హృదయ శ్రీమంతం

కథ

ఇల్లంతా హడావుడీగా ఉంది. అమ్మ క్షణం విరామం లేకుండా పనిచేస్తున్నది… వారం రోజులనుండి మా ఆయింటి వదిన ..ఈ పక్కింటి వదినలు, మా అక్కయ్యలతో, చకిలాలు,పెద్దపెద్ద చక్కిలాలు , తేనెతెరలు, లడ్డూలు, అరిశెలు, కరియలు ఒడినింపడానికి ఒల్లెలు, వచ్చిన వారికి వడ్డించడానికి బాదుషాలు , జిలేబీలు తయారు చేయించింది.
రేపే నాకు సీమంతం .. మా అత్తగారు, దగ్గర బంధువులందరూ వచ్చారు. మా అక్కలు నన్ను మరీ అపురూపంగా చూస్తూ… ఎందుకు తిరుగుతున్నావు? అలసిపోతావు! అంటున్నారు. నువ్వుల అప్ప తింటానంటే వేడిచేస్తుంది కడుపులో ఉన్న పిల్లకు మంచిది కాదు అంటున్నారు.
నేను మా వాళ్ళతో మాట్లాడుతూనే చండమ్మ వైపు చూస్తున్న… ఆమె కూడా నాతోటిదే! మా ఇద్దరికీ ఒకేసారి నెల తప్పింది. నేను ఆహారం సహించక బలహీనంగా అయ్యానని అమ్మ అత్తగారింటినుండి తీసుకుని వచ్చింది.
పాపం! చండమ్మను దాని మొగుడు చండశాసనుడు కనుక తల్లిగారింటికి పంపలేదు. దాని అత్త తాను పనిచేసే అన్నిండ్లకు పనిలో సహాయం చేస్తుందని… చండమ్మను తనవెంట తీసుకొనిపోతుంది. అన్ని ఇండ్లలో పనిచేసి మా ఇంటికి వచ్చేసరికి చండమ్మకు నడుం నొప్పి పెడతుందో ఏమో? ఒక పని చేస్తుంది. నిలబడి వెన్ను విరుచుకుంటుంది. భారంగా అడుగులో అడుగు వేస్తూ బరువుగా నడుస్తుంది. ఎప్పుడన్నా అమ్మా అని దమ్ముతీస్తే చాలు! అత్తె దుమ్ము దులిపి పెడుతుంది.. అబ్బో! సుఖాసి పానం సెకేసి పోయిందట! గిన్ని గన్ని ఇచ్ఛంత్రాలు లేవు! నీతాన ! వాయమ్మో! మేము ఇటై నీళ్ళాడేదాక మస్త్ పనులు జేసినం… రికాం లేకుండ యగుసెం పనులకు పోయినం… తొమ్మిది నెలల కడుపుతో నాట్లేసినం, కలుపు తీసినం…నీడకు కూకుండి చేసే గీ ఇండ్లల్ల పనులు గూడ శాతనైతలేదా? గిట్లైతే ఎట్లనవ్వో? అని మెటికలు విరుస్తున్నది అత్త రామవ్వ…
గుడ్ల నీళ్ళు గుడ్లల్ల కుక్కుకుంటూ పనిలో జొరబడ్డది చండమ్మ!
నాకు పొద్దున్నే పీట మీద కూర్చోబెట్టి, ముత్తైదువులంతా బొట్టు పెట్టి, మాడకు చుక్క పెట్టి మంగళ హారతిచ్చి, సీతమ్మ వేవిళ్ళ పాటలు పాడుతూ తలంటు స్నానం చేయించి, గద్దెపీట మీద కూర్చోబెట్టి, నా జుట్టుకు సామ్రాణి పొగ వేసి,
మా అత్త గారు తెచ్చిన కంచి పట్టుచీర కట్టి, అలసిపోయానని పడుకోమన్నారు.
