మానవ జీవన విధానంలో గుణాలే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అవి మంచివి కావచ్చు చెడివి కావచ్చు. వాటికి కొలమానాలు లేవు. కానీ ఈగుణాలను మన శాస్త్రాలు విభజన చేసి తమోగుణము, రజోగుణము, సత్వ గుణము అనిపేర్కొన్నాయి.సామాన్యమానవులందరూ ఈ మూడు గుణాలకు లోబడే జీవితం సాగిస్తూ ఉంటారు. ఇది నిత్యము ప్రతి వారి జీవితంలో సందర్భానుసారంగా ప్రస్ఫుటమయ్యేవే. సృష్టికి కూడా ఈ మూడు గుణాలే కారణభూతామని తత్వజ్ఞులు చెబుతారు. సాంద్రతలు మారవచ్చు గాని అందరిలోనూ కనిపించేవే. మంచి ప్రవర్తన కలిగితే సత్త గుణ సంపన్నులు అంటారు.గర్వము,అహంకారము, దంభము ఇవి రజోగుణ లక్షణాలు. ఇకపోతే బద్ధకము అలసత్వం, అతి తిండి,అతి నిద్ర తమోగుణ లక్షణాలు. ఈ గుణాలను సరిదిద్దుకునే అవకాశం మానవులకు మాత్రమే ఉంది జంతు జాలానికి లేదు. తమో రజోగుణాలు చాలా గట్టివి. వాటిని వదిలించుకోవడం చాలా కష్టంతో కూడిన ప్రయాస. కానీ ప్రయత్నిస్తే వదిలించుకోవచ్చు. సత్వగుణమే అన్నిటా మెచ్చేది.
ఇప్పుడు మనము జరుపుకునే దసరాపండుగ కూడా గుణత్రయానికసంబంధించినదే.అరిషడ్వర్గాలు,మనసు,బుద్ధి, అహంకారములు అనే ఈ తొమ్మిది చెడు గుణాలను జయించడమే దీనిలోని పరమార్ధం. ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుండి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులనీ 10వ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ. దీన్ని శరన్నవరాత్రి అని కూడా అంటారు. వర్షాకాలపు చిత్తడి తగ్గి ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది.
నైతికంగా చెప్పుకోవాలంటే పైన చెప్పిన మూడు త్రిగుణాలను జయించడమే ఈ పండుకు యొక్కఅంతరార్థం. ఇవే కాక మనం ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ద కర్మలుఅనే ఒకరకమైన సంపదలను మనం పుట్టుకతోనే తెచ్చుకుంటాం. ఈ సత్వ, రజ,తమోగుణాలు ఎలా నాశనం చేయబడతాయో ఒక పురాణ గాధ గా చెప్పబడింది. సామాన్యులకు కథారూపంలోనే చెబితే అర్థమవుతుంది. అందుకే పూర్వం హరికథలు బుర్రకథలు, వీధి నాటకాల రూపంలో ప్రజానీకానికి అందించేవారు.ఇది మాత్రము దేవి సప్తశతి అనే గ్రంథం లో తెలియబడింది. నవరాత్రులలో మొదటి మూడు రోజులు మహాకాళి రూపాన్ని ఆరాధిస్తాం. ఈమె పది ముఖములు పది పాదములు కలిగి తన పదిహస్తములందు పది ఆయుధములు ధరించి భీకరముగా నుండును.ఇది తామస గుణప్రదానమైనది.మూడులోకాలను తపింప చేసే మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులను సంహరించడం కోసం అమ్మ యోగనిద్రలో ఉన్న, శుద్ధ స త్వగుణ పరిపూర్ణుడైన, విష్ణుమూర్తిని ఎన్నుకొని మధుకైటువులను,తనయోగమాయచే,సంహరింపజేసింది. లోకాలకు రాక్షస బాధ లేకుండా ఆగామి కర్మల ఫలితాలను నశింప చేసింది. లోకాలు రక్షించే నిమిత్తం తామసీమూర్తితో ఆవిర్భవించింది.
