సంకల్పం

ధారావాహికం – 10, 11వ భాగాలు

పృథ్వీ అనూష ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు. తమ తో పాటు తమ చుట్టూ ఉండే సమాజం కూడా బాగుండాలని కోరుకునే వారు. దానికి తమ వంతు కృషి చేయాలని భావించే వారిద్దరి మార్గాలు మాత్రం భిన్నమైనవి.

అక్షరాస్యత ద్వారా ప్రజల్లో, తద్వారా సమాజం లో మంచి పెరుగుతుంది అని భావించి అక్షర యజ్ఞం మొదలెట్టాడు పృథ్వి.

తన కలాన్ని కత్తిలా ఝులిపిస్తూ, అవినీతి, లంచగొండితనం లాంటి భూతాలు తరిమేయాలని జర్నలిస్టు గా మారింది అనూష.

కారణాంతరాల వల్ల వీరి ప్రేమకు బ్రేక్ పడింది.

ఇకపై ఏం జరుగుతుందో  చూద్దాం.

 

జ్ణాపకాలు

“ఇకపై మన స్నేహితులుగా ఉందాం,” అంటూ అంత సులువుగా చెప్పేసి వెళ్లిపోతున్న అనూషను చూస్తూ, కోపం ఉక్రోషం తన్నుకు వచ్చాయి పృథ్వికి.

ఆపై నెమ్మదిగా ఆలోచన వచ్చింది.

అనూష చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉంది కదా, ఎవరైనా వచ్చి నన్ను ఈ అక్షర యజ్ఞం  ఆపేయమంటే ఆపగలనా?

ఇది నేను ఎంచుకున్న మార్గం. మరి అది తను ఎంచుకున్న దారి. అందులోంచి తప్పుకోమని ఆమెను కోరే హక్కు ఎవరికైనా ఎందుకుంటుంది?

తనకు అనూష నచ్చినదే తన ఈ ప్రత్యేకమైన వ్యక్తిత్వం వల్ల కదా? మరి ఇప్పుడు ఆ వ్యక్తిత్వం మార్చుకోమంటే అప్పుడు తనలో నాకు నచ్చేదేమిటి? ఇలా ఆలోచించినప్పుడు ప్రశాంతంగా అనిపించింది పృద్వికి.

అనూష చెప్పినట్లు తను పెళ్లయిన తర్వాత చూసుకోవచ్చు అనుకోకుండా ఆమె తో ముందే మాట్లాడటం సరైన పని.

దాంతో ఇద్దరికీ క్లారిటీ వచ్చింది.చాలా వరకు ప్రేమ వివాహాలు విఫలమయ్యేది ఈ కారణం చేత నేనేమో.

పెళ్లికి ముందు ఒకరిలో ఒకరికి నచ్చిన

ఆ వ్యక్తిత్వం, ప్రత్యేక లక్షణాలు వివాహం తర్వాత తల్లిదండ్రుల కోసమో,పిల్లల కోసమో, సమాజం కోసమో ఒకరిని మరొకరు మార్చుకోమని కోరడం,

అది ఆ రెండవ వారికి నచ్చక పోవడం వల్ల విభేదాలు వచ్చి విడిపోతూ ఉంటారేమో!

అలా విడిపోలేక బలవంతాన కలిసి ఉన్న వారిలో ఏ సంతోషమూ లేక  జీవచ్ఛవాలలా బతికేస్తూ ఉంటారేమో!

అమ్మో తామిద్దరి జీవితం అలా అవలేదు, సంతోషం, అనుకున్న తర్వాత చాలా రిలీఫ్ గా అనిపించింది పృథ్వి కి.

తల్లిదండ్రులు శ్రీధర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరిగి తన ఉద్యోగంలో కొనసాగింది అనూష.

అప్పుడప్పుడు ఫోన్లలోనే ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటున్నారు ఇద్దరూ.

వాళ్లు  కలుసుకుని మామూలుగా మాట్లాడుకోవడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది అని ఇద్దరికీ తెలుసు.

పృథ్వి కోరుకున్నట్లుగానే అతను నగరంలోని ప్రతి మురికివాడలో మొదలెట్టిన అక్షర యజ్ఞం కొనసాగుతోంది.

