భారతదేశఁలో శ్రీరామనవమి అనగానే ప్రతి హిందువులోను భక్తి, ఉత్సాహం ఉప్పొంగి భక్తులందరు కలసికట్టుగా చేసుకునే ఒక పెద్ద పండుగ. మన దేశంలోనే కాకుండా హిందూమతాన్ని అవలంభించే విదేశాలలోని వారు కూడా ఈ ఉత్సవాన్ని 5 లేదా 9 రోజులు జరుపుకుంటారు. ఆ రోజు చలువ పందిళ్లు చేసి, మేళతాళాలతో సీతారాముల కల్యాణం చేసి వడపప్పు, బెల్లంపానకం, చలివిడి ప్రసాదంగా నైవేద్యం పెట్టి భక్తులందరికి పంచి పిండి వంటలతో భోజనాలు పెడతారు. అసలు రామాలయం లేని గ్రామమే ఉండదు. మన తెలుగు రాష్ర్టాలలో, అన్నిట సీతారాముల కల్యాణమును వైభవంగా జరుపుకుంటారు. భద్రాచలంలో జరుపుతున్న శ్రీ సీతారామ కల్యాణం టివిలలో చూసి ఆనందిస్తారు. కొంతమంది ఆ రోజుకు భద్రాచలం వెళ్లి కల్యాణవేడుకలలో పాల్గొని, సీతారాముల కల్యాణ తలంద్రాలను ప్రసాదంగా పొందుతారు. ప్రభుత్వంవారు ప్రతి ఏటా సీతారాములకు పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు సీతారాముల కల్యాణ సమయంలో అందజేస్తారు. తలంబ్రాలుగా పోసే బియ్యమును, ధాన్యము దంచి కాకుండా గోళ్లతో వలిచి తయారుచేస్తారు.
త్రేతాయుగంలో రావణాసురుడు అండతో రాక్షసులందరు విజృంభించి దేవతలను, మునులను, జనులను ఎంతో ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. వారి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి రక్షించమని వేడుకొనగా వారికి అభయమిచ్చెను.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే
అన్న నా మాట ప్రకారం నేను కోసల దేశం రాజు, ఇక్ష్వాక వంశస్థుడు అయిన దశరథమహారాజు రాముడు అనే పేరుతో పెద్దకొడుకుగాను, ఆదిశేషుడు లక్ష్మణుడుగాను, శంఖ చక్రములు భరతుడుగాను, శతృఘ్నుడుగాను, మహాలక్ష్మి సీతాదేవిగా మిథిలానగర రాజు జనకుని కుమార్తెగాను జన్మస్థానమని చెప్పాడు. రాముడు సాక్షాత్తు ఆ శ్రీహరి తన 7వ అవతారముగా చెత్రశుద్ధ నవమినాడు భూలోకంలో జన్మించాడు.
శ్రీరాముడు వీరత్వము, సూరత్వము, ధీరత్వము, కరుణ, గురుభక్తి, సత్యదీక్ష. పెద్దల గురువుల ఎడ గౌరవం, ప్రజలను కన్నబిడ్డలుగా చూసే పరిపాలనా దక్షత, దాతృత్వం, భాతృప్రేమ, భార్య పట్ల ప్రేమ, ఏకపత్ని దీక్ష కలిగిన ఆదర్శప్రాయుడైన పరిపూర్ణ మానవుడు కల్యాణరాముడు. అందుకే శ్రీరాముడిని “రామో విగ్రహవాన్ ధర్మః “ అన్నాడు తాటకి కుమారుడు మారీచుడు.
విశ్వామిత్రుడు తాను చేసే యాగ సంరక్షణకు రాముని పంపమని కోరగా ముందు నిరాకరించినా, తరువాత వారి కులగురువు వశిష్ఠుడు చెప్పగా విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను పంపెను.
వారు తాటకి, సుబాహువు అనే రాక్షసులను చంపి విశ్వామిత్రునితో యాగ పరిసమాప్తి చేయించారు. తరువాత విశ్వామిత్రుడు వారిని వెంటబెట్టుకొని మిథిలానగరానికి సీతా స్వయంవరమునకు తీసుకెళ్లాడు. అక్కడ విశ్వామిత్రుని ఆజ్ఞతో శివధనస్సు విరిచిన రామునకు సీతను, రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణునకు, జనకమహారాజు తమ్ముడు పెద్ద కూతురు మాండవిని భరతునకు, రెండవ కుమార్తె శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి చైత్రశుద్ధ నవమి నాడు జనకమహారాజు మిథిలానగరంలో వివాహం చేసాడు. ఆ వివాహానికి దశరథుడు వారి భార్యలు, వసిష్ఠుడు, గురువులు పెద్దలను మిథిలకు పిలిపించి వారి సమక్షములో అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఆదర్శదంపతులైన లక్ష్మీనారాయణులను సీతారాములుగా వారి కల్యాణం చూసి దేవతలందరు ఆనందించి పూలవాన కురిపించారు. ఈ విధఁగా జన్మతిథిలోనే వివాహం కూడా జరిగిన పురా పురుషుడు శ్రీరాముడు.
యుగాలు గడిచినా “శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష” అని ఈ కలికాలంలో కూడా ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామకల్యాణం జరిపించి ప్రజలఁదరు తరిస్తున్నారు. కలియుగఁలో రామ రానామ స్మర భవతారకఁ అన్నారు మన ఋషులు. ‘రా’ అనగా సమస్త పాపములను క్షయము చేయునది అని ‘మ’ అనగా మళ్లీ ఆ పాపములను తిరిగి రావు అని అర్థం. ఈనాటికి వివాహం జరిపించే వధూవరులకు సీతారాములు ఆదర్శప్రాయంగా ఉండాలని సీతారాముల పేరుమీద శుభలేఖలపై శ్లోకాన్ని కూడా ముద్రిస్తారు. సీతారాములు ఒకే ఆత్మగా ఉండేవారు. సీతను వెదుకుటకు లంకకు వచ్చిన హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతను చూసినపుడు ఆమె అచ్చం రాముడిలా కనిపించి ఆశ్చర్యచకితులను చేసిందిట.
జానక్యాః కమలామలాంజలి పుతేయాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః
స్తస్తాశ్యా మల కాయకాన్తి కవితాః యా ఇంద్రనీలాయితాః
ముక్తాస్తాశుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః
చైత్రశుద్ధ దశమినాడు పట్టాభిషేకం కూడా చేస్తారు. కొంతమంది శ్రీరామ నవరాత్రులలో ఏదో ఒకరోజున కూడ చేస్తారు. శ్రీరాముని రక్షతో ప్రజలు ఆనాడు ఎంత ఆనందంగా జీవించాలో అదేవిధంగా ఈనాటికి మనం
ఆపదామపహర్తారం ధాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
అంటూ ఆయనని స్మరిద్దాం. సకల పాపాలను పోగొట్టుకని తరిద్దాం.