటూ బాత్రూం లోకి వెళ్ళింది.

బయటికి వచ్చి లక్ష్మి అందించిన కాఫీ తాగుతూ తను రాత్రంతా కష్టపడి తయారు చేసిన డ్రాఫ్ట్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకుని తృప్తిగా తల పంకించింది.

ఇది తను హైదరాబాద్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి యొక్క అవినీతిని గురించి తనకు అందిన లీడ్స్ తో విస్తృతంగా పరిశోధించి అనేక సాక్షాలు సేకరించి తయారు చేసిన స్టోరీ.

నగరంలో వివిధ  అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులలో నూటికి 60% ఈ మంత్రి గారు, అతని చుట్టూ ఉండే భజనపరులు పంచేసుకుంటున్నారు.

కేవలం 40 శాతం నిధులు మాత్రమే పైపై మెరుగుల కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ మంత్రి గారి పిఏ అంతకన్నా భయంకరమైన వాడు‌ అతని వాటా అతనికి లభిస్తే చాలు.

నిజానికి మన రాష్ట్రం- మన నిధులు-మన అభివృద్ధి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చింది ఈ  ప్రభుత్వం.

ముఖ్యమంత్రి గారు చాలా మంచివారే కానీ ఆయన ముందు మంచివారుగా నటిస్తూ, ప్రజలను కూడా అలాగే మభ్యపెడుతూ ఇలా దోచుకుంటున్న మంత్రుల గురించి,వారి అవినీతి గురించి బట్టబయలు చేయాలనేది అనూష లక్ష్యం. అందరికన్నా ముందుగా. బకాసురుడిలా మారిన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిని ఎంచుకుంది.

రెండు నెలలు గా అతడి గురించి చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసింది.

ముఖ్యమంత్రి గారి మంచితనం ఆసరాగా తీసుకుని ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎంత డబ్బు, ఆస్తి ఈ మంత్రి కూడబెట్టారు?ఎక్కడెక్కడ ఎవరెవరు అతని బినామీలు గా వ్యవహరిస్తున్నారు మొత్తం గత రెండు నెలలుగా విస్తృతంగా పరిశోధించి పూర్తి సమాచారం సేకరించింది అనూష.

ఇంకొక రెండు రోజుల్లో అతను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రపంచ నగరీకరణ సదస్సులో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్తున్నాడు. అతను వెళ్లే లోగా ఈ న్యూస్ తన ఛానల్ లో ప్రసారం చేయడం ద్వారా అతని అవినీతిని బహిర్గతం చేయాలనేది తన ఉద్దేశం.

దీనికోసం ముందుగానే ఛానెల్ ఎండి శ్రీధర్ గారి పర్మిషన్ తీసుకుంది.

ఈరోజు ఉదయం నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్క క్లిప్పింగ్ తో న్యూస్ బయట పెడుతూ రాత్రి ప్రైమ్ న్యూస్ టైం కి తన దగ్గర ఉన్న తన స్ట్రింగ్ ఆపరేషన్ కు సంబంధించిన విజువల్స్ బయట పెట్టాలి.

తమది చిన్న ఛానల్ కాబట్టి ముందు ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా సాయంత్రం కల్లా కొంతైనా ప్రజల్లో చర్చకు దారితీస్తుంది.

అప్పుడు తను ఎంతో ముఖ్యమైన ఆ ఫుటేజ్ ను ప్రసారం చేస్తే అప్పుడు ప్రభుత్వంలో కదలిక వచ్చి అతని పదవికి గండం వచ్చే అవకాశం ఉంది. అది జరగాలనే తను ఎంతో శ్రమకోర్చి, ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి చాలా ముఖ్యమైన ఆధారాలను సేకరించింది.

ఈరోజు ఆఫీస్ కి వెళ్తూనే ఒక్కొక్కటిగా ఈ మంత్రి గారి లీలలు సాక్షాలతో సహా ప్రసారం చేయాలి. అది చాలా పకడ్బందీగా ఉండాలని రాత్రంతా కూర్చుని కరెక్ట్ గా డ్రాఫ్ట్స్ సిద్ధం చేసుకుంది.

లక్ష్మీ ఇచ్చిన కాఫీ తాగి , స్నానం చేసి వచ్చేసరికి లక్ష్మీ తనకు ఎంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేసింది బ్రేక్ ఫాస్ట్ లో. అది తినేసి బాగా చేసినందుకు లక్ష్మిని మెచ్చుకుని తన బైక్ పై బయలుదేరింది అనూష ఆఫీస్ కి.

సిగ్నల్ దగ్గర ఆగగానే పక్కన కారులో ఉన్న వ్యక్తిని చూసి పృథ్వి ఏమో అనుకుని మరోసారి చూసింది. అతను పృథ్వి కాదు.

ఇంకా నయం పలకరించేయలేదు అనుకుని నవ్వుకుంది.

ఏమిటో ఈ మనిషి ఈమధ్య బాగా గుర్తొస్తున్నాడు, కొంచెం డిస్టర్బ్ కూడా చేస్తున్నాడు అనుకోకుండా ఉండలేకపోయింది.

తన ఫోన్ నెంబర్ తీసుకున్నా తనే స్వయంగా ఫోన్ చేసేంతవరకు నిజంగానే తనని డిస్టర్బ్ చేయని అతని వ్యక్తిత్వానికి, సంస్కారానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.

కానీ తనే ఏదో కారణంతో అతడిని మధ్య మధ్యలో కలుస్తూనే ఉంది గత రెండు నెలల్లో.

తను ఎందుకు ఇంతలా అతని గురించి ఆలోచిస్తోంది.?అతను ఎంతో అందగాడు, పైగా చాలా డబ్బున్న వాడు. అమ్మాయిల దృష్టిలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అనొచ్చు.