ఇదివరకే అతి పెద్ద స్లమ్ లో అతను  ఈ ప్రయత్నంలో విజయం సాధించాడని విని ఉండడం వల్ల మిగతా ప్రాంతాల్లో అతనికి సహాయ పడేందుకు వాలంటీర్లు చాలా మంది సిద్ధమయ్యారు.

వాళ్లందరి సహకారంతో అక్షర ఫౌండేషన్ ప్రతి ఒక్క మురికివాడలో ఉన్న పిల్లలందరికీ మంచి విద్యను అందిస్తోంది.

ఇప్పుడు ఆర్థికంగా తనకి ఎక్కువ మంది సహకారం ఉండటం వల్ల. కేవలం చదువులోనే కాక, క్రీడలలో కానీ, సంగీత సాహిత్యాల్లో కానీ. మరేదైనా ప్రత్యేక రంగంలో కానీ రాణించాలనుకునే వారికి తగిన ఏర్పాట్లు,ప్రోత్సాహం లభించేలా చేస్తున్నాడు పృథ్వి.

తన అక్షర ఫౌండేషన్ కేవలం మురికివాడల్లో ని పిల్లల చదువుల కోసం అనే ప్రారంభించినప్పటికీ,  అది చేయాలంటే దాని చుట్టూ ఇంకా ఎన్నో పనులు చేయక తప్పదని అర్థమైంది పృథ్వి కి.

స్త్రీ అభివృద్ధి చెందితే సమాజ అభివృద్ధి చెందుతుంది అనేది తెలుసు కనుక ముందుగా ఆ వాడల్లోని స్త్రీలందరినీ స్వయం సహాయక సంఘాలు (పొదుపు సంఘాలలో) చేర్పించి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు లభించేలా అవకాశం కల్పించాడు.

ఆ డబ్బులు వాళ్ళు వృధా చేయకుండా ఉండేలా దగ్గరుండి వారి చేత చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయించాడు.

ఇప్పుడు వారిలో చాలామంది బట్టలు కుట్టడం, రకరకాల ఆహార పదార్థాలు తయారు చేయడం, క్యాండిల్స్, సబ్బులు వంటివి తయారు చేయడం లాంటి పనులు చేస్తూ, అక్షర ఫౌండేషన్ వారు అందిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలతో వాటిని అమ్ముకుంటూ స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

అమ్మలు ఆనందంగా ఉంటే ఇంట్లో పిల్లలకు చాలా వరకూ మంచి వాతావరణం, ఆలంబన ఏర్పడినట్లే.

ఎన్ని పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అతని మనసులో అనూష ఆలోచనలు మాత్రం వీడటం లేదు.

ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మంచి జంటను చూడగానే,ఆ స్థానంలో తామిద్దరినీ ఊహించుకుంటూ, చక్కని పాట వింటే అనూషే పాడుతున్నట్లు ఇలా.

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది..

అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా..పేరు కైనా నేను లేనా

దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా

ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా…

ఈపాట ఎన్ని సార్లు పాడుకున్నాడో అతనికే తెలియదు.

ఐనా ఎవరితో నిమిత్తం లేకుండా కాలం పరిగెడుతూనే ఉంది.

ఆ మురికివాడల్లోని మగవారిలో చాలామంది సంపాదించేదే తక్కువ సొమ్ము కాగా, దాంట్లో ఎక్కువ శాతం తాగుడుకే ఉపయోగించడం, తద్వారా రోగాల బారిన పడటం, అందుకుగాను వైద్యానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం గమనించాడు పృథ్వి

అయితే ఒక వ్యసనానికి బానిసగా మారిన వారిని బలవంతంగా దాని నుంచి మళ్లించడం అంత సులువు కానీ, మంచిది కానీ కాదు అని అతనికి తెలుసు. కనుక ఆ ప్రయత్నం చేయలేదు.

ఎవరైనా వారంతట వారుగా మార్పు కోరుకుంటే, వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించే ఏర్పాటు చేశాడు.

అలా వెళ్లి వచ్చిన వారిలో వారి కుటుంబాల్లో వెల్లివిరిస్తున్న ఆనందాన్ని చూసైనా మిగతావారు మారే ఆలోచన చేస్తారని అతని ఉద్దేశం.

