నువ్వు అట్లన్నావని…

కథ

శ్రీదేవి హడావిడిగా క్లాస్‌ రూమ్‌ లో నుండి స్టాఫ్‌ రూమ్‌ కు వచ్చింది. టీచర్లందరూ ఒక్కసారిగా తలుపువైపు చూశారు. అందరూ ఆమెతో బాగా చనువుగా ఉండేవారేగాని, పద్మశ్రీ టీచర్‌ తో తనకు స్నేహం ఎక్కువ. ఆమె దగ్గరగా వచ్చి,

”పద్మా నేను అర్జెంట్‌గా ఇంటికెళ్ళాలి. ఇప్పుడే ఫోన్‌ వచ్చింది. ప్రిన్సిపల్‌ రూమ్‌ నుండి కబురొస్తే వెళ్లి మాట్లాడి వచ్చాను. నాకు తర్వాత పిరియడ్‌ క్లాస్‌ ఉన్నది ప్లీజ్‌ కాస్త నువ్వు తీసుకోవా- మధ్యాహ్నం లీవ్‌ పెడతాను” అన్నది.

”ఏమైంది శ్రీదేవీ? అంత అర్జెంట్‌ ఏంటి? ఎనీథింగ్‌ రాంగ్‌?” అన్నది పద్మశ్రీ.

”అవును! మా అత్తగారికి సీరియస్‌ గా ఉన్నదట, ప్లీజ్‌ చూసుకోవా” కళ్ళల్లో నీళ్ళు సుళ్లు తిరుగుతున్నాయి.

”ఛ ఏడవకు ఏంకాదులే, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను” అన్నది పద్మశ్రీ.

తొందర తొందరగా తన కబోర్డ్‌ నుండి లంచ్‌ బ్యాగ్‌ తీసుకున్నది.

రెండు రోజుల క్రితమే యూనిట్‌ పరీక్షలయ్యాయి. ఆ పేపర్స్‌ బండిల్స్‌ తీసి కవర్లో పెట్టుకున్నది. హ్యాండ్‌ బ్యాగ్‌ తీసుకొని ”వస్తాను టీచర్స్‌, బాయ్‌ పద్మా” అని బయటికి వచ్చింది. స్కూల్‌ గేట్‌ ముందు వాచ్మెన్‌ శ్రీదేవిని చూసి ”ఏంటి మేడమ్‌? ఆటో కావాలా?” అన్నాడు..

”అవును, జాదవ్‌ ఆటో ఆపవా?” అన్నది శ్రీదేవి.

ఐదు నిమిషాల్లో ఆటో ఎక్కింది. మనసంతా చిందరవందరగా ఉన్నది.

భర్త ఆనంద్‌కు ఫోన్‌ చేసింది. ‘ఏమైందబ్బా? ఈయన ఫోన్‌ ఎత్తట్లేడు…’ అనుకుంటూనే పెద్ద ఆడబిడ్డ సరోజనకు ఫోన్‌ చేసింది.

ఆమె ఫోన్‌ ఎత్తుతూనే ఏడుస్తుంటే చాలా భయమేసింది. ఏంటబ్బా! ఎంత అన్యాయం అయిపోయింది. ఇంతమందిమి ఉండీ, ఇంత ఘోరం జరిగింది. ఛీఛీ ఈ పాపం ఎవరిది? అనుకుంటుంటే ధారగా కన్నీరు కారుతూనే ఉన్నది.

”ఏమైంది మేడమ్‌? అంత పరేషాన్‌ అయితాండ్రు? ఏంది”? అంటున్నాడు ఆటో అతను అద్దంలోంచి చూస్తూ! వినే స్థితిలో లేదామె.

ప్రతిరోజు స్కూల్‌ ఆవరణలోకి రాగానే టీచర్లంతా స్వంత ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసి పెట్టాలి. ఏ ఎమర్జన్సీ అయినా, ఇట్లా స్కూల్‌ ఆఫీస్‌ నెంబర్‌ కే రావాలి. వీళ్ళు అక్కడికెళ్ళే చేయాలి. అది నియమం. శ్రీదేవి వాళ్ళ ఇల్లు ఓ అరగంట ప్రయాణపు దూరంలో ఉంటుంది. రోడ్‌పై ట్రాఫిక్‌ జామ్‌. మళ్ళీ ఫోన్‌ తీసి భర్తకు చేసింది. చిన్నాడిబిడ్డ ఫోన్‌ ఎత్తింది. ”హలో ఒదినా! అంతా అయిపోయిందొదినా!” అని గొల్లుమన్నది. ”నేను ఒస్తున్నా లతా! ఇదిగో పది నిమిషాలు, సారీ, సారీ…” అని ఫోన్‌ పెట్టేస్తుంటే.

