ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వాటిలో మెటాన్యూమో వైరస్ ఇన్ఫెక్షన్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించిందంటే అతిశయోక్తి కాదు. దానికి కారణమేమిటో ఒక్కసారి అవలోకిద్దాం.
జ్ఞాపకాలను తవ్వి తీస్తే చైనాలోని ఊహాన్ సిటీలో, అది సాధారణ వ్యాధిగా పిలవబడే కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయని, 2019 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన చైనా డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆ సాధారణ వ్యాధి అనుకున్నది, కోవిడ్ 19 రూపంలో ప్రపంచమంతా ఎలా అల్లుకుపోయిందో, ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో మనందరికీ విదితమే.
ఇప్పుడు కూడా అదే విధంగా, సాధారణ వ్యాధి లక్షణాలు కలిగి ఉండే మెటాన్యూమో వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఉత్తర చైనాలో, ఒక్కసారిగా ఎక్కువయ్యాయనే విషయం తెలుసుకున్న ప్రపంచం ఉలిక్కిపడింది. మరొక్క మహమ్మారి రాబోతుందా అని భయంతో వణికిపోతూ, ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అన్ని దేశాలూ.
మెటాన్యూమో వైరస్ అంటే ఏమిటి? అది కలిగించే వ్యాధి లక్షణాలు ఏమిటి? ఏ రకంగా వ్యాపిస్తుంది? దాని నుండి వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటి? ఎవరిలో ఆ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయనే విషయాలను ఈ వ్యాసంలో చర్చించుకుందాం. ఈ వైరస్ గవద బిళ్ళలు, చిన్నమ్మ వారు అనే వ్యాధులు కలగజేసే వైరస్ ల జాతికి చెందినది. ఇన్ఫ్లుయెంజా వైరస్ కు దగ్గర చుట్టం. ఈ వైరస్ ను తొలిసారిగా 2001లో నెదర్లాండ్ లో కనుగొన్నారు. పక్షుల్లో 1970 లోనే కనిపెట్టారు.
ఈ వైరస్ శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. ఒకరి నుండి ఒకరికి వ్యాపించడానికి మూడు నుండి ఆరు రోజుల సమయం తీసుకుంటుంది. నోటి తుంపర్ల ద్వారా, ఆ తుంపర్లు పడిన వస్తువుల వాడకం ద్వారా, ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు చూస్తే, సాధారణ వైరల్ జ్వరాలకు ఉండే లక్షణాలే- జ్వరం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, నీరసం. సాధారణంగా కొద్ది రోజులలో వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి. కాని, చిన్నపిల్లల్లోనూ, వయసు మళ్ళిన వారిలో, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే వారిలో, దీర్ఘకాలిక గుండె జబ్బులు మరియు శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారిలో, ఈ వైరస్ న్యుమోనియాకు దారితీసి, ప్రాణాంతకమయ్యే అవకాశముంది.
ప్రస్తుతానికి ఈ వైరసును నిరోధించే యాంటీ వైరల్ మందులు గాని, వ్యాక్సిన్స్ కాని లేవు. సిమ్ప్టమేటిక్ లేదా సపోర్టివ్ ట్రీట్మెంట్- అంటే ఉన్న వ్యాధి లక్షణాలను తగ్గించడానికి మాత్రమే మందులిచ్చే పద్ధతి మాత్రమే ఉంది. వైరస్ కోసం ప్రత్యేకమైన మందులేవీ ప్రస్తుతానికి లేవు.
ఈ రోజుకి మనదేశంలో ఇప్పటివరకు మొత్తం, 15 కేసులు నమోదయ్యాయి. అందులో ముందుగా కర్ణాటకలో రెండు కేసులు, ఆ తర్వాత తమిళనాడు నుండి మూడు కేసులు, కోల్ కత్తాలో ఒక కేసు, పుదుచ్చేరిలో మూడు కేసులు, గుజరాత్ లో ఐదు కేసులు అస్సాంలో ఒక కేసు నమోదు అయ్యాయి. పేషెంట్లు చాలామంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అందుకని ఆందోళన చెందవలసిన పనిలేదు. కాని, సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది మరొక కోవిడ్ లా మారే అవకాశం ఉండవచ్చని వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన పడుతుంది. నివారణ కొరకు తగిన నియమాలను రూపొందించి, వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలను అప్రమత్తం చేస్తుంది. IDSP పర్యవేక్షణను మరింత అప్రమత్తం చేసింది. ప్రయాణీకులలో వ్యాధి లక్షణాలు ఉండే వారికోసం, నిఘాను పెంచే దిశగా విమానయాన శాఖలకు ఆదేశమిచ్చింది.
ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన వంతుగా మనమేమి చేద్దాం? మాస్కులు వాడడం, సాంఘిక దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్య పద్ధతులను పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను పెంచుకోవడం.
ప్రస్తుతానికైతే ఈ వైరస్ లో జన్యుమార్పిడి జరిగిన దాఖలాలైతే లేవు. కానీ జన్యుమార్పిడి ఎప్పుడైనా జరగవచ్చు ఏ రకంగానైనా జరగవచ్చు ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఏమరపాటుగా ఉంటే మాత్రం, మరో కోవిడ్ ను ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అందుకని ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జలుబు, దగ్గు ఉన్నవారు మాస్కులు పెట్టుకోవడం, వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండడం పాటిస్తే, వారి నుండి వ్యాధి ఇంకొకరికి వ్యాపించకుండా దోహదపడిన వాళ్ళు అవుతారు.
ఇంకెందుకాలస్యం? పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. మెటాన్యూమో వైరస్ ఇంకొక కోవిడ్ 19 కాకుండా, ప్రపంచాన్ని కాపాడుకుందాం.
*