ఒక విధంగా చెప్పాలంటే ‘మార్పు’ అనే ఒక నిశ్శబ్ద విప్లవం  ఆ స్లమ్స్ లో, తద్వారా నగరం లో ఒక మహా వృక్షం లా వేళ్ళూనుకుంటోంది. ఆ మార్పు వల్ల కేవలం అక్కడ వారే కాక, నగరంలోని చాలామంది సంతోషంగా ఉన్నారు. నేరాలు తగ్గాయి కనుక పోలీస్ శాఖ వారు కూడా ఆనందంగా ఉన్నారు.

మనలోని మంచితనం ఎదుటి వారికి ఉపయోగపడే వరకూ మనం మంచివాళ్ళమే.

కానీ అదే మంచితనం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టినప్పుడు మనం వారికి శత్రువులు గా పరిగణింపబడతాం.

ఎదుటి వారికి నచ్చినట్లు ఉంటే ‘పువ్వులు’ వేస్తారు.

నచ్చకపోతే ‘రాళ్ళు’ వేస్తారు.

ఏదేమైనా ఒకరి జీవితంలో ‘హీరో’అవ్వాలంటే

మరొకరి జీవితంలో ‘విలన్’ అవ్వాల్సిందే.

వాట్సాప్ లో వచ్చిన ఈ ఫార్వర్డ్ మెసేజ్ చూస్తూ ఉండిపోయాడు పృథ్వి ఒక్క క్షణం. ఇటువంటి మెసేజ్ లు ఫార్వర్డ్ చేయడం వల్ల మంచి వారు నిజంగానే కాస్త భయపడతారేమో.  కానీ తను ఎవరికీ శత్రువు కాదు, కారాదు అనుకున్నాడు.

అయితే అన్నీ మనం అనుకున్నట్లే ,మన ప్లాన్ ప్రకారం గడిచిపోతే జీవితంలో కిక్కేముంది అన్నట్టుగా పృథ్వి జీవితంలో కూడా అతను ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఒక కిక్ ఎదురుచూస్తోందని ఎవరికీ తెలియదు.

11వ భాగం

(రాజకీయం)

ముఖ్యమంత్రి గారు తనని పార్టీ నుంచి బర్తరఫ్ చేయడంతో చేయి విరిగినట్టు అయింది మంత్రి రంగారావు గారికి. ఇప్పుడు అతని ముందు రెండు మార్గాలు ఉన్నాయి. వేరే పార్టీలో చేరడం, లేదా కొత్త పార్టీ పెట్టడం.

ఈ ముఖ్యమంత్రి గారి మంచితనం,ఆయన నిజంగానే ప్రజాసంక్షేమం కోసం చేస్తున్న పనుల వల్ల ప్రజలలో అధికార పార్టీ పట్ల మంచి అభిప్రాయం ఉంది. అటువంటి పార్టీకి ద్రోహం చేసిన వాడిని తమ పార్టీలో చేర్చుకుంటే. ఇక తమకూ చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతో ఏ పార్టీ కూడా రంగారావుకి స్నేహ హస్తం అందించలేదు.

అధికారం, తద్వారా వచ్చే ఆదాయం లేకపోవడంతో పిచ్చెక్కినట్లుంది ఆయనకి. పైగా తన తర్వాత తన కొడుకు కూడా రాజకీయాల్లోకి వచ్చి తన వారసత్వాన్ని కొనసాగించాలని అతడి ఆశ.

అందుచేత తనకున్న ధన బలంతో ,జన బలాన్ని సేకరించి కొత్త పార్టీ స్థాపించాలని భావించాడు రంగారావు. అయితే కొత్త పార్టీని ప్రకటించాలంటే దానికి సరైన అవకాశం, సందర్భం కలిసి రావాలి కదా.

తన పిఏ ని పిలిచి,” ఏయ్ పి ఏ, ఆ లేబర్ కాలనీలోని కుర్రాళ్ళకి కబురు పెట్టి ఒక్కొక్కరికి ఎంత కావాలో అడిగి డబ్బు,మందు అన్నీ ఇచ్చేయ్. ఏ కారణంగా జరుగుతున్నాయో తెలియకుండా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాలి. అల్లకల్లోలం సృష్టించాలి. రాష్ట్రమంతా అలజడి రేగాలి, అట్టుడికి పోవాలి.అవసరమైతే ఒకటో రెండో ప్రాణాలు కూడా పోనీ.

