మార్పు దిశగా

కథ

అరుణ ధూళిపాళ

ఆ రోజు వినాయక చవితి… ఎటు చూసినా ప్రతి ఇల్లు మామిడితోరణాలతో అలంకరించబడి పండుగ సంబరాల్లో కళకళలాడుతూ నవ్వుల పూలను పూయిస్తోంది. మోహన్ తెల్లవారు జామునే ఇంట్లోంచి బయటపడ్డాడు. గత నెల రోజులుగా వాళ్ళు ఉండే కాలనీలో వినాయక విగ్రహాన్ని పెట్టే ఏర్పాట్లలో తల మునకలుగా వున్నాడు. దానికి ప్రధాన సూత్రధారి మోహనే. విగ్రహాన్ని సెలెక్ట్ చేయడం దగ్గర్నించీ పూజకు పురోహితుని మాట్లాడడం, మంటపాన్ని వేయించడం, ఎలక్ట్రికల్ పనులు, రికార్డు, మైకులు, టెంట్లు, బ్యాండు…ఇవే కాక పూజకు కావలసిన పూలు, పండ్ల వరకు ప్రతీది దగ్గరుండి చూసుకుంటున్నాడు. అది ఎంతో తృప్తి తనకు.
అది తనకు కేవలం తృప్తి కోసం చేస్తున్నాడనుకోవడం కూడా పొరపాటే. ఎవరూ గ్రహించలేని స్వార్థం కూడా ఇందులో ఉంది. వార్డుమెంబరు రాజేశ్ అండ తనకు ఉండడం వల్ల అతడు కార్పొరేటర్ అయితే తనకు చాలా ప్రాముఖ్యత పెరుగుతుందని, తద్వారా రాజకీయాల్లో కాలు మోపి భవిష్యత్తులో తిరుగులేని నాయకుడు అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకోసం పక్క వీధిలో తమకు వ్యతిరేకులైన గ్రూప్ వారు ఏర్పాట్లు చేస్తున్న వినాయక ఉత్సవాలకు రెట్టింపు ఆర్భాటంగా చేయాలని సంకల్పించాడు. దానికి తన అయిదుగురు స్నేహితులు వత్తాసు పలకడం అతని నమ్మకాన్ని, బలాన్ని మరింత పెంచింది. అందుకే అవతలి వారు చేస్తున్న దానికి “అంతకు మించి” అన్నట్లు వుండేలాగా అక్కడి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ( ఆ గ్రూపు లోని ఒక వ్యక్తికి డబ్బు ఆశ చూపి ) వినాయకుడి విగ్రహం సెలక్షన్ నుండి ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తూ నలుగురి చూపు తన మీద పడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు.
అలా ఇంటి నుండి బయలుదేరి మంటపం దగ్గరికి వెళ్ళిన మోహన్ అక్కడ తడకలు బిగిస్తున్న పని వాళ్లకు ఇంకా కొన్ని సూచనలు చేసి, స్నేహితులతో కలిసి దుకాణానికి వెళ్ళి, విగ్రహాన్ని తీసుకు వచ్చాడు. పూజారి రాగానే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రత్యేక అతిథిగా ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన వార్డు మెంబరు హడావిడిగా రావడం పోవడం కూడా జరిగింది. వీధిలో చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ పూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొని, తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లడం చూసి తన ధ్యేయం తప్పకుండా నెరవేరుతుందన్న ఆత్మ విశ్వాసంతో ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు మోహన్.