”ఏంది మేడమ్‌ ఎవరికన్న సీరియస్సా?” అన్నాడు మళ్ళీ ఆటో అబ్బాయి..

”అవును బాబూ మా అత్తగారు….” అంటూ దుఃఖంతో మొహం అటు తిప్పుకున్నది. ఆమె అంటే చాలా ఇష్టం, గౌరవం..శ్రీదేవి వాళ్ళ మామ చనిపోయి రెండేళ్ళయ్యింది. అత్తకు డెబ్భై ఏళ్ళపైనే ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు.

ఆనంద్ను ఎంతో గారాబంగా పెంచారు. అందరి పెళ్ళిళ్ళూ బాధ్యతలూ తీరాయి. పెద్ద కూతురు కొడుకు పెళ్లి గూడా అయ్యింది. బిడ్డ పెళ్లి ఇప్పుడు సెటిల్‌ అయ్యింది. చిన్న కూతురుకూ ఇద్దరు పిల్లలు. పెద్దాడబిడ్డ సరోజన ఇల్లు వీళ్ల ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అత్త సీతమ్మ ఓపికకు మరో పేరు, ఆమె భర్త రామయ్య కట్టించిన ఇల్లే అది. ఇంటి ముందు ఆటో ఆగగానే శ్రీదేవి ఒక్క ఉదుటున లోపలికి వెళ్లిపోయింది.

*     *     *

ఆఫీస్‌ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. ఏ.సీ.హాల్‌ కాబట్టి చల్లగా ఉన్నది. తెల్లని ఫ్లోరింగ్‌ పై గాజు పలకలతో అందరికీ క్యాబిన్స్‌ చేశారు. పూర్ణిమ చేతివేళ్ళు కీబోర్డ్‌ పై చకచకా పని చేస్తున్నవి. ఆఫీస్‌ బాయ్‌ అప్పుడే టీ తీసుకొచ్చి ఇచ్చాడు. వీలున్నప్పుడల్లా లాంజ్‌లోకి వెళ్ళి అందరితో కలిసి టీ తాగుతుంది. టీ తాగుతూ ఫోన్‌ తీసి చెక్‌ చేసుకున్నది. ”వాట్‌! నానమ్మ….! ఓ మైగాడ్‌!….!” అనుకుంటూ, ప్రక్కన కూర్చున్న కొలీగ్‌ భావిన్‌ ”భావిన్‌ మై గ్రాండ్‌ మదర్‌ ఎక్స్‌ పైర్‌ డ్‌, ఐ గాట్‌ మెసేజ్‌, ఐ హావ్‌ టు గో” అన్నది. గుడ్ల నిండా నీళ్ళు తిరుగుతుంటే!

”ఓ! ఐయామ్‌ సారీ! హొ?” అన్నాడతను.

”ఆక్సిడెంట్‌! షి మెట్‌ విత్‌ ఆన్‌ ఫైర్‌ ఆక్సిడెంట్‌ ఇట్‌ సీమ్స్‌” ఏడుస్తూ అంటున్న పూర్ణిమతో ”హో… నో..! సో పిటీ! యూవాంట్‌ టు గో హోమ్‌!” అన్నాడు. ”యా ఐ హావ్‌ టు….. ప్లీజ్‌ కన్వే మై మెసేజ్‌ టు మేనేజర్‌! ఓకే! అంటూ పేపర్స్‌ ఫైల్స్‌ సర్దేసి, సిస్టమ్‌ షట్‌ డౌన్‌ చేసేసి, అక్కడే ఉన్న శృతికి కూడా చెప్పి గబగబా బయలుదేరింది.