అలా జరుగుతున్న సమయంలో రాష్ట్రాన్ని కాపాడే శక్తి మనకు మాత్రమే ఉందంటూ మన పార్టీని ప్రకటిద్దాం. మనకు సీట్ ఇవ్వనని భీష్ముంచుకున్న అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యేలను కొనేసేద్దాం. వాళ్ల పార్టీలో మనకి చోటు ఇవ్వకపోతే మన పార్టీలో వాళ్ళ వాళ్ళకి చోటిద్దాం. అధికార పార్టీ వాళ్ళకే కాక మిగతా అన్ని పార్టీల వారికి మనం అంటే ఏంటో తెలిసి రావాలి. ఆ ఏర్పాట్లు చూడు” అన్నాడు.

“సరే సార్, అలాగే చేస్తాను  ఆ కాంట్రాక్టర్ ని పిలిచి కుర్రాళ్ళకి కబురు చేయమని చెప్తాను.ఏ విషయం రేపు మీతో చెప్తాను,” అంటూ వెళ్ళాడు.

” ఏంటయ్యా అలా దిగులు మొహం వేసుకొని కూర్చున్నావ్, ఏమైంది?” మాట్లాడకుండా మౌనంగా ఉన్న పి ఏ ని అడిగాడు రంగారావు.

“మరీ, మీతో ఓ విషయం చెప్పాలి సర్.”నసిగాడు అతను.

” చెప్పవయ్యా, ఏంటలా నీళ్ళు నములుతున్నావు?” గద్దించారు మాజీ మంత్రి గారు.

“మరేమో సార్ ,మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేద్దామని ఆ మురికివాడలోని కుర్రాళ్ళ కోసం కబురు చేశాను. కానీ వాళ్ళెవరూ ఇప్పుడు ఇలాంటి పనులకు రావడం లేదుట.”చెప్పాడు పి.ఏ.

” ఇలాంటి పనులకు రాకపోతే ఏం చేస్తున్నారు? మర్డర్లు, బ్యాంకు దోపిడీలు చేస్తున్నారా?” వ్యంగ్యంగా అన్నాడు రంగారావు.

“లేదు సార్, వాళ్లంతా చదువుకుంటున్నారట. ఉద్యోగాలట, వ్యాపారాలట. ఇప్పుడు ఇలాంటి చెడ్డ పనులేవి వాళ్ళ కుర్రాళ్ళు చేయరని వాళ్ళ నాయకుడు తెగేసి చెప్పాడు.”

“ఏంటీ,చదువులా? వ్యాపారాలా? మనకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగిందయ్యా?

మనమే కదా పట్టణాభివృద్ధి ఏ మాత్రం జరగకుండా జాగ్రత్త తీసుకున్నాం ఆ శాఖలో ఉన్నన్నాళ్ళు. ఇంతలోనే ఇదంతా ఎప్పుడు జరిగింది?” ఆశ్చర్యం వెలిబుచ్చారు రంగారావు.

“అదే సర్, నేనూ ఆశ్చర్యపోయాను. ఎవరో పృథ్వి అట. అదేదో సినిమాలో మహేష్ బాబు ఊరిని దత్తత తీసుకున్నాను అన్నట్లుగా,మన ఊరిలోని మురికివాడలన్నీ దత్తత తీసుకొని, వాటిలోని యువత అభివృద్ధే లక్ష్యంగా ‘అక్షర ఫౌండేషన్’ అని స్థాపించాడట.

అక్కడ పిల్లలకు, పెద్దలకు అన్ని విధాల సహాయపడుతూ పెద్ద లీడర్ అయిపోయాడు.” కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు పిఏ.

“ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇలా ప్రతోడూ లీడర్ అయిపోతే మనం ఎందుకంటా ఉన్నది?మొన్నటికి మొన్న అదెవర్తో నన్ను ఇరికించి హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు వీడు ఆ అలగా జనాన్నంతా ఉద్ధరించేసి వాళ్లకి హీరో, లీడర్ అయిపోతే, రేపు మనకి పోటీకి వచ్చేయడూ?ఇంత జరుగుతుంటే తెలుసుకోకుండా ఏం చేస్తున్నావయ్యా? ఎందుకుంటారు నీలాంటి పనికి మాలినోళ్ళంతా?

