తమసో మా జ్యోతిర్గమయ *

        కామేశ్వరి

పండుగలు అనేవి ఆధ్యాత్మిక చింతన తో కూడిన సామాజిక సందడులు. దేశ కాలాలు, జాతి మత భేదాలు లేకుండా అందరికీ వారి వారి పద్ధతుల ప్రకారం పర్వదినాలు ఉండనే ఉంటాయి. ఇప్పటికీ అలా జరుపుకుంటూనే ఉన్నారు. పండుగలలో ముఖ్య ఉద్దేశం ప్రజలలో ఐకమత్యాన్ని, దాన గుణాన్ని, ధర్మ గుణాన్ని ప్రోది చేయడమే. ఆ ఒక్క రోజైనా సమ సమాజం కనపడాలని కోరికతో పెద్దలు ఏర్పాటు చేశారు . నేటికీ అన్ని దేశాల వాళ్ళూ అన్ని మతాల వాళ్ళు ఆఖరికి నాగరికతలేని ఆటవిక జాతుల వారు కూడా వారి వారి సాంప్రదాయనుసారం పండుగలు అనే సందడిని జరుపుకుంటూనే ఉంటారు. పండుగ వచ్చింది అంటే ఆబాలగోపాలము ఉత్తేజం పొంది ఆస్వాదిస్తారు.
కాలంతో వచ్చే మార్పులతో పాటు ఖగోళంలో వచ్చే మార్పులను ఆధారం చేసుకుని మన మహర్షులు ప్రతి పండుగకు ఒక అమూల్యమైన సందేశాన్నిచ్చారు. తామసంలోపడిపోకుండా మనుషులను ఉత్తేజులను చేయడానికి ఆయా ఋతువులలో ఆయా పండుగలను ఏర్పాటు చేసి ఉంటారేమో! ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వాటికి తగ్గ ఆహార విహారాలు కూడ తెలియపరిచారు. అంతే కాదు కొన్ని పండుగలకు ఏకభుక్తము, మరి కొన్నింటికి మృష్టాన్న భోజనాలు, కొన్నింటికి ఉపవాసాలు కూడా ఏర్పాటై ఉన్నాయి .

Choti Diwali Puja Deep Daan Vidhi and Muhurat: छोटी दिवाली आज, जानें पूजा  मुहूर्त, विधि और दीपदान का समय

గతించిన మన పెద్దలకు కూడా కృతజ్ఞతాపరంగా చేసే క్రియలు కూడా ఉన్నాయి. అంటే ఇహపరాలు కూడ కలుపుకుంటామన్న మాట. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే త్వరలో మనకి శోభ కృత్ నామ సంవత్సర దీపావళి పండుగ వస్తోంది.
. యావత్ భారతదేశం ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ దీపావళి. మరీ… పిల్లలకు సందడిని హుషారును తెచ్చే పండగ… బాణసంచా కాల్చే నెపం తో ఆ సమయంలో పెద్దలు కూడా పిల్లలు అయిపోతారు. ఇదే ఈ పండగ లోని మజా….కానీ ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి. అదేమిటంటే విపరీతంగా బాణసంచా కాల్చి వాయు కాలుష్యం చేసుకోకూడదు. ఇప్పటికే ఈ రవాణా వాహనాల వలన ఎంతో వాయు కాలుష్యం చవిచూస్తున్నాము. దీనివల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇదివరలో ఈ కాలంలోనే పండిన పంటలను కోసి వేసేవారట. ఆ పంటలను ఆశ్రయించి ఉన్న క్రిమి కీటకాదులు మనం వెలిగించే దీపాల నాకర్షించి చనిపోయేవట. ఇది కూడా ఒక రకమైన క్రిమిసంహారక పద్ధతిట ఆ రోజులలో.!
ఆశ్వీజ మాసమంతా దేవి పూజలు, బతకమ్మల తోటి హోరెత్తింది. దానికి కంటిన్యూగా ఆఖరి రోజైన అమావాస్య దీపావళి అమావాస్య. దీపావళి కూడా అతి పెద్ద పండుగే. త్రయోదశి రోజున ధన త్రయోదశి అని, చతుర్దశి నాడు నరక చతుర్దశి అని, అమావాస్యనాడు దీపావళి అని, కార్తీక పాడ్యమి బలిపాడ్యమని, తదియ భగిని హస్తభోజనం అని, చవితి నాగుల చవితి అని, పంచమి నాగ పంచమి అని ఐదు రోజుల పండుగ జరుపుకుంటారు.

