జరిగిన కథ
పృధ్వి ఒక ధనవంతుల బిడ్డ. కానీ అతను తండ్రి వ్యాపారం లో భాగస్వామ్యం తీసుకోకుండా, స్వయంగా ఉద్యోగం చేస్తూ, సమాజానికి తనదైన శైలిలో ఏదైనా చేయాలని ఆరాటపడుతున్న వ్యక్తి.
ఒక పార్టీ లో అతనికి తన ఆలోచనలకు అనుగుణంగా ఉండే అమ్మాయి అనూష తో పరిచయం ఔతుంది.
వారి కలయిక ఏ దిశగా వెళ్తుంది, వారిద్దరూ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారా అనేది చూద్దాం.
ఇక చదవండి…
ఆ రోజు అలా వెళ్ళిపోయిన అనూషను ఆ నిమిషం తిట్టుకున్నా, ఎందుకో ఆమె రూపం మాటిమాటికీ తన కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది పృథ్వి ని.

నందిని చెప్పినట్లు తను కాలేజీలో ఒకరకంగా హీరో గానే వెలిగాడు. దాదాపు ఆరడుగుల ఎత్తు, దానికి తగిన శరీర సౌష్టవం, స్ఫురద్రూపి తను.
తన తల్లి లాగా దబ్బ పండు ఛాయా, అందమైన కళ్ళు,ఉంగరాల జుట్టు.
తనని చూస్తూ అమ్మమ్మ ఎప్పుడూ అనేది,” నా మనవడు చూడు ఎంత అందగాడో, వాడి కళ్ళు చూసే పడిపోతారు అమ్మాయిలంతా,” అని.
కాలేజీ బ్యూటీ నందిని తో సహా చాలా మంది అమ్మాయిలు అందగత్తెలు, తెలివైన వారు, డబ్బున్నవాళ్ళు తనని ఇష్టపడుతున్నారని తెలిసినా, తన మనసు ఏ రోజూ స్పందించలేదు.
అలాంటిది అతి సాధారణంగా ఉన్న ఈ అమ్మాయి విషయంలో మనసు ఎందుకు ఇలా అవుతోంది? తనని మళ్లీ కలవాలని, మాట్లాడాలని ఎందుకనిపిస్తుంది? ఆలోచించకుండా ఉండలేకపోయాడు.
అలా ఆలోచిస్తూ కాఫీ షాప్ లోకి వెళ్తున్న పృథ్వీ, “హలో, మిమ్మల్నే,”అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు.
ఎదురుగా ఆ అమ్మాయే! నమ్మలేకపోయాడు. ఆ అమ్మాయి పిలిచేది తననేనా? అని అనుమానపడ్డాడు.
“సారీ అండీ, ఆ రోజు నేను పార్టీలో ఒక వ్యక్తిని ఫాలో చేస్తూ ఉన్నాను, నా ఇన్వెస్టిగేషన్లో భాగంగా. నందిని మీ గురించి మాట్లాడుతున్నప్పుడే అతను బయటికి వెళ్లిపోవడం చూసి నేను అలా పరిగెత్తాను. మీరు తప్పుగా అనుకోలేదు కదా? “నవ్వుతూ మాట్లాడుతున్న అనూష మొహం లోకి చూస్తూ మాటలు మర్చిపోయాడు.
“హలో సార్, మిమ్మల్నే? ఏమిటి పరధ్యానంలో ఉన్నారు?” గట్టిగా అడుగుతున్న అనూషను చూస్తూ ఒక్క క్షణం తత్తర పడి మళ్లీ లోకంలోకి వచ్చాడు.
“ఆ, అబ్బే , లేదండీ, తప్పుగా ఏమీ అనుకోలేదు. మనకు ఇంకా అప్పటికి పరిచయం లేదు కదా. కానీ ఇప్పుడు నాతో కాఫీ తాగకుండా వెళ్ళిపోతే తప్పకుండా ఫీలవుతాను,” అన్నాడు పృద్వి.
“సరే అయితే మిమ్మల్ని ఫీల్ అవ్వనివ్వను. పదండి కాఫీ తాగుదాం,” అంటూ లోనికి నడిచింది అనూష.
“ఇప్పుడు చెప్పండి మీ గురించి. నందిని చాలాసార్లు చెప్పిందనుకోండి, కానీ మీరు చెప్పండి,” అడిగింది.
“నా గురించి అంత గొప్పగా చెప్పుకునేది ఏమీ లేదులెండి.మా నాన్నగారు బిజినెస్ మాన్. నేను కూడా అందులోకి రావాలని ఆయన కోరిక. కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు. చిన్నప్పటినుంచి ఎందుకో మన చుట్టూ ఉండే సమాజంలో ఉన్న ఈ భేదాలు చూస్తూ చాలా బాధపడే వాడిని.
మా ఇంట్లో పనిచేసే రంగమ్మ డబ్బులు లేక తన కూతుర్ని స్కూలుకు పంపించకుండా తనతో పాటు పనిలోకి తీసుకురావడం చూసి బాధపడి మా అమ్మానాన్నలతో పోట్లాడి తనని స్కూలుకి పంపించే ఏర్పాటు చేశాను.
ఇప్పుడు తను గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా పని చేస్తూ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతోంది.
నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఈవినింగ్ స్లమ్స్ లో పిల్లలకు ఫ్రీగా చదువు చెబుతున్నాను. అలా చాలా స్లమ్స్ లో పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా ఉండడం చూసి,
వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నాను. త్వరలో నా ఆలోచన కార్యరూపం ధరిస్తుంది అనుకుంటున్నాను ,”చెప్పాడు పృథ్వి.
