
తెలంగాణలో ప్రత్యేకించి దీపావళి సందర్భంగా చేసుకునే నోములు పేర్లు వేరుగా ఉంటే అక్కడక్కడ ముఖ్యంగా కేదారేశ్వరి వ్రతం అని అంటారు . ఇంకా , సత్తి బోనాలు వ్రతాలు అని ప్రత్యేకించి పేర్లు ఉన్నాయి. దీపావళికి చేసుకునేటువంటి వ్రతాలు ఎక్కడైనా ఎప్పుడైనా దీపావళి రోజు అమావాస్య రోజు చేసుకోలేనట్టయితే , దాన్ని కార్తీక పౌర్ణమి లోపల చేసుకుంటూ ఉంటారు. “వ్రత్యతే ఇతి వ్రతం ” అంటారు . నోము అంటే నిత్యత్వలక్షణం ఉండేటువంటిది. నిత్య పూజ వేరు, వ్రతం వేరు. నోము అంటే విశేషమైనటువంటి పూజ చేయడం . ఎందుకంటే “నోచుట ” అంటే రక్షించడం . నోటిని ప్రత్యేకంగా వేడుకునేవి కాబట్టి విశిష్టత ఉంది.
ఈ నోములు చాలా రకాలు ఉంటాయి .చిన్న నోములని పెద్ద నోములని. ఈ నోములల్లో ముఖ్యంగా అంటే …. కాయక, వాచక ,మానసిక మైనవి. ఈ త్రివిధమైనటువంటి తత్వాన్ని ఏకీకృతం చేసి చేసుకోవడమన్నమాట.
ఈ విశిష్ట పూజలు చేసేటప్పుడు ప్రాంతాన్ని బట్టి అంటే కేవలం తెలంగాణ అయినప్పటికీ ఆ తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇలా ఉన్నప్పుడు చిన్న చిన్న మార్పులు ఉంటాయి . అంతేకానీ ఎక్కడ చేసినా దాదాపు 80% తెలంగాణలో కేదారేశ్వరి నోము నోచుకోవడం దీపావళి పండుగ నోములు అనేటువంటిది సర్వసాధారణంగా కనబడేటటువంటిది . నేటి కాలంలో కొంత తక్కువ ఉన్నప్పటికీ ఒక నోము నోయాలంటే కొంత అంగ బలం కావాలి అర్థబలం కావాలి. ఓపిక కావాలి ఓర్పు కావాలి . సంప్రదాయం అంటే ప్రతి ఇంటి కీ ఒక్కో సంప్రదాయం ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ఉంటుంది అలా ఉన్నటువంటి ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ వెళ్ళాలి.
సహజంగా నోము అనగానే …దాదాపు ఉదయం నుండి ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలుంటాయి. ముఖ్యంగా దీపావళి నోముల అనగానే ఆ ఇల్లు బంతిపూలతో కళకళలాడుతూ ఉంటుంది ! ఎలా ? అంటే … పండుగ ముందు ఇల్లంతా శుభ్రం కడుక్కుని చక్కగా సర్దుకొని సిద్ధమవ్వాలి . చాలా మంది ఇళ్లకు సున్నాలు వేసుకుంటారు. పూర్వం మట్టి గోడలు కదా ! చక్కగా సున్నం వేసి జాజు పెట్టెలో అలంకరణ చేసి, ఇల్లంతా క్రింద ఫ్లోర్ పైన ఎర్ర మట్టి తోనో, ఆవు పేడ తోనో అలికి ముగ్గులు పెట్టేవారు.
