” అట్టడుగున పడి కాన్పించని, కథలెన్నో కావాలిప్పుడు ” అన్నాడు శ్రీశ్రీ.
80వ. దశకంలో స్త్రీ శక్తిసంఘటన వారు పూనుకొని ” మనకు తెలియని మన చరిత్ర ” పుస్తకాన్ని తెచ్చి ఉండకపోతే ఉద్యమంలో పని చేసిన ఎందరో మహిళలు మరుగున పడి ఉండేవారు. అందుకే ఉద్యమంలోకి వెళ్ళిన ఎందరో పురుషుల కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి సహచరులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈనాడు ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వాళ్లలో B.S రాములు గారి సహచరి శ్యామల గారి భయంలో నుంచి భద్రతలోకి సాగిన జీవన గమనాన్ని తరుణి పాఠకుల కోసం ఆమె మాటల్లోనే…
1. నమస్తే! శ్యామల గారూ! బాగున్నారా?
జ. నమస్కారమండీ! బాగున్నాము.
2. మీరు ఎప్పుడు? ఎక్కడ జన్మించారు?
జ. 14/9/1954 లో పుట్టాను. కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల తాలూకా లోని పైడిమడుగు అనేది మా ఊరు.
3. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి.
జ. నాయన పేరు చెన్న నారాయణ. అమ్మ పేరు చెన్న గౌరమ్మ. మేము ఎనిమిది మంది తోడబుట్టినోళ్ళం. నాకు ముగ్గురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, ఉన్నరు.
4. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. బడికి పోయి నేనేమీ చదువుకోలేదు. మా ఊళ్ళో బడి కూడా లేకుండే. కానీ నాకు చదువంటే చాలా ఆసక్తి. నాకు పన్నెండేళ్ళు ఉన్నప్పుడు మా ఊర్ల చిన్న బడి వెట్టిండ్రు. అప్పుడు దూరం కూసోని అఆ లు, గుణింతాలు నేర్చుకున్న. మా కుటుంబ మిత్రులు ప్రభాకర్ స్మిత దంపతులు శాతవాహన స్కూలు నడిపేది. మా పిల్లలు బడికి పోయినాక, నేను స్మిత్ మేడం దగ్గరికి పోయినప్పుడు, చదువు పట్ల నాకున్న ఆసక్తిని గమనించి ఆమె నాకు చదువు నేర్పింది. ఇప్పుడు వార్తాపేపర్, కథల పుస్తకాలు చదువుత.
5. మీకు ఎప్పుడు పెళ్ళి అయింది? మీ కుటుంబ వివరాలు చెప్పండి.
జ. 17/5/1973 లో పెళ్ళయింది. అప్పుడు నాకు 18 ఏళ్ళు. మామ పేరు నారాయణ. అత్తమ్మ పేరు లక్ష్మిరాజు, మరిది పేరు గోపాలు. అప్పుడు మా సారుకు ( బీ.ఎస్. రాములు ) ఉద్యోగం కూడా లేకుండే… నాకు నలుగురు కొడుకులు.
6. మీ సారుకు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది? ఎక్కడెక్కడ పనిచేశారు?
జ. 1975 ల మా సారుకు ఉద్యోగం వచ్చింది. ఎలగందల, హుజూరాబాద్, వేములవాడ, మల్యాల అనే ఊర్లలో పని చేసినరు.
7. ఆయన ఎప్పుడు జైలుకు వెళ్లారు?
జ. 1984 జనవరిలో అరెస్టు చేశారు. కోరుట్ల లాకప్ లో వారం రోజులు ఉంచి, కరీం నగర్ జైలుకు పంపినరు. అక్కడ మూడు వారాలున్నడు. కోరుట్లల ఉన్నప్పుడు మా చెల్లెలు సరోజ రోజూ టిఫిన్ పట్కపోయి ఇచ్చేది. అప్పుడు మా చిన్న కొడుకు వయసు ఒక నెల. ఆయనకు బెయిలు తీసుకు రావడానికి చాలా కష్టపడ్డాను. దానికి అవసరమైన కాయితాల కొరకు, లాయర్ దగ్గరికి పోవలసి వచ్చినప్పుడు… నెల బాలింతగా నెల పిల్లాడిని చంకలో వేసుకొని, సరిగ్గా నడక కూడా రాని ఇంకో పిల్లాడిని ఒక చేత్తో పట్టుకొని తిరిగేదాన్ని. కోరుట్ల నుంచి మా చెల్లెలు సరోజ రేషన్ బియ్యం తెచ్చి ఇస్తుండే. ఎన్నో రకాలుగా సాయపడుతుండే.