“అయితే మీ గురించి నందిని చెప్పినది నూరు శాతం నిజమే అన్నమాట. మీ మీద ఉన్న ఇష్టం వల్ల కాస్త ఎక్కువ చెప్తుందేమో అనుకున్నాను,” నవ్వింది అనూష.
“ఇక ఇప్పుడు మీ గురించి చెప్పండి. ఈ లోగా ఇంకో కాఫీ ఆర్డర్ చేస్తాను,” చెప్పాడు పృథ్వి.
“బయోగ్రఫీ చెప్పుకునేంత ఏమీ లేదులెండి నా గురించి. మా అమ్మానాన్నలు ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగాలలో కాస్త ఉన్నతమైన పదవుల లోనే ఉన్నారు. వాళ్లకి ఒక్కత్తే కూతుర్ని నేను.
వాళ్లకి నేను ఐఏఎస్ లాంటిది ఏదో సాధించి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉండాలని, లేదా ఏ ఇంజనీరింగో చేసి చక్కగా సెటిల్ అవ్వాలని కోరిక. నాకు అంత బాగా చదివి దానిని సాధించగలననే నమ్మకం కానీ, దాని మీద ఇంట్రెస్ట్ కానీ లేవు.
కానీ సమాజం కోసం ఏదైనా చేయాలనేది మాత్రం కోరిక.అయితే ఐఏఎస్ లాంటి వాటి ద్వారా ఇంకా బాగా సమాజ సేవ చేయొచ్చని మా నాన్నగారి వాదన. కానీ నాకెందుకో దానిపై నమ్మకం లేదు.
మనదేశంలో బ్యూరోక్రాట్స్ అంతా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఎత్తవలసిందే అని అనిపిస్తుంది నాకు.
వాళ్లు మనల్ని వామనుల్లాగా చిన్న కోరికే కోరుతారు. అది తీర్చాలంటే చివరికి మనం బలి చక్రవర్తి లాగా పాతాళానికి తొక్కేయబడాలి. ఒక సమయంలో ఉత్తమ కలెక్టర్గా అవార్డు పొంది ఆ తర్వాత కటకటాల పాలైన శ్రీ లక్ష్మీ ఉదంతమే దీనికి పెద్ద ఉదాహరణ.
సినిమాల్లో చూపించినట్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒంటరిగా ఈ రాజకీయ శక్తులను ఎదిరించి ఏమీ సాధించలేరని నా ప్రగాఢ విశ్వాసం.
అయితే జర్నలిస్టుగా ఏం సాధించగలం? అంటారేమో. కనీసం ఒకరికి లొంగి ఉండక్కర్లేకుండా స్వతంత్రంగా పనిచేయగలం అనే ధైర్యమైనా ఉంటుంది అని నా ఉద్దేశం.
అయితే ఇక్కడ ఒక జర్నలిస్టుగా నేను సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద మన భారతీయ మీడియా కరప్షన్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.
స్వాతంత్ర సమరం జరిగిన సమయంలో మన దేశ ప్రజలను జాగృతం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేసిన పత్రికా రంగం
స్వాతంత్ర దినోత్సవ అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది లంచగొండితనంలో అని చదివినప్పుడు చాలా బాధపడ్డాను.
కానీ ఇప్పటికీ మీడియాకి ఆ శక్తి ఉంది ఏదైనా మంచి చేయడానికి. ప్రజలు కూడా ఇప్పటికీ విశ్వసిస్తున్నారు మీడియాను.
అందుకే నాకు చేతనైన పరిధిలో ఈ రంగాన్ని సమాజ హితం కోసం వాడుకోవాలని నా ఆశ, ఆకాంక్ష .
అందులోనూ ఇది నాకు ఇష్టమై,నేను ఎంచుకున్న రంగం కనుక పూర్తిగా మనసుపెట్టి పనిచేస్తాను. ఎంతో కొంత సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను,” కాస్త ఆవేశపూరితంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పింది అనూష.
“చాలా బాగుందండీ, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలరు. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్,”హృదయపూర్వకంగా విష్ చేసిన పృద్విని చూసి నవ్వింది అనూష.
“ఓకే అండీ, వస్తాను. హోప్ వియ్ విల్ మీట్ ఎగెయిన్,” అంటున్న అనూష ను చూసి కంగారుపడ్డాడు పృద్వి.
” ఇప్పుడంటే ఏదో అదృష్టం కొద్దీ ఇలా కలిసాం కానీ ,ఈ హైదరాబాద్ మహానగరంలో ఒకరినొకరు యాధృచ్చికంగా కలవడం ప్రతిసారీ సాధ్యం కాదు కదండీ. అందుకని మీరు మరోలా అనుకోకపోతే మనం ఫోన్ నెంబర్లను ఎక్స్చేంజ్ చేసుకుందామా?
మీకు ఎప్పుడైనా కలవాలని అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి కలుద్దాం.
కానీ ఫోన్ నెంబర్ అడిగానని నా అంతట నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి. ఐ ప్రామిస్ ఐ యామ్ ఎ డీసెంట్ గయ్”,వినయంగా చెప్తున్న పృథ్వి మాటల పై నమ్మకం కలిగింది అనుషకు.
“ఓకే అయితే నా నెంబర్ …,”అంటూ చెప్పింది. పృథ్వి నెంబర్ తీసుకుని,అతనికి బై చెప్పి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతున్న అనుషను మళ్ళీ ఓసారి చూడకుండా ఉండలేకపోయాడు పృద్వి.
“పృథ్వి సార్, ఎక్కడున్నారు? ఒకసారి అర్జెంటుగా మన ఏరియా కి రాగలరా? ప్లీజ్ వెంటనే రండి,” ఫోన్లో కంగారుగా చెప్తున్న రాజేష్ మాట వినగానే, ఏం జరిగిందో అనే ఆందోళనతో బయలుదేరాడు పృద్వి.
(సశేషం)