గుమ్మాలకి బంతి పూల దండలు వేళాడేసి, చేరేడుకు మామిడి తోరణాలు కట్టాలి. తర్వాత దేవుడి గదికి లేదా దేవుడి ని మనం పెట్టుకున్నటువంటి గూడునో, లేకపోతే మనం ఇంకా ఏదైనా చిన్న సెల్ఫ్ లాంటిది పెట్టుకుంటాం కదా ఏదైనా సరే చక్కగా చాలా పూలు మాలలు గుచ్చి కొడ్తూ ఉంటారు , కళకళలాడుతూ ఉండేలా! ఎందుకంటే దేవుడే ముఖ్యం కదా! దేవుణ్ణి అందంగా అలంకరించాలి . ఆరోజు మనం కేదారేశ్వరి వ్రతం చేయడానికి వ్రతం పీఠం ఉంటుంది కదా దాన్ని ఉపయోగించాలి. కొన్ని చోట్ల సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొన్నిచోట్ల ఒక పందిరిలాగా ఉంటుంది. చెప్పాలంటే వినాయక చవితికి మనం దేవుని ప్రతిమను పీట మీద పెట్టుకునేటువంటిది ఎలా ఉంటుంది అలా ఒక పందిరి లాగా వేసుకోవడం ..లేదంటే , పీఠాన్ని వేసి, కిందకి నాలుగు కాళ్ళు పెట్టి పైన పందిరిలాగా వేయడం ఇలాంటివి అయితే ఉంటుంది . ఈ పందిరి అయినా ఏదైనా అదే విధం. ఇక నియమం ఎలా ఉంటుందంటే …21 దండలు అనేటువంటి పద్ధతి ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటిది నోము దారాలు అని ఉంటాయి. ఈ నోము దారాల కథ వింటే మాత్రం మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఇంటి నుండి ఎన్ని సంవత్సరాలనుండి నోములు నోముల దారాల ద్వారా ఉంటే అప్పటినుండి ఈ ఇంట్లో ఈ కేదారేశ్వర వ్రతం జరుగుతుంది అని అర్థం . నోము దారాల్లో కొన్ని పెట్టెలో పెట్టి వాటిని మళ్ళీ జాగ్రత్త పరుస్తారు. ఎక్కడైనా ముఖ్యంగా పాత రోజుల్లో ఒక కుండలో పెట్టి అలాగే ఉంచేవాళ్ళు ఇప్పుడు రాను రాను వాటిని భద్రపరిచేటువంటి విధానం కొద్దిగా మారినప్పటికీ నోము దారాలు ఉంటాయి వాటినే పూజించాలి. నిజానికి నోము దారం లేకపోతే మనం ఈ వ్రతం చేసుకోవడానికి అనర్హులు అంటే … కొత్తగా ఎవరైనా వ్రతం చేసుకోవాలంటే … ఈ కేదారేశ్వర వ్రతంలో తప్పకుండా నోము దారాలు ఉండాలి. ఎలా ఉండాలి అంటే మనకి ఇంటి ఆచరణ ఉండొచ్చు … అత్తగారు కోడలికి ఇవ్వడం ఇలా వస్తుంది. కానీ మా ఇంట్లో లేదు ఇప్పుడు చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే…ఎక్కడైనా ఎవరైనా ఇప్పటివరకు 21సార్లు కేదారేశ్వర వ్రతం చేసినటువంటి వాళ్ళ దగ్గర నుండి దారాలు వస్తూ ఉంటాయి. అంటే ఎవరైనా నోము దారాలు పడేసుకున్న మళ్లీ మంత్ర పూర్వకంగా చేసుకోవాలి పడేసినప్పుడు ఎవరికైనా నోము దారాలు దొరికితే సంతోషంగా మళ్ళీ వ్రతం చేసుకోవచ్చట. ఇది పెద్దలు చెప్పే మాట. ఇక ఇక్కడ ప్రతిదీ కూడా 21 తో ముడిపడి ఉండడం అనేటువంటిది విశేషం .
21 బంతి పువ్వులో ఆ నోము చేసుకునేటువంటి పీఠానికి పెట్టేది 21 దండలు ఉండాలి . అట్లాగే ఒక బూడిద గుమ్మడికాయ అని పెట్టుకుంటారు …అది కొట్టి అక్కడ నోము దగ్గర కాసేపు ముందు ఉంచి, ఆ తర్వాత దాన్ని కూరగా వండుతారు .ఈ బూడిద గుమ్మడికాయ కూర వండడం కొన్ని ప్రాంతాల్లో ఉంటే, కొన్ని ప్రాంతాల్లో కలగూరని వండుతారు. అంటే అన్ని రకాల కాయగూరలు వేసి వండుతారు . ఏది ఏమైనా మొత్తానికి ఈ కూరలతో వండడం అనేటువంటిది ఉంటుంది . నోములో ఇంకా నువ్వు పోలేలు అని అంటారు ఇవీ ముఖ్యంగా చెప్తారు. పోలేలు అంటే గోధుమపిండితో చేస్తారు , బెల్లం అప్పాలు అంటారు .అంటే ఇవన్నీ కూడా మనం పూజలో పెట్టేటువంటివి అన్నమాట .ఇక్కడ 21 మర్రాకులు,21 మర్రి ఊడలు కూడా ముఖ్యంగా వాడుతూ ఉంటారు .