8. సార్ ఇంటికి వచ్చాక ఏం జరిగింది?
జ. సస్పెండ్ చేశారు. రూలు ప్రకారం సగం జీతం ఇవ్వాలంట. అది కూడా ఇచ్చే వారు కాదు. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మాకు రేషన్ కార్డు కూడా లేకుండే…అప్పుడు జగిత్యాలలో ఉన్నము. నా తోడబుట్టినోళ్ళు కొంచం సాయం చేసిండ్రు. నా సొంత అన్న లాంటోడు నిజాం వెంకటేశం కూడా సాయం చేసిండు. ఆరు నెలలు అప్పుడప్పుడు మాత్రమే మా సార్ కలిసేది. నిఘా పెట్టారు. నిర్బంధం ఎక్కువైంది. ఆ సమయంలో పూర్తిగా లోపలికి వెళ్ళి పోయారు.
9. నక్సలైట్ ఉద్యమం పైన మీకు అవగాహన ఉందా?
జ. కొంతవరకు ఉంది. అప్పటికే మా చిన్నబాపు అల్లుడు కల్లూరి నారా యణ పార్టీలో full time పని చేస్తుండే … ఆయన ఆ ప్రాంతానికి పెద్ద లీడరు. అలా మా యింట్లో దానిగురించి మాట్లాడుకునేటోళ్ళు.
10. సారు ఎన్నేళ్లు లోపల (UG) ఉన్నారు? అప్పుడు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఏమిటి?
జ. 1984-90 వరకు ఆరేళ్లు లోపల ఉన్నరు. నేను నలుగురు పిల్లలతో ఒక్క రూంల సర్దుకొని మిగతా రూములు కిరాయికి ఇచ్చిన. బీడీలు చేసేదాన్ని. కానీ పోలీసులు తరచుగా ఇంటికి వచ్చి మస్తు లొల్లి చేసిటోళ్లు. కిరాయికి ఉన్నోళ్ళను భయ వెట్టి ఖాళీ చేయించిన్రు. అప్పుడు ఒక్కదాన్ని ఉండలేక జగిత్యాలలో మా అత్తమ్మ దగ్గరికి పోయి ఉన్న. అది చిన్న పెంకుటిల్లు. బాత్రూం కూడా లేకుండే. అవతలికే పోతుంటిమి. అక్కడ కూడా బీడీలే చేస్తుంటిని. ఆ రోజులల్ల వెయ్యి బీడీలు చేస్తే 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు. రోజుకు వెయ్యి బీడీలు చేసేదాన్ని. ఆ మొత్తం పైసలు 15 రోజులకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. బీడీ కార్మికులు సమ్మె చేసినప్పుడు పని ఉండేది కాదు. ఆ సమయంలో నా తోడబుట్టినోళ్లే సాయం చేసిండ్రు. NT రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద 16 రూపాయలకు ఒక చీర ఇచ్చేది. రెండు చీరలు ఉండేటివి. ఒక చీర కట్టుకుంటే ఇంకో చీర పరుచుకుని పండుకునేదాన్ని. ఆ పరుచుకున్న చీరనే స్నానం చేసి కట్టుకునేదాన్ని. అంటే పక్క బట్టలు కూడా ఉండేవి కాదు. పిల్లలకు కూడా ప్యాంట్లు కాకుండా నిక్కర్లే వేసేదాన్ని. ఒక్కొక్క సారి ఉన్న అన్నం పిల్లలకు పెట్టి నేను నీళ్ళు తాగి పండుకునేదాన్ని. నేను బొట్టు, పూలు పెట్టుకుంటే… “మొగడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటడు”. అని నాకు ఇన్పించేటట్లు అమ్మలక్కలు మాట్లాడుకునేటోళ్ళు. ఆ మాటలు నన్ను మరింత కుంగదీసేది.
