అందమైన కాన్వాసుపై
రంగుల కుంచెలతో
పనిగట్టుకొని కలల్లో కరుగుతూ
ఊహను నిర్మించి
ఒప్పుదల కోసమో
మెప్పుకోసమో గీసే
నిర్జీవ చిత్రమా అది?..
తెల్లని మనసు తెరపై
అనుభవాల రంగులతో
దిద్దుకున్న సజీవ చిత్తరువు…
కాచి వడబోసిన
జీవన ప్రతిబింబం..
స్వేచ్ఛను పొంది బందీ అవడం,
గెలుపుకోసం ఓడిపోవడం,
నవ్వడానికి ఏడుపును దాచుకోవడం,
గాయాలతో మండుతున్నా
చలివేంద్రమై ఓర్పు వహించడం
ఆక్రోశాన్నంతా లోతున దాచి
కంటి నీరై కురవడం…
అనేకానేక ప్రశ్నలకు
నిశ్శబ్ద సమాధానంగా నిలిచే
స్వచ్ఛమైన రూపం..
వీటన్నింటికీ భిన్నంగా
అవసరాన్ని బట్టి
నినదించే నిప్పు కణమై
సమాజ చైతన్యలో
ఆహుతి కాగలిగే
త్యాగాన్ని స్వీకరించే
లక్షణం కూడా ……తానే !!