అంటే ఈ ఆకులతో విస్తరులు కుట్టడం ,అట్లాగే వీటిని ఆ విస్తరిలో మనం అమ్మవారికి అయ్యే వారికి ప్రసాదాన్ని పెట్టడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇది ఇలాగే ఉంటుందా ఈ వ్రతము అంటే కొన్నిచోట్ల అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ పందిరి కింద కూరాడు కుండలు పెట్టి మధ్యలో బియ్యం పోసి , కేదారేశ్వరుడు అంటే ఆ శివుడు పార్వతి కుటుంబం మొత్తం కుటుంబాన్ని ఫోటో గానీ ఇలాంటివి పెడుతూ ఉంటారు. కొంతమందికే ఈ వ్రతం ఉన్నటువంటి వారికి ఇలవేల్పు కాదు అన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫోటోని దేవుడి గదిలో పెడతారు. ఒక సంచి లాంటిదాంట్లో పెట్టు పైకి లాగి కట్టి పెడతారు , పైకి ఉంటుంది. ఇది వ్రతం నాడు తీస్తారు. వ్రతానికి ముందు స్నానం చేసిన తర్వాత ఇప్పుతారు. కిందకి దించి అప్పుడు పెడతారు చక్కగా ! దీనికి ప్రత్యేకత ఏంటంటే కొంతమంది ఇంటి హాల్లో మధ్యలో పెడితే మరికొంతమంది దేవుడికి ప్రత్యేకంగా గది ఉంటుంది కాబట్టి ఆ గదిలో పూజ చేయడం అనేటువంటిది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఆవు పేడ వాడుతారు. ఆవు పేడతో అలికి తర్వాత ముగ్గులు పెట్టి మొదలు పెట్టడమనేది ఇంటి ఆచారం ప్రకారంగా చేస్తారు. కొన్ని చోట్ల అయితే కోరారు కాబట్టి కూడా ప్రత్యేకించి పూజిస్తారు. తర్వాత ప్రత్యేకించి ఈ నోము దారాలు పెట్టేటువంటి కుండలు వేరే ఉంటాయి . వాటిని కూడా చక్కగా అలంకరించడం ఆచారం. తర్వాత బెల్లంతో వండిన అన్నము పెడతారు. ఇవన్నీ కూడా బోనం లాగా అన్నమాట. చక్కగా అలంకరించడం ఉంటుంది. సరే కొంతవరకు నది కి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతమైనప్పటికీ ఏదైనా ప్రాంతమైనా…గోదావరికి దగ్గరగా ఉన్నటువంటి చోట్ల ముఖ్యంగా నదికి వెళ్లి స్నానం చేసి వస్తారు. గోదావరి నుండి కొంత ఇసుక తీసుకువచ్చి ఇసుకను పోసి పొయ్యి సిద్ధం చేస్తారు. ఒక మూడు చోట్ల బియ్యం పోసి బియ్యం మీద కుండలు పెట్టి, వాటిల్లో అక్షతలు, ఒక్కలు వీటిని వేసిన తర్వాత మళ్ళీ పైన మర్రి ఆకులు పేర్చి( ముఖ్యంగా మర్రి ఆకులు మాత్రమే వాడుతుంటారు ) మరి ఆకుల మీద మధ్యలో ఉన్నటువంటి పెద్ద కుండలో 21 రకాలైనటువంటి మర్యాద లు, 21 పోలెలు ఇటూ అటూ ఉన్న చిన్న గుండిలలో మళ్లీ మర్యాదలు వేసి ఐదు పూలను పెడుతూ ఉంటారు . పెట్టిన తర్వాత వీటి పైన ఎక్కడైతే అన్నం వండి వాటిని అలంకరించుకొని పెట్టుకుంటారో వాటి మీద కూడా దీపాలు వెలిగిస్తుంటారు. ఇంకా మధ్యలో ఇసుక పోసి చిన్నగా అంటే నది ఇసుక తీసుకొచ్చి పెడ్తారు కదా అక్కడ కొత్త చాటను తీసుకొచ్చి, ఆ చాటకి చక్కగా పసుపు రాసి, కుంకుమ తో అలంకరించి అందులో ముఖ్యంగా ఒక కొత్త వస్త్రం వేసి, బియ్యం పోసి దాంట్లో ఇప్పటి వరకు మనము నోచుకున్నటువంటి నోము దారాలు పెడతారు. ఆ దారాలను కొద్దిగా పాలతో తడిపి చుట్ట లాగా చుట్టి పెడతారు. దానిపైన ఈ కేదారేశ్వర యొక్క ప్రతిమను అంటే అమ్మవారు అయ్యవారు సంతానంతో కుటుంబంతో ఉన్నటువంటి ఫోటో ను పెడతారు. ఇంకా , ఇటుపక్క అటుపక్క కొన్ని దారాలు పెడితే వాటిమీద గౌరీదేవిని పసుపుతో చేసి గాని లేకపోతే పోక గౌరమ్మ అంటారు అవి పెడతారు. అట్లాగే వినాయకుణ్ణి కూడా పసుపుతోగానీ, పోకతో కానీ ఇంటి ఆచారాన్ని బట్టి చేస్తుంటారు. మొత్తంగా ఇవన్నీ అలంకరించుకున్న తర్వాత, పూలతోనూ అలంకరించిన తర్వాత దీపం పెట్టి, దీపాలు వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడు అసలు కేదారేశ్వర నోము ప్రారంభం చేస్తారు. ఇంకా కొంతమంది చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం ఉంటే కొత్త నోములు పట్టుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యత ఉంటుంది. కానీ కేదారేశ్వర వ్రతానికి కఠినమైన నియమాలు అయితే ఉంటాయి . ఇంకా కొన్ని చోట్ల ఉమ్మెత్త పువ్వులు మోదుగాకులు పెట్టే ఆనవాయితీ ఉంటే అలాగే చేస్తారు. ఇక మనం ఏదైతే నోము దారాలంటామో వాటిని తోరాలు అంటారు. వీటిని 21 ముళ్ళు వేసి కానీ లేదంటే మర్రి ఊడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఐదు వాటిని తోరానికి కట్టి, చేతికి కట్టుకుంటారు. ఇక ఎప్పుడూ కూడా కొత్త వాటిని పాత వాటితో కలిపి చేస్తారు. అయితే ఇక్కడ కథ చదివేటప్పుడు పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి ఇద్దరు గురించి చెప్పేటువంటి కథ ఉంటుంది .