þþþþþþþþ

విషాద వదనంతో కూర్చున్న ఆనంద్‌ ప్రక్క కుర్చీలో కూర్చుంటూ సరోజన ”ఎన్నడన్న మాట విన్నదా ఏమన్ననా? ఇంత మంచి ఉద్యోగం నువ్వు చేస్తునే ఉంటివి. నాన్న చేసిన బిజినెస్‌ చూసుకుంటునే ఉన్నం. ఆస్తి పాస్తి లేనోళ్ళమా! ఈమె ఉద్యోగం చెయ్యకుంటే ఏమైతదని నేను నెత్తి నోరు పెట్టుకొని చెప్పిన నువ్వు అనకపోతివి. నీ పెండ్లాం జనకపాయె. ఇంట్ల ఉండి ఒండి వార్చి పెట్టుకుంట ఉంటే ఇట్ల మన అమ్మకు వంట చేయాల్సిన పని ఉండేదా? పొయ్యి దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండేదా? నాయిన పోయినంకనైన ఈమెను స్కూల్కు పోవద్దని గట్టిగ అనే దమ్ము నీకు లేకపాయె!” అంటూ అక్కడ ఎవరూ లేరనుకొని, తన తల్లి సీతమ్మ చావుకు శ్రీదేవే కారణం అన్నట్టు అంటున్నది.

అప్పటికి సీతమ్మ చనిపోయి నాలుగు రోజులైంది. ‘దినవారాల గురించి మాట్లాడుతది అనుకుంటుంటే అక్క ఇట్లా ‘అంటున్నదేందబ్బా’ అని ఆనంద్‌ మనసులో అనుకుంటున్నాడు. పక్కన బాల్కనీలో కూర్చొని ఆఫీస్‌ పనిచేసుకుంటున్న పూర్ణిమ ఒక్కసారిగా షాక్‌ తిన్నది. ఇదేంటి, పెద్ద అత్త ఇట్లా మాట్లాడుతున్నది అనుకుంటూ లోపలికి వచ్చి ”అదేంది పెద్దత్తా నాన్నమ్మ చావుకు మా అమ్మ జాబ్‌కు ముడిపెడ్తున్నావేంది? అసలు నాన్నమ్మ స్టౌ ముట్టిచ్చి పిండివంటలు చేస్తున్నది. ఎవరికోసం? నీ కోసంకాదా? పైగా ఆమె ఫోన్‌ ఓపెన్‌ పెట్టి నీతోనే కదా మాట్లాడుతూ మూకుట్లో పిండి వేసింది? హాఁ? ఏంది? ఎప్పుడు చూడు మా అమ్మ మీద ఏవో ఓ కామెంట్‌ చేస్తావు, కంప్లయింట్‌ ఇస్తావు. ఇంత దుఃఖంలో నీకు ఈ మాటలు ఎట్టొస్తున్నవో నాకైతే అర్ధం కావట్లేదు. ఏంటి డాడీ! నువ్వు కూడా అట్లా సైలెంట్‌ గా ఉన్నావు? హాఁ? దిస్‌ ఈజ్‌ టూ మచ్‌” అన్నది ఆవేశంగా! ”ఫోన్‌ పేలుతుందని, దాంతో స్టౌ బర్న్‌ అయ్యి సిలిండర్‌ పేలుతుందని నాన్నమ్మకు తెలిస్తే అట్లా చేసేదా? ఆమె పిండివంటలు చేస్తుందేమోనని అమ్మ ఎట్లా ఊహిస్తుంది? ఛీ! ఛీ! ప్లీజ్‌ ఇక ఇక్కడితో ఆపండి ఈ విషయం. విషయం. ఇది ఎక్కడన్నా ఎవరితోనన్నా నువ్వు అన్నావంటే, మా అమ్మకు తెలిసిందంటే మాత్రం మీరు నన్ను కాదు, మరో పూర్ణిమను చూస్తారు!” అని గబగబా అక్కడి నుండి వెళ్లిపోయింది పూర్ణిమ.

పదోరోజు పిండం పెట్టాలంటే చుట్టుపక్కాలను పిలిచి భోజనాలు పెట్టాలని, ఏమేమి కావాలో కొనుక్కోద్దామని శ్రీదేవి, తన చిన్నాడి బిడ్డ లతతో బజారుకుపోయింది. ఆ రోజు పగలు అన్నాలు తిన్నాక ఎక్కడివాళ్ళక్కడకిపోయారు. తన తమ్ముడు, తను ఇద్దరే ఇంట్లో ఉన్నామనుకున్న సరోజనకు ఇట్లా పూర్ణిమ జలక్‌ ఇస్తుందనుకోలేదు.