11. మీ అత్తా కోడళ్ళ అనుబంధం గురించి చెప్పండి.
జ. మా అత్తమ్మ చాలా మంచిది.” నువ్వూ మొగడు లేక, బీడీలు చుట్టి పిల్లల్ని పెంచినవు. నేనూ మొగడులేక బీడీలు చుట్టి పిల్లల్ని పెంచుతున్న. మన బతుకులింతే… ” ఇట్ల నేనే బాధ అయినప్పుడు ఆమె మీద అరిచేదాన్ని. దానికి ఆమె ” అట్లనకే శామలా , నా మొగడు చచ్చిపోతే నేను పిల్లల్ని పెంచిన. కానీ నా కొడుకు ( నీ మొగడు ) ఒత్తడే ” అని నన్ను సముదాయించేది. కానీ నాకు మాత్రం ఆయన వస్తడనే ఆశ లేకుండే… ఎక్కడ ఎన్ కౌంటర్ వార్త విన్నా మస్తు బుగులయ్యేది.
12. మీకు చాలా కష్టమనిపించిన మరో రెండు మూడు ముచ్చట్లు చెప్పండి.
జ. “కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డది” అన్నట్టు ఉండే నా పరిస్థితి. మా ఇంట్ల ఎలుకలు చాలా ఉండేవి. అటక మీద ఉన్న సామాన్లు పాడు చేసేటివి. ఒకసారి నేను నెల బాలింతగా ఉన్నప్పుడు నిచ్చెనెక్కి అటక మీద సర్దుతున్న. అప్పుడు నిచ్చెన జారి నిట్టనిలువున కింద పడ్డ. పొద్దుగాల పదిగంటలకు కింద పడితే సాయంత్రం ఆరుగంటలకు నన్ను నాయుడు దవాఖాన్ల చేరిపిచ్చిన్రు. అప్పటి దాకా ఇంట్లోనే వైద్యం చేసిన్రు. అపుడు రెండు కాళ్ళకు సిమెంటు పట్టీలు కట్టిండు డాక్టరు. గట్ల ఆరు నెలలు మంచం మీదనే ఉన్న. దానికి తోడు చిన్నపిల్లలు. వాళ్ళను సముదాయించు డు చాలా కష్టమయ్యేది.
మా ఇంట్లో ఎలుకలు ఉండేవని చెప్పిన కదా…వాటి కోసం పాములు వచ్చేవి. పెంకుటిల్లు… పైన వాసాలు, దూలాల మీద కనిపించేవి. పగలు కనిపిస్తే ఆ రాత్రి పక్కింట్లో పండుకునేదాన్ని పిల్లలతోపాటు. కానీ ఒకరోజు మధ్య రాత్రి పిల్లలు పండుకున్నాక కనిపించింది. వామ్మో! … ఆ రాత్రి పిల్లలను తీసుకొని బయటకు పోలేను కదా… పిల్లలను చూసుకుంట దానిని చూసుకుంట బిక్కు బిక్కుమంటా ఆ రాత్రంత గడిపిన. ఇప్పటికీ అది గుర్తుకొస్తే నా ఒళ్లంతా బుగులుతో జలదరిస్తది.