ఇది ఎక్కువగా ప్రదోషకాలములో చేసుకునేటువంటి పూజలు చాలా చోట్ల కూడా అంతే చేస్తారు. ఉదయం నుండి ఉపవాసంతో ఉండి సాయంకాలం కనీసం నోట్లో నీళ్లు కూడా పోయకుండా స్ట్రిక్ట్ గా కఠిన నియమాలతో ఉండేటటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. అందుకే వయసు పైపడిన తర్వాత నోమును తీసుకోవడం అనేది ఉండదు. మళ్ళి ఇప్పుడు గత పది పదిహేను సంవత్సరాల నుండి చాలా ఎక్కువమంది మళ్ళీ ఇది చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఇంకొకరకంగా రథం పీఠపెట్టేటప్పుడు కింద ముగ్గు వేసి తర్వాత లోపల నాలువైపులా నాలుగు ఫలాలు అవి కట్టి మధ్యలో సాన పీట అంటారు కదా దాన్ని పెట్టు, దాని మీద తమలపాకులో, మోదుగాకులో పెడతారు. వాటి మీద 21 రకాలైనటువంటి ఆకులు పోకలు ఇవన్నీ పెడతారు వీటిని పెట్టి పూలతో అలంకరించి పైన కొబ్బరి కుడుకలలో మళ్ళీ ఆకులు పెట్టి గౌరమ్మని చేసి పత్తితో వస్త్రం చేయడం గౌరమ్మను తయారు చేసి ఇంటి ఆచారం ప్రకారంగా పెడుతూ ఉంటారు. మొత్తంగా ఇక్కడ వ్రతము అనగానే కనిపించేది వ్రతపు దారాలు తర్వాత ఇరవై ఒక్క రకాలు నైవేద్యాలు సమర్పించాలి. ఏదైనా సరే మరి ఆకులు మోదుగాకులు ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. బంతిపూలు వీటితోనే ఉంటుంది అయితే ఇక్కడ చేసినటువంటి మహా నైవేద్యం ఆరోజు వండినటువంటి ది ఇంటివాళ్ళే తినాలి. చాలామంది భార్యాభర్తలు కలిసి కేదారేశ్వరి వ్రతం చేస్తుంటారు. మొత్తంగా ఇది చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే కొన్ని వందల సంవత్సరాల నుండి అదే ఆ ఇంటి ఆచారంగా వస్తుంది. సరే ఏది ఏమైనా ఇక్కడికి భోజనానికి కొంతమంది అయితే కుటుంబాలతో సహా భోజనానికి పిలుచుకోవడం ఉంటుంది ఇక్కడ వండినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదం ఏది కూడా బయటికి వెళ్ళకూడదు అనే నియమం కూడా ఉంటుంది. ఈ కేదారేశ్వరి వ్రతంలో మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే ఒకప్పుడు ఆ బోళా శంకరుడు అమ్మవారికి అర్థ శరీరం ఇచ్చినటువంటి రోజు అని … ! అంటే, అమ్మ కోరింది కాబట్టి అంటే తాను తనకు గౌరవం లేదని ఒక కథలో ఉంటుంది అందులో అమ్మ తన అర్థ శరీరాన్ని అడిగింది. తనకు స్వామి అలా ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఈ వ్రతం చేస్తే మనకి ఆ ఫలితం …అంటే అమ్మకు అర్థ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు, మనకు ఏది లేకపోతే అది ఇవ్వగలిగినటువంటి భగవంతుడు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకుని చక్కగా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంతటి కఠినమైన నియమాలున్నప్పటికీ దీన్ని సంతోషంగా ఈ నోమును పట్టుకుంటారు. ఈ నోమును అందరూ శ్రద్ధగా చేస్తుంటారు . ఇంకా కొంతమంది ఇందులో ఏ నోములో నమ్ముకుంటే ఆ నోమునే చేస్తారు. ఇంటి గురువులనే వాళ్ళు ఉంటారు. వారిని గౌరవించాలి. ప్రసాదాలు పంచే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇది తెలంగాణలో కూడా ఒక్కొక్క ఇంటి ఆచారం ప్రకారంగా కొంత కొంత తేడాలుంటాయి.