ఆనంద్‌ ఏనాడు శ్రీదేవిని ఉద్యోగం చెయ్యవద్దని చెప్పలేదు గాని, పెత్తనాలు చేసే నోళ్ళను ఏ మాత్రం అదుపు పెట్టలేకపోయాడు. ఇట్లాంటి సూటిపోటి మాటలు వింటూంటే, పట్టించుకోని శ్రీదేవి తన ఇద్దరు బిడ్డలను ఎట్లా చూసుకునేదో అత్తా మామలనూ అట్లాగే చూసుకునేది. చిన్ననాటినుండి చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటున్నదని ఆమె తండ్రి తన శక్తి మించి చదివించాడు. బుద్ధిమంతురాలని కోరి తెచ్చుకున్నందుకు సీతమ్మక్కుడా ఏనాడు కోడలు మీద కోపం లేదు. ఎటొచ్చీ ఆడబిడ్డకే అన్నీనూ! ఆమె ఇంట్లో ఉంటే తాము వచ్చినప్పుడల్లా బాగా చూసుకునేది గాని, అప్పుడూ ఏదో ఓ కంప్లెయింట్‌.

”అక్కా ప్లీజ్‌ గిట్లాంటి మాటలు మళ్ళెక్కడ మాట్లాడకు! పిల్ల విన్నది జాగ్రత్త” అని రుసరుసగా లోనికెళ్ళాడు ఆనంద్‌. అతని వెనుకానే సరోజన వెళ్తూ, ”ఏం లేదురా, ఏందో ఆరాటం! నాకు శ్రీదేవి మీద కోపమా ఏమన్నా? ఇప్పుడేం చెయ్యాల్నో ఏమో ఏం తోస్తులేదురా. నీకు తెల్సుగద మన శిరీషక్కకు పెళ్లి సంబంధం ఒచ్చింది. వాళ్ళు మాట ముచ్చటకు రమ్మంటున్నరు. ఏం జేయాల్నో తోస్తులేదురా ఆనందూ!” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే, తమ్మునికి అడ్డంగా నిలబడింది.

”అయ్యో అక్కా, ఏం జేసుడేందే? పోండి, పోయి మాట్లాడి ఖాయం జేసుకోని రాండి. మంచి సంబంధమే, పిల్లగాడు బావున్నడు.”

”మరి నువ్వు లేకుండా ఎట్లరా? నాకైతే కాళ్లు చేతులు ఆడుతలేవు”, దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమె అంటుంటే ”ఏం లేదు అక్క అమ్మ బోయిందని మీరు ఆగకండి. నేను రాకున్నా ఫరవాలేదు. బావ, నువ్వు, ఇంక ఎవరన్న బావకు దగ్గరోళ్లను తీసుకోనిపోయి లగ్గంకు మంచిరోజు పెట్టించుకోండి అట్లనే! దేంది దానికేనే!” అన్నాడు ఆనంద్‌.

*     *     *

ఒక ఇంట్లో జననం ఒక ఇంట్లో మరణం. ఎవరి బంధాలు వారివి. ఎవరి బ్రతుకులు వారివి. కాలమెక్కడా ఆగదు. జీవితచక్రమూ ఆగదు. దీన్నే ప్రకృతి ధర్మంగానూ, ప్రజా జీవన ధర్మంగానూ చెప్పుకుంటుంటాం. నావ నడి సంద్రంలో ఆగిపోదు. తీరంచేరేందుకు లంగరెత్తాల్సిందే. ఆకలి, నిద్రల మధ్య, మధ్యే మార్గంగా నడుస్తుంటాయి నిత్యం పరిస్థితులు! సరోజన, బుచ్చిరాజెం, సడ్డకుడు శ్రీనివాస్ను, తన కొడుకును తీసుకోని పెండ్లి పిల్లగాని ఇంటికి వెళ్ళారు. పలకరింపులు, మిఠాయిలు, మర్యాదలు అన్నీ బాగానే అయ్యాయి. పెండ్లి కొడుకు కాసేపు వీళ్ళతో మాట్లాడి పని ఉందంటూ వెళ్ళిపోయాడు. పిల్లవాడి తల్లిదండ్రులు కాకుండా మరో ఇద్దరు, వాళ్ళ దగ్గరి బంధువులున్నారు. కట్నాలు అడగొద్దు, చట్ట ప్రకారం నేరం అంటూనే, మాకే బోలెడంత ఉన్నది. మీది మాకెందుకు అంటూనే, మీ పిల్ల మీ ఇష్టం ఏమన్న పెట్టుకోండి, ఊరుకోండి అని చూచాయగా కట్నం ప్రస్తావనను తెచ్చారు. వీళ్ళూ అన్నింటికీ సిద్ధపడే వచ్చారు కాబట్టి అన్నీ సంతోషంగా ఒప్పుకున్నారు.

అంతా సరి అనుకునే సమయానికి పిల్లవాడి తల్లి, ఆమె పిన్ని ఇద్దరూ ఈ మాటల్లో దూరిపోయారు.