రెండో గుణం రజోగుణం. ఇందులో స్వార్థ బుద్ధి, విషయ భోగములందు లాలస, డాంబికము మున్నగునవి ఉంటాయి. ఇవి కూడా కొంతవరకు ఆసురీ గుణాలే. రజోగుణ సంపన్నడు, త్రిలోకాలను జయించిన వాడు అయిన మహిషాసురుని సంహారం కోసం జగదంబ మహాలక్ష్మి రూపంలో 18 చేతులతో 18 ఆయుధాలు ధరించి ఆవిర్భవించవలసి వచ్చింది.ఇదే రాజస మహాలక్ష్మి మూర్తి. ఈమె భోగ మాయ. మహావీర, పరాక్రములతో కూడినది. కానీ జయించవలసినది రజోగుణాన్ని. అందువలన ఆమెకు దేవతలందరూ వారి వారి శక్తిని ఇవ్వవలసి వచ్చింది. దానికి తోడు మహిషుడు పశుతుల్యుడు ( దున్నపోతు). వెంట 16 మంది సేన నాయకులను మీదు మిక్కిలి సేనను తెచ్చుకున్నాడు. వీరందరినీ ముందు సంహరిస్తేనే గాని మహిషున్ని సంహరించడం కుదరలేదుఅమ్మకు. చివరికి పదునెనిమిది చేతులతో పదునె ఎనిమిది ఆయుధాలు ధరించి, ఉన్మత్తి అయ్యి ( మధువు తాగి ) మహిషాసురుని సంహరించింది. సంచిత కర్మల ఫలితాలను నశింపజేసింది.
చివరి మూడు రోజులు అమ్మను మహా సరస్వతీ రూపంలో కొలుస్తారు.ఈమె జ్ఞానమయి.. 8 చేతులు యందు ఎనిమిది ఆయుధాలు ధరించి యున్నది .దీనికి కూడా ఒక పురాణ గాధ కలదు. సత్వగుణ ప్రాధాన్యమైనది. ఇది సంపాదించాలంటే చాలా శ్రమ పడాలి. చాలా అవగుణాలను పోగొట్టుకోవాలి. ఒకసారి జగదాంబ హిమగిరిలో గల జాహ్నవిలో స్నానం చేయడానికి వచ్చింది. ఆమె అందము చూచిన శుంబుని మంత్రులు ఈవిషయంశుంభనిసుంబులకు తెలియజేశారు. వారు ఆమె అందానికి మోహితులై వివాహ మాడ తలచి రాయబారం పంపారు. కానీ ఆమె పూర్వం ఒక శపథం చేశానని, నన్ను యుద్ధంలో ఎవరు జయిస్తారు వారిని వివాహం చేసుకుంటాను, కావాలంటే నాతో యుద్ధం చేసి గెలవమనిమీప్రభువుకుచెప్పుఅనిఅంది. శుమ్భనిశుమ్బులు కోపముతో మంత్రులను,సేనాపతులను బహువిధములైన సేనలతో ఆమెతో తలపడానికి పంపారు. అమ్మవారు తన వాహనమైన సింహం సహాయంతో అందరినీ చిత్తు చేసింది. రక్తబీజన్కూడా కాళీసహాయంతో నేలమట్టం చేసింది . అమ్మకు సహాయంగా అష్ట మాతృకలు వచ్చారు. ( బ్రహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నరసింహి, ఇంద్రియ, చాముండా ). శంభుడు ఇంతమంది సహాయం తీసుకున్న నీవు ఏమి గొప్ప అని హేళన చేశాడు. అమ్మ వారందరినీ తన అంశలేనని తనలో కలుపుకొని ఒంటరిగా శుంభ నిశుమ్భ లను తన శూలముతో దనుమార్చింది. లోకోపకారము చేసి దేవతల పూజలు అందుకుంది. తమో,రజోగుణాలను నిర్మూలించి సత్వగుణం పొందడం కష్టంతో కూడుకున్న పని. అమ్మ కు ఈ రాక్షసుని చంపడానికి చాలా సమయమేపట్టింది. ప్రారబ్ద కర్మ ఫలితాలను నిరాకరించడమే శంభాసుర వద.
