అనునిత్యం సాహిత్య సేవ లో

శాంతారెడ్డిగారితో తరుణి ప్రతినిధి యశోద ముఖాముఖి

పేరుకు తగ్గట్టే శాంతం ఆమె ఆభరణం. బోధన వృత్తి, శోధన ప్రవృత్తి. అనునిత్యం సాహిత్య సేవ లో నిమగ్నమై అక్షరం సమాజాన్ని ప్రభావితం చేయాలన్న తపనతో కృషి చేస్తున్నారు. ఆమే శాంతరెడ్డి గారు…ఈ వారం తరుణి

మీ పరిచయం, సొంత ఊరు, తల్లిదండ్రులు, చదువు, ఉద్యోగం, పెండ్లి, పిల్లలు?

బీఎస్సీ., ఎం.వీ.ఎస్ కళాశాల , మహబూబ్ నగర్, రెడ్డి ఉమెన్స్ కాలేజీ హైదరాబాదులో ఎం. ఏ., తెలుగు, టిపిటి సమగ్ర శిక్షణా కళాశాల హైదరాబాద్ లో చేశాను.

తల్లి దండ్రులు: కడుకుంట్ల ప్రమీలమ్మ కృష్ణారెడ్డి గారలు

జన్మస్థలం ; దాసుపల్లి గ్రామము, తెలకపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా

పెండ్లి : గాల్ రెడ్డి రవీందర్ రెడ్డి గణిత ఉపాధ్యాయులు, గ్రా. పెద్ద చింతకుంట, మండలం మరికల్ , జిల్లా నారాయణ్ పేట్

పిల్లలు: కొడుకు రాహుల్ కార్తీక్ రెడ్డి , కోడలు శిల్పారెడ్డి, వీరికొక కొడుకు విశృద్ రెడ్డి ఇద్దరూ సాప్ట్ వేర్ ఇంజినీర్స్ , కూతురు డా. సాత్విక రెడ్డి, డెంటిస్ట్ , అల్లుడు హరీశ్ రెడ్డి సాఫ్టువేర్ ఇంజినీర్ వీరికొక కూతురు ఆర్యశ్రీ , లాస్ ఏంజిల్స్ లో ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడినారు.

వృత్తి: ప్రస్తుతం తెలుగు భాషోపాధ్యాయినిగా
గవర్నమెంట్ హై స్కూల్ న్యూ టౌన్, మహబూబ్ నగర్ లో చేస్తున్నాను.
నివాసం: టీచర్స్ కాలోని, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ

సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది, మీకు స్ఫూర్తి కలిగించిన సాహితీ వేత్తలు ఎవరు?

చిన్నప్పుడు మా నాన్న కె. కృష్ణారెడ్డి , తెలుగు ఉపన్యాసకులు గారి లైబ్రరీలో నుండి బోలెడు నీతి శతకాలు, నీతి కథల పుస్తకాలు మరియు నీతి శాస్త్రం మొదలగునవెన్నో పుస్తకాలను తీసి ప్రతి రోజు చదివించడం ద్వారా వాటి ప్రభావంతో సాహిత్యంపై ఆసక్తి ఏర్పడింది. మా నాన్న ఇంటిదగ్గర పాఠ్య పుస్తకాల బోధన చేస్తూ నిరంతరం మాచే అభ్యసనం చేయించేవారు. వాటితో పాటు చిన్న చిన్న కవితలు, పద్యాలు, ఏకపాత్ర అభినయాలు, నాటకాలు రాయించగా వాటిని వివిధ సందర్భాలలో పాఠశాలలో ప్రదర్శించి తోటి విద్యార్థుల మధ్యన ప్రత్యేకంగా నిలిపారు. నన్ను బహుముఖ ప్రజ్ఞావంతురాలిగా తీర్చిదిద్దిన మా నాన్న క్రిష్ణారెడ్డి గారే నాకు స్ఫూర్తి వంతమైన గొప్ప సాహితీ వేత్తగా నిలిచిన రోల్ మాడల్.
నిజం చెప్పాలంటే నా జీవితంలో నాన్న ఒక స్ఫూర్తివంతమైన పీ హెచ్ డి గ్రంథం. నాన్న చూపించిన దారిలో నడుస్తూ తెలుగు ఉపాధ్యాయుని ఉద్యోగం సంపాదించి పాఠశాల విధులు నిర్వహిస్తూనే సాహిత్యంపై ఆసక్తి కలిగి 2012 నుండి సీరియస్ సాహిత్యాన్ని సృజిస్తున్నాను. నాన్న అకాల మరణం చెందగా నాకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన మా నాన్నగారి సహాధ్యాయి డా. కపిలవాయి లింగమూర్తి మామయ్య మరియు నా పీ.జీ. గురువు డా. ముదిగంటి సుజాతా రెడ్డి, వారి శిష్యురాలు ప్రముఖ కవయిత్రి డా. కొండపల్లి నీహారిణి , తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి మరియు నా తమ్ముడు డా. రఘురాంరెడ్డి గార్ల ప్రోత్సాహం సహకారంతో వర్ధమాన కవయిత్రిగా సాహితీ రంగంలో వేగంగా దూసుకెళ్తున్నాను.