నా సీమంతం ఏరోజో నిర్ణయం కాగానే ఆనాటినుండి మా అమ్మతో పోరుపెట్టినాను. నాతో పాటు చండమ్మకు కూడా సీమంతం చేయమని, సరేలే అట్లనే చేస్త అన్నది అమ్మ.
రోజూ చండమ్మ పని కాగానే మల్లెపూలు తెంపుకొని వచ్చి నాదగ్గర ఉన్న బల్లపీట మీద పోసి, మేమిద్దరం కలసి మాలలు అల్లుకుంటూ పొట్టలో ఉన్న పాప గురించి , మాట్లాడుకుంటాము. చండమ్మ తన పిల్లాడు చాలా అల్లరి చేసేవాడు పుడతాడేమో? పొట్ట లోనుండే అటూ ఇటూ బాగ తిరుగుతాడు అంటుంది, ఒకనాడు మస్తు తంతున్నఢమ్మా అంటుంది. మా మామకు వాడి తల పట్టుకోవడం ఇష్టం అని మురిసిపోతుంది.
ఇలా పుట్టబోయే పిల్లల గురించే మాట్లాడుకుని అత్త పిలువగానే ఏం తెలువనట్టు వెంట పోతుంది. నేను ముందురోజే చెప్పిన! చండమ్మా! తల స్నానం చేసిరా! అని సరే అని ఈ రోజు తలంటుకుని వచ్చింది. రోజూ నూనె పెట్టి అణగదువ్వుకుని ఏలు ముడి వేసుకుంటే తెలువదు దాని జుట్టు అంత పొడవుందని, నల్లగ నిగనిగ మెరుస్తూ చండమ్మ- అంతకన్నా నల్లగా సిల్కు దారాలవలె మెరుస్తున్న పొడగాటి జడ వేసుకొని వచ్చిన ఆమెనూ చూసి నా చూపు తిప్పుకోలేక పోయిన! నలుపులో ఎంత నాణ్యత! భగవంతుడు శ్రద్ధగా తీర్చిన కనుబొమలు, పెద్ద కండ్లు, పొడుగాటి ముక్కు, తమలపాకులవలె పలుచని చెంపలు, కోల ముఖంతో గర్భిణీ కావడమో ఏమో కానీ, మెరిసిపోతున్నది. ఏందమ్మ గట్ల సూడబడితిరీ, అన్నది… చండమ్మా! సూపర్! గ ఉన్నవు! అన్నాను.
సిగ్గుతో తలవంచుకున్నది. మేం ఇద్దరం కలిసి కట్టిన మల్లెపూల మాల పొడగాటిది తెంపి దాని జడలో పెట్టిన. ఏందమ్మా! మీకు పూలజడ కోసం మాలలు కట్టినం… అమ్మ కోప్పడతది … బెదురు చూపులతో అన్నది.
ఏం కాదులే! చాలా పూలున్నాయి. నీ జడ పూలదండ పెడితే ఎంత బాగుందో అన్నాను. మళ్ళీ సిగ్గుపడింది.
ఇంటికి పోయొస్తవా? అన్నాను.
గిప్పుడా! అని బెదురుగా చూపులతో అమ్మా! పేరంటానికి అందరొచ్చేయాలైంది. ఇగేమన్నా ఉన్నదా? పెద్దమ్మ కోప్పడతది. అది విని
మా అత్త తిట్టుడు షురూ చేస్తది. ఐనా ఇప్పుడింటి కెందుకమ్మా? అన్నది.
చంద్రయ్య ఇంట్లో ఉన్నడు కదా! నీ పూలజడ చూపెట్టి, బహుమతి తీసుకొని రాపో! అన్నాను. గట్టాంటియేం ఉండవు మా ఇండ్లల్ల… బహుమతులు గిట్ట కొనడానికి మా అత్త పైసలియ్యది అన్నది చండమ్మ.