”ఏమో వదినె! మా సందీప్‌ ఉద్యోగంలో ఎప్పుడు చూడూ బిజీ బిజీగా ఉంటడు. అమ్మాయి చేయకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటది అనిపిస్తున్నది. తరగని ఆస్తి ఉన్నది. ఏంజేసుకుంటరు? హాయిగ సుఖపడక! కావాలంటే బిజినెస్‌ చూసుకుంటది!” అన్నది కాబోయే అత్తగారు.

సరోజన గుండెలో బాంబు పడ్డట్లయ్యింది. ‘అమ్మో నా బిడ్డ ఒప్పుకుంటదా? అనుకుని, ”చూద్దాం లేండి, పెండ్లైనంక వాళ్ళే చూసుకుంటరుగాని, మనమేం పరేషాన్‌ కావద్దు. ఒదినమ్మ అన్నది, ధైర్యం చేసి, కాసేపు కూర్చొని ఇంటికి తిరిగివెళ్ళారు సరోజనవాళ్ళు.

*     *     *

శిరీష పూర్ణిమకంటే పెద్దది. చదువులో ఎట్లా ఫస్టో, మాటల్లోనూ అట్టే బెస్ట్‌. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళింట్లోనూ, నానవైపు వారిలోనూ అందరూ శిరీషక్కలాగా చదువుకోవాలె, శిరీషక్కలాగా చెయ్యాలి అంటూ ఆమెనే పోల్చేవారు, తల్లి చెప్పిన మాటలు విని విస్మయంతో ”అమ్మా మరి అప్పుడు సందీప్‌ ఏమనలేదా?” అన్నది..

”సందీప్‌ లేడు బిడ్డా! అప్పుడే బయటికెళ్ళిపోయిండు” అన్నది సరోజన.

”నేను ఫోన్‌ చేసి మాట్లాడుతా అమ్మా, పెళ్ళయ్యాక నన్ను ఉద్యోగం మానమంటే ఒప్పుకునేదే లేదు. అరె! ఇదేంది? నేను ఎంత కష్టపడి ఈ జాబ్‌ సాధించాను ఏంది? అసలు నా మెంటాలిటీకి బిజినెస్‌ అస్సలే సరిపోదు. అటువంటిదాన్నే అయితే రామయ్య తాత బిజినెస్నే చూసుకునేదాన్ని. పాపం తాతయ్య ఎంత అడగాడో నో వేస్‌! ఈ మాచ్‌ వదులుకుంటాగాని, జాబ్‌ వదులుకోను. ఇదెక్కడి సోదోళ్ళేవాళ్ళు. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండమనే వాళ్లు!” శిరిష మాటకు లత అడ్డు పడుతుంది.

”సిరీ! నువ్వు జాబ్‌… మానడమేంటే? మనకు అక్కరలేదు. అన్నీ ముందే క్లియర్గా మాట్లాడుకోవాలి. పెళ్ళి తర్వాత చూద్దాంలెండి అని అమ్మ వాళ్ళతో అన్నదటగాని, అట్లా ఒద్దు ముందే ఒప్పందం చేసుకోవాలె. లేకుంటే ఆగో శ్రీదేవి అత్తకైనట్టు అవుతుంది” అన్నది సరోజన చెల్లె లత!

”శ్రీదేవత్తదేంది పిన్నీ? నా కర్ధం కాలేదు” అన్నది శిరీష,

‘ఆఁ ఏం లేదులే, ఇప్పుడు ఆమె ముచ్చటెందుకు? పోలికే లేదు” అని అడ్డుకున్నది సరోజన.

”పోలికెందుకు లేదు? అప్పుడు ఒదినెను ఎవ్వరు ఉద్యోగం చేయొద్దనలేదు. పెండ్లయినాంక ఎప్పుడు ఛాన్స్‌ వస్తే అప్పుడు మీ అమ్మ, అమ్మమ్మతో అంటూ ఉండేది. శ్రీదేవిని ఉద్యోగం మానెయ్యమను. మిమ్మల్ని చూసుకోవడానికి ఇంట్ల ఉండొచ్చు గదా, అని. అమ్మమ్మ ఎప్పుడు అనలేదు. ఎందుకే చేసుకోని ఉద్యోగం అనేది. పైగా ఓ రోజు వంట చేసి అన్నీ టేబుల్‌ మీద పెట్టి స్కూల్‌కు పోయేది” అన్నది లత.

