కల్మషం లేని పసిపాప నవ్వు నుండి
పండు ముత్తయిదువ చెప్పే ముందు చూపు
జాగ్రత్తలను పడతులకు ఉపదేశం గా రాస్తాను
ప్రతి అందాన్ని ప్రతి అనాకారాన్నీ ప్రేమిస్తాను బహుశా
నేను కవయిత్రినైనందుకు కాబోలు…
మలినం లేని మనసుతో
మంచి మాటలెన్నో సమాజ
మార్పు కోసం రాస్తాను…
హృదయంలో జ్వలించే వేదనతో
కలతల కావ్యాలెన్నో రాస్తాను…
ప్రకృతిలోని అందాలకు పరవశించి
సున్నితమైన పదాలతో రాస్తాను…
అన్యాయాలను ఎండగట్టే
అక్షరాలను నిప్పుకణికల్లా మార్చి రాస్తాను…
పేదరికం పెనవేసుకున్న జీవితాల్లో
ధైర్యం నింపే చైతన్య వాక్యాలు రాస్తాను…
అమరమైన అమ్మ ప్రేమను
ఆనందంతో అందంగా అభివర్ణిస్తాను…
మావారి కన్నుల్లో కనిపించే
ప్రణయాన్ని అతికోమలంగా
సంతోషంతో లిఖిస్తూనే ఉంటాను…
నాకు తెలిసి హృదిలోని ఆవేదన
కాసింతైనా చల్లార్చే కవిత్వం…
కడుపు నింపదని తెలిసి
ఖర్చు లేకుండా వచ్చే
కన్నీటిని సిరాగా మార్చి
నా కలంలో నింపి అలుపులేక
కవితలు రాస్తూనే ఉంటాను…
ప్రశంసల శాలువాలు లేకపోయినా
విమర్శల దుప్పట్లు కప్పుకుంటూ
రాస్తూనే ఉంటాను
బహుశా ఇదంతా
నేను కవయిత్రినైనందుకు కాబోలు…