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతున్నాయి. ఆడవాళ్లు పోటీలు పడి రకరకాల నైవేద్యాలు తెస్తున్నారు. సాయంత్రం కాగానే పిల్లలు, యువతీయువకులు ఆటా పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అంతో ఇంతో హుండీలో డబ్బులు కూడా చేరుతున్నాయి. నిరుటి కంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారని ప్రశంసలూ అందుతున్నాయి. ఎనిమిది రోజులు గడిచాయి. కానీ మోహన్ ఆలోచనలన్నీ రాబోయే తన అదృష్టంపై సాగుతున్నాయి. ఈసారి తను స్నేహితులతో కలిసి వసూలు చేసిన చందాలు, ఖర్చులు లెక్క వేసుకుంటే రేపటి నిమజ్జనం తర్వాత కనీసం 25 వేలు అయినా మిగిలేలా ఉన్నాయి. అనుకున్న దానికంటే భక్తులు అధిక సంఖ్యలో రావడం, ధూప దీప నైవేద్యాలన్నీ వారు భక్తిగా సమర్పించుకోవడం ద్వారా ఆ ఖర్చంతా తగ్గింది. ఇంకా హుండీ ఉండనే ఉంది. సుమారుగా పదివేల వరకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల స్నేహితులతో 5 వేలు ఖర్చు పెట్టి ఎంత ఘనంగా మందు పార్టీ చేసుకున్నా 30 వేలు తన సొంతం అవుతాయి. ఈ విషయంలో మిత్రులు తనను ప్రశ్నించే అధికారం లేదు. వాళ్ళను దేంట్లో కూడా భాగస్వాములను చేయకుండా ముందే జాగ్రత్త పడ్డాడు మరి. తన మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కొంత కష్టపడ్డారు అంతే. రాజేశ్ తో తిరిగే సమయంలో అవసరాన్ని బట్టి కొంత ఖర్చు పెట్టవలసి వస్తే ఈ డబ్బు ఉపయోగపడుతుంది. తద్వారా తనపై అతని దృష్టి మరలిపోకుండా చేసుకుంటాడు. ఏది ఏమైనా తాను అనుకున్నది సాధించి తీరుతాడు. ఉద్యోగం చేయడం సుతరాము ఇష్టం లేదు తనకు. రోజు రోజుకూ ఉద్యోగం వెతుక్కోమంటున్న అమ్మా నాన్నల నస భరించలేక పోతున్నాడు. కొంతకాలం ఓపిక పడితే నా ఆలోచనే సరియైనదని వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా వరుసగా మోహన్ ఆలోచనలు ఆగని ప్రవాహంలా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు అన్నీ చూసుకొని కాస్త ఆలస్యంగా ఇంటికి బయలుదేరాడు మోహన్. తాను వెళ్లే దారిలో రోడ్డు మరమ్మత్తు కోసం తవ్వడం మూలాన పక్క సందులోకి బండి పోనిచ్చాడు మోహన్. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యానికి లోనయి, బండి ఆపకుండా వుండలేకపోయాడు. పక్కకు బండిని పార్క్ చేసి చేతులు కట్టుకొని అలాగే నిలబడి పోయాడు. ఒక చిన్న వేదిక పైన కూర్చుండబెట్టిన చిన్ని గణపతి ముందు కూర్చొని కొంతమంది పిల్లలు భక్తిగా
