పృథ్వి అనూష ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు. తమతో పాటు తమ చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలని కోరుకునే వారు. దానికి తమ వంతు కృషి చేయాలని భావించే వారిద్దరి మార్గాలు మాత్రం భిన్నమైనవి.
అక్షరాస్యత ద్వారా ప్రజల్లో అవగాహన తద్వారా సమాజం లో మంచి పెరుగుతుంది అని భావించి అక్షర యజ్ఞం మొదలెట్టాడు పృథ్వి.
అక్షరాన్ని ఆయుధం గా మార్చి సమాజం లో, రాజకీయ రంగం లో ప్రబలుతున్న అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జర్నలిజం ఎంచుకుంది అనూష.
భిన్న మార్గాల్లో పయనించే వీరిద్దరి గమ్యం ఒకటే. ఈ ప్రయాణం లో వీరెలా కలిసారు, ఏం జరిగింది అన్నది ముందు భాగాలలో చదవండి.
సంకల్పం
అలా నిలబడి చూస్తున్న వాళ్లకి, ఉన్నట్టుండి పోలీస్ పెట్రోలింగ్ జీప్ వస్తున్న శబ్దం అవడంతో గబగబా పక్కనే చెట్ల చాటుకు వెళ్లారు.
“పెట్రోలింగ్ టైం అయిపోయింది అని చెప్పావు కదరా? మళ్ళీ ఎలా వచ్చారు పోలీసులు?” అడిగాడు వారిలో ఒకడు.
“అవును, ఇందాకనే వెళ్ళిపోయింది పోలీస్ జీపు. నేను చూసాకే మీతో చెప్పాను. మళ్లీ వీళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు,చూద్దాం ఏం జరుగుతుందో,”అన్నాడు ఇంకొకడు.
పోలీస్ వాహనం వెనకాలే ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. అది చూసి మరింత ఆశ్చర్యపోయారు ఆ నలుగురు.
పోలీసులు,ఫైర్ ఇంజన్ సిబ్బంది కలిసి మొత్తానికి ఆ మంటలు ఆర్పేసి పృథ్వి ని కారులోంచి బయటకు తీశారు.
అదృష్టవశాత్తు పృథ్వి శరీరం పెద్దగా కాలిపోలేదు. కానీ ఆ మంట, పొగ వల్ల ఊపిరి ఆడినట్లు ఉండి అతను దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితులకు వెళ్ళాడు.
చర్మం నీలంగా మారిపోయింది.
వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు పోలీసులు. డాక్టర్లు ఆక్సిజన్ పెట్టడంతో కొద్దిసేపటికి మామూలు స్థితికి వచ్చాడు పృథ్వి.
అప్పుడు పోలీసులు అడిగారు అసలు ఏం జరిగింది అని.
విషయం వివరించాడు పృథ్వి.
అటువంటి ప్రాణాపాయ స్థితిలో అంత కూల్ గా ఆలోచించి 1095కి, 101 కి కాల్ చేసి,లైవ్ లొకేషన్ ఆన్ చేసి ఉంచాలని ఆలోచన రావడం నిజంగా చాలా గొప్ప విషయం అంటూ అతని సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారు పోలీస్ ఆఫీసర్.
ఆ సమయంలో తన మెదడు అంత చురుగ్గా ఎలా పనిచేసిందో తనకే గుర్తు లేదని, బహుశా ‘అపాయంలో ఉపాయం’ అంటే ఇదేనేమో అని అన్నాడు పృథ్వి.
అతను అలా పోలీసులతో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి అనూష వచ్చింది.
పృథ్వి ని చూసి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.
“ఏమిటి పృథ్వీ, ‘ఇక సెలవు, మరో జన్మ’ అంటూ ఏదేదో మెసేజ్ చేసి,ఫోన్ ఎత్తకుండా ఉంటే నేనేమైపోతాననుకున్నావు? అసలేం జరిగిందో అర్థం కాక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా?
ఫోన్ చేస్తుంటే ఎత్తవు. ఏం చేయాలో తెలియక శ్రీధర్ గారిని అడిగితే ఆయన తన ఫ్రెండ్ ఏఎస్పీ శంకర్ గారి సాయంతో నీ ఫోన్ ట్రాక్ చేయించి, నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టించి నాకు చెప్పారు.
ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు ఇలాగ. అసలు ఎవరు చేసి ఉంటారు ఇదంతా? నీ మీద ఇంత దారుణంగా అటాక్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ మధ్యకాలంలో ఎవరితోనైనా గొడవ పడ్డావా! అయినా నువ్వు ఆ రకం కాదు కదా?” ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్న అనూషను చూస్తూ నవ్వాడు పృథ్వి.
