
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కే. వి.మహదేవన్
గీత రచయిత: సినారె
నేపద్యగానం : చిత్ర , వాణీ జయరామ్
పల్లవి : శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి
భగవన్నామ సంకీర్తనమే కృతి ముఖ్యోద్దేశం . నాచే గానం చేయబడుతున్న ఈ కృతిలో పాటకు ఆధారమైన ధ్వని తరంగానివీ నీవే, పాటకు గతి అంటే పాటను నడిపించే గమనానివీ నీవే తల్లీ అంటూ ఆ శారదాంబను స్తుతిస్తున్నారు.
ధృతి నీవు ద్యుతి నీవు.. శరణాగతి నీవు భారతి
నేను ఈ పాటను ఆకళింపు చేసుకొని పాడగలుగుతున్నానంటే , పాటలో ఇమిడి ఉన్న ఛందస్సును గ్రహించి, పాడటానికి అవసరమైన ధారణాశక్తిని ప్రసాదించిన తల్లివి నీవే అంటూ భారతీదేవిని సర్వస్య శరణాగతి చేస్తున్నాడు.
చరణం : నీ పదములొత్తిన పదము.. ఈ పథము నిత్య కైవల్య పదము
నీ చరణ సేవైన ఈ మార్గం ఏదైతే ఉందో అది మోక్ష సాధనకు బాటలు వేసి, నన్ను నీలో ఐక్యం చేసుకొనే పరమపద సోపానం అంటూ సరస్వతీ దేవికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నారు.
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్థ నిధులున్న నెలవు
నీ పద సన్నిధిలో జీవితం గడపాలని కోరుకునే ఈ శరీరం సమస్త వేదాల సారమైన నిధి నిక్షేపాల నిలయం వంటిది అంటున్నారు.
చరణం: శ్రీనాథ కవినాథ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
శృంగార రసంతో కూడుకున్న కవిత్వమనే అలలను నీ ప్రేరణ వల్లనే కవిసార్వభౌములైన శ్రీకృష్ణదేవరాయలు రచించగలగారనీ అమ్మవారికి విన్నవించుకుంటున్నారు.
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
తమిళ సాహిత్యంలో విరివిగా వాడబడే ‘ కలవాణి ‘ అనే పదానికి కళల దేవత , చిలిపిదనం, కొంటెతనం అని పలు అర్థాలు ఉన్నాయి.
బహుశా గేయ రచయిత ఈ సందర్భంగా ఈ పదానికి కొంటెతనం అనే అర్థాన్ని తీసుకొని ఉండవచ్చు.
ఎందుకంటే అన్నమాచార్యుల వారి రచనలు శృంగారం, సమాజ హితం అనే రెండు పార్శ్వాలతో కూడుకుని ఉంటాయి.
తిరుమల వేంకట రమణునిపై
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ , జగడపు చనవుల జాజర , చక్కని తల్లికి ఛాంగుభళా
అంటూ కొంటెతనం జత కలిపి రచించిన కీర్తనలు కూడా నువ్వు ప్రసాదించినవే తల్లీ!
నీ దయ ఉండడం వల్లనే అన్నమాచార్యుల వారు ఆ కీర్తనలు రచించ గలిగారే తప్ప, లేనియెడల అది సాధ్యమయ్యే విషయం కాదు అనే భావాన్ని వ్యక్తపరిచారు.
అన్నమయ్య తిరుమల వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జన్మించినప్పటికీ, సరస్వతీ దేవిని ఉద్దేశించి నీ కరుణ వల్లనే కీర్తనలు రచించగలిగారని గేయ రచయిత అనడం ,
రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే అన్న ఉద్దేశంగా వారు పాటను రచించి ఉంటారని నా అభిప్రాయం.
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంతరాగాలు నీమూర్తులే
భారతీయ సంగీతంలో స్వరాల సమూహాన్ని రాగం అంటారు. సంగీత శాస్త్ర లోతుల్లోకెళ్లి పలువురు సంగీత విద్వాంసులు, మహనీయులు గానసౌలభ్యం కోసం ఆ రాగాలను పలు ప్రాతిపదికలపై విభజించగా లెక్కకు మిక్కిలిగా కొత్త రాగాల ఆవిర్భావం జరిగింది. అందువల్లనే అనంతరాగాలు అన్నారు.
త్యాగరాజస్వామి వారి గళంలోంచి జాలువారిన ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, రాగమాలికలు, పంచరత్న కీర్తనలు అన్నీ కూడా నీ ప్రతిబింబాలే తల్లీ అంటూ ఆ జ్ఞానసరస్వతీ దేవికి ఆత్మార్పణ చేసుకుంటున్నారు.
“నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీ భవతారకమంత్రాక్షరం”
నీ కరుణ వల్ల రూపు దాల్చిన ఏ రచనైనా అది మానవుల్ని తరింపజేసే మంత్రం తల్లీ అంటూ ఆ కళామతల్లిని సర్వస్య శరణాగతి చేస్తున్నారు.
ఈ పాట మొత్తం భక్తి రసం తోనే నిండి ఉంది. గురుపత్నిలో మాతృమూర్తిని, జగదంబను దర్శిస్తూ, పాట పాడుకుంటూ ఆవిడ చేయి పట్టి తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టడం, ” శరణాగతి నీవు భారతి” అంటూ ఆవిడ కాళ్ళకు నమస్కరించడం చూస్తూ ఉంటే గర్భగుడిలో మూలవిరాట్టును అర్చిస్తున్నంత భక్తి ఆ పసివాడి కళ్ళలో ప్రతిఫలించడం, ఆవిడ ( రాధిక గారు) ఉలిక్కిపడి అమ్మవారి విగ్రహం వైపు చేతులుసాచి, శరణాగతి అమ్మవారిని చేయాలి నన్ను కాదు నేను నిమిత్తమాత్రురాలిని అన్న భావన స్ఫురించే విధంగా భావ ప్రకటన చేయడం ప్రేక్షకులను భక్తి సాగరంలో ముంచెత్తుతుంది.
ఆవిడ పాదాల చెంత కూర్చుని, ఆవిడకే పాట నేర్పించడం, అపశృతులు పలికితే వాడి చిన్ని బుర్రతో సవరించడం, దానికి ఆవిడ మురిసిపోతూ , అవ్యాజమైన అనురాగాన్ని ఆ బాలుడిపై కురిపిస్తూ తనను తాను సవరించుకోవడం చూస్తూ ఉంటే ఆ సాధ్వీమణి లోని ఔన్నత్యానికి, ఆ చిట్టి గుండెలోని అభిమానానికి ప్రేక్షకుల హృదయాలు ఆర్ద్రత చెందుతాయి.
ముగ్గురి అత్యద్భుతమైన హావభావవ్యక్తీకరణలతో ఈ పాట ప్రేక్షకుల హృదయాలలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ పీఠం వేసుకొని ఉంటుందనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు లేదు.
నటీనటులకు, దర్శక నిర్మాతలకు, సాంకేతిక బృందానికి అందరికీ పేరుపేరునా వందనాలు.