మొత్తంగా ఏంటంటే ఒక మండపం గాని ఒక గదిలో గాని పూజా పీఠం వేసుకోవడం కేదారేశ్వరి యొక్క ఆ కుటుంబాన్ని కుటుంబంతో సహా ఉన్నటువంటి ఆ ప్రతి ని పెట్టుకోవడం , మర్రి ఆకులు మరియు ఊడలు ఉండడం, వీటితో పాటు తోరాలు… దారాలు ఉండడం, నోము దారాలు అంటాం. ఇవన్నీ ముఖ్యం. ఈ నోము దారాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వీటి వల్లనే ఇంకొకరు కొత్తగా పట్టుకోవాలంటే నోము దారం అత్తింటి నుండి రావాలి అత్తగారు కోడలికి ఇవ్వాలి అలా ఆచారం ఉంది.
అలా మొత్తంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం సంధ్యలు చేసుకున్నాక ఇంటినంతా అలంకరించుకొని పూజ గదిని అలంకరించాక, దేవతలను అలంకరించుకొని వీటితోపాటు కావలసినటువంటి నైవేద్యాన్ని కావలసినటువంటి పోలెలు కానీ పరవాన్నంగానీ, కలగూర కానీ అన్నం కానీ ముద్దపప్పు ఇవన్నీ తయారు చేసుకుంటారు. ఇన్ని తయారు చేసుకున్నాక , స్వామి దగ్గర పూజలో కూర్చుంటే అన్ని ఒక్కొక్కటిగా నియమనిష్టలతో పూజ చేసి తరువాత నివేదన చేసిన తర్వాత కథను పూర్తిగా … మనస్ఫూర్తిగా విని పూజ అక్షతలు చల్లుకొని పిల్లల్ని దీవించుకొని ఆ తోరణాలు అన్నిటిని కూడా మళ్లీ భద్రపరుచుకునే వరకు ఈ నోము విశేషంగా ఉంటుంది. ఇది తెలంగాణలో మాత్రమే చేసుకుంటూ ఉంటారు. కేదారేశ్వర ఇంకా మిగతా చోట్ల మిగతా పేర్లు కానీ ఇక్కడ మాత్రం మారుతున్నటువంటి రోజుల ప్రకారంగా కాస్త అంగబలం తక్కువ ఉన్నవాళ్లు ఎవరికి వాళ్ళం ఒంటిగా ఉంటున్నటువంటి ఈ స్థితిలో కొద్దిగా ఎవరింట్లో వారు చేసుకోవడం కొద్ది గా తగ్గినప్పటికీ … కొంతమందిని పిలుచుకోవడం దగ్గర వాళ్ళని పిలుచుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఎవరిని ఎక్కువ పిలవకున్నా, ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు . నేటి కాలంలో ఏది ఏమైనా ఈ కథను చేసుకోవడం వ్రతాన్ని చేసుకోవడం కథను వినడం పూర్తిగా ఆచరించడం చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఈ నోము తెలంగాణ నోము విశిష్టత . కేదారి నోము విశిష్టత ఇది!అందరం నోములు చేసుకుందాం. ఆనందంగా ఆ బోలాశంకర్ ప్రసాదించే విశేష ఫలితాలను పొందుదాం.