ఇప్పుడు ఆ కుర్రాళ్ళు లేకపోతే మనం అనుకున్నది ఏదీ చేయలేం. ఏం చేద్దాం?  చెప్పి చావు,” రంకెలేసాడు రంగారావు.

“అదే ఆలోచిస్తున్నాను సార్.కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి. అంత బేవార్స్ గా తిరుగుతుండే ఆ స్లమ్స్ లోని పిల్లలందరినీ మంచిదారిలోకి నడిపించాడు అంటే అతను మామూలు వ్యక్తి కాదు సార్. మెచ్చుకోకుండా ఉండలేము,” అంటున్న పి ఏ ను చూసి ఒళ్ళు మండింది పాపం రంగారావుకి.

“అలాగా ?అయితే అతనికి సన్మాన సభ ఏర్పాటు చెయ్. దండేసి చప్పట్లు కొట్టి వద్దాం. నీ…..(చెడ్డ మాట.)

“ఆగండి సార్. ఇప్పుడు మనం చేయగలిగేది ఒకటే. అతడిని అడ్డుతప్పించాలి.అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం. మన చేతికి మట్టంటకుండా ఏ బీహార్ గ్యాంగ్ నో రప్పించి అతనిని ఫినిష్ చేయించాలి.

అసలు లీడర్ లేనప్పుడు ఆ అక్షరా ఫౌండేషన్ నడవదు. దాని పని ఆగిపోగానే మనం యధా ప్రకారం మన కుర్రాళ్ళని వాడేసుకోవచ్చు, ఏమంటారు? సలహా పారేశారు పి ఏ గారు.

“ఇంకేమంటాను ,అదేదో చేసి చూపించమంటాను.”

“ఓకే సార్ అయితే ఇక నేను ఆ పనిలో ఉంటాను,” చల్లగా జారుకున్నాడు పి ఏ.

ఆరోజు ఆఫీసులో పని అయిపోయిన తర్వాత, రాజేష్ పెళ్లికి ఎటెండ్ అయి ఆలస్యంగా ఇంటికి వస్తున్న పృథ్వి కారు మీద ఎటాక్ జరిగింది.

హైవేపై పృథ్వి  ఒంటరిగా వస్తుండగా ఎక్కడి నుంచో వచ్చిన నలుగురు మనుషులు అతని కారుపై దూకడంతో సడన్ గా బ్రేక్ వేసి ఆపేసాడు.

ఏం జరుగుతుందో, తనపై వాళ్ళు ఎందుకు దాడి చేశారు అర్థం కాలేదు. అతను కార్లో కూర్చుని ఉండగానే ఒకడు పెట్రోల్ సీసా విసిరాడు. మరొకడు అగ్గిపుల్ల వెలిగించాడు. కార్ అంటుకుంది..

వెంటనే ఇగ్నిషన్ ఆపేసాడు పృథ్వి.

కిందకు  దిగుదామంటే వాళ్ళ చేతులలో ఆయుధాలు ఉన్నాయి. కనుక అది ఇంకా ప్రమాదం అని గుర్తించాడు. వాళ్లు ఆ ఆయుధాలతో తనని చంపేస్తారు. పైగా ఆ హింసను తను భరించాలి. దాని కన్నా కార్ లోనే ఉండి ఏం జరుగుతుందో వేచి చూడడం మంచిది అనుకున్నాడు.

ఇక తన ప్రాణం పోయినట్లే అని అనుకున్న ఆ క్షణం అతనికి అనూష గుర్తొచ్చింది. ఆమెకు మెసేజ్ చేశాడు. “ఐ యాం సారీ అనూ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు.

ఈ జన్మకు ఇక సెలవనుకుంటాను. మరు జన్మలో తప్పక నిన్ను చేరుతాను,”అంటూ.

పృథ్వి అతడితో పాటు కారు మొత్తం కాలి   బూడిదయ్యేంతవరకు దగ్గరుండి, రూఢి చేసుకున్నాక అక్కడ నుంచి వెళ్లాలని ఆ నలుగురు అక్కడే ఉండి చూస్తున్నారు.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 ఎడారి కొలను      

పూలజడ