“అనూ ఆ ఎంక్వయిరీ అంతా పోలీసులు చేస్తారు లే. నువ్వు ఇలా వచ్చి నా ఎదురుగా కూర్చో చాలు,” ఏమి జరగనట్లు నార్మల్ గా మాట్లాడుతున్న పృథ్వి ని చూసి ఛర్రున కోపం వచ్చింది అనూష కి.
ఆమె మొహం చూడగానే ఆ విషయం అర్థమైంది పృథ్వికి.
“ఐ యాం వెరీ సారీ, అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఓసారి,”
అంటూ కావలసి తన గొంతును ఇంకా జీరగా చేసి పాడాడు.
“బాబోయ్ నువ్వు పాడకు బాబూ, నవ్వు కాదు ఏడుపొస్తుంది,” నవ్వుతూ చెప్పింది అనూష.
అవసరం అయితే మళ్లీ వస్తామని, ఈ లోగా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తామని చెప్పి వెళ్లిపోయారు పోలీసులు.
“నువ్వు ఆ మురికివాడల్లోకి వెళ్ళకు. ఆ అక్షరయజ్ఞం మానేయ్,అని ఎవరైనా అడిగితే ఏం చేస్తావు? అన్నావు గుర్తుందా ?ఆ మాటలే గుర్తొచ్చాయి అనూషా దాడి జరిగినప్పుడు.
నేను నడిచే బాటలో ఏ ప్రమాదము లేదని అనుకున్నాను. కానీ అలా భావించే అవకాశం లేదని ఈరోజు తెలిసింది.
అదేంటో యాదృచ్ఛికంగా జరిగిందేమో తెలియదు గాని ఈ సంఘటన జరగడానికి రెండు రోజులు ముందు ఈ వాట్సాప్ మెసేజ్ వస్తే చూసి నవ్వుకున్నాను. కానీ అదే నిజమవుతుందని ఊహించలేదు,” అంటూ తనకు వచ్చిన మెసేజ్ చూపించాడు అనూషకి.
“నా అక్షరా ఫౌండేషన్, అది సాధించిన విజయం ఎవరికో కంటగింపుగా ఉంది. ఎవరో తెలియదు కానీ ఒక విధంగా సంతోషంగానే ఉంది. ఇలా నామీద దాడి జరిగేంతగా నా అక్షర యజ్ఞం విజయం సాధించింది అంటే అది మామూలు విషయం కాదు కదా.
దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి.ఈ సంఘటన ఇంకో విషయంలో కూడా నా కళ్ళు తెరిపించింది. సమాజం కోసం మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ప్రమాదం గురించి ఆలోచించి వెరవకూడదు అని.
వన్స్ ఎగైన్ సారీ అనూ, మనసారా కోరుకుంటున్నాను. నిన్ను ఆరోజు అలా అడిగి బాధ పెట్టినందుకు నన్ను క్షమించగలవా?
నా జీవితంలోకి మళ్లీ వచ్చి వసంతాన్ని నింపగలవా?
నిజం అనూ,నువ్వు పరిచయం అవక ముందు 30 సంవత్సరాలు ఎలా బతికానో నాకు తెలియదు. నాకు గుర్తులేదు. కానీ నువ్వు వచ్చావు, నాలో ఆనందం నింపావు. ఆశలు రగిలించావు. మళ్లీ వెళ్ళిపోయావు.ఆ రోజు నుంచి నేను ఉన్నానంటే ఉన్నానంతే.”
ఎంతో ఆర్తిగా చెప్తున్న పృథ్వి మాటలు కొట్టి పారేయలేకపోయింది అనూష. గబుక్కున అతని దగ్గరికి వచ్చి పెదాలపై సుతారంగా తన పెదవులనుంచింది.. ఆ మధుర క్షణంలో ఇద్దరూ పోగొట్టుకున్న నిధిని తిరిగి పొందిన అన్వేషకులలా మారిపోయారు.
“సారీ టు డిస్టబ్ యూ,”అంటూ లోపలికి వచ్చిన పృథ్వి పేరెంట్స్ ని చూసి “బై పృథ్వీ,”అంటూ వెళ్లిపోయింది అనూష.
“నేను చెప్పాను కదా, ఇలాంటి రిస్కులు మనకు అవసరం లేదు. హాయిగా మన వ్యాపారం చూసుకుంటూ, అవసరమైతే ఆ సిఎస్ఆర్ కింద ఎంతో కొంత డబ్బు డొనేషన్స్ ఇచ్చేయమని. విన్నావా?ఇప్పుడు చూడు ఏం జరిగిందో! నా కొడుకు మీద చెయ్యి వేసిన వాడు ఎవడో తెలియాలి, వాడి అంతు చూస్తాను.”
