సాయంకాలమైంది !!

కవిత

రఁగరాజు పద్మజ

సాయంకాలమైంది మనిషికా? మనసుకా?
ఆకసాన సూర్యాస్తమయ రంగులెన్నెన్నో?
ఓహో! అవలోకించి ఆనందించడానికి!
గ్రహాలనదుపులో పెడుతూనే గగనాన
గమనం సాగిస్తూనే
పండు బారిపోయాడు వెలుగుల దొర!
మళ్లీ ఉదయించడానికే కదా!
ఉషస్సుల రంగులు నింపడానికేగా?
భగ్గున మండాడని,మార్తాండుని
ఆకసంలోనుండి పారదోలామా?
పండుబారిన వారెందుకలా పనికిరారో?
బండబారిన హృదయాలు
తమ బతుకు కారణమైన వారేనని అనుకోరా?
మధ్యందిన మార్తాండుడిలా ఎపుడూ
కుటుంబాన్నదుపులో పెడుతూనే,
సూర్యుడితో పాటూ గిరగిర తిరిగి తిరిగి,
తనవారిని కాపాడి తాను కృశించి,
కుంటుబడిన వారి చేతికర్రకాలేరా?
వెల వెల బారిపోయిన వృద్ధాప్యం కాదనీ,
వారి జ్ఞాన సంపద వృధాకాకూడదనుకోరా?
జ్ఞాన మయూఖలందించే భాస్కరులు వారే కదా!
శ్రమదమాదులోర్చిన వారుండాల్సింది వృద్ధాశ్రమంలోనా? వసతులులేని ఊళ్ళల్లోనా?
దేవళమంటి తమ ఆంగణములో ఉండాల్సిన దేవుళ్ళని తలచకపోతెలా?
ఐదుగదుల మహల్ లో ఆరడుగుల జాగా కరువా?
సమాజం తలలు బోడులై డుల్లకాదా?
తరతరాల తలపండిన వారినితలచి,
తలవంచి తనకొక ఏడుగడగా భావించాలి!
తల్లిదండ్రుల మరచిన ఆ లోగిళ్ళు…
సంతానానికి చీకటిగుయ్యారాలేకదా?
ఆదరించిన ఆ తలవాకిళ్ళు! విలువల లోగిళ్ళే!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భక్తిగీతాలు

మీ చుట్టూరా ఆమే..!!