ఇంకో ముచ్చట చెప్తా… మా ఇంటెనక బిల్డింగ్ కట్టడానికి పిల్లర్లు పోయడానికి పెద్ద పెద్ద గుంతలు తీసిన్రు. అప్పుడు ఒక రోజు వాన పడ్డది. మా పాణి వాడి దోస్త్ కస్తూరి శీను ఆడుకోవడానికి పోయినరు. వాళ్ళ ఎనక శ్రీకాంత్ (రెండో బాబు) కూడా ఉరుక్కుంట పోయి గుంటల పడ్డడు. తమ్ముణ్ణి తియ్యబోయి పాణి కూడా గుంతల పడ్డడు. ఆ సమయంల వాళ్ళ దోస్త్ అట్లనే విడిచిపెట్టి వచ్చి ఉంటే నాకు ఇద్దరే కొడుకులు ఉందురు. కానీ వాడట్ల రాలేదు. ధైర్నం చేసి వాళ్ళను కాపాడి తీసుకచ్చి నాకప్పజెప్పిండు. ఒంటి నిండ బురదతోని బుగులు బుగులుగున్న నా బిడ్డలను చూసి నా గుండె ఆగినంత పనైంది. ( శ్యామలగారు చాలా ఉద్వేగభరితులయ్యారు )
13. BS రాములు గారు తిరిగి వచ్చినప్పటి మీ ఫీలింగ్స్ చెప్పండి.
జ. ఒకరోజు రాత్రి దబ దబా తలుపులు కొట్టినరు. తలుపు తీసి చూద్దును కదా… ఎదురుంగ పెద్ద గడ్డంతో మా సారు, ఆ ఎనక గద్దరు, మాభూమి సంధ్య, వరవర రావు, దేవులపల్లి అమర్ మరికొందరున్నరు. నాకు నోట్ల నుంచి మాట రాలేదు. వస్తడనే ఆశ లేదు కదా… పిల్లలను, నన్ను చూపించి తీస్కపోనికి వచ్చినరు అనుకున్న. ఏమ్మా! ఉంచి పొమ్మంటవా? తీసుకపొమ్మంటవా? అని నన్ను అడిగినరు. మా అన్నలను కూడా పిలిపించిన. “ఉంచితే మరి క్షేమంగా ఉంటడ” అని అడిగినరు. మా అన్నలు బావను బాగా చూసుకుంటమని చెప్పారు. వచ్చిన వాళ్ళు వెళ్ళి పోయారు. తెల్లారి మా అన్నలను, ఇంకొంత మందిని తీసుకొని పోలీస్ స్టేషన్ కు పోయిండు. తరువాత యూనియన్ వాళ్ళతో పోయి కలెక్టర్ ను కలిసిండు. వారం రోజులల్ల ఉద్యోగం కూడా వచ్చింది. అప్పుడు మా పాణి ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిండు.
14. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. నాకు నలుగురు కొడుకులు. వరుసగా మూడేళ్ళ ఎడమతో 74, 77, 80,83 లలో పుట్టారు. పాణిగ్రాహి, శ్రీకాంత్, కిరణ్, నరేశ్ వాళ్ళ పేర్లు. అందరు పెద్ద చదువులు చదువుకున్నరు. ఇక్కడొక ముచ్చట యాదికొచ్చింది. నా మూడో కొడుకు కిరణ్ ను ఐదో తరగతిల గవర్నమెంటు బడిల ఏసిన. ఆ బడికి పోనని మస్తు ఏడిచిండు. అప్పుడు జరమచ్చింది. చూడనీకి నిజాం వెంకటేశం, అలిశెట్టి ప్రభాకర్, జయధీర్ తిరుమల రావు మా ఇంటికి వచ్చినరు. సంగతి తెలుసుకొని, స్కూల్ డ్రెస్స్ , పుస్తకాల పెట్టే కొనిచ్చిన్రు. వాళ్ళంతా మా కుటుంబ మిత్రులు. పాణి ఏడు, ఎనిమిది తరగతులల్ల ఉన్నప్పుడు గంటలకొద్దీ లైన్ లల్ల నిలబడి రేషన్ సామాను తెచ్చేటోడు. పిల్లలు అప్పుడప్పుడు బీడీలకు దారం చుట్టేవాళ్లు. పాణికి మా నాన్న ఇంటర్ల ఫీజు కట్టి, ఒక డ్రెస్ కుట్టించిండు. పాణి రాత్రి ఉతికి ఆరేసుకొని తెల్లారి వేసుకొని గవర్నమెంటు కాలేజీకి పొయ్యేటోడు.
15. మీ పిల్లలందరూ ఇంజనీరింగ్ చదివారు కదా… అందులో మీ కృషి గురించి చెప్పండి.