పోవే! పిచ్చిదానా! చంద్రయ్య ఇచ్చే బహుమతి కొనుక్కొచ్చేదికాదు! ఇంత అందమైన పెళ్ళాం కంటెదురుగ కనపడితే…. ఆ బహుమతులన్నీ అవంతటవే వస్తయ్! పో! వాటికి పైసలెందుకే పిచ్చిపిల్లా! అన్నాను.
గది నిజమే అమ్మా! ఏడ మా అత్త చూస్తదో అని మస్తు భయంతో తప్పించుకుంట! నేను అందక పోయినాకొద్దీ మా శంద్రయ్యకు పట్టుదలెక్కువై కొసాఖరుకు పట్టుకుంటడు. మీరన్న బహుమతిస్తడు అదెట్లనో మా అత్త కంట పడతది. ఇగ గుణుగుడు షురూ ఐతది. తిట్లన్నా తింటడుగానీ మరువడు అమ్మా! అని మెలికలుతిరిగిన చండమ్మ మొహం వేయి వాట్ల బల్బువలె వెలిగిపోతున్నది.
మా అమ్మ కాస్త ఆదర్శ భావాలున్నది. మా అక్కయ్యల సీమంతం అప్పుడు కూడా ఎవరైనా గర్భిణీ స్త్రీలుంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి, బొట్టూ, తాంబూలంతో పాటు అప్పాలు, అరిశెలు, పండ్లూ, చీరా, రవికె వారికి ఇస్తుంది.
నా సీమంతం రోజు ఎవరికివ్వాలనుకుంటూంటే నేనే చండమ్మకు ఇవ్వమని అడిగాను. అలాగే చండమ్మకూ సీమంతం చేసింది.
గిర్రన రోజులు తిరిగి పోతున్నాయి. ప్రసవ సమయం రానే వచ్చింది. చండమ్మ తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో కానుపు చేసేవారు లేక ఇక్కడే అత్తారింట్లోనే మగబిడ్డను కన్నది.
నాకూ ఆడపిల్ల పుట్టింది. ఎప్పటి వలెనే మా ఇండ్లల్లో జరిగే పురుడు- నామకరణం మొదలైన ఎన్నో వేడుకలు నాకు చేసారు. అందులో భాగంగా నామకరణం రోజు బాలింతరాలికి పసుపు నలుగు పెట్టడం ఆచారం. కట్టెల పొయ్యి మీద పెద్ద కొప్పెర పెట్టి, వావిలి ఆకు వేసి నీళ్ళు మసల బెట్టారు.
ఇత్తడి నలుగు గిన్నెలో పసుపు- సున్నిపిండి నూనే కలిపి పెట్టింది అమ్మ వల్లె. (మెడ మీద ముడివేసి కట్టే ఒక బట్ట) కట్టి గద్దెపీట మీద కూర్చుండబెట్టారు.
శుభ శకునమని అమ్మ- ఒదిన ఇద్దరూ బొట్టుపెట్టి, కొంచెం నలుగు నా చేతులకు రుద్ది వాళ్ళ పనులమీద వెళ్ళిపోయారు.
నాలుగు పెడుతుందని లచ్చుమమ్మ కోసం నేను చూస్తుంటే… చండమ్మ వచ్చింది. చండమ్మా! పాప దగ్గర కూర్చోమన్న కదా! ఎందుకు వచ్చినావు? అన్నాను.
పాపకాడ పెద్దమ్మ కూకుంటనన్నది.. నన్ను నలుగు పెట్టమన్నది. అన్నది చండమ్మ! నువ్వా? అని ఆశ్చర్య పోయాను.
ఔనమ్మా! అన్నది.
