తూర్పు,పడమర,ఉత్తరం?దక్షిణం నాలుగు దిక్కులు! అవును నాలుగు దిక్కులు అంటాం కానీ మనిషి నడవడికి కావలసిన దిక్కులు మరికొన్ని ఉన్నాయి !విజయం పరాజయం,నీతి అవినీతి,న్యాయం అన్యాయం,మంచి చెడు, వంటివి.సన్మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటున్నారా దుర్మార్గం లో వెళ్లాలని అనుకుంటున్నారా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అయితే దిక్కులకు పేర్లు పెట్టింది మనిషి. మనిషి ప్రవర్తన లో చూడాల్సిన దారులు ఈ దిక్కులు. విజయం కూడా అటువంటి దిక్కే అటువంటి దారే!
మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి మనం అనుసరిస్తుంటాం . ‘విజయం‘దారి కాస్త కఠినమైన దారే! కాని, గమ్యం చేరాక ఆనంద పతాకాన్ని ఎగురవేసి అభినందనల వెల్లువలో ముంచెత్తుతుంది.
ఇది విజయదశమి శుభాకాంక్షలు అందించుకునే సమయం. ఈ మాసం మొత్తం పండుగలతో ఉత్సవాలతో గడిపే మాసం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో సందడి చేసి సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకొని ఆనందిస్తారు. పూల తో గోపురాకారంలో పేర్చిన బతుకమ్మలను గౌరమ్మ గా భావించి, నిమజ్జనం చేసి సాగనంపుతారు. “పోయిరా గౌరమ్మ ….”అంటూ పాటలు పాడుతూ పడతులంతా గౌరమ్మను “మళ్ళీ రా గౌరమ్మ ….”అంటూ వేడుకోవడం కూడా చూస్తాం. ఈ పాటలోని ఆంతర్యం ఏమిటి అని ఆలోచించాలి. ఆచారాలలో ఆనందాన్ని కోరుకోవడం బతుకు పై ఆశను వ్యక్తం చేయడం ఇది. మనకు ప్రధానంగా కనిపించే భావోద్దీపనం ఏదైతే ఉందో అది సార్వకాలీనం , సార్వ జనీనం గా ఉండాలి. ఈ శరన్నవరాత్రులలో ప్రత్యేక త ఇది. బతుకమ్మ మరుసటి రోజు దసరా పండుగ విజయదశమి ని వేడుక గా జరుపుకుంటారు ప్రజలు. ఈ పండుగ పేరులోనే విజయం ఉన్నది.
ఈ పండుగకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథ ప్రాచుర్యంలో ఉంది.ప్రకృతి లో జరిగే మార్పులకు తగినట్లుగా పండుగల పేర్లను పెట్టుకున్నాం. ప్రకృతి లో జరిగే మార్పులను ఋతువులు, కాలాలు అంటాం. మనుషులు ఎప్పుడైతే సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారో దాన్నిబట్టే పేర్లు కూడా పెట్టుకున్నారు. వసంత ఋతువు కు ప్రథమ స్థానం ఇచ్చారు.ఇంగ్లీష్ లో Spring Season అంటారు. ఋతువులకు స్థానం ఇవ్వడం విషయం లో మనదేశంలో పద్ధతి మిగతా దేశాల పద్ధతి ఒకలా ఉండవు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత,శిశిర ఋతువు అనే ఆరు ఋతువులు మనం ఏర్పరుచుకున్న ఋతువులు. రెండేసి నెలలు ఒక్క ఋతువు. వర్షాలు తగ్గి , అప్పుడప్పుడే చల్లదనం తో ఉండే శరదృతువు ఆరంభంలో ఈ శరన్నవరాత్రులను జరుపుకుంటాం. ఆశ్వయుజ కార్తీక మాసాలు ఈ శరత్ ఋతువు. వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉండి, పచ్చదనం తో పూలు పండ్లతో చెట్లు అందంగా ఉండడం మనం చూస్తాం. గ్రీష్మ ఋతువు ను ఇంగ్లీష్ లో Summer అనీ వర్ష ఋతువు ను Mansoon Season అనీ, శరదృతువు ను Autumn అనీ అంటారు. హేమంత ఋతువు ను Winter అనీ శిశిరాన్ని Fall అనీ అంటారు. శరదృతువులో వచ్చే విజయ దశమి ని దసరా పండుగ గా పిలుచుకుంటాం. దేవీ నవరాత్రులు విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు చేస్తారు. బతుకమ్మ పండుగ కూడా పైన చెప్పినట్లు ఘనంగా చేస్తారు. నవరాత్రి తర్వాత పదవరోజు దశిమి నాడు దసరా పండుగ అంటూ, విజయదశమి వేడుక ను జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తున్నది. ఈ దసరా ఎందుకు చేసుకుంటారనడానికి కొన్ని కథలున్నాయి.