జ. పాణిగ్రాహి బి.టెక్, ఎం.టెక్ చదివి, ఒక ఏడాది బెంగళూర్ లో ఉద్యోగం చేసిండు. తరువాత 1998లో కంపెనీ వాళ్ళు అమెరికాకు పంపిన్రు . ఇప్పుడు చికాగోలో ఉన్నడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. శ్రీకాంత్ కూడా ఎం. సిఏ చదివి అమెరికాలో ఇండియానా పోలీస్ లో ఉన్నడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు నరేశ్ హైదరాబాదులోనే సాదన్ కాలేజీల ఇంజనీరింగు చదివిండు. అప్పుడు మిగతా ఇద్దరు ఉద్యోగ ప్రయత్నాలల్ల హైదబాదులనే ఉన్నరు. వాళ్ళ కొరకు 2001ల హైదరాబాదుకు వచ్చిన. ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ముందు కొన్ని రోజులు వారసిగూడలో ఉన్న. తరువాత మెహిదీపట్నం కాకతీయ నగర్ ల ఉన్నము. ఆప్పుడు ఇల్లు గల్లామె చాలా సతాయించేది. అక్కడి నించి ఇల్లు మారి విద్యానగర్ వచ్చినం. తర్వాత కిరణ్ ఆస్ట్రేలియాకు పోయిండు. ఆయనకు ఒక కొడుకు, ఒక బిడ్డ. 2019ల నరేశ్ ఐర్లాండ్ పోయిండు. ఆయనకు ఒక బిడ్డ, ఒక కొడుకు. నాకు ఐదుగురు మనుమలు, ఇద్దరు మనమరాండ్లు అన్నమాట. ఎన్ని కష్టాలు పడ్డా మా ముగ్గురు పిల్లలను ఇంజనీరింగు చదివించిన కనుక సాహితీవేత్త నిజాం వెంకటేశం నాకు ‘ మదర్ ఆఫ్ ఇంజనీర్స్ ‘ అని బిరుదు ఇచ్చిండు.
16. మీరు మొదటిసారి అమెరికా ఎప్పుడు వెళ్ళారు? ఆ అనుభవం గురించి చెప్పండి.
జ. మొదటిసారి 2005లో నేనొక్కదాననే అమెరికాకు పోయిన. పాణి దోస్త్ వెంట ఉండే. చిన్నప్పుడు వాకిట్ల మంచం మీద పండుకొని ఆకాశంల పోయే గాలి మోటర్ని చూసేదాన్ని. అది చిన్నగ బొమ్మవోలె కనబడేది. అసలు కలల కూడా అనుకోలేదు. విమానం ఎక్కుత అని. ఇప్పుడు విమానం ఎక్కిన. ఆ మబ్బులల్ల నుంచి పోతుంటే ఆ మజానే వేరు. ఒకప్పుడు స్నానం చేయడానికి బాత్రూము కూడా లేకుండే. గోనె సంచి అడ్దం కట్టుకొని స్నానం చేసిన రోజులల్ల నుండి పెద్ద పెద్ద బాత్రూములల్ల, ఆ టబ్బులల్ల స్నానం చేసిన. ఐదుసార్లు అమెరికాకు, ఒకసారి ఆస్ట్రేలియాకు పోయిన. మా ఖాన్ దాన్ ల నేనే మొట్టమొదట విమానం ఎక్కిన. అప్పుడు మావళ్ళు అందరు చాలా గొప్పగ చెప్పుకున్నరు. తెలంగాణా పల్లెల్ల తిరిగిన నేను అమెరికాల ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ ల నడుమ తిరుగుతుంటే… ఇది నా జీవితమేనా! అని ఆశ్చర్య పోయిన.
17. బి.ఎస్. రాములుగారికి తెలంగాణా బి.సి. కమిషన్ చైర్మన్ పదవి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?