భజన చేస్తున్నారు. వారితో పాటు మరికొంతమంది పెద్దలు కూడా పారవశ్యంలో మునిగి గణనాథుని సేవలో నిమగ్నమయ్యారు. ఎంతటి తన్మయత్వం? ఈ ఎనిమిది రోజుల్లో ఏనాడైనా తను భజనలో పాల్గొన్నాడా? భక్తిగా
పూజించాడా? తన హంగూ, ఆర్భాటాలు, ఇతరుల దృష్టి పడడానికి పడుతున్న తపన, రాజకీయాల కోసం కంటున్న కలలు, దానికోసం వినాయక ఉత్సవాల పేరిట సమకూర్చుకుంటున్న డబ్బు ఇవన్నీ మదిలో మెదిలాయి. “అన్నా హారతి తీసుకోండి” అన్న మాట వినబడి అటుదిక్కు చూశాడు. ఒక పిల్లవాడు హారతి పళ్లెంతో తన ముందు నిలబడి ఉన్నాడు. హారతి కళ్ళకు అద్దుకున్నాడు. ఇంతలో “ఇదిగో ప్రసాదం అన్నా” అంటూ మరో పిల్లవాడు వేయించిన శనగలు చేతిలో పెట్టాడు. అప్రయత్నంగా భక్తిగా కళ్ళుమూసుకొని నోట్లో వేసుకున్నాడు. పెద్దవాళ్ళంతా వెళ్లిపోయారు. మోహన్ అక్కడే నిలబడి చూస్తున్నాడు. బహుశా 15 ఏళ్ళ లోపు వుంటారేమో అందరూ.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అన్నీ సర్దుకుంటూ నిమజ్జనానికి ఏం చేయాలో చర్చించుకుంటున్నారు. రేపటి ఏర్పాట్లలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూసుకోవాలని, గణేశుని భజనలతో కొలుస్తూ ఊరేగించాలని, అందరికీ ప్రసాదం అందేలా జాగ్రత్త వహించాలని వాళ్ళ చర్చల సారాంశం. దానికి ఎవరెవరు ఏం చేయాలో , ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో నిర్ణయించుకున్నారు. చివరగా స్వామికి దండం పెట్టి వేడుక జయప్రదంగా జరగడానికి అనుగ్రహాన్ని ఇవ్వమని కోరుకొని వెళ్లిపోయారు. అంతా గమనిస్తున్న మోహన్ శరీరంలో ఒక్కసారిగా నీరసం ఆవహించింది. మెదడు మొద్దుబారి పోయింది. మనసులో తెలియని వెలితి ప్రవేశించింది. ఎలాగోలా ఇల్లు చేరుకున్నాడు. నిద్ర పట్టడం లేదు. పదే పదే ఆ పిల్లల మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
తెల్లవారి ఉదయమే కలత నిద్రతో ఎర్రబడిన కళ్ళతో లేచాడు మోహన్ . బయటకు వెళ్ళడానికి అన్యమనస్కంగానే తయారవుతున్నాడు. ఇదంతా సోఫాలో కూర్చుని గమనిస్తున్న తండ్రి ‘నాయనా మోహన్!’ అని పిలిచాడు. ఇదే ఇంకో సందర్భంలో అయితే ఒంటి కాలు మీద లేచేవాడే. కానీ ఎందుకో తండ్రి వైపు అడుగులు వేసి చిన్న పిల్లాడిలా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. “ఏమయింది నాన్నా? ఈరోజు నీలో ఎందుకో హుషారు కనిపించడం లేదు. తీవ్రంగా దేని గురించో ఆలోచిస్తున్నట్లు నీ కళ్ళు చెప్పకనే చెప్తున్నాయి. ఆ మాత్రం అర్ధం చేసుకోగలను. అసలేం జరిగింది?” అంటూ లాలనగా అడిగాడు. అమాంతం తండ్రి ఒడిలో తల పెట్టుకొని నిన్నటి విషయం చెప్పి, అది తనను ఎంతగా మనస్తాపానికి గురి చేస్తున్నదో చెప్పాడు.