పాండవులు అరణ్యవాసం ముగించిన ఆనందం తో విజయ దశమి ని నిర్వహించారనీ, మహిషాసుర మర్దనానికి గుర్తు గా అమ్మవారి విజయాన్ని పండుగగా జరుపుకుంటారు అనీ, రావణాసురుణ్ని శ్రీ రాముడు వధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగ జరుపుకుంటారు అనీ ప్రతీతి. ఇవన్నీ విజయానికి ప్రతీకలు. విజయ దశమి దసరా పండుగ ను అనాదిగా జరుపుకుంటున్నాం. ఈ రోజు అస్త్ర పూజ చేయడం, వాహన పూజలు చేయడం దుర్గా దేవి కి అర్చన చేయడం ఆచారం. పండుగ ల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది.సామాజిక తారతమ్యాలు మర్చిపోవడం,ఎంత పేదరికం లో ఉన్నా, ఎన్ని ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్నింటినీ దూరం పెట్టు ఇంటి వాళ్ళ కోసం , చుట్టుపక్కల కుటుంబాలలోని వాళ్ళ కోసం, చుట్టాలకోసమైనా కష్టాలను మరిచిపోయి కాస్తైనా సంతోషంగా ఉంటారు. ఉన్నంతలో కొత్త బట్టలు ధరించి ఆనందిస్తారు. పండుగ కు సంబంధించిన పిండివంటలో, మంచి ఆహారమో తింటారు కాబట్టి సంతృప్తి గా ఉంటారు. ఇవి చాలవూ పండుగలు జరుపుకోవడం వెనుకున్న ఆంతర్యం తెలుసుకోవడానికి.
విజయ దశమి సందర్భం కాబట్టి విజయాన్ని సాధించుకొనేలా ఆలోచన కూడా చేస్తుంటాం. ఈ విజయం నీతి మార్గాన, ఈ విజయం నిజాయితీ మార్గాన సాధిస్తే ఎటువంటి న్యూనతలూ ఉండవు . గర్వం అహాన్ని పక్కనపెట్టి విజయ ఫలితాలను ఆహ్వానించి ఆనందించాలంటే
“కష్టే ఫలి” అనే మాటను మననం చేసుకోవాలి. మధురమైన జ్ఞాపకాల్ని అనుభూతుల్నీ మిగుల్చుకుంటూ విజయం దిక్కుగా నడవాలి. విక్టరీ పాత్ కఠినంగా ఉన్నా గెలుపు సంతకం చేసిన హృదయ పత్రాన్ని పదికాలాలపాటు పదిలపరుచుకోవచ్చు. పదిమందికి దారిచూపవచ్చు. ఈ విజయం దిక్కు లో ఎదురయ్యే మైలు రాళ్ళు చదువు, ఉద్యోగం, ఉన్నత పదవులు, ఉత్తమ మానవులు ఇలా.. ఇలా ఎన్నో రకాలు!! మార్గాలు, ఆలోచనలు, ఆచరణలు ! మంచి మాట మంచి వేడుకలు నడతలూ ….
ఇక్కడే మనం విజయం ప్రాముఖ్యత ను పునః పునః పరిశీలన చేసుకోవడమే కాకుండా సాధన కోసం కృషి చేయాలి. మనమే విజయానికి మరో రూపమవ్వాలి!!