ధన త్రయోదశి నాడు మార్వాడీలు లక్ష్మీ పూజ ఘనంగా జరుపుకుంటారు. మన పండుగలు అన్నీ ప్రకృతితో ముడిపెట్టినవే. పంచభూతాలకు సంబంధించినవే. ” దీపా నామ్ ఆవళ్ళి ” అంటే దీపముల వరుస. సంఖ్యాకమైన విద్యుత్ దీపాలతో,నూనె దీపాలతో అలంకరిస్తారు. కరెంటు లేని రోజులలో ఆముదపు దీపాలను, నువ్వుల నూనె దీపాలనువెలిగించేవారు. ఆధునికత సంతరించుకుని పాతవన్నీ వెనక్కి వెళ్ళాయి. ఆ దీపాల వల్ల కళ్ళకు చల్లదనం, కొన్ని రకాల కీటకాలు వల్ల రక్షణ కూడా కలిగేది. ఈరోజు మనం ఆచరించే విధులలో అభ్యంగన స్నానము, దానాలు, ధర్మాలు, పితృతర్పణాలు ముఖ్యమైనవి. కొన్ని ప్రాంతాలలో గోగు కర్రలతో దివిటీలు కొట్టించి పైనున్న పితృదేవతకు మార్గాన్ని చూపుతారుట అమావాస్య రోజున. ఈరోజున లక్ష్మి నీటిలోనూ, దీపంలోనూ కొలువై ఉంటుందట. అందుకే ప్రతివారు దీపాన్ని ఆరాధిస్తారు ఈరోజు.
ప్రతి పండుగకు ఒక పౌరాణిక కథ ఉన్నట్టే దీపావళి కూడా ఒక కథ ఉన్నది. దుష్టుడైన నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతంగా వెళ్లాడు. సత్యభామ నరకుణ్ని సంహరించడం చాలా ముఖ్యమైన విషయం. అలా అతన్ని సంహరించి దేవతలకు భూలోక వాసులకు పీడా నివారణ గావించాడట శ్రీకృష్ణుడు. ఆ రోజు నరక చతుర్దశి గాను, మరునాడు దీపావళి గాను పండుగ జరుపుకునే ఆచారం వచ్చింది. నరకుడు అనే అజ్ఞానాన్ని తొలగించు కొని దీపావళి నాడు వెలిగించే జ్యోతి ద్వారా మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకొనుటే ఈ పండుగలోని ముఖ్య ఉద్దేశం.

ప్రధానంగా మనది అగ్ని ఆరాధన సాంప్రదాయం. తెల్లవారు లేస్తే అది లేనిదే భుక్తి
గడవదు. అగ్నిలో సర్వదేవతలు ఉంటారని మన పూర్వీకుల నమ్మకం. “అసతో మా సర్గమయా ” ” తమ సో మా జ్యోతిర్గమయ ” అంటూ వేదాలు ఘోషిస్తున్నాయి. ప్రతి పండుగ మళ్లీ మళ్లీ రావడంలో ఉద్దేశ్యం మనలో నైరాశ్యాన్ని పోగొట్టి మనలను ఉద్దీపులను చేయడానికే. కొడిగడుతున్న మానవత్వం అనే దీపాన్ని( వత్తిని పైకి తోయడం ) అప్రమత్తతో నిరంతరం వెలిగేలా చూసుకోవాలి అని. అదే” తమసో మా జ్యోతిర్గమయ”. దాని ద్వారా జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి.
శాంతిః శాంతిః శాంతిః

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త రోజు A New Day.

`విశ్లేషణా ధోరణి లేనివాడు రచయితే కాదు’