”అమ్మ ఎందుకన్నది పిన్ని?” అన్నది శిరీష వెంటనే లత,

”అడుగు నువ్వే! ఎందుకంటే, ఊరికెనే పెత్తనం చేసుడు. పాపం మొన్న కూడా. అమ్మమ్మ చనిపోవడానికి కూడా శ్రీదేవి ఇంట్లో లేకపోవడం వల్లనే అని అన్నదట. పాపం పూర్ణిమ నాకు చెప్పి ఏడ్చింది. ఇంకా నయం ఒదినెకు తెలుపదు. అన్నయ్య కూడా చెప్పలేదు. పూర్ణిమ కూడా చెప్పలేదట. ఎక్కడా అనకు చిన్నత్తా, నీకు తెలియాలని చెప్తున్నా అన్నది. ఇది సందర్భమని చెప్తున్న” అని లత అంటుంటే,

”ఆఁ దిసీజ్‌ టూమచ్‌! అమ్మా నువ్వెందుకు అట్లా మాట్లాడుతావ్‌? అత్తను ఏదో ఒకటి అనాలనా? అసలు రీజెన్‌ లెస్‌! ఛీ….!” కోపంగా శిరీష అంటుంటే,

”అసలు అమ్మదే తప్పంతా. ఒదినెకు చెప్తే ఆమెనే చేసేదో, దుకాణంలోనో కొనితెప్పించి ఇచ్చేదో? నీ పెళ్లి సెటిల్‌మెంట్‌ మాటముచ్చటకు వాళ్ళే మీ ఇంటికి వస్తరనుకోని అక్కడి కారా చుడువా అప్పలూ అవ్వీ ఏమన్నా చెయ్యమన్నదట. నాతోని అమ్మ చెప్పంగనే నేనన్నాను కూడా ఒదినకు చెప్తే లీవ్‌ పెట్టుకోనైనా చేస్తది అమ్మా. నీకేం చేతనైతదే అని! ఆమె వినలేదు, మీ అమ్మ ఒద్దనలేదు. అటు ఇటు బోయి బదనాం చేసుడు. మండుతున్న స్టౌ దగ్గర, ఫోన్‌ ఛార్జ్‌ పెట్టి, ఓపెన్‌ పెట్టి అక్కతోనే మాట్లాడుతుంటే ఫోన్‌ పేలడంతో సిలిండర్‌ పేలి అట్లా ఆక్సిడెంట్‌ అయ్యింది. ఇదంతా పక్కకు పెట్టి చాలా అన్యాయంగా శ్రీదేవొదిన మీదికి మాట్లాడడం నిజంగా అక్క తప్పు. మరి అదెటుపోతది? ఆమె దగ్గరికే వచ్చింది. నీక్కాబోయే అత్తగారు వాళ్ళు నిన్ను ఉద్యోగం మానేయమంటున్నరు. మనం ఏది జేస్తే, ఏ తప్పుజేస్తే అది తిరిగి మనకే చుట్టుకుంటున్నది గదా అని లత అంటుంటేనో అమ్మా! నువ్వు పూర్ణిమకు సారీ చెప్పు, ఒక్కతే ఉన్నప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, అని అంటుంటే

”తప్పు నాదేనే లతా! అట్లనకపోనుంటి. అమ్మ మాట్లాడుతుంటే నేను కొంచెం కూడా ఊహించలేదే ఫోన్‌ పేలొచ్చు అని. మనమ్మ చావు నా వల్లనే అయ్యింది…” అని బోరుమని ఏడ్చింది సరోజన.

తెలిసి కొంత, తెలియక కొంత చేసే తప్పులతోనే ఎన్నో జీవితాలు అతలాకుతలమైతుంటవి. ‘అయ్యో అమ్మా! నువ్వు అట్లన్నావని… నీకు ఇట్లా అయ్యింది. మనం చేసే ప్రతి తప్పుకు ఇక్కడే శిక్ష పడుతుంది” అని మనసులో అనుకుంటూ నిట్టూర్చిన శిరీష,

”పోనీలేండి అయ్యిందేదో అయిపోయింది. తన మాట వెనుకకు తీసుకుంటున్నది గదా, అమ్మా! మనమైతే అన్నీ క్లియర్‌గా నా పెళ్ళి విషయంలో క్లిస్టల్‌ క్లియర్‌ గా ఉండాలి సరేనా!” అన్నది ఉన్నతంగా!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బతుకమ్మ నిజమైన Woman empowerment

కోడలు పిల్ల