ఇప్పటి వరకు మీరు రాసిన ప్రక్రియలు, రాయడానికి ప్రేరణ?

సామాజిక మార్పు కోసం మా నాన్నగారి సాహిత్యాన్ని ఈ జనరేషన్ కు అందిద్దామనే ఉద్దేశ్యంతో వివిధ అంశాలపై వచన కవితలు, ప్రాచీన సాహిత్యం మరుగున పడకుండా పద్యాలు మరియు చిన్న చిన్న కథలు రాయటం మొదలు పెట్టాను.

ప్రచురించిన పుస్తకాలు :
1. మౌనగీతం (వచన కవితా సంపుటి)
2. అమ్మా నాన్న ద్విశతి (స్మృతి కావ్యం) 216 పద్యాలు
3. ” తొలకరి మెరుపులు “వచన కవితా సంపుటి
4. పెళ్లి పుస్తకం.. పెళ్లిలో జరిపే క్రతువుల దీర్ఘ వ్యాసం
5. ఆత్మ బోధ శతకం ఆటవెలది పద్యాలు మరియు వందల సంకలనాలలో నా రచనలు అచ్చయినవి

మీరు అందుకున్న బిరుదులు, అందుకున్న అవార్డులు, పురస్కారాలు:?
విద్యారంగంలో, సాహిత్య రంగంలో చాలా సంస్థలు బిరుదులు, పురస్కారాలు ఇచ్చాయి. వాటిలో కొన్ని
మెరుపు మిత్ర , నారీశక్తి బిరుదులు.
సాహిత్యరంగంలో*
1. ప్రపంచ తెలుగు మహాసభల కవి సమ్మేళనాలలో పురస్కారం 2012 జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ గారిచే , 2017లో తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్ష కార్యదర్శులు నందిని సిధారెడ్డి ఏనుగు నరసింహా రెడ్డి గార్లచే..

2. తెలంగాణ జాగృతి వారి కాళోజీ శత జయంతి కవి సమ్మేళనంలో పురస్కారం – 2013 .. వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారిచే

2. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA పురస్కారం – 2019 .. పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతి సిన్హా గారిచే
3. తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన కథయిత్రి నందగిరి ఇందిరా దేవి జయంతి కవిసమ్మేళనంలో అధ్యక్ష కార్యదర్శులు నందిని సిధారెడ్డి ఏనుగు నరసింహారెడ్డి గార్లచే పురస్కారం
3. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం – 2021
4. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల కవి సమ్మేళనం 2022లో ఉత్తమ కవితగా ఎన్నికై పురస్కారం
జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గార్లచే అందుకున్నాను.

5. తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనం – 2022లో “తెలుగు భాష అభివృద్ధికై ప్రభుత్వానికి సలహాలు సూచనలు” అంశంపై పత్ర సమర్పణ చేసి తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్ష కార్యదర్శుల ఆచార్య ఎల్లూరి శివారెడ్డి డా.జె. చెన్నయ్య గార్లచే పురస్కారం

    

6. భారత జాగృతి నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభల్లో పురస్కారం – 2023 , వ్యవస్థాపక అధ్యక్షులు ఎం ఎల్ సీ కల్వకుంట్ల కవిత జూలూరు గౌరీ శంకర్ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ తదితరులచే పురస్కారం

7. రాష్ట్ర రెడ్డిసేవ సొసైటిచే
“నారీశక్తి” పురస్కారం – 2020
జిల్లా రెడ్డి సేవ సొసైటి వారిచే ఉత్తమ సాహితీవేత్త పురస్కారం 2022

8. వరసగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ మరియు తెలుగు భాషా దినోత్సవ కవిసమ్మేళనాలలో మరియు బతుకమ్మ ఉత్సవాలు విద్యా విభాగం ఆధ్వర్యంలో
పురస్కారాలు గౌరవ మంత్రి వర్యులు డా. వి. శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా
ఇంకా మరెన్నో అందుకున్నాను .

ప్రస్తుతం రాస్తున్న పుస్తకాలు?

1. మనుమసిద్ది పద్యాలు
2. నాయనపల్లి మైసమ్మ చరిత్ర తారావళి
3. రెడ్డికుల చరిత్ర ( త్రిపదలు)
4. పద్యపారిజాతం ( ఖండకావ్యం)
5. కాలగమనంలో కరోనా.. డైరీ, లేఖ కథ మరియు వచన కవితలు
6. వివిధ అంశాలపై వందకు పై వచన కవితలు సంపుటికి సిద్ధంగా ఉన్నాయి.
భవిష్యత్ రచనలు : చిన్న పిల్లల కోసం పాటలు, కథలు
విద్యార్థుల కోసం: అతి సులభ వ్యాకరణం

పర్యాటక రంగంలో మీ అనుభవాలు , మీరు చూసిన ప్రదేశాలు.. అనుభవాలు?