జ. అది కూడా వస్తది అనుకోలేదు. అది అంత పెద్ద పోస్ట్ అని కూడా నాకు తెల్వదు. కానీ అది వచ్చినాక మేము యాదగిరి గుట్ట దర్శనానికి పోయినం. అప్పుడు కలెక్టరు, పెద్ద పోలీస్ ఆఫీసర్లు ముందర ఉండి, స్వాగతం చెపుతూ గుడి లోపలికి తీసుక పోయినరు. ఐదు మంది వేద పండితులు దగ్గర ఉండి పూజ చేయించినరు. అప్పుడు తెల్సింది అది ఎంత పెద్ద పోస్టు అని. కన్పిస్తే కాల్చి వేత ఉత్తర్వులు కూడ ఉండే… ఆ పోలీసులే ఇప్పుడు సెక్యూరిటీగ వచ్చిరి. నాకంతా అయోమయంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటది.
18. గొప్ప రచయిత సహచరిగా మీ ఆలోచనలు చెప్పండి.
జ. అది నా అదృష్టం. కాళోజి, దాశరథి,నారాయణ రెడ్డి లాంటి పెద్ద పెద్ద కవులను పిలిచి మా సారు మీటింగ్ లు పెడుతుండే. దాని వల్ల నేనే కాదు, మా వాళ్ళు అందరూ వాళ్ళను చూసే అవకాశం దొరికింది. నేను ఇట్ల మీకు ఇంటర్వ్యూ ఇస్తున్ననంటే అందువల్లనే…
19. భరించలేని కష్టాలు, అందుకోలేని ఆనందాలు మీ జీవన గమనంలో చూసారు కదా… మీకేమనిపిస్తుంది?
జ. నేను దేవుణ్ణి నమ్ముత. కష్టాలల్ల ఉన్నప్పుడు నేను చాలా వారాలు సంతోషి మాత పూజ చేసిన. అప్పుడు మా సారు క్షేమంగా ఇంటికొస్తే చాలని కోరుకున్న. అంతే… కానీ ఆ అమ్మ నేను అడిగిన దానికంటే చాలా ఎక్కువ నాకిచ్చింది. జీవితంల ఎప్పుడు ఏమైతదో తెల్వదు. అందరు మంచిగుండాల. మనం మంచిగుండాల.
20. ఇంకా జీవితంలో మీరేం కోరుకుంటున్నారు?
జ. నాకిప్పుడు ఏ కోరికలూ లేవు. ఎన్నో కష్టాలు చూసిన. పిల్లలు ఎదిగినరు. మా సార్ బి. సి కమిషన్ చైర్మన్ అయ్యిండు. మా పిల్లలు చాలా సంతోష పడ్డరు. మా కుటుంబాలల్ల ఊహించని గౌరవం ఇది. ఆరోగ్యంగా ఉండాలి. నా పిల్లలు, వాళ్ళ పిల్లలూ బాగుండాలి. అందరూ బాగుండాలి.
21. మీ సహచరుని పై మీ అభిప్రాయం చెప్పండి.
జ. మా సారు ప్రజల మనిషి. నక్సలైట్, తెలంగాణ, దళిత, బహుజన ఉద్యమాలల్ల ఎండ్ల పని చేసినా ప్రజల కొరకే చేసిండు. చేస్తున్నడు. రచయితగా కూడా ఆయన ప్రజల పక్షమే… మూడు భాగాలు ఆయన స్వీయ చరిత్ర రాసిండు. నాలుగో భాగం ఇంకొన్ని రోజులల్ల వస్తది. ఆయన ఈ మధ్య సామాజిక తత్వశాస్త్రం గురించి ఎక్కువ ఆలోచన చేసి రాస్తున్నడు. ఈ వయసుల కూడా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తనే ఉంటడు.
22. చివరగా ఈ తరం ఆడపిల్లలకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. ఆడపిల్లలు మంచిగ చదుకోవాలే. ఉద్యోగాలు చేయాలె. ఎన్ని కష్టాలొ చ్చినా నిలబడి ధైర్నంగ ముందుకు పోవాలె. ఎవరికి వాళ్లు మంచోల్లే అనుకుంటరు. కానీ అందరి దృష్టిల మంచోల్లు కావాలె.