నన్ను ఎంతగానో ఇష్టపడే అమ్మ మీద నాకు కోపంవచ్చింది. ఇదెక్కడి న్యాయం? నన్నేమో నాలుగు నెలలైనా బాలింత అని ఇటున్న పుల్ల తీసి అటు, పెట్టనివ్వదు…నేనూ- చండమ్మ ఇద్దరం ఒక్క నాడే ప్రసవించినాము. నెల వెళ్ళగానే చండమ్మ పనిలోకి వస్తున్నది. పిల్లవాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి, ముసలమ్మను చూడమని చెప్పి వస్తుంది. పొద్దున ఎప్పుడో పాలిచ్చి వస్తే రెండు ఝాములైనా పనికాదు.
నా ఆలోచనలో నేనున్నాను ఇంతలో చండమ్మ గట్టి పెట్టి నలుస్తున్నది. చలికాలమైనా చెమటలు వస్తున్నాయి ఆమెకు… రావు మరి! ఎంత బలంగా రుద్దితే కానీ గట్టి వదలదు!
ముందు నావైపుకు తిరిగి నలుస్తున్నది. ఇంతలో ఆమెకు కొడుకు జ్ఞాపకానికి వచ్చిండేమో? పాలు చేపి, ధారలు కడుతున్నయ్! పిల్లవాడికి ఇవ్వలేకపోతున్నానని చండమ్మ కళ్ళలోంచి నీళ్ళు ఉబికి వస్తున్నాయి… నాకు పాపమనిపించింది… గబుక్కున చెంబుతో గంగాళంలోని నీళ్ళు ముంచి నా ఒంటిమీద పోసుకున్న!
“అదేందమ్మా? ఇంకా పెయ్యి అంత అట్లనే ఉండే! నలుగు రాల్చకనే పోతిని. గట్ల నీళ్ళు పోస్తివి. ఇప్పుడెట్ల? పెద్దమ్మ వచ్చి కోప్పడతది” అన్నది.
“ఏంకాదు! నువ్వు ఇంటికి పో ! నేను అమ్మ తో చెప్తా!” అన్నాను.
ఏంచెప్తవు? నేను రుద్దనన్ననా? అని ఏడుపుమొఖం పెట్టింది.
నాకు ఎక్కువ సేపు కూచోలేకపోతున్నానని, చక్కర్ వస్తున్నదని చెప్తాను .. అన్నాను.
హమ్మయ్య అన్నట్టు చూసింది.
నాకు బిస్కట్ డబ్బా కావాలని నిన్ను పంపిస్తాను. నువ్వు చక్కగ నీ ఇంటికి పోయి పాపకు పాలిచ్చి రా! అన్నాను.
మరి ఏం బిస్కెట్ కావాలో రాసియ్యి ! కొనుకొస్త.. అంటే…
“ఓ ! బుద్దూ ! నీకేం అర్ధంకాదు! మొద్దు మెదడు, నిన్ను పంపడానికి నాటకం… సరేగానీ జల్ది పోయిరాపో!” అని తుడుచుకునే చీర సోలుకుని, చండమ్మ వైపు చూస్తే పాపం పాలతో- కన్నీళ్ళతో తడసిన కొంగు పాలిండ్లను దాచలేకపోతున్నది. తలకు చుట్టుకోవాలనుకున్న తువ్వాలు ఆమె భుజాల చుట్టూ కప్పిన. కాస్త సిగ్గు తగ్గి, కొడుకు దగ్గరకు పోతున్నాననే సంతోషంతో ముఖం విప్పారింది.
ఇంతసేపైంది…తానుకూడా తన పాపకు ఎప్పుడో పాలిచ్చింది… కానీ నాకు చేపులూ రాలేదు… గుండెలూ తడవలేదు! బహుశా పిల్ల చుట్టూ ఎందరో కాపలా ఉండి, నేను నిశ్చింతగా ఉండడమే కారణం కావచ్చు. నేను చేసిన ఈ పని ఎందుకో నేరం చేయకుండా ఆపినట్టు అనిపించింది.
_**_

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు – 16వ భాగం

సంగీతం వీనుల విందు The Muscle gain