ప్రశాంత వదనం , చిరుదరహాసం, కోకిల స్వరం , చక్కని ఆహార్యాల కలబోత శ్రీమతి కలైవాణి( వాణీజయరాం) గారు. దురై స్వామి అయ్యంగార్ , పద్మావతి గార్ల తనయ . నవంబర్ 30,1945 లో తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు.
కర్ణాటక సంగీతంలో వీరి తొలి గురువు శ్రీరంగరాజ రామానుజ అయ్యంగార్ గారు. తదనంతరం కడలూరి శ్రీనివాస్ అయ్యంగార్, టీఎస్ బాల సుబ్ర మనియన్, ఆర్ఎస్ మణి గార్ల వద్ద శిక్షణ పొందారు. పట్టభద్రురాలు, బ్యాంకు ఉద్యోగి అయిన ఈమె టిఎస్ జయరాం గారితో వివాహానంతరం ముంబైలో నివాసం ఉన్నారు. భర్త ప్రోత్సాహంతో ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ గారి వద్ద హిందుస్తానీ సంగీతంలో తర్ఫీదు పొందారు . గురువు గారి ఆశీస్సులతో హిందీ సినీ నేపథ్య గాయనిగా అవకాశం వీరిని ఆహ్వానించింది . 1971లో గుడ్డి సినిమాలో తొలిసారిగా గాన వాహిని మొదలైంది . తదనంతరం వివిధ భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నారు.
1973 లో తెలుగులో తొలి అవకాశం ‘అభిమానవంతులు’ చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా
నా స్వామి ‘పాటతో గానామృతం లో ఓలలాడించడం మొదలుపెట్టారు.
ఆమె గళంలో సయ్యాటలాడిన పాటలెన్నో! అసలే గాన కోకిల పైగా మకరందం గ్రోలిందా అన్నఛదంగా ఆలపించే ఆ పాటల తీరుకు పరవశించని రసహృదయం అరుదనే చెప్పొచ్చు. 19 భాషల్లో దాదాపు పదివేల పాటలకు పైగా ఆలపించారు . వీరు పాడిన భక్తి గీతాలలో ముఖ్యంగా ‘వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే ‘… అంటూ గానం చేసిన తీరు అత్యద్భుతం . ‘శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము’… సంగీత సాహిత్యాలను శారదా మాత స్థన ద్వయంతో సరిపోలుస్తారు కదా! నిజంగా ఆ తల్లి క్షీర ధారల సేవనంతో మాధుర్యాన్ని సంతరించుకున్న ఆమె గళ సీమ నుండి జాలువారిన రసఝరులన్నో!
‘ తెలిమంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ ‘… (స్వాతి కిరణం చిత్రం ) అంటూ – ఓ బాలుడు ఉషోదయాన్ని స్వాగతిస్తూ చేసే స్వర విన్యాసానికి అనుగుణంగా ఆలపించిన తీరు ముగ్ధ మనోహరం!

‘ పూజలు సేయ పూలు తెచ్చాను’ అంటూ – దేవుణ్ణి వేడుకోవడంలోని
ఆర్తి ఐనా (పూజ చిత్రం)
‘నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా’!( మల్లెపువ్వు చిత్రం ) అంటూ – ఎదురుచూపుల్లోని నైరాశ్యాన్ని పలికే విధమైన –
‘ హే కృష్ణా! మళ్ళీనీవే జన్మిస్తే నీ భగవద్గీతే నిజమైతే ‘…(మొరటోడు చిత్రం)
‘ విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని ‘… (మరోచరిత్ర చిత్రం)
లాంటి వేదనాభరిత గీతాలాపనైనా –
‘ నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా? ‘… (వయసు పిలిచింది చిత్రం)
‘మాఘమాసం మంగళవారం మామయొచ్చాడు …’ (మా దైవం చిత్రం)
అంటూ హుషారైన
గీతాలాపన చేసినా –
‘ అందెల రవమిది పదములదా’…
(స్వర్ణకమలం చిత్రం ) అంటూ హృద్యంగా పాడినా –
‘ మధురానగరిలో చల్లనమ్మ బోదు దారి విడుము కృష్ణా!’…(త్యాగయ్యచిత్రం)
‘ఏ తీరుగనను దయ చూసెదవో ఇనవంశోత్తమ రామా!’…(శంకరాభరణం చిత్రం)
అంటూ భక్తి భావమొలికించినా మధువులూరే గాత్రంతో వీనుల విందొసగేలా పాటేదైనా పరవశించి పాడే తత్వంలోని పరిణతికి , కృషికి దక్కిన అరుదైన గౌరవం మూడు జాతీయ పురస్కారాలు సాధించడం. మూడింట రెండు తెలుగులోనివే కావడం మన అదృష్టం . ఒకటి మానస సంచరరే ( శంకరాభరణం) రెండు ఆనతినీయరాహరా (స్వాతికిరణం) .
ఆమె గళం నుండి పెల్లుబికి విశ్వవ్యాప్తినొందిన రసధునులెన్నో! మెచ్చి వరించిన సత్కారాలు , సన్మానాలు ఎన్నెన్నో!ఆ సుస్వర వాణి స్వరమాధుర్యానికి మెచ్చి భారత ప్రభుత్వం ఆమె ‘కీర్తి కిరీటం’లో పొదిగిన జాతిరత్నం ‘పద్మభూషణ’ పురస్కారం . ఆసాంతం ఆస్వాదించకుండానే దురదృష్టవశాత్తు ఫిబ్రవరి 4 , 20 23న ఆ భారతీమాత కచ్చపీనాద తంత్రులలో లీనమైన ఆ సుధారస వాణికి అక్షర సుమాంజలి