ప్రతి సంవత్సరం తిరుపతి, శ్రీశైలం, మోత్కుపల్లి బలభీమ సేన పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటేనే మనసు కుదుట పడుతుంది. నల్లమలలో ఓంకారేశ్వర పిరమిడ్ బాగానచ్చి పౌర్ణమి సందర్భంగా అఖండ ధ్యానం చేయడానికి వెళ్తుంటాం. మెగా సిటీ హైదరాబాదులో ఉన్న బిర్లా సంఘీ ఆలయాలు, గోల్కొండ, చౌమల్లా ప్యాలెస్, చార్మినార్ మొదలగు పర్యాటక స్థలాలు నచ్చి తరచుగా పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తుంటాం. విద్యార్థులతో కలిసి ఆనందంగా కట్టడాలన్నింటినీ చూస్తూ అనుభూతిని చెందుతాను. ఈ మార్చిలో మేము అమెరికా వెళ్లి అక్కడ ఉన్న బంధు మిత్రులతో కలిసి బిడ్డకు శ్రీమంతం, మనుమరాలుకు తొట్లె కట్టడం, ఎవరో ఒకరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు మరియు మాతృదినోత్సవం మొదలగునవి ఎన్నో కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడం వల్ల కలిగిన ఆనందానుభూతి అమోఘం. అక్కడ ఉద్యోగ బాధ్యతలు లేనందున అచ్చమైన గృహిణిలా పిల్లలకు నాలుగు పూటలు భారతీయ వంటలు వండి తినిపించిన తృప్తితో అక్కడున్నన్ని రోజులు క్షణాల్లా ఎంతో హాయిగా గడిచినవి. ‌ మన అమ్మ ఎలాంటి టెన్షన్ కు లోనుకాకుండా రిలీఫ్ గా ఉండడం మనము ఇప్పుడే చూస్తున్నామని పిల్లలు అనుకుంటుంటే నాకు ఎంతగానో సంతోషం కలిగేది. అసలు నేను ఇండియాను మరిచిపోయాను అనుకోండి . అక్కడున్న ఇరుగు పొరుగున ఉన్న విభిన్న దేశాల వారి సంస్కారం ఆత్మీయత అపారం. హాస్పటల్ , వాకింగ్ , మాల్స్ లలో చూడగానే తెలియని వారైనా సరే నవ్వుతూ పలకరిస్తారు. భారతీయ చీరకట్టు బొట్టును చూసి అభినందిస్తారు. అక్కడి వారితో అనుబంధం పెనవేసుకొని మాకు తిరిగి రావడానికి మనసు ఒప్పు కోలేదు కానీ తప్పదు కదా ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకోవడం.

– అమెరికా లాస్ ఏంజిల్స్ లోని దర్శనీయ స్థలాలు స్వామి నారాయణ, మాలిబ్ బాలాజీ ఆలయాలు , హాలీవుడ్, ఆస్కార్ అవార్డు ఇచ్చే థియేటర్, శాంటా బార్బరా హార్బర్ , పార్క్, చర్చీ మరియు పసిఫిక్ మహా సముద్రం బార్డర్, బీచ్ మొదలగు ఎన్నో స్థలాలను కుటుంబ సభ్యులతో దర్శించడం ఊహించ లేనంత ఆనందము కలిగినది. అనూహ్యంగా అక్కడ ఉన్న ప్రముఖ వర్ధమాన కవయిత్రులు డా. అంగంపల్లి జయంతి, చిలుకూరి రాజ్యలక్ష్మి గార్ల సాహితీ సద్గోష్టిలో పాల్గొనడం ఇంటర్వ్యూ తీసుకోవడం వారితో కలిసి శుభకార్యాలలో పాల్గొనడం వారికి నా రచనలను అందించడం చెప్ప లేనంత ఆనందానుభూతిని కలిగించినది.

నేటితరం రచయితలకు మీరిచ్చే సూచనలు సలహాలు?

ప్రతి రచయిత సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే తపనతో రాయాలి. గొప్ప గొప్ప రచయితలు రాసిన పుస్తకాలు చదివి వాళ్ళను అనుసరించాలి.
ఎలాంటి ఈర్ష్యా ద్వేషాలు బేధాభిప్రాయాలు లేకుండా సమాజ స్థితిలో మార్పును తీసుకొస్తూ సమానత్వం కోసం రచనలు చేయాలని సూచిస్తున్నాను.

 

ముఖాముఖీ గ్రహీత ఎస్. యశోదా

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విజయం దిక్కులో… Victory Path

నుడి క్రీడ-2