నందిని లాంటి ఎందరో అందమైన, తెలివైన అమ్మాయిలను కూడా పట్టించుకోలేదుట ఈ ప్రవరాఖ్యుడు. అలాంటిది నిన్ను అతను పట్టించుకుంటాడా అనూషా?

తనేమో చాలా సాధారణమైన రూపం కలిగిన ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడు తన గురించి అసలు ఆలోచిస్తాడా?

‘మనసా తుళ్ళిపడకే, అతిగా ఆశపడకే,’ అని పాడుకోవాలి తను.

ఐనా అన్ని విషయాలలో ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ అని అనిపించుకునే తను ఇతని విషయం లో ఏమిటి ఇలా తనకు ఏమాత్రం అలవాటు లేని సిగ్గు బిడియం లాంటి భావాలకు లోనౌతోంది?

ప్రేమంటే ఇదేనా? తను పృథ్వీ ని ప్రేమిస్తోందా?

సరే ఈరోజు ఎలాగూ అతడిని కలవబోతోంది కనుక నిజాయితీగా తన మనసులోని మాటను

పృథ్వికి చెబుదామా? ఇలా

ఆలోచిస్తూ ఉండగానే ఆఫీస్ వచ్చేసింది.

ఆఫీసుకు వెళ్ళగానే నేరుగా ఎండి గారి క్యాబిన్ లోకి వెళ్ళింది.

60 సంవత్సరాల వయసు ఉన్నా, నిత్యం వ్యాయామం చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఎండి శ్రీధర్ గారు తన వయసు కన్నా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. చాలా ఎనర్జిటిక్ గా,ఆఫీసులో అందరికీ ఇన్స్పైరింగ్ గా ఉంటారు.

వివిధ పత్రికలలో, చానెల్స్ లో పనిచేసిన అతనికి అక్కడి రాజకీయాలు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే బాస్ లు నచ్చక ఎన్నో ఉద్యోగాలు మారాడు. చివరికి ధైర్యం చేసి తనదైన చిన్న ఛానల్ పెట్టుకున్నాడు.

‘సివిటాస్ –  నవసమాజం కోసం’ అతని ఛానెల్.

సివిటాస్ అంటే లాటిన్ భాషలో కమ్యూనిటీ అని అర్థం.

తను రాజకీయాలకు అతీతంగా స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేయాలంటే అదే సరైన  మార్గం అని అనుకున్నాడు. తనలాగే ఆలోచించే అనూష అంటే అతనికి ప్రత్యేక అభిమానం. ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు.

తన కూతురు కనుక తన దారిలో నడిస్తే అచ్చు అనూష లాగే ఉండి ఉండేదని అనుకుంటాడు శ్రీధర్. కానీ తన దురదృష్టం, తన పిల్లలిద్దరికీ తనమీద వల్లమాలిన కోపం. డబ్బు సంపాదించడం చేతకాని వాడని హేళన.

ఎలాగోలా కష్టపడి తన కొడుకు, కూతురు ఇద్దరినీ  వారు కోరుకున్న  ఇంజనీరింగ్ చదువు చెప్పించాడు. దాని సాయంతో వాళ్ళు అమెరికా ఎగిరిపోయి అక్కడ బాగానే సంపాదించుకుంటున్నారు.

మూడు సంవత్సరాల క్రితం తన భార్య చనిపోయినప్పుడు చివరిసారిగా వాళ్ళు ఇండియా వచ్చి వెళ్లారు. ఇక దాంతో వారికి కన్నతల్లితో ,కన్న దేశంతో రుణం తీరిపోయినట్లు భావించారు. తిరిగి చూడలేదు, తనని పలకరించలేదు.

తనే మమకారం చంపుకోలేక ఎప్పుడైనా ఫోన్ చేస్తే ముక్తసరిగా మాట్లాడతారు.

అనూష వచ్చి ఆరోజు తను మంత్రిగారి అవినీతిని ఎలా బయటపెట్టపోతోందో వివరించింది. దానికి సంబంధించిన డ్రాఫ్ట్స్, స్లైడ్స్ అన్ని చూపించింది.

ఆమె నిశితమైన పనితీరును మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీధర్.

“వెరీ గుడ్ అనూషా, నువ్వు ఎలా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నావో అలాగే చెయ్యి. అయితే ఈ న్యూస్ కి నువ్వు కేవలం తెర వెనుక కాకుండా న్యూస్ రీడర్ గా కూడా  ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.

ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియలో నువ్వు ఈ విషయంపై ఎక్కువ అవగాహన పొంది ఉంటావు కదా. అందుకే నువ్వే ప్రజెంట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి అనిపిస్తోంది.

రోజంతా కాకపోయినా కనీసం ప్రైమ్ టైం న్యూస్ మాత్రం నువ్వే ప్రెజెంట్ చేయి.  అప్పుడే మన ఈ ప్రయత్నం  సఫలం అవుతుందని నాకనిపిస్తోంది అన్నాడు శ్రీధర్.

ఆ మాటకు ముందు తటపటాయించింది అనూష. “సర్ ఇంత ముఖ్యమైన వార్తలని బాగా అలవాటు ఉన్నవాళ్లు కాకుండా నేను ప్రెజెంట్ చేస్తే….?”

“లేదు అనూషా, నాకెందుకో నువ్వు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తోంది ,ఆలోచించు,”అన్నారు శ్రీధర్.

ఆయన చెప్పిన మాటలోని నిజాన్ని కొట్టిపారేయలేక అనూష కూడా సరే అంది. దీని ద్వారా రాబోయే ప్రమాదాన్ని వాళ్ళిద్దరూ ఊహించలేదు.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏడ్పు ఎందుకు?

ఆనందజ్యోతి