ప్రేమతో కూడిన కోపం వల్ల వచ్చిన ఆవేశంతో మాట్లాడుతున్న తండ్రిని చూసి నవ్వాడు పృథ్వి.
పృథ్వికి జరిగిన ప్రమాదం గురించి పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టేసరికి రాజేష్ అతని టీమ్, తద్వారా ఆ మురికివాడలోని కుర్రాళ్ళందరికీ తెలిసింది.
తమ కోసం ఇంత చేస్తున్న అతనికి ఇలా జరిగిందని విని వాళ్లంతా ఎంతో ఆవేదనకి, ఆవేశానికి లోనయ్యారు.
ఎవరు చేశారో తెలిస్తే అతడ్ని ప్రాణాలతో వదలం అని ప్రతిణలు పూనుతూ, పృథ్వి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అతనికి వాట్సాప్ లో వందలు, వేలలో మెసేజ్ లు వచ్చాయి.
వాటిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు పృథ్వి.
మరుసటి రోజు ఉదయం అనూష, శ్రీధర్ లని, పోలీస్ ఆఫీసర్ ని తన ఇంటికి రమ్మని కబురు చేశాడు.
వాళ్ళు వచ్చిన తరువాత,ఆ ఆఫీసర్ తో,
” సర్ నా మీద జరిగిన దాడి గురించి నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వడం లేదు. కనుక మీ ఎంక్వైరీ ఆపేసేయండి.ప్లీజ్,” అని చెప్పాడు.
ఆ తర్వాత తన ఫోన్ లో కెమెరా ఆన్ చేసి,
“నా అక్షరా ఫౌండేషన్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సభ్యులైన వారందరికీ నా విన్నపం. ఇటీవల నాపై జరిగిన దాడి గురించి మీరంతా ఎంతో బాధ పడ్డారని నాకు అర్ధమైంది. మీరంతా నా శ్రీయోభిలాషులు . అందుకే అలా రియాక్ట్ అవుతున్నారు. మీలో చాలా మంది ఆవేశంతో,ఆ పని చేసిన వారు దొరికితే చంపేస్తామని ప్రతిణలు కూడా చేశారని విని నేను ఎంతో బాధపడ్డాను.
మీరు అలా ఆలోచిస్తే ఆ దాడి చేసినవాడు గెలిచినట్లే కదా! ఔను మీరంతా చదువుకుని చెడుకి, నేరాల కి దూరంగా బ్రతకటం ఇష్టం లేని ఎవరో ఈ పని చేసారు. ఇప్పుడు మీరు నా కోసమైనా సరే ఆ బాటలోకి మళ్ళీ ప్రయాణిస్తే వాళ్ళదే విజయం ఔతుంది. కనుక ఇలాంటి సమయంలోనే మనం ఇంకా శాంతంగా, సంయమనం గా ఉండాలి. మీరంతా ఇంకా బాగా చదువుకుని, మీరు కోరిన రంగాలలో రాణిస్తేనే అలాంటి వారికి గొడ్డలి పెట్టు. అదే మన విజయం. ఈనాటి నుంచి నా ఈ జీవన ప్రయణంలో నాకు భాగస్వామి గా మారబోతున్న అనూష ను మీకందరికీ పరిచయం చేస్తున్నాను.
అలాగే మనకు అవసరమైన మీడియా సహకారం అందించ బోతున్న ‘సివిటాస్- నవ సమాజం కోసం’ ఛానెల్ ఎండీ శ్రీధర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థాంక్యు సర్.
మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయ చేసి ఆవేశపడకుండి.” ఈ మెసేజ్ తన ఫౌండేషన్ లో ఉన్న అందరి ఫోన్ లకు పంపించే ఏర్పాటు చేశాడు పృథ్వి. అలాగే సివిటాస్ ఛానెల్ లోనూ ప్రసారం చేయమని చెప్పాడు శ్రీధర్ గారికి.
“తప్పకుండా చేస్తాను పృథ్వీ. మొత్తానికి సమాజానికి మంచి చేయాలనే మీ ఇద్దరి ‘సంకల్పం’, మీ ఇద్దరినీ ఒకటి చేయాలనే ఆ ప్రకృతి ‘సంకల్పం’ చాలా బలమైనవి. అందుకే ఇంత పెద్ద ప్రమాదాల నుంచి మీ ఇద్దరూ రక్షించబడ్డారు.
ఇకపై మీకు ఏ ఇబ్బందీ లేకుండా నిండు నూరేళ్ళు హాయిగా, సంతోషంగా జీవించండి. ఇదే మా పెద్ధలందరి ఆశీర్వాదం అంటున్న శ్రీధర్ గారి మాటలకు జత కలిపారు పృథ్వీ తల్లిదండ్రులు.
(సమాప్తం)