మానవులు కూడా మూడు గుణాలను జయించినప్పుడే శుద్ధ తత్వాన్ని పొందుతాం. కానీ కష్టసాధ్యమైనది. గట్టిగాప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. ముందు తామస గుణలను తెలుసుకొని వాటిని అరికట్టుకోవడం కోసం ఎల్లవేళలా ఎరుకలో ఉండాలి. తర్వాత రాజస గుణాల మీద దండెత్తాలి.ఈ రెండు జయంంపబడితే మిగిలేది సత్సగుణమే. దానికోసం ఏమి ప్రయాస పడక్కర్లేదు .కానీ పెద్దలు సత్వగుణం కూడా ఒక రకమైన అహంభావమే అంటారు. మోక్ష ప్రాప్తికి అడ్డంకు అంటారు. అక్కడ కూడా “నేను ” అనే అహం ఉంటుందట. అందుకే శుద్ధసత్వ ప్రాప్తే అంతిమ లక్ష్యం అంటారు. కానీ నేటి మానవులు కలియుగంలో ఉన్నారు కనుక కనీసం తమ తామస రాజగుణాలనైనా సరి చేసుకోగలిగితే కుటుంబం, సంఘం, దేశం, ప్రపంచం కూడా ఎలాంటి గుణ దోషాలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
ప్రతి అమ్మవారి గుడిలలో రోజుకి ఒక అవతారం చొప్పున వేస్తారు. కుంకుమ పూజలు, లలిత పారాయణులు, కుమారి పూజలు,బాల పూజలు విశేషంగా జరుగుతాయి. రామాయణ గ్రంథ ప్రకారము విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన రోజు అని తెలుస్తుంది. దీనిని పురస్కరించుకుని దేశం నలుమూలల రావణ దహన కార్యక్రమాన్ని వైభవంగ జరుపుతారు. భారతం ప్రకారం పాండవులు వనవాసానికి వెళుతూ జమ్మి చెట్టుపై ఉంచిన ఆయుధాలను తిరిగి తీసుకొనిన రోజుట ఈరోజు.ఆరోజు జమ్మి చెట్టు పూజ, జమ్మీ ఆకులను బంగారం అని పెద్దలకు ఇచ్చి ఆశీర్వచనం పొందటం రివాజు. తెలంగాణలో బతుకమ్మల పండుగ వైభవంగా జరుపుకుంటారు. బతకమ్మలను వివిధ రకాలైన పువ్వులతో అలంకరిస్తారు. ప్రకృతిలో ఈ శరత్ రుతువు పువ్వులు బాగా దొరికే సమయం. ఏదేమైనా భారతదేశంలో పండుగలు దైవత్వంతోనే ముడిపడి ఉంటాయి. ఈ సందర్భంగా అందరూ ఐకమత్యంతో ఒకరికి ఒకరు ఇచ్చుపుచ్చుకుంటూ సంతోషంగా గడుపుతారు. రోజు దిన చర్యలో ఉన్న సాధక బాధలు విడిచి పిన్నా,పెద్ద కొత్త బట్టలతో, పిండి వంటలతో బంధుమిత్రులతో కలిసి కులాసాగా జరుపుకుంటారు. ఈ రోజులలో ఆరోగ్యమే కాదు,ఆనందం కూడా మహాభాగ్యమైపోయింది. ఒంటికాయ సొంటి కొమ్ము వలె అయిపోయారు మనుషులు. అందరితో కలివిడిగా ఉండి మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటే ఇవన్నీ మనకు దక్కుతాయి. ఏమంటారు మీరు…..
* జయ భవ **
* జై దిగ్విజయీభవ *