తండ్రి ఓదార్పుగా మోహన్ తలను ప్రేమగా నిమురుతూ “మోహన్! ఒక్కగానొక్క కొడుకువని గారాబంతో నిన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా పెంచాం. అతికష్టం మీద ఇంజనీరింగ్ పాస్ అయి ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే ఎన్ని సార్లు నీకు హితబోధ చేయడానికి ప్రయత్నించినా మా మాట పెడచెవిని పెట్టావు. మా పెంపకం లోపమని అనుకుని నేను, మీ అమ్మ బాధ పడని క్షణం లేదు. మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నీకు ఎలాంటి లోటు రాదు. మరి ఆ తర్వాత? ఒక్క విషయం చెప్పనా? మనం స్వచ్ఛమైన భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క క్షణం భగవంతుని తల్చుకున్నా చాలు..ఆ పరంధాముని అనుగ్రహాన్ని పొందవచ్చు. హంగులూ, ఆర్భాటాలు, రాజకీయపు పోకడలు, స్వార్థ చింతనలు, మోసపూరిత భావాలు ఇవన్నీ మనిషికి అప్పటికప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయేమో కానీ శాశ్వతంగా ప్రశాంతతను దూరం చేస్తాయి. ‘భక్తి’ అనే భావన మనసుకు సంబంధించినది. పదిమందిలో నిరూపించుకునేది కాదు. అందరిలో గొప్పలు ప్రదర్శించడానికీ కాదు. నిష్కల్మషమైన మనసు, నిస్వార్థ భావన, భగవంతుని పట్ల అనురక్తి..ఇవన్నీ ఆ పిల్లల్లో నువ్వు ప్రత్యక్షంగా చూశావు. ఇది ఒకరు నేర్పితే వచ్చేది కూడా కాదు. అది మనిషి అంతర్గత పొరల్లో నుండి ఉబికి వచ్చే భావన. నీవు ఎన్నో చోట్ల ఈ వేడుకలను ప్రతీ సంవత్సరం చూస్తూనే ఉన్నావు. ఇవేమీ నీకు కొత్త కాదు. కానీ నిన్న
వాళ్ళను చూసిన తర్వాత ఇంతగా చలించడానికి, ఆవేదనకు గురి కావడానికి కారణం ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. నీకే బోధ పడుతుంది” అన్నాడు. వంటింట్లోంచి వీళ్ళ మాటలను వింటున్న తల్లి సుశీలమ్మ
కంటి నిండా నీళ్లు.
ఎన్నడూ లేని విధంగా తండ్రి మాటలను శ్రద్ధగా వింటున్న మోహన్ నిట్టూర్చి చెప్పులు వేసుకొని నిశ్శబ్దంగా బయటకు నడిచాడు. మంటపం దగ్గరికి
వెళ్ళాడు. అప్పుడే పూజారి వచ్చి విగ్రహాన్ని ఉద్వాసన చేయించే పనిలో నిమగ్నమయ్యాడు. పూజ జరుగుతున్నంతసేపు కదలకుండా పరిపరి విధాల ఆలోచిస్తూ కూర్చున్న మోహన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకిస్తూ లేచి నిలుచున్నాడు. చేతులు జోడించి గణనాథుని వైపు చూశాడు. ఆ స్వామి తన నిర్ణయాన్ని సమర్థిస్తూ అనుగ్రహ పూర్వకంగా నవ్వుతున్నట్లు అనిపించింది. దిగులు అంతా మాయమైంది. నూతన ఉత్సాహంతో నిమజ్జనాన్ని ఎలాంటి లోటు జరుగకుండా పూర్తి చేశాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. పవిత్రమైన మనసుతో తృప్తిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయం సరిగ్గా తొమ్మిదిగంటలు. నీట్ గా తయారైన మోహన్ క్యాష్ బ్యాగుతో తన గది నుండి
బయటకు వచ్చాడు. తల్లి దండ్రుల పాదాలకు నమస్కరించి, నవరాత్రుల ఖర్చులు పోనూ మిగతా డబ్బును అనాథ శరణాలయానికి ఇవ్వడానికి వెళ్తున్నట్లు అలాగే ఉద్యోగం కొరకు ప్రయత్నాలు ప్రారంభించ బోతున్నట్లు చెప్పి హుషారుగా ముందుకు నడిచాడు. ఆనందం నిండిన కళ్ళతో కొడుకు వైపు మురిపెంగా చూస్తూ ఆశీర్వదించారు సుశీల దంపతులు.

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘ఘర్షణ‘కథల సంపుటి ఆవిష్కరణ సభా విశేషాలు

మనం మన సమాజం మారేదెప్పుడో ?